Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
వర్షకాలం , వానలు జోరుగా ఉన్నాయి. మామిళ్ళు కాశాయి. నా గదిలో గుంపు చేరింది. సానులలో బిస్మిల్లాజాన్, బేగా జాన్, ఖుర్షిద్ జాన్ , మగవారిలో నవాబ్ బల్చున్, నవాబ్ చబ్బన్, గోహర్ మిర్జా, ఆషిఫ్ హుసేన్, తఫజ్జుల్ హుసేన్, అఘ్జుదలీ, అక్బరలీఖాను ఉన్నారు. పాట సాగుతుంది. ఇంతలో బిస్మిల్లా "పాట రోజూ ఉండేదే. మూకుడు పెట్టండి. వంటలు కానివ్వండి. చూడండి . వర్షం ఎంత అందంగా ఉందో " అన్నది.
నేను : తెప్పించుకో బజారు నుంచి.
ఖుర్షిద్ : బాగా చెప్పావు. బజారు నుంచి తెప్పించుకోవాలట. బజారు నుంచి ........ వంట చేసుకొని తినాలి. అందులో ఉంది మజా.
నేను : నీకు కుండలు గోకడం అనందం. నేను మాత్రం వంట చేయలేనమ్మా. నీ ఇష్టం.
బేగా : అయితే నువ్వు బజారుదానివన్నమాట.
నేను ; అబ్బ ఎంత ఆకలి నీకు ?
బేగా : నాకు కాదె ఆకలి. అడిగింది బిస్మిల్లా , అమెనను.
బిస్మిల్లా : ఇవ్వాళ ఏదో ఒకటి కావాలిసిందే.
నేను : చెప్పనా ! బక్షీ చెరువుకు వెళ్దామా?
బిస్మిల్లా : యెంత మంచి మాట చెప్పావక్కా!
ఖుర్షిద్ : హాయిగా విహరించవచ్చు.
బేగా : నేనూ వస్తా.
నేను : అయితే సామాను సర్దు.
మాటలు మాటలలోనే మూడు బాడు బండ్లు వచ్చాయి. వంటసామాగ్రి వాటి మీద వేశారు. నవాబు చబ్బన్ ఇంటి నుంచి రెండు గుడారాలు వచ్చాయి. అంతా బండ్లెక్కాం. బండ్లు కదిలాయి.
గోమతి దాటింతరవాత బేగాజాన్ పాట మొదలు పెట్టింది.
ఝూలాకన్ డోరోరే అమిరియాఁ
ఎన్ని మళుపులు తిప్పిందో! గుండె పిండేసింది.
పట్నం దాటితే అడవి ఎంతో అందంగా కనిపించింది. ఎటు చూచినా పచ్చదనం ఆకాశంలో మబ్బులు ఉరుకుతున్నాయి. వర్షం కురుస్తుంది. చెట్ల ఆకుల నుంచి నీటి బిందువులు రాలుతున్నాయి. నదీనదాలు నిండి ప్రవహిస్తున్నాయి. నెమలి ఆడుతుంది. కోకిల పాడుతుంది. మాటల్లోనే చెరువు దగ్గరికి చేరాం. గుడారాలు నిలిచాయి. నవాబు చబ్బను గారు వాన దుస్తులు వేసుకొని వేటకు బయలుదేరారు. గోహర్ మిర్జా మామిడికాయలు తెంపాడు. ఇంతలో పనివాళ్ళు ఉళ్ళో నుంచి మంచాలు తెచ్చారు. అనందం అంటే అది. మామిడికాయలు రాలుతున్నాయి. ఒక్కొక్క కాయ మీద నలుగురు , నలుగురు పడుతున్నారు. వానలో గంతులు వేస్తున్నారు.
ఒకడు అటు పరుగెత్తుతున్నాడు. ఒకడు ఇటు. పోట్లాటలు. క్రిందపడితే అంతా బురద. వానలో క్షణం నుంచుంటే చాలు మళ్ళీ శుభ్రం. కాస్త జాగ్రత్త గలవాళ్ళు బాజీ, బేగా జాన్ లాంటి వారు గుడారాల్లో కూర్చున్నారు.
బిస్మిల్లా చాటుగా వెళ్ళి ముఖానికి మామిడి పళ్ళ రసం పులిమింది. వాళ్ళ కేకలు. వీళ్ళ నవ్వులు . చూడాలి తమాషా!
వరదలు వచ్చినట్లు వచ్చారు. ఆటపాటల వాళ్ళు. వాళ్ళతో పాడించారు. వారితో ఉన్న డోలక్ వాయించేవాడు అసాధ్యుడు. వాళ్ళ ఆటపాటలు మాకేం నచ్చుతాయి? అయినా ఆ పరిస్థితిలో అది బాగానే ఉన్నాయి. రెండు గడియల పొద్దు ఉండగా మా అదృష్టానికి మబ్బు విడిపోయింది. ఎండ వచ్చింది. జాగ్రత్త కోసం ఇంటి నుంచి ఒక్కొక్క జత బట్టలు తెచ్చుకున్నాం. బట్టలు మార్చుకొని వన విహారానికి బయలుదేరాం.
నేను ఒంటరిగా ఒకవైపు బయలుదేరాను. ఎదుట చెట్లు దట్టంగా ఉన్నాయి. చెట్ల వెనక సూర్యుడు కుంగుతున్నాడు. పచ్చని చెట్ల మీద బంగారు కిరణాలు శోభాయమానంగా ఉన్నాయి. అంతటా అడవి పూలు వికసించాయి. పక్షులు గూళ్ళు వెదుకుతూ ఎగురుతున్నాయి. చెరువు నీటి మీద సూర్య కిరణాలు పడడాన బంగారం కరిగిపోసినట్లనిపిస్తుంది. ఆకాశం మీద సంధ్యారాగం పరచుకుంది. ఈ అందాన్ని , ఆనందాన్ని వదిలి గూటిలో కూర్చోడం సాధ్యపడదు. అలా చూస్తూ ఎంత దూరం నడిచానో , ఒక మట్టి రోడ్డు వచ్చింది. పల్లెజనులు ఆ బాటనే వెళ్తున్నారు. భుజాన నాగలి వేసుకొని ఒకడు ఎద్దులు తోలుతున్నాడు. ఒక చిన్నపిల్ల ఆవులను, గేదెలను తోలుకుపోతున్నది. ఒక కుర్రాడు మేకలు, గొర్రెల వెనక వెళ్తున్నాడు. అన్నీ అలా కనిపించి మాయం అయినాయి. మళ్ళీ వంటరిదాన్ని అయిపోయాను. ఏ ధ్యాసలో ఉన్నానో రోడ్డు వెంట సాగిపోయాను. చెరువు వైపు వెళ్తున్నానేమో! సూర్యుడు అస్తమించనున్నాడు. కాళ్ళు వేగంగా నడిచాయి. కొంత దూరం నడిచాను. ఫకీర్ల స్థలం కనిపించింది. కొందరు కూర్చొని హుక్కా తాగుతున్నారు. చేరువునకు దోవ అడిగాను. లక్నో రోడ్డు మీద నడుస్తున్నానని తెలిసింది. చెరువు కుడివైపున తప్పిపోయింది. రోడ్డు వదిలి కాలి బాటన సాగిపోయాను. కొంత దూరంలో ఒక కాలువ కనిపించింది. కాలువ అవతలి ఒడ్డున రెండు మూడు చెట్లున్నాయి. ఆ చెట్ల క్రింద మనిషి అలికిడి వినిపించింది. ఒక మురికి బట్టల మనిషి గునపంతో ఏదో త్రవ్వుతున్నాడు. అతన్ని చూశాను. అతడు చూచాడు. ముందు సంశయం. బాగా చూచాను. అతడే. నిశ్చయం . చూపు తిప్పాలని ప్రయత్నం. వెధవది కదలందే ద్రువపడింది. అతడే వళ్ళు తూలింది. పడిపోయేదాన్నే. ఇంతలో అక్బరలీఖాను నౌకరు సాలారు ఖాను కేక చెవిని పడింది. నన్ను వెదకడానికి బయలుదేరాడతను. నన్ను చూచి దిలావర్ ఖాను గునపం అక్కడ పెట్టేశాడు. నేను అతనిని చూడడం అతడు నన్ను చూడడం. అతడు నన్ను గుర్తించలేదని తేలిపోయింది. నేను మాత్రం అతనిని బాగా గుర్తించాను.
సాలార్ బక్ష్ మాట విని దిలావర్ ఖాను కాలువ వైపు పరిగెత్తాడు. సాలార్ బక్ష్ నావద్దకు చేరాడు. నేను భయంతో వణికిపోతున్నాను. నోటి నుంచి మాట రావడం లేదు. సాలార్ బక్ష్ నన్ను చూచి "భయపడ్డారా?" అని అడిగాడు. నేను చెట్ల వేపు సంజ్ఞ చేశాను. సాలార్ బక్ష్ అటు చూచాడు.
సాలార్ : ఏముందక్కడ? గునపం పడి ఉంది. వాహ్! దాని చూచి ఇంత భయమా? బొంద తవ్వుతున్నాడనుకున్నారా?" ఏడీ ఆ తవ్వుతూ ఉండినవాడు?
నేను : ( నోటితో చెప్పలేకపోయాను. కాలువ వైపు చూపాను.)
సాలార్ : హుక్కా తాగడానికి వెళ్ళి ఉంటాడు. నవాబు చబ్బన్ గారు చాల పిట్టలను కొట్టి తెచ్చారు. మీ జాడ కనిపించలేదు. వెదకడానికి వారు అటు వెళ్ళారు. నేను ఇటు వచ్చాను. నేను లేకుంటే మీకు తోవ దొరికేది కాదు.
నేను అవునని కాని కాదని కాని అనలేదు. సాలార్ బక్ష్ కూడా మాట్లాడలేదు. చేలల్లోంచి చెరువు దగ్గరికి చేరాం. రాత్రి అక్కడే ఉండిపోయాం. భోజనాలు అయిన తరవాత అక్బరలీ ఖాను కు ఆ వృత్తాంతం చెప్పాను.
అక్బరలీ ఖాను : బాగా చూచావా? దిలావరు ఖానేనా? ఫైజాబాదు వాడు. గుర్తుంచే ఉంటావు. వెధవను వెళ్ళి పట్టుకునే వాణ్ణి. ముందే చెప్పావు కావు. పేరు వచ్చేది. ప్రభుత్వ బహుమానం లభించేది. వేయి రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఏమీ తవ్వుతూ ఉంటాడు?
నేను : ఏమో ఎలా తెలుస్తుంది? వెధవ తన గోరీ తవ్వుకుంటూన్నాడేమో?
అక్భ : వాడి పేరు చెబితే నీ ముఖం వెలవెలపోతుంది. ఇక్కడ ఏం చేయగలడు. వాడు నిన్ను?
నేను : (ధైర్యం తెచ్చుకొని) పితూరీ సమయంలో ఏదో పాతిపెట్టి ఉంటాడు. త్రవ్వి తీసుకోవడానికి వచ్చి ఉంటాడు.
అక్భ : నడువు చూతాం.
నేను : నేను మాత్రం రాను.
అక్బ : నేను వెళ్ళడం ఖాయం. సాలార్ బక్ష్ ను తీసికేల్తాను.
నేను : ఎక్కడికి వెళ్తారు? ఇంకా అక్కడ ఏముంటుందని? తవ్వి తీసికెళ్ళి ఉంటాడు.
అక్బ : వెళ్ళడం ఖాయం.
కాస్త బిగ్గరగా అన్నారు. పక్కనే నవాబు చబ్బను గారి గుడారం ఉంది. బిస్మిల్లా నవాబు మెలకువతోనే ఉన్నారు.
నవాబు : ఖానుగారూ! ఎక్కడికీ వెళ్ళడం?
అక్భ : నవబుగారూ! ఇంకా మీరు పడుకోలేదా?
నవాబు : ఇంకా లేదు.
అక్భ : నేను రానా?
నవాబు : విచ్చేయండి.
అక్బరలీఖాను, నేను డేరాలోనికి వెళ్ళాం. మొత్తం వృత్తాంతం వినిపించాను.





