Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
"వానర శ్రేష్ఠా! నేను క్షత్రియుడను. లోక ప్రసిద్ధమగు బలవంతుడను. వాయుదేవుని వరమున కుంతి గర్భమున పుట్టినవాడను. భీముడను వాడను. నేను ఒక కార్యార్థినయి వెళ్లుచున్నాను. నాకు దారి విడువుము. నీవు దారి ఇవ్వనిచో పూర్వము హనుమంతుడు సముద్రమును లంఘించి లంకకు వెళ్లినట్లు, నిన్నును ఈ పర్వతమును గూడ దాటి వెళ్లెదను" అన్నాడు భీముడు.
"భీమా! ఎవరా హనుమంతుడు? సముద్రమును ఏల దాటినాడు?" అని ప్రశ్నించినాడు మారుతి. రామకథ యనిన అతనికి మహారుచి.
"పూర్వము ఇక్ష్వాకు కులమున రామచంద్రుడు అవతరించినాడు. తండ్రి ఆజ్ఞప్రకారము అతడు సీతా, లక్ష్మణ సమేతుడయి అడవులకు వెళ్లినాడు. రాముడు వనములందు ఉండగా రావణుడు సీతను అపహరించినాడు. సీతను వెదకుటకు వానరులు బయలుదేరినారు. సీత లంకలో ఉన్నదని "సంపాతి" వలన తెలుసుకున్నారు. కాని సముద్రము దాటుటకు వానరులకు శక్యముకాలేదు. అప్పుడు మహాశక్తిమంతుడయిన హనుమంతుడు సముద్రముదాటి లంకకు చేరినాడు. నేను కూడ హనుమంతుని వంటి పరాక్రమము గలవాడను. నా పరాక్రమమును నీకు చూపగలను" అని బీరములు పలికినాడు భీముడు.
హనుమంతుడు భీముని మాటలు విన్నాడు. ముసిముసినవ్వులు నవ్వుకున్నాడు. "భీమా! చూచుచున్నావు కదా! నేను ముసలివాడను లేవజాలకున్నాను. నాతోకను తొలగించి వెళ్లుము" అన్నాడు.
భీముడు గర్వమున ఎడమ చేతితో తోకను కదలించ దలచినాడు. తోక కదలలేదు. కుడి చేతితో ప్రయత్నించినాడు. తోక కదలలేదు. రెండు చేతులతో కదలించినాడు. తోక కదలలేదు మోకాళ్లు నేలకు దట్టి బలమంతయు ప్రయోగించి ప్రయత్నించినాడు. తోక చేతికి రాలేదు. చెమటలు పట్టినవి. భీముడు నీరసించిపోయినాడు. బలగర్వము రాలిపోయినది. తన ముందున్న వానరుడు సామాన్యుడు కాడని ఎరిగినాడు. సాగిలి మ్రొక్కినాడు. చేతులు జోడించి విన్నవించినాడు:-
"మహాత్మా! వానర శ్రేష్ఠా! నిన్ను ఎరుగక బీరములు పలికినాను. మన్నింపుము. నీవు సిద్ధుడవో; గంధర్వుడవో; వానర రూపమున ఉన్న మరెవడవో ఎరుకపరచి నన్ను కరుణించుము".
హనుమంతుడు భీముని చూచినాడు. నవ్వసాగినాడు. "భీమా! నేను కేసరి క్షేత్రమందు వాయుదేవునకు పుట్టినవాడను. కావున నీవు నాకు తమ్ముడవు.
పూర్వము రఘురాముడు వారధి కట్టి సముద్రము దాటినాడు. వానర సమేతుడయి లంకలో ప్రవేశించినాడు. యుద్ధమున రావణుని వధించినాడు. సీతను సాధించినాడు.
రామ రావణ యుద్ధమున నేను కనబరచిన బలపరాక్రమములకు రాముడు మేచ్చినాడు. "హనుమా! లోకమందు నా కీర్తి నిలిచి ఉన్నంతకాలము నీవు నిత్యుడవయి ఉందువు" అని వరమును ఇచ్చినాడు.
శ్రీరాముడు ఈ భూమండలమును పదకొండువేల సంవత్సరములు పాలించి స్వర్గమునకు వెళ్లినాడు.
శ్రీరాముని దయవలన నిత్యుడను అయి ఉన్న హనుమంతుడను నేనే" అని వివరించినాడు మారుతి.
హనుమంతుని మాటలు విని భీముడు దిగ్భ్రమ చెందినాడు. హనుమంతుడు తనముందు ఉన్నాడని ఎరిగి పులకాంకితుడు అయినాడు. సాదరముగ మారుతికి సాగిలి మ్రొక్కినాడు. "అన్నా! నిన్ను చూచినాను. కృతార్థుడను అయినాను. నీవు మహా బలవంతుడవు. నీవలననే రావణుడు చచ్చినాడు. అప్పటి నీరూప వైభవములను దర్శించవలెనని ఆసక్తిగా ఉన్నది. ఆ రూపమున నాకు దర్శనము ఇమ్ము" అని ప్రార్థించినాడు.
హనుమంతుడు ప్రసన్నుడు అయినాడు. తన పూర్వ రూపమును భీమునకు చూపినాడు. హనుమంతుని శరీరము రెండవ మేరు పర్వతమువలె ఉన్నది. అతడు ఆకసమంతయు వ్యాపించినాడు. అతని వాలము సర్వదిక్కులకు వ్యాపించినది.
భీముడు హనుమంతుని రూపమును చూచినాడు దడుచుకున్నాడు. రెండు కనులు మూసుకున్నాడు. 'అన్నా! చాలును ఇక నీ ఇప్పటి రూపమునకు రమ్ము' అన్నాడు. హనుమంతుడు తన సహజ రూపమునకు వచ్చినాడు. అన్నాడు:-
"భీమా! నీవు సౌగంధికము తెచ్చుటకు వెళ్లుచున్నావు. ఆ సరస్సును రాక్షసులు రక్షించుచుందురు. నీవు పరమ ధర్మమును ఎగిరి సాధించవలెను. సాహసమునకు దిగరాదు. సదాచారము వలన ధర్మబుద్ధి కలుగును. ధర్మబుద్ధివలన వేదార్థజ్ఞానము కలుగును. వేదార్థజ్ఞానము వలన యజ్ఞప్రవర్తనలు కలుగును. అందువలన దేవతా తృప్తియు దేశకాలములను తెలుసుకొనుటయు జరుగును. బుద్ధిమంతులు సామ, దాన, భేద, దండోపాయములచే కార్యములు సాధింతురు. సర్వకార్యములు ఆలోచించి నిర్వర్తించవలెను. బాలకులతోనూ, ధనమదాంధులతోను, అల్పులతోను కార్యాలోచనలు చేయరాదు. గొప్పబుద్ధిగలవారితోను, విద్వాంసులతోను కార్యాలోచనము చేయవలెను. నీవు నిగ్రహానుగ్రహ సమర్థుడవు. నీవు కార్యమును నిర్వర్తించగలవు. నిన్ను చూచుటవలన నానేత్రములు కృతార్థములు అయినవి. నీకు ఇష్టమయిన కార్యమేదియో తలిపిన చేయగలను. దుర్యోధనాదులు మీకు కీడు కలిగించినారు. వారిని ధ్వంసముచేసి మంట కలుపమందువా? సకల ధరణీ రాజ్యమును ధర్మరాజునకు కట్టపెట్టమందువా?" అని అడిగినాడు.
"అన్నా!" భీముడు అన్నాడు. "నీవు చెప్పినట్లు చేయగల శక్తి సామర్థ్యములు నీకున్నవి. దుర్యోధనాదులు నీ ధాటికి నిలువలేరు. అయినను మేమే వారిని యుద్ధమున గెలువవలసి ఉన్నది.
"భీమా! పాండవ కౌరవులకు యుద్ధము తప్పనట్లున్నది. ఆ మహారణమున నీవు నన్ను తలచుకొనుము. అతిరథుడయిన అర్జునుని టెక్కెమందు నేనుండెదను. అట్లుండి ఆ రణరంగమున మీ బలపరాక్రమములను నేను చూడగలను" అని భ్రాతృ వాత్సల్యమున భీముని ఆలింగనము చేసుకున్నాడు. హనుమంతుడు సౌగంధిక సరస్సునకు మార్గము చూపి అంతర్ధానుడు అయినాడు.
హనుమంతుని కౌగిలివలన భీమునకు శ్రమతీరినది. మరింత శక్తి వచ్చినది. అతడు సౌగంధిక సరస్సునకు సాగినాడు. మార్గములు రమణీయములుగా ఉన్నవి. కొండలు కోనలు మబ్బులతో దోబూచులాడుచున్నవి. అడవులు పచ్చగా, చిక్కగా ఉన్నవి. అందు ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుచున్నవి. మద ధారలు కారుచున్నవి. ఏనుగుల దంతములు, మబ్బుల మెరుపులు ఒకే తీరుగా వెలుగుచున్నవి. ఏనుగుల ఘీంకారములు, మబ్బుల ఉరుములు ఒకే రీతిగా ఉన్నవి. భీముడు మనోహర ప్రదేశములను చూచుచు సాగినాడు. అతనికి కైలాస పర్వత ప్రాంతమున కనుల పండువయిన ఉపవనము కనిపించినది.
ఆ ఉపవనమునందు రమణీయమయిన సరస్సు కనిపించినది. ఆ సరస్సునందు సౌగంధికములున్నవి. భీముడు వానిని చూచినాడు. గదాయుధము ధరించి, ధనుర్బాణములతో సరస్సు వైపునకు సాగినాడు.
ఆ సరస్సును పదివేలమంది రాక్షసులు కావలికాయుచున్నారు. వారు భీముని చూచినారు. యుద్ధమునకు సన్నద్ధులు అయినారు. అయినను భీమునితో అన్నారు:-
"నీవెవరవో మాకు ఎరుగరాకున్నది. శ్రీకృష్ణాజినము ధరించి మునివేషమున ఉన్నావు. ఆయుధములు ధరించి వీరుని వలె కనిపించుచున్నావు. ఈ ప్రాంతములు నీకు తెలియనట్లున్నవి. ఇది కుబేరుని వనము. ఈ సరస్సు కుబేరుని స్వంతము. ఇందు అతడు భార్యా సమేతుడయి విహరించును. ఇందలి జలములు అమృత సమములు. ఇందలి కమలములు బంగారపువి. వీటికి అపూర్వమయిన పరిమళమున్నది. ఇంతవరకు ఇంత దూరము వచ్చిన వీరుడు లేడు. నీవు పొరపాటున వచ్చినావో, దారి తప్పి వచ్చినావో తెలియకున్నది. మరలిపోవుట మంచిది".





