Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6


 

    నవాబు : ఆ దుర్మార్గుడు మీకెలా తెలుసు ?
    నేను : నా కధంతా వారికేం చెప్పను ? "తెలుసు, బాగా తెలుసు. నేను ఫైజాబాదు  దాన్నే కదా?" అన్నాను.
    నవాబు : ఏమీ! మీరు ఫైజుబాదు వాళ్ళా?
    అక్భ : ఇక్కడే ఎక్కడో ఉంటాడు దుర్మార్గుడు. వాణ్ణి పట్టాలి.
    సాలార్ బక్ష్ ను పిలిచి చీటీ వ్రాసి దగ్గరే ఉన్న పోలీసు ఠాణా కు పంపారు. కొద్ది సేపటిలోనే ఠాణా దారుడు పది పన్నెండు మంది పోలీసులను తీసుకొని వచ్చాడు. చూచింది చెప్పాను. ముందు ఆ స్థలానికి వెళ్ళి వెదికారు. ఫకీర్ల స్థావరంలో కొద్దిగా జాడ తెలిసింది. ఒక పోలీసుకు రాజుల కాలపు సవరను దొరికింది. అది తెచ్చి ఠాణా దారునికి ఇచ్చాడు. "దేవుడు తలచుకుంటే సొమ్ము యుక్తంగా పట్టుపడ్తాడు" అన్నాడు ఠాణాదారుడు.
    ఠాణాదారు గట్టి బందోబస్తు చేశాడు. పోలీసులు కూడా శ్రమపడ్డారు. రాత్రి మూడు గంటలకు ముక్కాగంజ్ లో పట్టుబడ్డాడు. తెల్లవారుతుండగా చెరువు దగ్గరికి తెచ్చారు. 24 సవరనులు దొరికాయి. గుర్తించడానికి నన్ను పిలిచారు. నేను కాక ఇద్దరు పోలీసులు కూడా గుర్తించారు. ఉదయం పది గంటలకు లక్నో తీసికెళ్ళారు.
    రుస్వా : ఇంతకూ వాణ్ణి ఏం చేశారు? త్వరగా తేల్చండి.
    నేను : ఏమి అవుతుంది? రెండు నెలల తరవాత తెలిసింది, ఉరి తీశారని.

                                   25

        బ్రతుకు వ్రాత నా కనులముందు వ్రేలె!
        స్వీయకధయం దది చదివి కుంగిపోతి!
    మిర్జారుస్వాగారు! మీరు నా ఆత్మకధ చిత్తు ప్రతి చూడవలసిందని నాకు ఇచ్చినప్పుడు మందిపోయాను. ముక్కలు ముక్కలుగా చించేదామనుకున్నాను. ఈ బ్రతుకులో ఏం పాడుబడిందని! చచ్చిన తరవాత కూడా చదివి జనం తిట్టడానికి కధ రాయడమా అనిపించింది. మీరు చేసిన శ్రమను చూచి చేయి నిలిచిపోయింది.
    నిన్న రాత్రి పన్నెండు గంటలకు ఎందుకో మెలకువ వచ్చింది. గదిలో ఒంటరిగా ఉన్నాను. అది మామూలే. పనివాళ్ళంతా క్రింది గదిలో పడుకున్నారు. దీపం వెలుగుతుంది. ముందు పడకలో అటు ఇటు పోర్లాను. నిద్రపోవడానికి ప్రయత్నించాను. నిద్ర రాలేదు. చివరకు లేచాను. పాన్ తిన్నాను. దాసీ దాన్ని పిలిచి హుక్కా నింపించాను. మంచం మీద పడుకొని హుక్కా పీల్చాను. పుస్తకం చదవాలని పించింది. అలమారాలో చాల కధల గాధల పుస్తకాలున్నాయి. ఒక్కొక్కోటే తీసి పుటలు తిప్పసాగాను. అన్నీ ఇదివరకు చదినవే. మూసిపెట్టేశాను. ఈ చిత్తూ ప్రతి కనిపించింది. రక్తం వేగంగా ప్రవహించింది. చిన్చేయాలని నిశ్చయించుకున్నాను. ఇంతలో ఎవరో చెవిలో చెపుతున్నట్లు అనిపించింది. "ఉమ్రావ్ ఇప్పుడు దీన్ని చించుతావు. తగలేస్తావు. బాగానే ఉంది. కాని భగవదాజ్ఞలో దేవదూతలు నీ కధంతా వ్రాసి పెట్టారు కదా! దాన్ని ఎవరు చెరపగలరు? ఎవరు కాల్చగలరు? ఎవరు చింపగలరు?"
    ఈ అదృశ్యవాణి విని కాళ్ళు చేతులు వనకాయి. చిత్తుప్రతి జారిపడెంత పని అయింది. ధ్వంసం చేసే ఆలోచన పూర్తిగా మాయం అయింది. ఎక్కడి నుంచి తీశానో అక్కడే పెట్టేదామనుకున్నాను. కాని ఒకసారి చూడాలనిపించింది. ఉబుసుపోకకు చదవసాగాను. మొదటి పుట చదివాను. పుట తిప్పాను. నాలుగు అయిదు పంక్తులు చదివాను. నా ఆత్మకధలో నాకే ఆసక్తి ఏర్పడింది. చదువుతుంటే చదవాలనిపించింది. ఇతర కధలు చదవడంలో ఇంత అనందం కనిపించలేదు. ఎంచేతనంటే అవన్నీ కల్పనలనీ వాస్తవాలు కావనీ తెలుసు. అలా చేయడంలో ఆసక్తి వచ్చి పోతుంది. ఈ కధ అలా కాదు. ఇది నా స్వంత కధ. మీరు వ్రాసింది. అన్ని స్మఘతనలూ నా జీవితంలో జరిగినవి. అన్ని విషయాలు నా కళ్ళముందు కనిపిస్తున్నాయి. వీటిలో కల్పన లేదు. అన్ని వాస్తవాలు. ప్రతి సంఘటన, ప్రతి అంశం నా మనసు మీదా, మెదడు మీద ఎలాంటి ప్రభావం వేశాయో తెలియపర్చడం కష్టం. ఆ దశలో నన్ను ఎవరైనా చూచి ఉంటే పిచ్చి దాని కింద లెక్కకట్టేవారు. ఒకప్పుడు పిచ్చిగా నవ్వేదాన్ని. మరొకప్పుడు కన్నీటి జాలు ప్రవహించేది. అవసరం అయినచోట సవరించమని తాము శలవిచ్చారు. కాని అంత స్పృహ ఏది? చదువుతుండగానే తెల్లవారింది. చేతులు, ,ముఖం కడుక్కొని నమాజు చేశాను. మళ్ళీ పడుకున్నాను. ఎనిమిది గంటలకు లేచాను. చేతులు ముఖం కడుక్కొని చదువసాగాను. సాయంకాలం వరకు పూర్తి చేశాను.
    కధ మొత్తం లోనూ తాము శీలవతులను గురించి, దుష్ట స్త్రీ ల గురించీ చెప్పి, వారి వ్యత్యాసం చూపిన ఉపన్యాస భాగం నాకు ఎంతో నచ్చింది. శీలవతులకు గర్వం ఉందంటే అది వారికి అలంకారం. నాలాంటి బజారు స్త్రీలు వారి గర్వాన్ని చూచి సిగ్గుపడాలి. కాని ఆకస్మిక సంఘటనలను గురించి తమ ఉపన్యాసంలో ఎక్కడా చెప్పలేదు. నేను చెడిపోవడానికి దిలావర్ ఖాను దౌష్ట్యమే కారణం. వాడు నన్ను ఎత్తుకుని రాకుండినట్లయితే , ఖానమ్ కు అమ్మకున్నట్లయితే నా జీవితం ఎలా ఉండేదో? నేను దుష్టవాతావరణం లో చిక్కిపోయాననడం నిస్సందేహం. అందుకే చాలాకాలం నుంచి నాకు విసుగు , వివ్వాలత కలిగాయి. ఆ కాలంలో ఈ నగ్నసత్యాలు నాకు తెలియవు. నేను చేస్తున్నది శాసన వ్యతిరేక కార్యం అని కాని, శిక్ష విధించడానికి ఒక శాసనం ఉందని గాని నాకు తెలియదు. నేను ఖానమ్ ను నా స్వామినిగా భావించాను. ఆవిడ ఇష్టానికి విరుద్దం అయిన పని చేయలేదు. చేసినా ఆమె దెబ్బలూ, తిట్లూ తప్పుకోవడానికి రహస్యంగా చేశాను. ఖానమ్ తాను బ్రతికి ఉన్నంతకాలం నన్ను ఏమీ అనలేదు. అయినా భయం అలా ఉండేది .
     నేను ఎలాంటి జనుల మధ్య పెరిగి పెద్దదాన్ని అయ్యానో హరిరీతులు రివాజులు నాకూ అలవడ్డాయి. ఆ కాలంలో నేను మతాన్ని గురించి గానీ, అల్లాను గురించి గానీ ఆలోచించలేదు. ఆ వాతావరణం లో ఎవరూ ఆలోచించలేరని నా అభిప్రాయం.
    ఆకస్మిక సంఘటనలు హృదయంలో ఉత్పాతాలు కలిగిస్తాయి. మేఘగర్జన , మెరుపు తుఫాను, భూకంపం, సూర్య చంద్ర గ్రహాణాలు, కరువులు అన్నీ భగవంతుడు కల్పించిన ఉత్పాతాలని విశ్వసిస్తారు. కాని వీటిలో కొన్నింటిని దూరం చేయడానికి ఉపాయాలు, మార్గాలు నేను చేశాను. అయితే కొన్ని పీడలు దీవనలు, తాయెత్తులు, మందు మాకులతో దూరం కావు. వాటిని భగవదిచ్చగా భావించి అంతా భగవదదీనం అంటారు. మతాన్ని గురించి గానీ, పాపపుణ్యములను గురించి గానీ మాకు ఎవరూ చెప్పలేదు. కాబట్టి అవేమిటో తెలియలేదు. ఆ కాలంలో నాకొక మతం లేదు. అందరిని చూచి వారు ఏది చేస్తే నేనూ అదే చేసేదాన్ని. ఎక్కువగా అదృష్టం మీదనే ఆధారపడేదాన్ని. నా సోమరితనం వల్లనో, బుద్ది తక్కువదనం వల్లనో చెడిపోయిన పనిని దురదృష్టానికి అప్పగించేదాన్ని. పారసీక గ్రంధాలు చదవడం వల్ల ఆకాశాన్ని తిట్టడం అలవాటు అయింది. నేను ఒడిపోయినపుడు లేదా నా లక్ష్యం చేరలేనప్పుడు అదృష్టాన్ని నిందించేదాన్ని.
    స్వేచ్చాధీరులమని ప్రగల్భములు పలికి పలికి
    అదృష్టము తొలగు వేళ నిందించేడి పరతంత్రులం!
    మౌల్వీగారూ, బువాహుసేనీ పూర్వకాలపు విషయాలు చెప్పేవారు. అవి ఎంతో బావుండేవి. నాకూ గతాన్ని కీర్తించడం, వర్తమానాన్ని దూషించడం అలవాటు పడింది. ముసలివారు పూర్వకాలాన్ని కీర్తించడానికి కారణం పడచుధనపు కాలం అందరికీ అందంగా ఉండడమేనని అప్పటికీ అర్ధం కాలేదు. లోకం తన తోటిది. తాను చస్తే లోకం చస్తుంది. తాను బ్రతుకుతే లోకం బ్రతుకుతుంది. ముసలివాళ్లను చూచి వయసువాళ్ళూ అదే పాట ప్రారంభించారు. ఈ అలవాటు మొదటి నుంచీ వస్తుంది కాబట్టి ఇప్పుడు అందరికీ అది మాములు అయిపొయింది.
    ప్రాయం వచ్చిన తరవాత విలాసాల్లో పడిపోయాను. ఆ కాలంలో పాట పాడి పురుషులను రంజింపచేయడం నా వృత్తి. అందులో నా తోటి వారితో గెలిచినపుడు ఆనందము, ఓడినప్పుడు దుఖమూ కలుగుతుండేవి. ఇతరులతో పోల్చినపుడు నేనేమంత అందమైనదాన్నేమీ కాదు. కాని సంగీత సాహిత్యాలలో నాకున్న ప్రావీణ్యం నాకు ప్రత్యెక స్థానాన్ని , గౌరవాన్నీ ఇచ్చాయి. దానితో నాకు కొంత నష్టం కూడా కలిగింది. గౌరవంతో పాటు గర్వం పెరిగింది. మిగతా సానులు ఎవరితో నైనా తమ పనులు వెళ్ళదీసుకునేవాళ్ళు. నేను ముఖాలు చూస్తూ ఉండిపోయేదాన్ని. ఉదాహరణకు ఎవరు వచ్చినా ఏదో ఒక కోరిక కోరడం వారి రివాజు. నేను అలా కాదు. సిగ్గయ్యేది. అడుగుతే లేదంటారేమో ననిపించేది. నాతోటి వారి దగ్గరికి ఎవరైనా వచ్చినపుడు అతడు ఎంత ఇవ్వగలడు,  వారెంత పుచ్చుకోగలరు అనే ఆలోచన ఉండేది కాదు. నాకు నచ్చిన వాని మనస్తత్వం, నీతి నియమాలు , ఆచార వ్యవహారాలూ పరిశీలించడంతోనే సరిపోయేది. అడగడం హేయంగా భావించేదాన్ని. అంతేకాదు వేశ్యలకు ఉండవలసిన లక్షణాలు నాలో లేవు. అందుకే నా తోటివారు నన్ను పిచ్చిదాని కింద లెక్కకట్టేవారు.
    తరవాత వేశ్యావృత్తి నీచమైందని అర్ధం చేసుకున్నాను. వదిలేశాను. ఆటపాటలతో కాలం గడిపసాగాను. అమీరు ఎవరైనా కొలువుంచుకుంటే ఉండేదాన్ని. క్రమంగా అదీ వదిలేశాను.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.