Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    బలరాముని మాటలు విని సాత్యకి అగ్గి కురిపించినాడు:-
    "యాదవ సేనా వాహిని కదిలి హస్తినను ముంచెత్తవలెను. బలరాముడు నాగలి, శ్రీకృష్ణుడు సుదర్శనము పట్టి రణరంగమున దూకవలెను. దుర్యోధనాది దుష్టులందరిని హతమార్చవలెను. భీష్మ, ద్రోణ, కర్ణాదుల పీచమడచవలెను. రాజ్యమును ఆక్రమించవలెను. ధర్మరాజు తన మాట ప్రకారము పదమూడు సంవత్సరములు వనవాస, అజ్ఞాతవాసములు చేయునుగాక. అభిమన్యుని రాజ్య రక్షకునిగా నియమింతము".
    ధర్మరాజు వారి మాటలు విన్నాడు. సవినయముగా విన్నవించినాడు:-
    "శ్రీకృష్ణ బలరామాదులారా! మీ దయ మాకున్న చాలు. మేము శత్రువులను జయించగలము. భీష్మ, ద్రోణ, విదురాదులు సత్యవంతులు. ధర్మమూర్తులు. వారి ముందు అరణ్య, అజ్ఞాత వాసములకు సమ్మతించినాము. ఆమాట తప్పరాదు. మీరు కోపము మనుడు. మాయందు దయకలిగి ఉండుడు".
    ధర్మరాజు మాటలకు శ్రీకృష్ణ బలరామాది యాదవులు ఎంతో సంతసించినారు. వారు ద్వారకకు తిరిగి వెళ్లినారు.

                                                       ఆలోచనామృతము

    పాండవులు ప్రభాస తీర్థమునకు చేరుటలో రాజకీయమున్నది. ఇది తీర్థయాత్ర మాత్రము కాదు. ఏలనన ఈ తీర్థమును గురించి రోమశుడు ఏమియు చెప్పలేదు.
    ప్రభాస ద్వారకకు సమీపమున ఉన్నది. పూర్వము అర్జునుడు తీర్థయాత్రలు చేసినపుడు శ్రీకృష్ణుడు ఇచటనే కలిసినాడు. అప్పుడు అర్జునునకు సుభద్ర లభించినది. సుభద్ర వివాహము వలన బలరామునకు ఉన్న కౌరవ పక్షపాతమునకు కళ్లెము పడినది.
    బలరాముని కౌరవ పక్షపాతము తగ్గించుటకు ఇది మరొక ప్రయత్నము. పాండవుల దుస్థితిని స్వయముగా చూచినా బలరాముడు కౌరవులపై దండెత్తుదునన్నాడు. అది చాలును. అంతకు మించి అక్కరలేదు.
    ఇది శ్రీకృష్ణుడు చేసిన ఏర్పాటు కావచ్చును.

                                                        చ్యవనుని కథ

    ధర్మరాజాదులు ప్రభాస తీర్థము నుండి బయలుదేరి పయోష్ణి తీర్థమునకు చేరినారు. అక్కడ రోమశుడు వారికి చ్యవనుని కథ వినిపించినాడు.
    భృగువునకు పుత్రుడు చ్యవనుడు. అతడు పయోష్ణి తీరమున కొన్నివేల సంవత్సరములు తపము చేసినాడు. అతనిపై పుట్టలు పెరిగిపోయినవి. పొదలు మొలిచినవి. తీగలు పాకినవి.
    సంయాతి అను రాజు విహారమునకు ఆప్రదేశమునకు వచ్చినాడు. అతని కూతురు సుకన్య తన చెలికత్తెలతో ఆ ప్రాంతమున తిరుగసాగినది. ఆమెకు చ్యవనుని పుట్ట విచిత్రముగా తోచినది. దానిని తవ్వించినది. మునిని చూచినది. వెళ్లిపోయినది.
    చ్యవనుడు తపస్సులో ఉన్నాడు. అయినను అతనికి బాధకలిగినది. కనులు తెరిచి చూచినాడు. జరిగినది తెలుసుకున్నాడు. సంయాతి సైన్యమునకు మూత్ర పురీషములు బంధింప చేసినాడు. సంయాతి సైనికులలో హాహాకారములు చెలరేగినవి. వాళ్లు బ్రతుకుట కష్టము అయినది.
    ఇది విపత్తు. ఈ విపత్తునకు కారణము సంయాతికి అర్థము కాలేదు. అతడు అటు ఉరికినాడు. ఇటు ఉరికినాడు. కారణము తెలియలేదు. సుకన్యను అడిగినాడు. పుట్ట తవ్వినాను. అందు ఒక ముని కనిపించినాడు" అని చెప్పినది.
    సంయాతి అది విన్నాడు. అక్కడికి ఉరికినాడు. అతనికి ముని కనిపించినాడు. అతడు శుష్కించి ఉన్నాడు. బారెడు గడ్డము, జానెడు మీసములు ఉన్నవి. అతని ముఖము తేజోవంతమయి ఉన్నది. అతని కనులలో విజ్ఞాన జ్యోతులున్నవి.
    సంయాతి చ్యవనుని చూచినాడు. మోకరిల్లి నమస్కరించినాడు. "మహాత్మా! నా కూతురు చిన్నది. తెలియక అపరాధము చేసినది. నన్ను మన్నించవలెను. నా సైనికులకు మూత్ర పురీష బంధమునుండి విముక్తి కలిగించవలెను" అని సవినయముగా ప్రార్థించినాడు.
    చ్యవనుడు చిరునవ్వు నవ్వినాడు. "మహారాజా! నీ కూతురు సుకన్యకు సౌందర్య, యవ్వన గర్వమున్నది. ఆ గర్వమున ఆమె కన్ను మిన్ను కానకున్నది. ఆమెను నాభార్యను చేసితివేని నీ సైన్యముల బాధను పోగొట్టగలను".
    సంయాతికి గత్యంతరము లేకపోయినది. సుకన్యను చ్యవనునకు ఇచ్చి వివాహము చేసినాడు. సైనికులు బాధ నుండి విముక్తులు అయినారు. సుకన్యను చ్యవనుని వద్ద వదలినాడు. సంయాతి తన రాజ్యమునకు వెళ్లిపోయినాడు. సుకన్య చ్యవనునకు పరిచర్యలు చేయుచు ఆశ్రమమున ఉండిపోయినది. ఒకనాడు సుకన్య అడవికి వెళ్లినది. అశ్వనీ దేవతలు ఆమెను ఒంటరిగా చూచినారు. ఆమెను సమీపించినారు. 'సుకన్యా! నీవు రూపవతివి. వయసులో ఉన్నావు. చ్యవనుడు ముసలివాడు. నీకు కామ సుఖములు కలిగింపలేడు. నీకు కామ సుఖములు కలిగింపలేడు. నీకు తగిన మరొక వరుని తెత్తుము వరింపుము" అని ఆశ చూపినారు.
    సుకన్య అశ్వినులకు నమస్కరించినది. "చ్యవనుని విషయమున నాకు మక్కువ ఉన్నది. నన్ను మరొకరిని వరించమనుట మీకు ధర్మము కాదు. అని చ్యవనుని దగ్గరకి వచ్చినది, జరిగినది వివరించినది. సుకన్య పాతివ్రత్యమునకు చ్యవనుడు సంతోషించినాడు. అశ్వినుల వద్దకు వెళ్లి వరము కోరుకొనవలసినదని పంపినాడు.
    సుకన్య అశ్వినీ దేవతల వద్దకు వచ్చినది. తనకు ఒక వరము ప్రసాదించమని ప్రార్థించినది. అశ్వినీ దేవతలు ఇద్దరు అందుకు అంగీకరించినారు. తన భర్త చ్యవనునకు యవ్వనము ప్రసాదించవలసినదని కోరినది. వారు అందుకు అంగీకరించినారు. చ్యవనుని తీసుకొని ముగ్గురు ఈ పయోష్ణి తీర్థమున మునిగినారు. మునిగి లేవగా ముగ్గురును యవ్వనవంతులయి బయటికి వచ్చినారు. "మా ముగ్గురిలో నీ ఇష్టము వచ్చిన వారిని వరింపుము" అన్నారు.
    సుకన్య తన భర్త అయిన చ్యవనుని వరించినది. భార్యాభర్తలు సుఖముగా కాలము గడిపినారు. అశ్వినీ దేవతలు చ్యవనునకు ప్రాయము ప్రసాదించినారు. వారికి సోమపానము కలిగింతునని చ్యవనుడు మాట ఇచ్చినాడు. అశ్వినులు సంతోషించినారు. తమ నెలవులకు వెళ్లినారు.
    చ్యవనుడు యవ్వనుడు అయినాడను వార్త సంయాతికి తెలిసినది. కూతురును, అల్లుని చూచుటకు సంయాతి వచ్చినాడు. సుకన్య, చ్యవనులు సంయాతిని ఆదరించినారు. పూజించినారు. సంయాతి చాలా సంతోషించాడు. సంతసించిన సంయాతిని యజ్ఞము చేయవలసినదని చ్యవనుడు ప్రోత్సహించినాడు. అల్లుడు తనతో యజ్ఞము చేయింతుననినందుకు సంయాతి సంతోషించినాడు. సంభారములు సమకూర్చినాడు. ఏర్పాట్లు పూర్తిచేసినాడు.
    సంయాతి యజ్ఞము చేసినాడు. చ్యవనుడు చేయించినాడు. యజ్ఞమునకు అశ్వినీ దేవతలను పిలిచినాడు. వారికి "సోమము"ను ఇచ్చుటకు రథము సిద్ధము చేసినాడు.
    ఇంద్రుడు యజ్ఞమునకు వచ్చినాడు. అశ్వినులకు సోమము ఇవ్వరాదని వారించినాడు. "చ్యవనా! నీ ప్రయత్నము మానుము. అశ్వినులు దేవతలకు వైద్యులగుదురు. దేవతలు కారు. వీరు యజ్ఞసోమమునకు అనర్హులు. వారికి సోమము ఇచ్చుట దోషము. నీ ప్రయత్నము మానుము" అన్నాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.