Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
సత్యవతికి "జమదగ్ని" జన్మించినాడు. అతడు నాలుగు వేదములందును, ధనుర్వేదమందును నిష్ణాతుడు. అతడు "ప్రసేనజిత్తు" అను రాజు కూతురు రేణుకను వివాహమాడినాడు. జమదగ్ని వలన రేణుకకు నలుగురు పుత్రులు కలిగినారు. వారు 'రుమతి' 'ఉత్సాహుడు' 'విశ్వావసుడు' 'పరశురాముడు' అనువారు.
ఒకనాటిమాట. జమదగ్ని తపములో ఉన్నాడు. నలుగురు కొడుకులు, రేణుక ఫలములు తెచ్చుటకు అడవికి వెళ్లినారు. మార్గమధ్యమున రేణుకకు ఒక సరస్సు కనిపించినది. ఆమె ఆగిపోయినది, ఆ సరస్సులో చిత్రసేనుడు అను అంగదేశపు రాజు భార్యా సహితుడయి జలక్రీడలాడుచున్నారు. రేణుక అతనిని చూచినది. జలక్రీడలు చూచినది. ఆమెకు కామవికారము కలిగినది. ఆమె చిత్రసేనుని చేరినది. సంగమించినది. వ్యభిచరించినది.
రేణుక జమదగ్ని ఆశ్రమమునకు చేరినది. జమదగ్ని ఆమెను చూచినాడు. జరిగిన దుష్కర్మము తెలుసుకున్నాడు. మండిపడినాడు. అగ్గిబుగ్గి అయినాడు. రేణుకను వధించ వలసినదని కొడుకులను ఆజ్ఞాపించినాడు. మొదటి ముగ్గురు కొడుకులు తండ్రి ఆజ్ఞను కాదన్నారు. తల్లిని వధించుటకు ఇష్టపడలేదు. జమదగ్ని కోపించి "మీరు ముగ్గురు భయంకరారణ్యములందు మృగములు, పక్షులవలె అజ్ఞానులయి, మందబుద్ధిగలవారయి ఉండగలరు" అని శపించినాడు.
జమదగ్ని పరశురాముని చూచినాడు. "పరశురామా! నీ తల్లి రేణుకను వధింపుము. ఇది నా ఆజ్ఞ" అన్నాడు. పరశురాముడు తండ్రి ఆజ్ఞ తలదాల్చినాడు. తల్లి రేణుకను వధించినాడు. తలవంచుకుని నిలిచినాడు.
"రామా! నీవు నా ఆదేశమును ఆచరించినావు. నేను ప్రసన్నుడను అయినాను. కోరుకొనుము వరములు ఇచ్చెదను" అన్నాడు జమదగ్ని.
"తండ్రీ! నాతల్లి రేణుక దోషరహిత అయి జీవించవలెను. రెండు. నా అన్నలకు శాపవిముక్తి కావలెను. మూడు. యుద్ధములందు నేను శక్తిమంతుడను అయి ఉండవలెను. నాలుగు. నేను చిరంజీవినయి ఉండవలెను. ఈ వరములను ప్రసాదించుము" అని ప్రార్థించినాడు పరశురాముడు.
జమదగ్ని ఆ నాలుగు వరములను ప్రసాదించినాడు. రేణుక నిర్దోషి అయి జీవించినది. రుమత్యాది రేణుకా పుత్రులు తిరిగి వచ్చినారు. జమదగ్ని కుటుంబము సుఖముగా ఉన్నది.
కార్తవీర్యార్జునుడు హైహయ వంశపు రాజు. అతడు వేటకయి అడవులకు వెళ్లినాడు. వేటాడిన శ్రమతో ససైన్యముగా జమదగ్ని ఆశ్రమమునకు వచ్చినాడు. జమదగ్ని రాజును సత్కరించినాడు. ఆతిథ్యము ఇచ్చినాడు. అయినను కార్తవీర్యుడు విజృంభించినాడు. ఆశ్రమమందలి చెట్టు చేమను పెరికివేసినాడు. ఫల పుష్పాదులను ధ్వంసము చేసినాడు. జమదగ్ని హోమధేనువును, దూడను గుంజుకొని పోయినాడు.
అది జరిగినపుడు ఆశ్రమమున పరశురాముడు లేడు. అతడు అడవి నుండి వచ్చు వరకు ఆశ్రమము ధ్వంసమయి కనిపించినది. "కుమారా! కార్తవీర్యుడు ఆశ్రమమును ధ్వంసము చేసినాడు. హోమధేనువును గుంజుకొని పోయినాడు. నీవు వెళ్లి కార్తవీర్యుని చంపిరమ్ము". అని ఆజ్ఞాపించినాడు జమదగ్ని.
పరశురాముడు కార్చిచ్చువలె ఉరికినాడు. కార్తవీర్యుని సైన్యముపై బాణాగ్ని కురిపించినాడు. కార్తవీర్యుని సైన్యము సాంతము కాలి కూలినది.
కార్తవీర్యుడు అసామాన్యుడు. అద్భుత బలపరాక్రమములు కలవాడు. అతనికి వజ్రములవంటి వేయి చేతులుండినవి. పరశురాముడు కార్తవీర్యునితో ఘోర యుద్ధము చేసినాడు. క్రూరమయిన బాణములువేసి కార్తవీర్యుని వేయి చేతులు నరికివేసినాడు. అప్పుడు పరశురాముడు ప్రళయ రుద్రుని వలె కనిపించినాడు. అతనిని చూచి జనులు వడకినారు.
కార్తవీర్యుని కొడుకులు పరశురామునిపై పగబూనినారు. సమయమునకై వేచినారు. పరశురాముడు లేనపుడు జమదగ్ని ఆశ్రమముపై పడినారు. మునులను తిట్టినారు. ఆశ్రమముపై రాళ్లు రువ్వినారు. వారు మానవత్వము మరచినారు. పగబట్టి జమదగ్నిని పట్టినారు. 'హారామా! నారామా! పరశురామా!' అని ఆర్తనాదము చేయుచున్న జమదగ్నిని పట్టుకొని చంపినారు. మునులందరు చూచుచుండగా జమదగ్నిని క్రూరముగా వధించినారు.
వనము నుండి తిరిగి వచ్చిన పరశురామునకు ఘోరాతి ఘోరము కనిపించినది. తండ్రి రక్తపు మడుగులో చచ్చిపడి ఉన్నాడు. తల్లి రేణుక హృదయ విదారకంగా విలపిస్తున్నది. ఆశ్రమము ధ్వంసమయినది. అనేకమంది మునులు కంటికి, మంటికి ఏకధారగా ఏడ్చుచున్నారు.
పరశురాముడు ఆ దృశ్యమును చూచినాడు. అతని గుండెలో కార్చిచ్చు రగిలింది. కన్నులు బడ బానలము అయినవి. పెదవి అదరినది. ఒడలు వడకినవి. అతడు గర్జించినాడు:-
"నాతండ్రి జమదగ్ని పుణ్యాత్ముడు. నిర్దోషి. శాంత చిత్తుడు. అట్టి వానిని క్షత్రియ హీనులు చంపినారు. ఆశ్రమమును ధ్వంసము చేసినారు. మా అమ్మను, మునులను ఏడ్పించినారు. భూమండలమున క్షత్రియులను బ్రతుకనీయను. ఈ భూమండలమును అక్షత్రియము చేసెదను" అని ఘోరమయిన ప్రతిజ్ఞ చేసినాడు.
ఆ విధముగా ప్రతిజ్ఞ చేసిన పరశురాముడు ముహూర్త మాత్రము అచట నిలువలేదు. సుడిగాలి వలె ఉరికినాడు. దావానలము వలె వ్యాపించినాడు. కార్తవీర్యుని కొడుకులను నరికినాడు. భూమండలమందంతటను తిరిగి క్షత్రియులందరిని హతమార్చినాడు. భూమండల ఆధిపత్యమును ఆర్జించినాడు. తదుపరి శాస్త్రవిధిని అనుసరించి యజ్ఞములు చేసినాడు. తాను సంపాదించిన భూమండలమును కశ్యప మునీంద్రునకు ధారాదత్తముగా అర్పించినాడు. మహాత్ముడగు పరశురాముడు నిస్సంగుడై మహేంద్ర పర్వతమున తపస్సు చేయుచున్నాడు. ధర్మరాజాదులు కృతప్రవణుడు చెప్పిన పరశురాముని చరిత్రను విన్నారు. చతుర్దశినాడు పరశురాముని దర్శించుకొని అతనిని పూజించినారు. పరశురాముడు ధర్మరాజాదులను దీవించి వెళ్లినాడు.
ఆలోచనామృతము:
1. మహాభారతమునందలి కథల విషయమున కాల నిర్ణయము చేయుటకు పరిశ్రమించ వలసిన అవసరము ఉన్నది. కథలన్నియు మహాభారత కాలపువి కావు. అంతకు పూర్వపు చరిత్రను వివరించు కథలు అనేకములు ఉన్నవి.
2. రాజకీయులకు మేధావులకు క్షత్రియులకు బ్రాహ్మణులకు ఉండిన సఖ్యతకు విఘాతము కలిగినట్లు కనిపించుచున్నది. సాధారణముగా క్షత్రియ కన్యలను బ్రాహ్మణులకు ఇచ్చి పెళ్లిళ్లు చేసినట్లు కనిపించుచున్నది. బ్రాహ్మణ కన్యలను క్షత్రియులకు ఇచ్చిన సందర్భములు కనిపించవు. ఇది బహుశః మేధావంతులయిన సంతానము కొఱకు జరిగి ఉండవచ్చును.





