Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda
సమహం ప్రజయా సం మయాప్రజా |
సమహగం రాయస్వోషేణ సం మయా రాయస్వోషః ||
ఆరవ ప్రపాఠకము
మొదటి అనువాకము
1. మరుత్తులారా! మీరు గొప్ప దానశీలురు. బలము కలిగించునదియు, పర్వతములందు ఉన్నదియు, గాలియందు ఉన్నదియు, వర్షించు మేఘమందున్నదియు, వరుణ సంబంధి జలములందున్నదియు, ఉదకములందున్నదియు, ఓషధులందున్నదియు, వనస్పతులందున్నదియు నగు అన్నమును మాకు అందించండి.
2. పాషాణ సదృశ అగ్నీ! నీ ఆకలి బాధయు, నీ సంతాపమును మేము ద్వేషించు శత్రువును చేరును గాక.
3. అగ్నీ! నిన్ను సముద్రము నందలి శైవాలముచే లాగుచున్నాను. మమ్ము పావనము చేయువాడవు. శాంతుడవు అగుము.
4. అగ్నీ! నిన్ను చల్లదనమునకు పుట్టిల్లయిన శైవాలముచే లాగుచున్నాను. మమ్ము పావనము చేయువాడవు, శాంతుడవు అగుము.
5. అగ్నీ! నీవు భూమి మీద ఉన్నావు. బెత్తపు చెట్టునందున్నావు. అధిక రక్షణలు కలిగి నదులందు ఉన్నావు. నీవు జలములకు తేజస్సువు అగుచున్నావు.
6. మండూకీ! ఋక్కుల సహితవై విచ్చేయుము. మా యజ్ఞమునందలి అగ్నిజ్వాలలను వర్థిల్లచేయుము. శాంతింప చేయుము.
7. మండూకీ! అగ్నిని జ్వలింపచేయుచు విచ్చేయుము. నీవు రాగానే నేలమీది ఈ అగ్ని ఉషః కాంతులచే ప్రకాశించినది.
8. దుడుకు గుర్రమును అదుపునందుంచి శత్రు సేనను ధిక్కరించబోవు శూరుని వలె అగ్గి అంతటను మండుచున్నాడు. అగ్ని జరారహితుడు. అతడు దప్పిక లేనివాడు అగుచున్నాడు.
9. అగ్నీ! నీవు పావకుడవు. నీ మాట దీప్తి వంతము - మంద్రము. దానితో దేవతలను ఆవహించుము - యజించుము.
10. పావకా! నీవు దీప్తిమంతుడవు. ఈ కర్మయందు మా కొరకు దేవతలను ఆవహింపుము. ఈ యజ్ఞమును, హవిస్సులను దేవతలకు చేర్చుము.
11. ఈ చిత్యాగ్ని స్థానము నీరు అందుబాటులో ఉండుచోటు. సముద్రమునకు గృహస్థానము. ఈ రెండు రూపముల అగ్నీ! నీ ఆయుధములను మా మీద కాక, అన్యుల మీద ప్రయోగించుము. మా కొరకు పావకుడవు, శాంతమూర్తివి అగుము.
12. అగ్నీ! ద్రవములను శోషింపచేయు నీ తేజస్సునకు నమస్కారము. పదార్థములను ప్రకాశింపచేయు నీ తేజస్సునకు నమస్కారము. నీ ఆయుధములను మా మీద కాక అన్యుల మీద ప్రయోగించుము. మా కొరకు పావకుడవు, శాంతమూర్తివి అగుము.
13. మానవులందున్న అగ్నికి వట్ = హవిస్సు అర్పించబడినది. ఉదకములందలి అగ్నికి వట్. అరణ్యము లందున్న అగ్నికి వట్. యజ్ఞములందున్న అగ్నికి వట్. ఆదిత్య రూపపు అగ్నికి వట్.
14. యజ్ఞసంబంధులగు దేవతలు, యజ్ఞ సంబంధులగు ప్రాణాదులు హవిర్భాగములను సేవించుచున్నారు. అహంతాది ప్రాణాదులారా! ఈ యజ్ఞమున మీకు మధురములు, ఘృతయుక్తములగు హవిస్సులు అర్పించుచున్నాము. మీరు స్వయముగ హవిర్భాగములను అందుకొనండి.
15. ప్రాణముల వలననే దేవతలకు దేవత్వము కలిగినది. ప్రాణముల వలననే అగ్ని ప్రజ్వరిల్లుచున్నాడు. ప్రాణములు లేక నరుడు జీవించకున్నాడు. అట్టి ప్రాణములు దేవతలు. ఆ ప్రాణదేవతలు దివియందుండుట లేదు. పృథివి యందుండుట లేదు. అవి దేహము నందలి నేత్రాద్యవయవములను ఆశ్రయించి ఉంటున్నవి.
16. అగ్నీ త్వం ప్రాణదాః అసి. అపానదాః అసి. వ్యానదాః అసి. చక్షుర్దాః అసి. వర్చోదాః అసి. వరివోదాః - పూజలను ఇచ్చువాడవు - అసి. నీ ఆయుధములను మాపై కాక ఇతరులపై ప్రయోగించుము. మా కొరకు పావకుడవు, శాంతుడవు అగుము.
17. ఈ అగ్ని జ్వాలలు రాక్షసాది విరోధులను నాశనము చేయును గాక. ఈ అగ్ని మాకు ధనము నిచ్చుటను సంకల్పించును గాక.
18. అగ్నీ! నీవు జ్వాలా సమూహములచే తెలియబడు వాడవు. మా కొరకు దేవతల యాగ నిష్పాదకుడవు అగుము. నిర్విఘ్నముగ యాగము సమాప్తము చేయువాడవు అగుము. నిన్ను బాధించగల వారులేరు. నీవు మంత్ర రక్షకుడవు. నీవు మమ్ము పరిపాలించుము. వెలుగొందు గృహక్షేత్రాదులను ప్రకాశింపచేయుము.
రెండవ అనువాకము
1. ఎవడు ఈ సమస్త భువనములను తనయందు ధరించినాడో, ఎవడు ఋషియో, ఎవడు హోతయో, ఎవడు మాకు తండ్రి యగునో అట్టివాడు మాకు ధనములు అందించ నిచ్చగించును గాత. అతడు తాను సృష్టించిన హృదయ పద్మమున చేరి ఉన్నాడు.
2. అతడు సంకల్ప మాత్రమున విశ్వముల సృష్టి, స్థితి, లయకారకుడు, ధాత, విధాత, సంహర్త, పరముడు, సర్వజ్ఞుడు అయినాడు. పూర్వము ఆ పరమసప్తర్షులు లీనమై ఉండిరని పెద్దలు చెప్పినారు. ఆ పరమ పురుషుడు సప్తర్షులకు వారు అపేక్షించిన స్థానములు ఏర్పరచినాడు. అందుకు వారు సంతసించుచున్నారు.
3. ఎవడు మా పోషకుడో, మమ్ము పుట్టించిన వాడో, ఎవడు విధాతయో, ఎవడు పాలకుడో, ఎవడు సమస్తమును 'సత్' నుండి సృష్టించినాడో అతడు దేవతల పేర్లు పెట్టుకున్నవాడైనను ఏక ఏవ బభూవ. ఒక్కడే అయినాడు. అతనిని అన్యభువనములు ఎవరు? ఏవి? అని ప్రశ్నించుచున్నారు.
(పరమాత్మ జ్ఞానము లేనివారు ప్రశ్నించుచున్నారని భావము.)
4. ఆ పరమపురుషుడు తొలుత కొందరు సృష్టికర్తలను కలిగించినాడు. వారు తమ కర్మలు, తమ విశేషజ్ఞానము చేత దృశ్యమానమగు ఈ సమస్త భూతములను సృష్టించినారు. అట్లు సృష్టించిన ఋషులు తమ స్వమాహాత్మ్యమున జరారహితులు అయినారు. వారు అంతకు ముందు తాము సృష్టించిన జగము కొరకని ధనమును సమార్జించినారు.
5. ఈ సమస్త లోకమును సృష్టించిన వానిని ఎవ్వారలును తెలిసికొనలేకున్నారు. ప్రాణులారా! అతని తత్త్వము అగమ్యగోచరము. మీరు అజ్ఞానమను మంచుచే ఆవరింపబడి ఉన్నారు. అబద్ధములాడు వారు. ప్రాణము ఉన్న చాలునని తృప్తి చెందువారు. ఉక్థములను ప్రశంసించుచు ఉన్నవారు.
(పరమాత్మ జ్ఞానము కర్మాచరణమును మించినది అని ప్రవచించుచున్నాడు.)
6. ఆ పరమాత్మ తత్త్వము నిగూఢమైనది. అది ద్యులోకమున కన్న దూరమున ఉన్నది. పృథివి కన్న దూరమున ఉన్నది. దేవాసురుల కన్న దూరమున ఉన్నది. ఏ గర్భము నందు సకల దేవతలు కలసి ఉండిరో అట్టి గర్భమును తొలుత జలములు ధరించి ఉండెను.
7. ఏ గర్భము నందు సకల దేవతలు కలసి ఉండిరో అట్టి గర్భమును తొలుత జలములు ధరించి ఉండెను.
దేనియందు ఈ సమస్త భువనములు నిలిచి ఉన్నవో ఆ ఒక్కటి అజాయమానుని నాభియందు స్థాపించబడి ఉండెను.
8. అట్టి అండమధ్యము నుండి తొలుత విశ్వకర్మ ఆవిర్భవించినాడు. తదుపరి రెండవ వానిగా గంధర్వుడు అవతరించినాడు. ఓషధులకు తండ్రియు, ఉత్పాదకుడు నగు సోముడు మూడవవానిగా జన్మించినాడు. ఈ విధముగ ఆ పరమ పురుషుడు గర్భమును బహు విధములుగ వ్యక్తము చేసినాడు.
9. అతడు చక్షురాదులకు పిత. ధీరుడు. ప్రాణులకు ఘృతము వలె ఉపయుక్తములగు ద్యావాపృథ్వులను వారికి అనుకూలముగా తన ఇష్ట ప్రకారము సృష్టించినాడు. చక్షురాదులు చేష్టావంతములై స్థిరపడిన తరువాతనే ద్యావాపృథ్వులు విస్తరిల్లినవి.
10. పరమపురుషుడు సర్వత్ర కనులు గలవాడు. సర్వత్ర ముఖములు కలవాడు. సర్వత్ర హస్తములు కలవాడు. సర్వత్ర పాదములు కలవాడు. ఆ ఒక్కదేవుడే ద్యావాపృథ్వులను కలిగించినాడు. తన బాహువులచే విశ్వమును వశపరుచుకున్నాడు. అనిత్యమగు జగములను స్వాధీనము చేసికొన్నాడు.
11. పరమాత్మ ద్యావాపృథ్వులను సృష్టించినాడు కదా! అప్పుడు అతడు ఎచట నిలిచినాడు? ఏది ఉపాదానమై ఉండెను? అచట ఏమి ఉండెను? సర్వద్రష్ట అయిన విశ్వకర్మ భూమిని ఏ కాలమున సృష్టించినాడు? ఎప్పుడు ద్యావాపృథ్వులను ఆచ్చాదించినాడు?
12. పరమేశ్వరుడు ఏ అరణ్యము నుండి ఎట్టి చెట్లను తెచ్చి ఈ ద్యావాపృథ్వులను తక్షణము నిర్మించినాడు? ఆ అరణ్యము ఏది? ఆ చెట్లు ఏవి? విద్వాంసులారా! వీనిని గురించి ఆలోచించండి. అడగండి. ఆ పరమేశ్వరుడు భువనములను ధరించినపుడు ఎచట నిలిచినాడు? ఆ విషయము కూడ అడగండి.
13. విశ్వకర్మా! నీకు విశిష్ట స్థానములు ఉన్నవి. మధ్యమ స్థానములు ఉన్నవి. అధమ స్థానములు ఉన్నవి. వానిని గురించి మిత్రుని వలె హవిస్సులు అర్పించు వానికి తెలియ పరచుము. నీవు హవిరూప అన్నము కలవాడవు. యజమానిని అనుగ్రహించి నీవు స్వయముగా యాగము చేయుము.
14. విశ్వకర్మ వాచస్పతి అగును. కర్మములందు మనసును లగ్నము చేయించువాడగును. ఈనాడు అతనిని భోజనమునకు ఆహ్వానించుచున్నాము. అతడు విశ్వశంభువు. సాధుకర్ముడు. ఆ విశ్వకర్మ మా వద్దనున్న హవిస్సులను సేవించుచున్నాడు.
15. విశ్వకర్మా! మేము సమర్పించిన హవిస్సులచే వర్థిల్లుచున్నావు. వర్ధిల్లిన ఆ తనువుచే స్వయముగ యాగము చేయుము. ఈ కర్మయందు మా శత్రువులు భ్రాంతులు అగుదురు గాక. మాకు అన్నవంతుడు, విద్వాంసుడగు పుత్రుడు కలుగును గాక.
16. విశ్వకర్మా! ఈ యజమాని నీకు హవిస్సులు అర్పించి నిన్ను వర్థిల్లచేసినాడు. అతనిని రక్షకుని, ఐశ్వర్యోపేతుని, అవధ్యుని చేయుము. అతనికి వర్థిల్లు ప్రజలను ఆధీనులను చేయుము. అతనిని ఉగ్రుని, యోగ్యుని చేయుము.
17. సముద్రాయ, మనోహరాయ, సిన్దూనాం పతయే నమః. ఋత్విగ్యజమానులారా! సర్వనదులకు తండ్రియగు విశ్వకర్మకు నిత్యము అమరమగు హవిస్సును హోమము చేయండి.
మూడవ అనువాకము
1. అగ్నీ! నీవు ఆజ్యముచే ఆహుతుడవు. యజమానికి మహదైశ్వర్యము కలిగించుము. అతనిని ధనసమృద్ధి కలవానిని, పుత్ర పౌత్రాదులు కలవానిని, సంపన్నుని చేయుము.
2. సంపన్న అగ్నీ! యజమానిని గొప్పవానిని చేయుము. అతడు బంధువులను అధీనమందు ఉంచు కొనగలవాడు అగును గాక. ఇతనికి వర్చస్సు కలిగించుము. ఇతడు దేవతలకు హవిస్సులు అర్పించువాడు అగును గాక.
3. అగ్నీ! మేము ఎవని ఇంట హవిస్సులు అర్పించుచున్నామో అతనిని వర్థిల్ల చేయుము. దేవతలు ఇతనిని అందరిని మించినవాడని చెప్పుదురు గాక; ఇతడు వైదిక కర్మలను ఆచరించును గాక.
4. అగ్నీ! సకల దేవతలు తమ ప్రభావమున నిన్ను పైననే నిలుపుదురు గాక. నీవు మాకు శివతముడవు, సుప్రతీకుడవు, విభావసువు అగుము.
5. అయిదు దిశలు దేవపత్నులు. ఆ దిశలు స్వయముగ దేవతలు. వారు మా బుద్ధి మాంద్యమును, దుర్మతిని నశింప చేయుదురు గాక. యజమానికి ధనసమృద్ధి కలిగించి యజ్ఞమును రక్షింతురు గాక.
6. యజ్ఞము మండి పడుచున్న అగ్నిని మాటిమాటికి పూజించునది. మంత్రములు వాహనములుగా గలది. ఋత్విగ్యజమానులచే గ్రహించబడినది. ఈ యజ్ఞము ధనసమృద్ధి యందు స్థిరముగ నిలిచి యున్నది. ఋత్విగ్యజమానులు ప్రజ్వలించు అగ్నిని పూజించుచున్నారు.





