Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
3. ఈ దశలో బ్రాహ్మణులకు పిల్లలను ఇచ్చుటకు సంకోచించినారు. రుచికుడు సత్యవతిని కోరినాడు. గాధి రాజు రుచికుని నుండి వేయి గుఱ్ఱములను కన్యాశుల్కముగా కోరినాడు. ఇది కొత్త ఆచారము. ఋష్యశృంగునకు శాంతను ఇచ్చిన "రోమపాదుడు" గోసమూహములను వరకట్నముగా ఇచ్చినాడు. ఆడపిల్లకుగాను "జోలి" అడుగుట ఈనాటికి ఆటవిక జాతులందు ఆచారముగా ఉన్నది.
కొంతకాలము క్రితము మనలో కూడ కన్యాశుల్కమను దురాచారము వ్యాప్తిలో ఉండెననుటకు 'కన్యాశుల్కము' అను నాటకము నిదర్శనము. ఇప్పుడు వరశుల్కము ఆచారమయినది.
4. వ్యక్తి కలహములు వర్గ కలహములుగా మారినట్లు కనిపించుచున్నది. ముఖ్యముగా బ్రాహ్మణ క్షత్రియుల మధ్య ఏదో అగ్గి రగులుతున్నట్లు కనిపించుచున్నది.
"రేణుక" ప్రసేన జిత్తుని కూతురు. అతడు రాజు కాబట్టి క్షత్రియుడు. ఆమెను జమదగ్ని వివాహమాడినాడు. ఆమెకు జమదగ్ని వలన నలుగురు కొడుకులు కలిగినారు. నలుగురు బిడ్డల తల్లి వ్యభిచరించినది. ఆమె క్షత్రియుని కూడి వ్యభిచరించినది. అది జమదగ్నికి మహాదోషముగా తోచినది. ఆమెకు మరణదండన విధించినాడు. ఇందు పరిశీలించవలసిన అంశములు కొన్ని ఉన్నవి.
i) వ్యభిచారమునకు ఏ శాస్త్రమునందునను మరణశిక్ష విధింపబడలేదు. "వినాగర్భం సవర్ణేషు, నత్యాజ్యా గమనాత్ స్త్రీయః" అన్నాడు యాజ్ఞవల్క్యుడు. సవర్ణులతో వ్యభిచరించి, గర్భము ధరించని స్త్రీని విడువరాదు అనుచున్నాడు.
అట్టి స్త్రీకి "భూమౌ చ భస్మశయనం దానం భోగవివర్జితమ్" అను శిక్షను విధించినాడు. అహల్య సరిగ్గా రేణుక చేసిన పని చేసినది. గౌతముడు ఆమెను చంపలేదు. యాజ్ఞవల్క్యుడు విధించిన శిక్షనే విధించినాడు. జమదగ్ని శాస్త్రములను అతిక్రమించినాడు. రేణుకకు మరణశిక్ష విధించినాడు. ఇది జమదగ్నికి క్షత్రియుల మీద ఉన్న కక్షకు తార్కాణముగా కనిపించుచున్నది.
కుంతి, సత్యవతి వ్యభిచారముననే సంతానము బడసినారు. అది ఆనాటికి వ్యభిచారము కాకపోవచ్చును. జమదగ్ని కథ అంతకు ముందుది కావలెను. అట్లయిన రేణుకకు మరణశిక్ష విధించుట యుక్తమా? ఇది సైతము జమదగ్నికి క్షత్రియుల విషయమున ఉన్న ద్వేషమును నిరూపించుచున్నది.
వ్యభిచారము దోషమే కాని మరణదండన అందుకు మించిన దారుణ శిక్ష. జమదగ్ని కక్షతో విధించిన శిక్ష. అందుకే అది ఆచారము కాలేదు.
జమదగ్నికి కోపము మిన్న. కోపమున అతడు కన్ను, మన్ను కానడు.
ii) తండ్రి ఆజ్ఞను కొడుకులు పాలించుటకు సంబంధించిన కథలున్నవి. యయాతి, భీష్ముడు అట్టివారు. కాని తల్లిని చంపమని ఆజ్ఞాపించుట ఘోరము. అది అన్ని నాగరకతలకు వ్యతిరేకము. అందువలననే ముగ్గురు కొడుకులు తండ్రి ఆజ్ఞను ధిక్కరించినారు. శాపోపహతులు అగుటకు సిద్ధపడినారు. అందుకు అంగీకరించలేదు.
iii) పరశురాముడు తల్లిని వధించినాడు అని చెప్పబడినది. వధింతునని తీసుకొనివెళ్లి ఆమెను దాచిఉండును. తండ్రికి కోపము చల్లారిన తరువాత అతని దారుణ నిర్ణయమును గురించి నచ్చచెప్పి ఉండును. తన తప్పు తెలుసుకున్న జమదగ్ని రేణుకను చేరదీసినాడు.
రేణుక వ్యభిచారమునాకు జమదగ్ని శిక్షయే విధించలేదు. అతని కార్యములన్నియు 'అతి'ని సూచించును.
పశ్చాత్తాపము రేణుక అనుభవించిన శిక్ష.
పరశురాముడు యుక్తిగా ఒక ఘోరమును తప్పించినాడు. అతడు తల్లిని అన్నలను రక్షించినాడు. జమదగ్నికి జ్ఞానోదయము కలిగించినాడు.
5. కార్తవీర్యార్జునుడు క్షత్రియుడు. రాజు. బలవంతుడు. అతడు బ్రాహ్మణుడు, మేధావి జమదగ్ని మీద నిష్కారణముగా దండెత్తినాడు. ఆశ్రమమును ధ్వంసము చేసినాడు. గోవును పట్టినాడు. జమదగ్ని బలహీనుడు. ఏమి చేయలేకపోయినాడు.
మేధావులు బలవంతులు కూడ కావలెననునది పరశురాముని సందేశముగా కనిపించుచున్నది. అధికార దుర్మదాంధులకు బుద్ధిచెప్పుట మేధావుల కర్తవ్యము. తండ్రిని హింసించిన కార్తవీర్యుని పరశురాముడు హతమార్చినాడు.
పగతీర్చుకొనుట ఆటవిక న్యాయము. అచ్చట న్యాయాన్యాయ విచారణలులేవు. పరశురాముడు కార్తవీర్యుని చంపినాడు. కార్తవీర్యుని కొడుకులు జమదగ్నిని చంపినారు. ఇది వ్యక్తి ద్వేషము మాత్రమే.
6. పరశురాముడు ఒక అడుగు ముందుకువేసి వర్గద్వేషమునకు మార్గము పరచినాడు. అతడు కార్తవీర్యుని కొడుకులను హతమార్చి ఊరుకొనలేదు. క్షత్రియులందరు దుర్మార్గులు అను నిర్ణయమునకు వచ్చినాడు. క్షత్రియ జాతిని పరిమార్చుటకు దండెత్తినాడు. సకల భూమండలమును జయించి కశ్యపునకు ఇచ్చినాడు.
ఇందువలన బ్రాహ్మణ క్షత్రియులలో వర్గద్వేషములు రగిలినవని చెప్పవచ్చును. ధర్మము ప్రకారము క్షత్రియుడు రాజ్యము చేయవలెను. ఆ ధర్మమును తలక్రిందులు చేయుటకు ప్రయత్నించినాడు పరశురాముడు.
అధికార మదాంధతకు ఒక గుణపాఠము చెప్పిన మహామహుడు పరశురాముడు.
అందుకే అతడు అవతార పురుషుడు.
ప్రభాస తీర్థము
ధర్మరాజాదులు మహేంద్ర పర్వతము నుండి బయలుదేరినారు. పశ్చిమ సముద్ర తీరమున సాగినారు. ప్రభాస తీర్థమునకు చేరినారు. ధర్మరాజు అచట వాయు, జల భక్షణ చేయుచు తపస్సు సాగించినాడు. శ్రీకృష్ణ బలరాములకు ఆవార్త అందినది. వారు సకల యాదవ శ్రేష్ఠుల వెంట ప్రభాస తీర్థమునకు వచ్చినారు. ధర్మరాజాదులు వారిని గౌరవించి, పూజించినారు.
పాండవులు కృశించి ఉన్నారు. ద్రౌపది సహితముగా కృష్ణాజినములు ధరించి ఉన్నారు. రాజ్యము చేయవలసిన వారు ఆటవికులవలె తిరుగుచున్నారు.
బలరాముడు వారిని చూచినాడు. బాధపడినాడు. ఉద్రేకమున అరిచినాడు "ధృతరాష్ట్రుడు బుద్ధిహీనుడు. దుర్యోధనాదుల మాటలు విని పాండవుల రాజ్యమును అపహరించినాడు. పాండవులను అడవులకు త్రోసినాడు. ఇది అన్యాయము. అక్రమము. అధర్మము. కాబట్టి మనము కౌరవుల మీదకి దండెత్తి దుర్యోధనాదులను హతమార్చి ధర్మరాజునకు పట్టము కట్టుట న్యాయము ధర్మము".





