Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
బేగం : గుర్తించకేం? మొదటిసారి కాన్పూరులో చూచినప్పుడే అనుకున్నాను. చాలసేపు ఎక్కడో చూచినట్లు అనిపించింది. ఎక్కడ చూచింది గుర్తుకు రాలేదు. ఎంతో ఆలోచించాను. అయినా గుర్తుకు రాలేదు. కరీమన్ అనే దాసీ మీద దృష్టి పడింది. వెంటనే ఆ వెధవ కరీమ్ గాడి పేరు గుర్తుకు వచ్చింది. అప్పుడు అనుకున్నాను. కరీమ్ ఇంట్లోనే చూచి ఉంటాను.
నేను : నాకూ అలాగే అనిపించింది. చాలసేపు ధ్యానంగా చూచాను. నాతోటి వారిలో - "ఖుర్షిద్" అనేది ఉండేది. ఆమె అచ్చం నీలాగే ఉండేది. ఆమెను చూచినప్పుడల్లా నువ్వు గుర్తుకు వచ్చేదానిని.
బేగం : ఇక నా విషయం విను.
విదిపోయావా ? నవాబు గారి తల్లి ఉన్దుతున్నీసా బేగం నన్ను కొన్నది. అప్పుడు నా వయసు పన్నెండు సంవత్సరాలు ఉండవచ్చు. నవాబు గారికి అప్పటికి పదహారేళ్ళు. వారి తండ్రి కాన్పూరులో ఉండేవారు. బేగం గారికీ భర్తకు స్పర్ధలుండేవి. నవాబు తండ్రి నవాబు గారి పెళ్ళి తన అక్క కూతురుతో నిశ్చయించారు. బేగం గారికి ఆ సంబంధం ఇష్టం లేదు. నవాబు మేనత్త డిల్లీలో ఉండేది. నవాబు తల్లి తన అన్న కూతురు నిచ్చి కొడుకుకు పెళ్ళి చేయాలనుకుంది. మొదటి నుంచీ ఉన్న ఆలుమగల స్పర్ధలు దీనితో పెరిగాయి. ఈ తగాదా పరిష్కారం కాకముందే నవాబు గారి తండ్రి జబ్బు పడ్డారు. వైద్యులు త్వరగా పెళ్ళి కావాలన్నారు. అది సాధ్యపడలేదు. ఇంతలో నేను ప్రవేశించాను. బెగమ్ గారు నన్ను కొన్నారు.
నవాబు గారికి నేనంటే అపారమైన ప్రేమ ఏర్పడింది. రెండు తరపుల సంబంధాలూ తమకు ఇష్టం లేవని స్పష్టంగా చెప్పేశారు. దురదృష్టవశాత్తూ బేగమ్ గారు గతించారు. తరవాత కొద్ది కాలానికి పెద్ద నవాబు గారు మరణించారు. తల్లీ , తండ్రీ ఇద్దరూ ఆస్తి గలవాళ్ళే. ఒక్కడే కొడుకు. ఇద్దరి ఆస్తి వారికే చెందింది.
నవాబుగారి దయ వలన బేగమ్ ను అయినాను. హాయిగా ఉన్నాను. తాళి కట్టిన భార్య కంటే మిన్నగా చూసుకుంటున్నారు నవాబు గారు. నాకు తెలిసినంత వరకు మరొక ఆడదాన్ని కన్నెత్తి చూడలేదు. బయట ఎవ్వరైనా సానులున్నారేమో నాకు తెలియదు. ఎంతైనా మగవాళ్ళు గదా! వెంట ఉండి చూడబోయానా?
అల్లా అన్ని కోరికలు తీర్చాడు. పిల్లలు కావాలనే అభిలాష ఉండేది. భగవంతుడు ఆ కోరికను కూడా తీర్చాడు. ఇప్పుడు ఉన్న కోరికల్లా కోడలును తేవడం, మనుమని ఆడించడం. నవాబు చేతిలో మట్టి అయితే ధన్యురాలిని. ఇక నీ కధ చెప్పు.
రామ్ దేవీ తన కధ చెపుతున్నంత సేపూ న దురదృష్టానికి మనసులో దుఖించాను. అదృష్టం అంటే అలా ఉండాలనుకున్నాను. నా ఖర్మ నన్ను బోగం కొంపకు చేర్చింది.
తరవాత సంగ్రహంగా నా కధ చెప్పాను. అది మీకు తెలిసిందే. ఆరోజంతా అక్కడే ఉన్నాను. వెళ్ళిపోవడానికి తయారు అవుతుండగా దాసీలను పిలిచి తబలా, తంబూరా సితార్ వగైరా తెప్పించింది. పాటలు ప్రారంభం అయినాయి.
మేము ఇద్దరం మాత్రమే ఉండినప్పుడు ఆమె రామ్ దేవీ , నేను అమీరన్ అయినాం. అందరి ముందు మళ్ళీ ఆమె బేగమ్ సాహెబ్ , నేను ఉమ్రావ్ ఖాన్ అయిపోయాం. మూడు నాలుగు గంటలు గాన, వాద్య గోష్ఠి జరిగింది. బేగం కు కూడా కొద్దిగా సితార్ వాదనం తెలుసు. ఒక చెలికత్తె గొంతు బాగుంది. ఆమెతో పాడించింది. సాయంకాలం వరకూ ఆనందంగా గడిచింది.
24
ఓసి కాంక్షా దృగంచలమా! జాగ్రత్త
ఎల్లవారి చూపుల తూపులు నీయందే నిగిడే
సాయంకాలానికి నవాబు గారు విచ్చేశారనే కలకలం వినవచ్చింది. స్వేచ్చ స్నేహానికి అంతరాయం కలిగింది. తబలా, సితార్, తంబూరా వగైరాలన్నీ తొలగించబడినాయి. గోషా వారు పరదాలలోకి వెళ్ళిపోయారు. అంతా ఎవరి స్థానాల్లో వారు ఉండిపోయారు. నేను బేగమ్ కు దూరంగా నుంచున్నాను. మేము కూర్చున్న చోటునకు ఎదురుగా ద్వారం ఉంది. దానికి తెర ఉంది. నవాబు కోసం ఎదురు చూస్తూ ఉండడాన చూపు పరదాకు అంటుకుపోయింది. ఇంతలో నవాబు గారు విజయం చేస్తున్నారనే కేక వినిపించింది. కొన్ని క్షణాలు గడిచాయి. ఒక దాసీది తెర తొలగించి "బిస్మిల్లా ఇర్రహమా నిర్రహీమ్ " అన్నది. నవాబు లోపల ప్రవేశించారు.
వారిని చూడగానే మనసులో అనుకున్నాను సుల్తాను గారు ఎలాంటి సమయంలో ఎడురైనారు అని. నవాబు దృష్టి నామీద పడింది. క్షణం తడబడ్డాను. తరవాత నన్నే చూస్తూ ముందుకు సాగారు. నేనూ వారినే చూస్తూ ఉండిపోయాను.
వారిని చూచినపుడెల్ల గుండె బెదురు నాకు
నా దృక్కు అతనికి ప్రళయమహో గ్రకీలలయ్యే
బేగమ్ : ఎందుకూ చూస్తారు? ఉమ్రావ్ జాన్ కాన్పూరు లో ....
నవాబు : ( వినకుండానే ) ఈమె విషయమే మీకు నేను చెప్పింది.
అంతా వినయంగా లేచి నుంచున్నారు. నవాబు బాలీసును అనుకోని బేగమ్ పక్కన కొద్ది ఎడంగా కూర్చున్నారు.
చీకటి పడింది. దాసీది రెండు తెల్లని దీపకమలాలు తెచ్చి పెట్టింది. బేగమ్ ఆకులకు సున్నం రాస్తుంది. ఈలోగా నవాబు దొంగచాటుగా నావైపు చూచారు. నా కనుపాపల్లో వారు కనిపించారు. నాలుకలు పలకవు. కాబట్టి కళ్ళకే నోరు వచ్చింది. కోపతాపాలు, విరహప్రణయాలూ కళ్ళతోనో సాగాయి.
నవాబు : (కొత్త దానం కనబరచి) ఉమ్రావ్ జాన్ గారూ! మీకు మేము ఎంతో రుణపడి ఉన్నాం. ఆ రాత్రి కాన్పూరులో తాము లేకుండినట్లయితే మా ఇల్లు దక్కేది కాదు.
నేను : ఎందుకు నన్నిలా ముళ్ళ కంచేలోకి లాగుతారు? అది కాకతాళీయం మాత్రమే.
నవాబు : ఏ తాళీయం అయినా కారణం మీరే. అక్కడ ఉండినదేమీ లేదు. అయినా ముఖ్యమైన కాగితాలన్నీ అక్కడే ఉన్నాయి.
నేను : అడవిలో ఆడవాళ్ళను వదిలి ప్రభువులు ఎక్కడికి వేంచేశారు?
నవాబు : ఏం చేయను ? పరిస్థితులు అలా వచ్చాయి. లక్నో లోని ఆస్తి పాదుషా జప్తు చేశారు. గవర్నరు వద్దకు కలకత్తా వెళ్ళవలసివచ్చింది. ఆ తొందరలో వెంట ఏమీ తీసికెళ్ళలేదు. షమ్మీర్ ఖానును, మరొక మనిషిని మాత్రం వెంట తీసికెళ్ళాను.
నేను : ఆ అడవి ఇంట్లో ఏం జరిగినా ఆశ్చర్యం లేదు.
నవాబు : ఆనాటి సంఘటన తప్ప ఏదీ జరగలేదు. పితూరీ జరగబోతుంది. గుండాలంతా తలెత్తారు. దేశంలో చీకట్లు కమ్ముకున్నాయి.
తరవాత ఆ మాటలు ఈ మాటలు జరిగాయి. దస్తర్ ఖాన్ పరచబడింది. కలిసి భోజనాలు చేశాం. ఆకూ తినడం , హుక్కా తాగడం అయిన తరవాత నవాబు సంగీతం పాడమని ఆదేశించారు. నేను ఈ గజలు చదివాను.
గుర్తులేదు మరణవేళ మృత్యుదేవి
గుర్తువచ్చే పదేపదే అదే చెలియ!
నీ వలపు వయారాలు గుర్తులేవు
నీ చేసిన ,మోసమెల్ల గుర్తుకలదు!
విరహరాత్రి గడిచిపోయే - గుర్తులేదు
కురుల వలల చిక్కుటోకటే గుర్తుకలదు!
వియోగాన నీవొకతేవె గుర్తుంటివి
నీవు రానివేళ చావొకటే గుర్తువచ్చే !
అడగకు వలపుకలత లెన్నికలవొ
స్వర్గమందు కూడ అవియే గుర్తువచ్చు!
ఓరి వైద్యుడా! గ్రుక్కెడు విషము తెమ్ము
ఆ అమృతమేదో ఇపుడు గుర్తువచ్చే!
ఏమి పాట! ఎవరు చెప్పిరి?
ప్రాభాత మలయానిలమేల గుర్తువచ్చెనో?
* * *





