Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda
జ్యేష్ఠాయ = పెద్దవానికి, కనిష్ఠాయ = చిన్నవానికి, పూర్వజాయ = సృష్టికి పూర్వము పుట్టినవానికి, మధ్యమాయ = మధ్యమునకు, అపరజాయ = సృష్టికి తరువాత పుట్టినవానికి, అపగల్భాయ = ఇంద్రియములు ఏర్పడనివానికి, జఘన్యాయ = జఘనమున ఉన్నవానికి, బుధ్నిమాయ = వృక్షాదుల మూలములకు, సోభ్యాయ = నరలోకపువానికి, ప్రతిసర్యాయ = కంకణము కట్టుకున్నవానికి, యమ్యాయ = యమలోకవాసికి, క్షేమ్యాయ = క్షేమము - మోక్షము - కలిగించువానికి, ఊర్వ్యాయ = పంటలవానికి, ఖల్యాయ = కళ్లముల వానికి, శ్లోకాయ = కీర్తించబడువానికి, అవపాన్యాయ = వేదాంత ప్రతిపాద్యునకు, వన్యాయ = అరణ్యములకు, కక్ష్యాయ = పొదలకు, శబ్దాయ = శబ్దమునకు, ప్రతిశ్రవాయ = ప్రతిధ్వనికి, ఆశుషేణాయ = వేగవంతసేన గలవానికి, ఆశురథాయ = వడిగల రథము గలవానికి, శూరాయ = శూరునకు, అవభిన్దతే = శత్రువును సంహరించువానికి, వర్మిణే = కవచధారికి, వరూథినే = గృహపతికి, బిల్మినే = శిరస్త్రాణధారికి, కవచినే = కవచము గలవానికి, శ్రుతాయ = వేద ప్రసిద్ధునకు, శ్రుతసేనాయ = వేదప్రసిద్ధ సేన గల రుద్రునకు నమోనమః
ఏడవ అనువాకము
1. నమో దున్దుభ్యాయ చ్క్కాహనన్యాయ చ నమో ధృష్ణవే చ ప్రమృశాయ చ నమో దూతాయ చ ప్రహితాయ చ. నమో నిషఙ్గిణే చేషుధిమతే చ. నమస్తే క్షేషవే చ్క్కాయుధినే చ. నమః స్వాయుధాయ చ సుధన్వనే చ. నమః సృత్యాయ చ పథ్యాయ చ. నమః కాట్యాయచ నీప్యాయ చ. నమః సూద్యాయచ సరస్యాయచ. నమో నాద్యాయచ వైశన్తాయచ. నమః కుప్యాయ చావట్యాయచ. నమో వర్ష్యాయచ నమో మేఘ్యాయచ విద్యుత్యాయ చ. నమ ఈధ్రియాయచ్కాతప్యాయ చ. నమో వాత్యాయచ రేష్మియాయచ నమో వాస్తవ్యాయచ వాస్తు పాయచ.
దుందుభి గల వానికి, దుందుభిని కొట్టు కర్ర కలవానికి, యుద్ధమునకు వెన్నివ్వని వానికి, పరసైన్య బలజ్ఞాతకు, దూతకు, యజమాని పంపిన వానికి, ఖడ్గ హస్తునకు, అమ్ములపొది కలవానికి, వాడి బాణముల వానికి, బహు ఆయుధముల వానికి, గొప్ప ఆయుధముల వానికి, గొప్ప ధనువు గలవానికి, కాలిబాటల వానికి, రథపుబాటల వానికి, కాలువల నీటికి, జలపాతమునకు, బురదగుంటకు, సరస్సునకు, నదులకు, కుంటలకు, బావినీటికి, చెలమనీటికి, ఊట నీటికి, మబ్బు నీటికి, తటిత్తుకు, శరన్మేఘమునకు, ఎండతోటి వానకు, గాలితోటి వానకు, వడగళ్ళవానకు, గవాశ్వాది ధనమునకు, వాస్తురూపుడగు రుద్రునకు నమోనమః.
ఎనిమిదవ అనువాకము
1. నమః సోమాయచ రుద్రాయచ. నమస్తామ్రా చారుణాయచ. నమః శఙ్గాయచ పశుపతయేచ. నను ఉగ్రాయచ భీమాయచ. నమో అగ్రేవధాయచ దూరే వధాయచ. నమో హన్త్రేచ హనీయసేచ. నమో వృక్షేభ్యో హరికేశేభ్యో సమస్తారాయ. నమః శంభవేచ మయోభవేచ. నమః శంకరాయచ మయస్కరాయచ. నమః శివాయచ శివతరాయచ. నమస్తేర్ధ్యాయచ కుల్యాయచ. నమః పార్యాయ చావార్యాయచ. నమః ప్రచరణాయ చోత్తరణాయచ. నమ ఆతార్యాయచ్కాలాద్యాయచ. నమః శష్పాయచ ఫేన్యాయచ. నమః సికత్యాయ చ ప్రవాహ్యాయ.
శఙ్గాయ = సుఖము కలిగించువానికి, అగ్రే వధాయ = ఎదుట వధించువానికి, దూరే వధాయ = దూరమున వధించువానికి, హన్త్రే = హంతకు, హవనీయసే = సంహరించువానికి, వయోభవే = మోక్షము కలిగించువానికి, మయస్కరాయ = సుఖములు కలిగించువానికి, పార్యాయ = దాటించువానికి, అవార్యాయ = కామ్యఫల ప్రదుడగు వానికి, ప్రతరణాయ = చక్కగా తరింపచేయు వానికి, ఉత్తరణాయ = ఉద్ధరించువానికి, ఆతార్యాయ = ఫలప్రదునకు, ఆలాద్యాయ = సంపూర్ణ ఫలప్రదునకు.
(మిగిలిన పదములకు అర్థములు సులభ గ్రాహ్యములు.)
తొమ్మిదవ అనువాకము
1. చవిటి నేలయందు పుట్టినవానికి నమః. అందరు నడచు మార్గమున పుట్టినవానికి నమః గులకరాళ్ల చోటునకు నమః. నివాసయోగ్య భూమికి నమః. జడలుగలవానికి నమః. భక్తుల ముందు ఉండువానికి నమః. గోశాలకు నమః. గృహపదార్థములకు నమః. తల్పమునకు నమః. గేహమునకు నమః. దుర్గమ అరణ్యములకు నమః. గిరిగుహాదులకు నమః. అగాధ జలమునకు నమః. శుద్ధ జలములకు నమః. పరమాణు స్వరూపునకు నమః. ధూళియందున్నవానికి నమః. పుట్టిన వానికి నమః. హరితములకు నమః. గట్టినేలకు నమః. గరికనెలకు నమః. నేలమీద పుట్టిన వారికి నమః. నదులందు పుట్టినవానికి నమః. ఆకులందు ఉన్నవానికి నమః. ఎండుటాకుకులందున్న వారికి నమః. ఉద్యతాయుధునకు నమః. ప్రహర్తకునమః. కొంచెము దుఃఖము కలిగించువానికి నమః. భక్తులకు ధనమిచ్చు వారలు, దేవతల హృదయములందున్న వారలగు మీకు నమః. క్షయము లేక దేవతల హృదయములందున్న మీకు నమః. ఆపేక్షితార్థములు సాధించిన దేవతల హృదయములందున్న మీకు నమః. పాపములను నశింపచేయు దేవతల హృదయములందున్న మీకు నమః. సర్వత్ర స్థూలముగా ఉన్నట్టి దేవతల హృదయములందున్న మీకు నమః.
(ఈ నమస్కారములన్నియు శివస్వామికే.)
పదవ అనువాకము
1. రుద్రదేవా! నీవు తాపకుడవు. అన్నపాలకుడవు. కేవలుడవు. నీలలోహితుడవు. మా పుత్ర, పౌత్రాదులను, పశువులను భయపెట్టకుము. వానిలో ఏదియు తప్పిపోరాదు. రోగాన పడరాదు.
2. శివస్వామీ! నీ దేహము శివము. నీ దేహము సర్వరోగ నివారక భేషజము. శాంతము, భిషగ్రూపమగు నీ దేహము మమ్ము సుఖముగా బ్రతికించునుగావుత.
3. మా పుత్ర పౌత్రాదులు, పశువులకు సుఖము కలుగుటకు, ఈ భూమి మీది సకల ప్రాణి జాలము అనాతురమై సుఖములందు తేలియాడుటకును, బలశాలి, కపర్ది, ప్రతిపక్షమును క్షీణింపచేయువాడగు రుద్రుని పూజించుచున్నాను. అర్చనలను పోషించుచున్నాము.
4. నీలకంధరా! మాకు ఇహ, పర సుఖములు కలిగించుమనియు, మా పాపములను నశింపచేయుమనియు నిన్ను నమస్కరించి సేవించుచున్నాము. మను ప్రజాపతి దుఃఖమెరుగని సుఖమును ఆర్జించినాడు. స్వామీ! నీవు మమ్ము అనుగ్రహించు చుండగా వానిని అన్నింటిని మేము అనుభవించగలము.
5. రుద్రదేవా! మా వారలగు వృద్ధులను బాధించకుము. బాలురను బాధించకుము. యువకులను బాధించకుము. గర్భస్థులను బాధించకుము. మా తండ్రిని వధించకుము. మా తల్లిని వధించకుము. మాకు ప్రియములగు మా దేహములను హింసించకుము.
6. రుద్రదేవా! మా సంతానమును బాధించకుము. మా పుత్రులను బాధించకుము. మా ఆయువులను బాధించకుము. మా గోవులను బాధించకుము. మా అశ్వములను బాధించకుము. క్రోధము కలవాడవై మా పరిచారకులను వధించకుము.
మేము నీకు హవిస్సులర్పించియు, నమస్కరించియు సేవింతుము.
7. రుద్రస్వామీ! నీ ఉగ్రరూపము పశువులను, పుత్రులను, సేవకులను వధించునది. ఆ ఉగ్ర రూపమును మాకు దూరముగా నిలుపుము. శాంతమగు నీ రూపము ఉన్నది కదా! దానిని మా యందు చేర్చుము. మమ్ము అంతటను పాలించుము. మమ్ము గురించి దేవతలకు హెచ్చుగా చెప్పుము. ఇహ, పరములను వర్థిల్ల చేయునట్టి నీవు మాకు సుఖములు ప్రసాదించుము.
8. రుద్రుడు హృదయకుహరములందుండువాడు. నిత్య తరుణుడు, ప్రళయకాలమున భీకర మృగము వలె ఉగ్ర రూపము దాల్చువాడు. ప్రసిద్ధుడు.
జిహ్వా! అట్టి రుద్రదేవుని స్తుతించుము.
రుద్రదేవా! మా స్తుతులు వినుము. క్షీణించు మా దేహములకు సుఖములు కలిగించుము. నీ సేనలు మమ్ము కాక, మా వైరులను నశింపచేయునుగాక.
9.రుద్రుని ఆయుధము మమ్ము తాకకుండునుగాత. అతని బుద్ధి ఉగ్రము. అది మండి పడుచు ప్రళయము కలిగించు పాపములు కోరుచుండును. అది మమ్ము అంటకుండును గాక.
రుద్రదేవా! హవిస్సులు అందించు యజమాని నుండి నీ ఉగ్రబుద్ధిని తొలగించుము. నీవు కోరికలు తీర్చువాడవు. మా పుత్ర పౌత్రులకు సుఖములు కలిగించుము.
10. రుద్రదేవా! హవిస్సులు అందించు యజమాని నుండి నీ ఉగ్రబుద్ధిని తొలగించుము. నీవు కోరికలు తీర్చువాడవు. మా పుత్ర, పౌత్రులకు సుఖములు కలిగించుము.
11. మహాదేవా! నీవు ఎన్నో కోరికలు తీర్చువాడవు. మా విషయమున శివతముడవు, శాంతుడవు, సుమనస్కుడవగుము. నీ ఆయుధమును చెట్టు మీద పెట్టి, పులి తోలు కట్టి, పినాకపాణివై మాకు అభిముఖముగా విచ్చేయుము.
12. రుద్రదేవా! నీవు భక్తులకు విశేష ధనము ప్రసాదించువాడవు. విశేష లోహిత వర్ణుడవు. నీకు నమస్కరించుచున్నాను. నీకు వేల ఆయుధములు ఉన్నవి. వానిని మా విరోధుల మీద ప్రయోగించుము.
13. రుద్రదేవా! నీ చేత వేన వేల ఆయుధములు ఉన్నవి. నీవు సమర్ధుడవు. నీ ఆయుధముల మొనలను మా ముందునకు రాకుండునట్లు తిప్పి పెట్టుము.
పదకొండవ అనువాకము
1. భూమి మీద రుద్రులు వేలప్రకారులై ఉన్నారు. వేల మంది ఉన్నారు. వారందరి ధనువులను వేలయోజనముల దూరము నందు, అల్లె త్రాళ్ళని దించి ఉంచుచున్నాము.
2. మహార్ణవము వంటి అంతరిక్షము అదృశ్యమానమై ఉన్నది. దానిని ఆశ్రయించి రుద్రులు ఉన్నారు. తేషాగం సహస్రయోజన్కేవ ధన్వాని తన్మసి. వారి ధనువులను వేలయోజన దూరమున వంచి ఉంచినాము.
3. భూమిలోపల నీల కంఠులును, శితి కంఠులును అగు రుద్రులు ఉన్నారు.
తేషాగం సహస్ర యోజన్కేవ ధన్వాని తన్మసి.
4. స్వర్గమునందున్న నీలగ్రీవ, శితి కంఠ రుద్రులు, వృక్షముల మీద పసిడి రంగు గల వారును, నీలగ్రీవులును, విలోహిత వర్ణులును అగు రుద్రులు ఉన్నారు.
తేషాగం సహస్ర యోజన్కేవ ధన్వాని తన్మసి.
5. ప్రాణులు దేహములందు అధిపతులగుచు ముండిత శిరస్కులు, కపర్దులగు రుద్రులు ఉన్నారు.
తేషాగం సహస్ర యోజన్కేవ ధన్వాని తన్మసి.
6. కొందరు రుద్రులు అన్నములందు దాగి ఉన్నారు. కొందరు అన్నము తినువారి యందు, కొందరు భోజన పాత్రలందు, కొందరు క్షీరాదులు త్రాగు జనులందు దాగి ఉండి బాధించుచున్నారు.
తేషాగం సహస్ర యోజన్కేవ ధన్వాని తన్మసి.
7. రుద్రులందు దారులు కాపాడువారు. అన్నము పెట్టి పోషించు వారు. శత్రువులతో యుద్ధము చేయువారు. తీర్థములను రక్షించువారు. ఖడ్గ పాణులై సంచరించు వారు ఉన్నారు.
తేషాగం సహస్ర యోజన్కేవ ధన్వాని తన్మసి.
8. ఏ రుద్రులు భూమి మీద ఉన్నవారో, ఎవరు సర్వ దిశలందు ఉన్నవారో
తేషాగం సహస్ర యోజన్కేవ ధన్వాని తన్మసి.
9. భూమి మీద రుద్రులు ఉన్నారు. అన్నము బాణములుగా గల రుద్రులు ఉన్నారు. అట్టి భూమి మీద ఉన్నట్టి రుద్రులకును, అన్నము బాణములుగా గల రుద్రులకును, దశాంగుళులు ప్రాగగ్రములుగను, దశాంగుళులు దక్షిణాగ్రములుగను, దశాంగుళులు పశ్చిమాగ్రములుగను, దశాంగుళులు ఉత్తరాగ్రములుగను, దశాంగుళులు ఊర్థ్వాగ్రములుగను నమస్కరించుచున్నాము. ఆ రుద్రులు మాకు సుఖములు కలిగింతురుగాక. మేము ద్వేషించువైరులను, మమ్ము ద్వేషించు వైరులను రుద్రులారా! మీ నోట పడవేయుచున్నాము.
అంతరిక్షమున ఉన్న రుద్రులు ఉన్నారు. వాయువు బాణములుగా గల రుద్రులు ఉన్నారు. అట్టి అంతరిక్షమున ఉన్నట్టి రుద్రులకును, వాయువులు బాణములుగా గల రుద్రులకును, దశప్రాచీర్దశ దక్షిణా దశ ప్రతీచీర్దశోదీచీర్దశోర్ద్వాస్తేభ్యోనమస్తే. నో మృడయస్తు. తేయం ద్విష్మోయశ్చనో ద్వేష్టి తం వోజుమ్భేదదామి.
ద్యులోకమున ఉన్న రుద్రులు ఉన్నారు. వర్షము బాణములుగా గల రుద్రులు ఉన్నారు. అట్టి ద్యులోకమున ఉన్న రుద్రులకును, వర్షము బాణములుగా గల రుద్రులకును దశప్రాచీర్దశ దక్షిణా దశ ప్రతీచీర్దశోదీచీర్దశోర్ద్వాస్తేభ్యోనమస్తే. నో మృడయన్తు. తే యం ద్విష్మోయశ్చనో ద్వేష్టి తం వో జుమ్భే దదామి.
శ్రీమదాంధ్ర వచన కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహిత
నాలుగవ కాండము నందలి అయిదవ ప్రపాఠకము సమాప్తము.





