Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    "ఇంద్రా! నీవు నాకు అడ్డురావద్దు. అశ్వినులు వైద్యులు. వారికి దేవతలతో సమాన గౌరవము కలిగింతును. నీవు అడ్డురాలేవు" అని అశ్వినులకు సోమము అందించినాడు.
    ఇంద్రుడు కోపించినాడు. వజ్రాయుధము ఎత్తినాడు. చ్యవనుడు తన స్తంభన విద్యతో ఇంద్రుని చేతులు స్తంభింప చేసినాడు. ఇంద్రుని చేతులు కట్టుబడినవి. కదలలేదు.
    అశ్వినులు సోమపానము చేసినారు.
    అది చూచిన ఇంద్రుడు మండిపడి కేకలు వేసినాడు. చేతులు కదలలేదు. ఏమియు చేయలేకపోయినాడు.
    చ్యవనుడు ఇంద్రుని మీద మండిపడినాడు. "మధు" అను భయంకర రాక్షసుని సృష్టించినాడు. అతడు సింహనాదము చేసి ఇంద్రుని మీదకు ఉరికినాడు. చేతులు కదలని ఇంద్రుడు చ్యవనుని ఆశ్రయించినాడు. అన్నాడు:-
    "చ్యవన మునీంద్రా! వందనము. నీ తపశ్శక్తి గొప్పది. నేను అంగీకరించుచున్నాను. నేడు మొదలుకొని అశ్వినీ దేవతలు సోమపానమునకు అర్హులు. నన్ను కరుణించుము. నీవు సృష్టించిన ఈ రాక్షసుని నుండి నన్ను కాపాడుము. నేవే దిక్కు. నాకు మరొక దిక్కులేదు. అని ప్రాధేయ పడినాడు. ప్రార్థించినాడు".
    అశ్వినులకు యజ్ఞ సోమార్హతను ఇంద్రుడు అంగీకరించినాడు. చ్యవనుని కోపము తగ్గినది. అతడు ఇంద్రుని క్షమించినాడు. స్తంభనము ఉపసంహరించినాడు. ఇంద్రుడు చ్యవనుని అనుమతిపొంది వెళ్లిపోయినాడు. అశ్వినీ దేవతలు స్వర్గమునకు వెళ్లిపోయినారు.
    చ్యవనుని ఆజ్ఞప్రకారము 'మధు' రాక్షసుడు కల్లు, స్త్రీలు, వేట, జూదములను ఆశ్రయించి ఉన్నాడు.
    "ధర్మరాజా! ఇది చ్యవన మహర్షి తపస్సు చేసి యజ్ఞము చేసిన చోటు" అని రోమశుడు వివరించినాడు. ధర్మరాజాదులు పుణ్య సరస్సున స్నానము చేసినారు.

                                                                                  ఆలోచనామృతము

    చ్యవనుని కథలో ఆలోచించవలసిన అంశములు చాలా ఉన్నవి.
    1. బ్రాహ్మణ, క్షత్రియ వర్గ ద్వేషము పెరిగినట్లు కనిపించుచున్నది. కాకున్న సుకన్య పనిగట్టుకొని చ్యవనునకు హాని కలిగింపదు. ఆమెకు మేధావి ద్వేషము పరిసరములను బట్టి వచ్చి ఉండవలెను.
    2. రుచికుడు, చ్యవనుడు ఇద్దరు భృగు పుత్రులు. వేయి గుఱ్ఱములు కన్యా శుల్కముగా ఇచ్చి సత్యవతిని పెళ్లాడినాడు రుచికుడు. సంయాతి సైన్యపు మూత్ర పురీష బంధనము చేసి సుకన్యను పెళ్లాడినాడు చ్యవనుడు.
    రాజులు స్వచ్చందముగా మేధావులకు పిల్లలను ఇచ్చిన కాలము గతించినట్లున్నది.
    3. ఇందు వైద్య చరిత్ర కొంత తెలియుచున్నది. వైద్యులు నేటి మాంత్రికుల వంటి వారుగా కనిపించుచున్నారు. వ్యాధులను నివారించుట కంటే వ్యాధులను కల్పించు విద్య వారికి ఎక్కువ వచ్చును. వారిని చూచి ప్రజలు భయపడువారు. వైద్యులు గ్రామములందు కాక గ్రామముల వెలుపల ఉండువారు.
    చ్యవనుడు వైద్యుడు. అతను ఊరి వెలుపల ఉన్నాడు. అంతేకాదు అతడు పాములతో ప్రయోగములు చేసినట్లు కనిపించుచున్నది. పుట్ట అతని మీద పెరుగలేదు. పెరిగిన పుట్టల మధ్య అతడు నివశించినాడు. నేటికిని సర్పములను పెంచి, వాటి విషమును తీయు క్షేత్రములు ప్రపంచమునందు అన్ని దేశములందును ఉన్నవి. పాముల నుంచి గరళము తీయు క్షేత్రము మన దేశమున బొంబాయిలో ఉన్నది.
    4. చ్యవనుడు వైద్య విషయమున పరిశోధనలు సాగించినాడు. అతడు సాధించినది స్తంభన విద్య. ఎదుటివాని అవయవములను స్తంభింప చేయుట, తిరిగి విముక్తము చేయుట అతడు అప్పటికి నేర్చిన విద్యలు.
    రాచకన్య చ్యవనుని హేళన చేసినది. చ్యవనుడు తన విద్యను ప్రయోగించి ఆమె రాచ గర్వమును అణచినాడు. ఆమెను సాధించి పెళ్లాడినాడు.
    5. వైద్య వృత్తిని ప్రజా పీడన వృత్తి నుంచి ప్రజారంజన వృత్తిగా, రోగనివారణ వృత్తిగా మార్చినవాడు చ్యవనుడు కనిపించుచున్నాడు.
    రాజుల గర్వము అణచుటకే సుకన్యను సాధించినాడు. సుకన్య సహితము గర్వము బాసినది. సుశీల అయినది. చ్యవనునిలోని పగకాలిపోయి ప్రేమ అంకురించినది. చ్యవనునిలో ఏదో శారీరక లోపమున్నట్లున్నది. అతడు అశ్వినులను ఆశ్రయించినాడు. వారు ఆలోపమును సరిదిద్దినారు. అప్పుడు సుకన్యా చ్యవనులు అన్యోన్యముగా కాపురము చేసినారు.
    6. అశ్వినులు దేవ వైద్యులు. అప్పటికి వారికి వ్యాధి నివారణోపాయమములు తెలిసినట్లు కనిపించుచున్నది. చ్యవనునికి అశ్వినులతో స్నేహమయినది. చ్యవనుడు వారినుంచి వ్యాధి నివారణ విద్యలు తెలుసుకున్నాడు. వైద్యము ప్రజలను బాధించునది కారాదు. ప్రజలను బాధా విముక్తులను చేయవలెనని గ్రహించినాడు. ఆ తరువాత అందుకై కృషి చేసినాడు. "చ్యవన ప్రాశము" అను లేహ్యము అతను కనిపెట్టినది కావలెను. అది నేటికిని ప్రసిద్ధము.
    7. వైద్యులను వెలివేత నుండి రక్షించినవాడు చ్యవనుడు. మానవ కళ్యాణమునకు పాటుపడు అశ్వినులను దేవతలు అంటరానివారుగా చూచినారు. చ్యవనుడు సంయాతితో యజ్ఞము చేయించి అశ్వినులకు దేవతలతో సమాన ప్రతిపత్తిని కలిగించినాడు.
    అప్పటికి చ్యవనుడు ఎంతో ఎదిగినాడు. నాడు తన అక్కసు తీర్చుకొనుటకు స్తంభనము వాడినాడు. నేడు వైద్యవృత్తికి సమాన గౌరవము కలిగించుటకు ఇంద్రుని మీద ప్రయోగించినాడు.
    8. ఇంద్రుడు యథాతథ వాది. అతడు మార్పు సహించడు. ప్రగతి విరోధి. అతడు మాటలకు లొంగడు. దండనమునకు శరణాగతుడు అగును. చ్యవనుడు ఇంద్రుని స్తంభింప చేసినాడు. అయినను మార్పును అంగీకరించలేదు. రాక్షసుని అతనిపైకి తోసినాడు. అప్పుడు లొంగినాడు. ప్రగతిని అంగీకరించినాడు.
    ప్రగతి నిరోధకులందరును అంతే.
    9. దేవతలు మానవులకు అందనివారు కారు. మానవులు, దేవతలు కలిసి పరిశ్రమించిన మానవ కళ్యాణము సాధించవచ్చును అని వ్యాస మహర్షి సందేశము.
    మానవ ఇతిహాసమున ఒక మహత్తర కార్యము సాధించినందుననే చ్యవనుడు చరిత్రలో నిలిచిపోయినాడు.    
    10. మానవుని వినాశమునకు దారితీయునవి కల్లు, స్త్రీలు, వేట, జూదము అని నిర్ణయించినాడు చ్యవనుడు.
    చ్యవనుడు చెప్పినది నిత్యసత్యము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.