Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
ఉమ్రావ్ : చాలాసార్లు వచ్చింది. కూతురును చూచి సంతోషించింది. నన్ను దీవించింది. ఏటా ఒకటి రెండుసార్లు వచ్చేది. ఏదో నాకు తోచింది ఇచ్చేదాన్ని. ఇప్పుడు చాలా సంవత్సరాలైంది రాక. పాపం! ఉన్నదో, పోయిందో?
రుస్వా : కులం?
ఉమ్రావ్ : బోయిది.
రుస్వా : ఆ కధ సగంలోనే నిలిచిపోయింది. చట్టన్ పావలా ఇచ్చాడా? ఇవ్వలేదా ?
ఉమ్రావ్ : దరిద్రపు పావలా. చట్టన్ వెళ్ళిపోగానే దాన్ని చావబాదాను. పైసలు లాక్కొని వీధిలో పారేశాను.
నా గదికి ఎదురుగా చిన్న గది ఉండేది. ఏదో నెలకు రెండు రూపాయల అద్దె ఉండవచ్చు. అందులో ఒక సానిది దిగింది. హస్నా అప్పటికి వయసులో ఉండింది. అబాదీకి దానితో స్నేహం. పగలంతా అక్కడే ఉండేది. అబాదీకి దాని లక్షణాలన్నీ అలవడ్డాయి. దానికి తగిన విటులు. ఒకడు పావుశేరు నూనె పూరీలు తెచ్చేవాడు. మరొకడు బేడాకు వంద ఇచ్చే మామిడి పండ్లు యాభై తెచ్చేవాడు. ఒకణ్ణి రెండు గజాల చీటీబట్ట , ఇంకొకడిని ముఖ్మలు బూట్లూ అడిగేది. తిరునాళ్ళలో , జాతరలలో నలుగురు వెంట, పెద్ద తలగుడ్డల వారు. గంజి పెట్టిన చొక్కాలు, లేక అంగరఖాలు తొడిగి ఒకడు ధోవతి , ఒకడు ఫైజామా వాళ్ళు. చేతుల్లో లాఠీలు, మేడలో హారాలు, వారి వెంట హస్నా టిక్కు టిక్కుమని నడుస్తుంది. హిరాస్ వాలాసరా (సత్రం) లో ఒక టర్రా (కాపుసారాయి) బుడ్డీ ఖాళీ, అక్కడ్నుంచి సోలుతూ తూలుతూ పడుతూ లేస్తూ , ఆడుతూ పాడుతూ హస్నా కాస్సేపు వీని కౌగిలిలో, కాస్సేపు ఒకని మెడలో చేతులు వేస్తుంది. దారి వెంట తిట్లూ, పట్లూ గిల్లుకోవడం, గిచ్చుకోవడం, కొట్టుకోవడం, పట్టుకోవడం ఈ దశలో ఒకడో, ఇద్దరో తోవలో పడిపోయారు. తిరణాలకు చేరింది ముగ్గురో, నలుగురో అక్కడ చరస్ మీద పడ్డారు. వారిలో తెలివైన వాడు హస్నాను పట్టుకున్నాడు. మిత్రులకు మట్టి చూపించాడు. తానూ హస్నా గదికి విచ్చేశాడు. తిరునాళ్ళనుంచి తిరిగి వచ్చి జనం గది ముందు గడబిడ కేకలు, అరుపులు, రాళ్ళు విసరడం . హస్నా గదిలో ఉండనే ఉండదు. ఉన్నా పలకదు. ఇంతలో తుపాకి బంటు అక్కడికి వచ్చాడు. గుంపును చెదరగొట్టాడు. ఎక్కడివారక్కడికి వెళ్ళిపోయారు.
అలాంటివంటే అబాదీకి ఇష్టం. నేను సహించగలనా? నా దగ్గరకు వచ్చే ఒక నవాబు నౌకరు, హుసేనలీతో లేచిపోయింది. హుసేనలీ దాని చేతి బొంగరం అయిపోయాడు. హుసేనలీ కొంపకు చేరింది. పెళ్లాం పెద్ద గొడవ చేసింది. ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. మియాఁ హుసేనలీకి లక్ష్యమేం? కలిగింది ఇబ్బంది వంట వద్ద. అబాదీ దొరసానికి పొయ్యిలో నిప్పు వేయడమే చాతకాదు. ఎట్లాగో అట్లా కొన్ని రోజులు దొర్లాయి. ఒక పిల్లవాడు పుట్టాడు. ఆ బిడ్డ హుసేనలీకే పుట్టాడో, ఇంకెవరికి పుట్టాడో దేవునికే తెలియాలి. రెండు నెలల తరవాత పిల్లవాడు పోయాడు. అటు హుసేనలీ పెళ్ళాం తిండికీ, బట్టకూ వ్యాజ్యం వేసింది. నెలకు రూపాయిన్నర ఇవ్వాలని డిక్రీ అయింది. నవాబు గారు మూడు దూపాయలు ఇచ్చేవారు. రూపాయిన్నరలో ఎలా గడుస్తుంది? పై ఆదాయము మీద వెళ్ళేది. అదీ చాల్లేదు. అబాదీ అలికి ముండ , చివరకు హుసేనలీ ఇల్లు వదిలీ ఆ వీధిలోని ఒక కుర్రానితో లేచిపోయింది. ఆ కుర్రాని తల్లి పఠీనీ! - కుంటే నక,టక్కులమారి. మరో నలుగురు ముండలు ఉండేచోట ఈమెను కూడా చేర్చింది. అక్కడే మకాం అయిపొయింది. పఠీనీ ఆదాయం కాస్త పెరిగింది. కుర్రాడు పేరుకు నిలిచిపోయాడు. మియాఁ సాదత్ , పఠీని కంట్లో దుమ్ము కొట్టి లేవదీసుకు పోయాడు. తల్లి దగ్గర పెట్టాడు. ఆవిడకు కోళ్ళు అంటే సరదా. వాళ్ళ ఇంటి పక్కనే తకియా' ఉండేది. కోళ్ళు అక్కడ మేస్తుండేవి. అబాదీని కోళ్ళు కాయడానికి పెట్టింది. సాదత్ మియాఁ ఒక కార్ఖానాలో పనిచేసేవాడు. పగలంతా అతడక్కడ, ఈమె కోళ్ళ కాపలా. అబాడీ దొరసానికీ మహామ్మాద్ బక్ఖ్ తో ప్రేమ కలాపం ప్రారంభం అయింది. సాదత్ తల్లి చూచి కొడుకుకు చెప్పింది. అతడు చావతన్నాడు. మహమ్మద్ బక్ష్ కు ఒక మిత్రుడు ఉండేవాడు. పేరు అమీర్. నవాబు మిర్జా కొలువు గాడు. వ్యభిచారంలో మొనగాడు. అతడు లేపుకుపోయి ఒక ఇంట్లో పెట్టాడు. అక్కడ అతని మిత్ర బృందం ఉండేది. అబాదీ వారికి ఆటబొమ్మ అయింది. ఆ కాలంలోనే అమ్మకు రోగాలంటుకున్నాయి. ఇక మియాఁ అమీర్ కు ఆవిడతో ఏం పని? ఆస్పత్రిలో పారేశాడు. ప్రస్తుతం అక్కడే ఉంది. పిలిపించమంటే పిలిపిస్తాను.
21
మనసా వాచా కోరికలన్నీ
ఇనుమిక్కిలిగా తీరిపోయినవి!
అది రజబ్ నెల. దర్గాకు వెళ్ళి దర్శనం చేసుకోవాలనిపించింది. సాయంకాలం సవారీ ఎక్కి వెళ్ళాను. పురుషులుండే చోట దిగాను. కాస్త పచారు చేశాను. తరవాత దివ్వెలు వెలిగించి ప్రార్ధించాను. ఒకరు శోకగీతం ఆలపిస్తుంటే విన్నాను. తరవాత హదీస్! చదివారు. సంతాప సభ జరిగింది. జనం ఇండ్లకు వెళ్ళిపోయారు. నేను జియారాత్ రుఖ్సాతీ' చేసుకొని దర్వాజా వరకు వచ్చాను. జనానీ' దర్గాకు వెళ్ళాలనిపించింది. నవాబు మాలికా కిషోర్ అనుగ్రహం వల్ల చాలామంది మహిళలు నన్నేరుగుదురు. ఈనేపంతో వారిని కలుసుకోవచ్చునని సవారీ ఎక్కి పరా వేసుకున్నాను. జనానీ దర్గా గుమ్మం దగ్గరికీ చేరాను. దర్గా రక్షకుడు వచ్చి సవారీ దింపాడు. లోపలికి వెళ్ళాను. నేను ఊహించింది తప్పేమీ కాదు. చాలామంది కలిశారు. నిజాలు, నిష్టురలుం విప్లవాన్ని గురించిన మాటలు ఇంకేవేవో మాట్లాడాం. చాల రాత్రి అయింది. వెళ్దామని బయలుదేరాను. ఇంతట్లో కుడి వైపు నుంచి వస్తున్న కాన్పూరు బేగం కనిపించారు. అందమైన దుస్తులు ధరించి ఠీవిగా నడుస్తుంది. వెంట నలుగురైదుగురు దాసీలున్నారు. ఒకతే జారిపోతున్న ముసుగు సవరిస్తుంది. ఒకదాని చేతిలో విసనకర్ర , ఒకతే గిన్నె, మరోకతే పాన్ దాన్ పట్టుకొని ఉంది. నన్ను చూడగానే ఉరికి వచ్చి భుజం మీద చేయి వేసింది.
బేగమ్ : అబ్బ! ఉమ్రావ్! బలేదానివే! కాన్పూర్ లో మాయమై, లక్నో లో కనిపించావు. అదీ ఆకస్మికంగా.
నేను : ఏం చేయను? మీ తోటలో ఉన్నానా ఆ రాత్రి , తెల్లవారి లక్నో నుంచి మనుషులు వచ్చి నన్ను లాక్కొచ్చారు. తరవాత కల్లోలం చెలరేగింది. దేవునికే తెలియాలి ఎక్కడెక్కడ తిరిగానో! నాకు మీ జాడ గానీ, మీకు నా విషయం గాని తెలియకుండా పోయింది.
బేగమ్ : ఇప్పుడూ ఇద్దరమూ లక్నోలోనే ఉన్నాంగా.
నేను : లక్నో ఏమిటి? ఇక్కడే ఉన్నాం.
బేగమ్ : అదేం లాభం లేదు. మా ఇంటికి రావాలి.
చౌపేటీ దగ్గర నవాబుగారిని ఎరగని దేవరు?
నవాబు గారంటే ఎవరు అని అడుగుదామానుకుంటుండగానే ఒక దాసీదీ" నవాబు మహమ్మద్ తబీభా ఇల్లు ఎరగని వాడెవరు?" అన్నది.
నేను : రావడానికేం వస్తా గాని, నవాబుగా రేమనుకుంటారో?
బేగమ్ : ఏమీ అనుకోరు. అయన అలాంటి వారు కారు. అదికాక ఆ రాత్రి వృత్తాంతం అంతా పూస గుచ్చినట్లు చెప్పాను. అయన స్వయంగా కాన్పూరులో అనేకసార్లు వెదికించారు. తరచు అడుగుతుంటారు.
నేను : అయితే తప్పక వస్తాను.
బేగమ్ : మాట ఇవ్వు. ఎప్పుడు వస్తావు ?
నేను : వచ్చే గురువారం దర్శనం చేసుకుంటాను.
బేగమ్ : ఓహో ! ఈ గురువారపు భక్తురాలు వెప్పటినుంచి అయినావు? ఇంకా ఎనిమిది రోజులుంది. ఇటునుంచే రాకూడదూ?
నేను : మంచిది. అయితే వచ్చే సోమవారం వస్తాను.
బేగమ్ : ఆదివారం రా. నవాబు కూడా ఇంట్లో ఉంటారు. సోమవారం మళ్ళీ ఏ ఇంగ్లీషు వాళ్ళో కలుసుకోవడానికి వెళ్తారు.
నేను : అలాగైతే ఆదివారమే కానివ్వండి.
బేగమ్ : ఏ సమయానికి వస్తావు?
నేను : మీరు ఎప్పుడంటే అప్పుడు. నాకు ఇంట్లో పనేమీ లేదు.
బేగమ్ :నివాసం ఎక్కడ ?
నేను "చౌకులో - సయ్యద్ ఖాన్ ఫాటక్ వద్ద.
బేగమ్ : సరే, దాసీని పంపిస్తాను. దాని వెంట వచ్చేయి.





