Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda
7. ఋత్విగ్యజమానులు - దేవహితుడు, యాగధర్త, హవ్యవాహనుడగు అగ్నికి హవిస్సులు అర్పించి యజ్ఞమును పరిపుష్టము చేసినపుడు అగ్ని దేవతలను ఆశ్రయించువాడు, యజమానిని అనుగ్రహించు వాడు, శతవయస్కుడు అగుచున్నాడు. అటువంటి అగ్నిని గ్రహించి ఋత్విగ్యజమానులు యజ్ఞములు చేయుచున్నారు.
8. అగ్ని హరికేశ, సూర్యరశ్మిః, సవితా, జ్యోతి స్వరూపుడగుచు నిత్యము తూర్పున ఉదయించుచున్నాడు. రక్షకుడు, పోషకుడునగు సూర్యదేవత సమస్త జగములను వీక్షించుచు ప్రేరణ పొందుచున్నాడు.
9. ఋత్విగ్యజమానులు దేవతలను గూర్చి యజ్ఞము చేయ తలపెట్టినారు. అప్పుడు పశువును శామిత్ర ప్రదేశమున ఉంచినారు. తదుపరి శమిత యాగము కొరకు పశువును సంస్కరించినారు. తుదకు హవిస్సులను దేవతలకు అర్పించినారు. అట్టి యజ్ఞము నందలి ఆహవనీయాగ్నులు మాకు కోరిన ఫలములను ప్రసాదించును గాత.
10. ఈ శీలా ద్యావాపృథ్వులను, అంతరిక్షమును పూరించునట్టిది. జగత్తును నిర్మించునట్టిది. ఆ శిల ఆకాశ మధ్యమున నిలిచి ఉన్నది. అది విశ్వవ్యాప్తములగు దిక్కులను, ధేనువులను, బ్రహ్మాండ మధ్యమును, తూర్పు, పడమర దిక్కులను చూపు సూర్యుని ప్రకాశింపచేయుచున్నది.
11. ఈ శిల మేఘ సదృశము. సముద్ర సదృశము. సూర్య సదృశము. పక్షి సదృశము. ఇది పూర్వ దిగ్వర్తియైన ఆహవనీయమునకు స్థానమగు అగ్నీధమున ప్రవేశించినది. తెల్లని ఈ శిల ద్యులోక మధ్యమున సృష్టి యొక్క అంతము వరకు నిలిచి పాలించుచున్నది.
12. అగ్ని సముద్రము వలె వ్యాపించిన వాడు. రథికులందు శ్రేష్ఠతముడు. అన్నపతి. సదాచారుల పాలకుడు. పరమ సంపన్నుడు. అతనిని సమస్త స్తుతులు వర్థిల్లచేసినవి.
13. యజ్ఞము ప్రజల, పశువుల సుఖము కలిగించునది. అట్టి యజ్ఞము దేవతలను ఆవహించును గాక. యాగము చేయు అగ్ని దేవతలను ఆహ్వానించును గాక.
14. అగ్ని పరమైశ్వర్యోపేతుడు. అతడు అన్నము కలిగించు సమర్థుడు. అతడు నాకు పరిపూర్ణ అన్నము కలిగించినాడు. అగ్ని నిగ్రహ సమర్థుడు. అతడు నా శత్రువులను కూల్చినాడు.
15. దేవతలు నాయందు ఉత్కర్షమును, శత్రు నికర్షమును పెంపొందించినారు. తదుపరి ఇంద్రాగ్నులు పారిపోవుచున్న నా శత్రువులను అంతట నాశము చేసినారు.
నాలుగవ అనువాకము
1. ఇంద్రుడు శీఘ్రకారి. పోరునకు పోవు ఆబోతు వలె కాలు దువ్వువాడు. అత్యుగ్రుడు. శత్రుహింసకుడు. పరసేనల క్షోభకుడు. కేకపెట్టి గుండెలలో ఉరుమువాడు. అనిమిషుడు. వంటరిగా జయించగల శూరుడు. అతడు శత సంఖ్యాకములగు శత్రు సేనను ఒకే దెబ్బకు ఓడించినాడు.
2. ఇంద్రుడు కేకపెట్టి వడకించువాడు. అనిమిషుడు. జయశీలుడు. యోద్ధ. దుశ్శక్యుడు. నిర్భయుడు. ఆయుధ హస్తుడు. కోరికలు తీర్చువాడు.
యుద్ధము కోరు జనులారా! ఇంద్రుని అనుగ్రహము పొందండి. మీ శత్రువులను నాశము చేయండి.
3. ఇంద్రుడు బాణహస్తులను గెలుచుచున్నాడు. ఖడ్గహస్తులను గెలుచుచున్నాడు. పర బలములను గెలుచుచున్నాడు. అతడు యోద్ధయై పర సేనలందు దూరి శత్రు భటులను జయించుచున్నాడు. అతడు సోమము త్రావి, బాహు బలము పెంచి, ధనువు పట్టి, బాణము కొట్టి పర బలములను పారద్రోలుచున్నాడు.
4. ఇంద్రా! రాక్షసహంతా! నీవు రథము మీద సాగుము. శత్రువులను తొలగించుము. పర సేనలను భగ్నము చేయుము. యుద్ధమున హింసించుము. విజయుడవగుము. మా రథములను రక్షింపుము.
5. ఇంద్రుడు కొండల రెక్కలు త్రుంచినవాడు. భూమిని సాధించిన వాడు. వజ్రబాహువు. శత్రువుల భూమిని గుంజు కున్నవాడు. వారిని స్వబలమున పీడించిన వాడు. జనులారా! అట్టి ఇంద్రుని అనుసరించండి. శూరులు కండి. అతనిని అనుసరించి యోధులు కండి.
6. ఇంద్రా! నీవు పరుల సామర్థ్యము తెలిసిన వాడవు. సనాతనుడవు. శూరాతి శూరుడవు. బలశాలివి. అన్నవంతుడవు. శత్రుంజయుడవు. ఉగ్రుడవు. సర్వత్ర శూర భటులును, పరిచారకులును కలవాడవు. బలము నుండి పుట్టినవాడవు. భూమిని సాధించిన వాడవు. నీవు జయప్రద రథమును ఆరోహించుము.
7. ఇంద్రుడు ఎల్లెడల గల యుద్ధక్షేత్రములందు బలవంతముగ చొచ్చుకొని పోగలవాడు. శత్రు రహితుడు. శూరుడు. శతమన్యుడు. అజేయుడు. పరసేనలను జయించువాడు. యుద్ధము లందు అన్యులకు అశక్యుడు. అతడు కఠిన యుద్ధములందు మా సేనలను రక్షించును గాత.
8. ఈ యుద్ధమున మా సేనలకు ఇంద్రుడు నాయకుడు అగును గాత. బృహస్పతి, దక్షిణాదేవి, యజ్ఞము, సోమముముందు నడతురుగాక. పరబలములను భజించ జయంతి దేవసేనలకు ముందు మరుత్తులు సాగుదురు గాక.
9. కోరికలను తీర్చు ఇంద్రుని బలము, రాజ్యము చేయు వరుణుని బలము, ఆదిత్యుల, మరుత్తుల బలములు ఉగ్రములు అగును గాక. యుద్ధమున స్థిరచిత్తులు, శత్రుమర్దనులు, విజేతలగు దేవతల పొలికేకలు చెలరేగినవి.
10. సేనలు శత్రుసేనలను పడగొట్టుచుండగా ఇంద్రుడు మమ్ము రక్షించును గాక. మా బాణములు పరసేనలను బాధించును గాక. మా భటులు శత్రువుల భటులను మించినవారు అగుదురు గాక. దేవతలు యుద్ధములందు మమ్ము రక్షింతురు గాత.
11. మఘవా! మా ఆయుధములను ఇతరుల ఆయుధములను మించిన వానిని చేయుము. మా బలములకు మరింత తేజస్సు కలిగించుము. మా అశ్వములను మరింత శీఘ్రగాములను చేయుము. జయించు చున్న రథముల ధ్వని ఆకాశమును అంటును గాక.
12. నరులారా! శత్రుసేనల మీదకు లంఘీంచండి - జయించండి. మీ బాహువులు బలిష్ఠములు అగును గాక. ఇతరులు జయించ జాలని మిమ్ము ఇంద్రుడు రక్షించును గాక.
13. ఆయుధమా! నీవు హింసించు దానవు. పైగా బ్రహ్మచే పదును పెట్టబడిన దానవు. నిన్ను ప్రయోగించుచున్నాను. శత్రుసేనల మీద పడుము. వారి దేహములను ఛేదించుము. వారిలో ఒక్కనిని సహితము విడువకుము.
14. యజమానీ! నీ దేహము నందలి కీలక స్థానములను కవచముచే కప్పుచున్నాను. సోమరాజు అమృత కవచమున నిన్ను అంతటను ఆచ్చాదించును గాక. నీ ధనములు పరుల ధనములను మించును గాక. విజయము వరించుచున్న నిన్ను చూచి దేవతలు మురిసి పోవుదురు గాక.
15. యుద్ధమునందు శత్రుశరములు పిల్లల చింపిరివెంట్రుకల వలె పడుచున్నవి. అవి యుద్ధమున పరసేనను నశింప చేయునుగాక. మాకు సుఖములు కలిగించును గాక.
అయిదవ అనువాకము
1. అగ్నీ! తూర్పును తెలిసికొనుము. సగర్వముగా అటుసాగుము. నీవు ఈ అగ్ని కర్మమున ముందుండు అగ్నివి అగుము. సర్వ దిశలను పరిపూర్ణముగ ప్రకాశింపచేయుము. మా ప్రజకు, పశువులకు అన్నము సమకూర్చుము.
2. ఋత్విగ్యజమానులారా! ఉఖ స్వర్గ సాధనము. దానిని పట్టుకొని అగ్ని సహితులై చిత్యాగ్ని పై పాదములను ఉంచండి. తదుపరి ఆకాశము పైనున్న స్వర్గ లోకమును చేరి దేవతలతో సమముగా ఆసీనులు కండి.
3. నేను యజమానిని. పృథివి నుండి అంతరిక్షమునకు ఆరోహించినాను. అంతరిక్షము నుండి ద్యులోకమునకు ఆరోహించినాను. ద్యులోకము నుండి దుఃఖము నెరుగని పైభాగపు స్వర్గజ్యోతిని చేరుకొనగలను.
4. విద్వాంసులను, జగములను ధరించు యజ్ఞములను అనుష్ఠించునట్టి యజమానులు అంతరిక్షమును ఆరోహించుచున్నారు. రోదసిని ఆరోహించుచున్నారు. తదుపరి స్వర్గమునకు చేరుచున్నారు. వారికి ఇతర కోరికలు లేవు.
5. అగ్నీ! నీవు దేవతలకు, మానవులకు నేత్రము వంటి వాడవు. యజమానులు దేవతలు కాదలచుచున్నారు. వారి ముందుండి సహకరించుము. యాగములు చేయగోరు యజమానులు భృగువులతో సమాన సుఖములు కలవారలై స్వర్గమునకు చేరుదురు గాక.
6. రాత్రింబవళ్ళు సమనస్కలు, విలక్షణరూపలు, అనుకూలములు అగుచు ఒక శిశువును సాధించినవి. ఆ శిశువు ద్యావాభూముల మధ్య ఎంతో ప్రకాశించుచున్నాడు. ధనములు ప్రసాదించునట్టి అగ్నిని యజమాని యజించుచున్నాడు.
7. అగ్నిదేవా! నీవు సహస్రాక్షుడవు. శత శిరస్కుడవు. తే ప్రాణాః శతమ్. అపానాః సహస్రమ్. నీవు వేలకొలది ధనములకు అధిపతివి. అట్టి నిన్ను అన్నము ప్రసాదించుమని సేవించుచున్నాము. స్వాహా.
8. అగ్నీ! నీవు గరుత్మాన్ పక్షివి అగుచున్నావు. నీవు నేల మీద నిలువుము. నేలపై భాగమున నిలువుము.
9. అగ్నీ! నీ వెలుగులచే అంతరిక్షమును నింపుము. నీ తేజస్సుచే ద్యులోకమును స్తంభింప చేయుము. నీ బలమున దిక్కులను దృఢపరచుము.
10. అగ్నీ! నీవు అభిముఖముగ ఆహ్వానించబడువాడవు. సుముఖుడవు. నీకు నివాసస్థానమగు తూర్పు దిక్కునకు చేరుము.
విశ్వేదేవతలారా! మీరు యజమాని ఏర్పరచిన ఉత్తమ స్థానమున ఆసీనులు అగుడు.
11. అగ్నీ! నీవు పూర్వము నుండి ప్రకాశించుచున్నవాడవు. మా ఎదుట మరింతగా ప్రజ్వరిల్లుము. యువతమ అగ్నీ! నిన్ను అన్నములు నిరంతరము ఆశ్రయించుచున్నవి.
12. అగ్నీ! పరమమగు నీ జన్మను సేవించుచున్నాము. నీ భూలోక జన్మమును స్తుతులచే సేవించుచున్నాము. నీవు ఆవిర్భవించిన స్థానమును పూజించు చున్నాము. నిన్ను ప్రజ్వలింప చేసి అందు హవిస్సులు అర్పించుచున్నాము.
13. కణ్వమహర్షి ఈ అగ్నిని ఫలప్రదుని, విశ్వజన్యుని అనుగ్రహించు వానినిగ చేసినాడు. అతడు ఆ అగ్నిని మంచి పొదుగు కలిగి, సహస్ర క్షీర ధారలుగల ధేనువును వలె పిదికినాడు. వరేణ్యుడగు అట్టి అగ్ని యొక్క అనుగ్రహమును నేను కోరుచున్నాను.
14. అగ్నే! తే సమిధః సప్త. జిహ్వాః సప్త. మంత్రాః సప్త. ప్రియధామాని సప్త. హోత్రాః సప్త. త్వా సప్త ధా యజన్తి. సప్త స్థానములందున్న నీవు నేతితో అంతటను నింపుము.
15. ఈ దృఙ్ , అన్యాదృఙ్, ఏతాద్రుఙ్, ప్రతిదృఙ్, మిత, సంమిత, సంభర ఇవి మరుత్తుల మొదటి గణపు పేర్లు.
శుక్రజ్యోతి, చిత్రజ్యోతి, సత్యజ్యోతి, జ్యోతిష్మాన్, సత్య, ఋతప, అత్యంహ ఇవి మరుత్తుల రెండవ గణపు పేర్లు.
ఋతజిత్, సత్యజిత్, సేనజిత్, సుషేణ, అంత్య మిత్ర, దూరే మిత్ర, గణము ఇవి మరుత్తుల మూడవ గణపు పేర్లు.
ఋత, సత్య, ధ్రువ, ధరుణ, ధర్త, విధర్త, విధార ఇవి మరుత్తుల నాలుగవ గణపు పేర్లు.
ఈదృక్షాస, ఏతాదృక్షాస, సదృక్షాస, ప్రతిసదృక్షాస ఇవి మరుత్తుల అయిదవ గణపు పేర్లు.
పంచ గణములందలి మరుత్తులు మమ్ము రక్షించుటకు ఆదరముగ విచ్చేయండి.
దేవలోకపు ప్రజయగు మరుత్తులు ఇంద్రుని అనుసరించి ఉంటున్నారు. దేవలోక ప్రజలగు మరుత్తులు ఇంద్రుని అనుసరించి ఉన్నట్లే యజమానిని, దేవలోక ప్రజను, మానవలోక ప్రజను అనుసరించి ఉందురు గాత.
ఆరవ అనువాకము
1. రాజు కవచము ధరించి శత్రువు మీదకు పోవునపుడు మేఘములు సాగుచున్నట్లుండును. రాజా! అప్పుడు నీవు శత్రువు చేత దెబ్బ తినక జయించుము. కవచము తన మహిమచే నిన్ను రక్షించును గాత.





