Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
బేగమ్ : ఏం చెప్పగలం ఏం చేస్తారో చెడిపోయిన ముండలు. మందూ మాకూ పెట్టినా పెట్టవచ్చు. మిర్జా మహమ్మదలీ కోడలుకు సవతి జెలగ తినిపించింది. పాపం మగనికి కాకుండా పిల్లలకు కాకుండా పోయింది లోకం విడిచి.
అమీరన్ : నాకేం తెలియదా?
బేగమ్ : ఎప్పుడూ వీళ్ళతో దూరంగా ఉండాలమ్మా! దూరంగా ఉన్నా ఒక్కొక్కసారి ప్రాణాల మీదికి తెస్తారు. ఆ దాసీది ఏం చేయలేదని? తాయెత్తులు, చెట్లు ఏమేమి కనిపించేవి నా దిండు కింద!
అమీరన్ : మరి దాన్ని ఇంట్లో కెందుకు రానిచ్చారు?
బేగమ్ : అయ్యో కర్మ! నేను రానిచ్చానా? దాసీది ఇలా చేస్తుందని నేనేం కలగన్నానా? మావారిని వలలో వేసిందని తెలియగానే వెళ్ళగొట్టాను.
అమీరన్ : బేగమ్ సాహబా! ఉన్నమాటంటే కోపం రాదుకదా! ఆ దాసీది పాపం, మీకెంత సేవ చేసింది?
బేగమ్ : బాగానే ఉంది. అయితే మొగుణ్ణి వలలో వేసుకోవాలని ఉందా? అంతదాకా ఎందుకూ? ఈ ముసలిదెం తక్కువ తిన్నదా? ఇదీ మావారితో ఆడిందే.
అమీరన్ : (పెద్దగా నవ్వి) అంతా వట్టిది.
బేగమ్ : అబద్దాలనుకున్నావా? అందుకే పగ తీర్చుకుంటానంటుంది.
అమీరన్ : కోడలు గారూ! అయితే మీరలా చేయకుండాల్సింది. మామగారి ఉంపుడుకత్తేకు చెప్పుదెబ్బ .....
బేగమ్ : ఈకాలపు పిల్లలకు అంత విచక్షణ! నిజం చెపుతున్నాను. నేను సహించలేకపోయాను. ముఖం ముందే అంటున్నాను. ఈరోజు ఆ బోగం దాని మూలాన మామగారి ఉంపుడుగత్తెను తన్నింది. రేపు అత్తనే తంతుంది.
అమీరన్ : కాదు. ఎందుకు అవుతుంది గానీ - అయినా అనిపిస్తుంది.
ఆ ఇద్దరు ముసలివాళ్ళు పాపం, కోడల్ను సతమతం చేశారు. ఆమె పెద్దగా ఏడ్పు సాగించింది. నా స్థితి అడక్కండి. నిప్పుల్లో పారినట్లుంది. అమాంతంగా ఇద్దరి ముసలివాళ్ళ గొంతులు నులిమివేయాలని పించింది.
రుస్వా : ఆఁ ఆఁ అంత కోపమా?
శాంతి సర్వదా పరమ ధర్మం
కాకున్న సర్వదా తప్పదు , నిజం!
ఉమ్రావ్ : కోపం రాకేం? ఒక మనిషిని అంత నీచంగా భావించడం మానవత్వ లక్షణమా?
రుస్వా : నావరకు నాకు, మీకు అంత కోపం రావలసిన అవసరం లేదనిపిస్తుంది. ఆ ముసలివాళ్ళిద్దరూ నిజం చెప్పారు. అనవసరంగా లడ్దన్ తల్లికి తన్నులు పడ్డాయి. మీరు మంచి అనుకున్నా, చెడు అనుకున్నా అది వాస్తవం.
ఉమ్రావ్ : వాహ్ మిర్హా సాహెబ్ ! ఏం న్యాయం చెప్పారండీ?
రుస్వా : చిత్తం. నాకు తోచిన న్యాయం అది. ఈ విషయంలో కొంత వరకు మీ తప్పూ లేదు. తప్పంతా అక్బరలీఖాను భార్యది.
ఉమ్రావ్ : పాపం, ఆవిడదేం తప్పు?
రుస్వా : తప్పా! తప్పున్నర! నా భార్య అలాగే చేసి ఉంటే డోలీ ఎక్కించి తల్లి గారింటికి పంపేవాణ్ణి. మళ్ళీ ఆరునెలల దాకా ముఖం చూసేవాణ్ణి కాదు. సరే, ఒక్కమాట ఆ వృత్తాంతం తెలిసిన తరవాత అక్బరలీఖాను ఏమన్నారు?
ఉమ్రావ్ : లడ్దన్ తల్లి మీద అరిచారు. కేకలు వేశారు. ఆ రాక్షసిని తన ఇంటికి రావద్దని హెచ్చరించారు. చాలా రోజుల వరకు అది గడప తొక్కలేదు. పెద్ద ఖాను వచ్చిన తరవాత మళ్ళీ రావడం ప్రారంభించింది. వారికి ఈ కధ తెలుస్తే అక్బరలీఖాను భార్యను కొప్పడ్డారు.
రుస్వా : ముసలివాడు తెలివి కలవాడు.
ఉమ్రావ్ : తెలివా! తెల్ల ముఖమా? లడ్దన్ తల్లి వారి కాళ్ళు వత్తేది. దాంతో ఆమె పక్షం వహించాడు. కాకున్నా పాత ప్రియురాలు కదా?
రుస్వా : సరే. మీరే గెలిచారు. ఒక్క విషయం చెప్పండి. లడ్దన్ తల్లి వయసులో సానియా సంసారా? అమీరన్ ఎవరు?
ఉమ్రావ్ : లడ్దన్ తల్లి డబ్బున్న ముండే. వయసులో చెడిపోయింది. అమీరన్ పల్లెటూరిది. దాని ఊరు సండేలా జిల్లాలో ఉంది. కొడుకు పెద్దవాడే. వానికి పెద్ద ఖాను వద్ద నౌకరి. కూతురుకు పెళ్ళి అయి అత్తవారింటికి వెళ్ళింది.
రుస్వా : అమీరన్ కు పెద్ద ఖానుతో ఏమీ సంబంధం లేకుండేనా?
ఉమ్రావ్ : లేదు. అబద్దం చెపుతే అల్లాకు జవాబు చెప్పాలి. అమీరన్ శీలం గల ఆడది. వయసులో సాని అయి ఇక్కడ కొలువుకు వచ్చిందని వాడ వారంతా చెప్పుకునేవారు. కాని ఇక్కడికి వచ్చిన తరవాత ఆమె చెడుతోవలు పట్టింది ఎవడూ చూడలేదు.
రుస్వా : ఇప్పుడు అన్ని విషయాలు తెలిశాయి. ఇక అడగండి. ఏమి అడుగుతారో?
ఉమ్రావ్ : అయితే తాము వ్యాజ్యంలో తీర్పు ఇవ్వడానికి కూర్చున్నవారన్నమాట.
రుస్వా : అవును చాలా పెద్ద వ్యాజ్యం.
ఆడవాళ్ళు మూడు రకాలు. శీలం గలవారు. చెడిపోయినవారు. బజరుకేక్కినవారు. రెండవ రకం వారిలో మళ్ళీ రెండు రకాలు. చాటుమాటుగా చెడుతోవలు పట్టేవారు, బహిరంగంగా చేసేవారు. చెడు పేరు రానివాళ్ళను కూడా శీలవతుల జతకు చేర్చవచ్చు. పాపం, జీవితాంతం నాలుగు గోడల చెరలో ఉండి సీతమ్మ చెరలు పడుతారు. బాగున్నప్పుడు అంతా బాగానే ఉంటారు. చెడు రోజులు వస్తే వెంట ఉండేది వీళ్ళే పాపం. మగలు వయసులో ఉన్నప్పుడూ , డబ్బు చేతి నిండా ఉన్నప్పుడు కేళీవిలాసాలు బయటి స్త్రీలకు , కాని దరిద్రంలోనూ, ముసలితనంలోనూ వెంట ఉండేవాళ్ళు పెళ్ళాలే. వాళ్ళే అన్ని కష్టాలు పడుతారు. వారికి గర్వం ఉంటేనేం? ఉండాల్సిందే. అది వారి హక్కు . ఆ గర్వంతోనే వారు చెడు స్త్రీలను నీచంగా చూస్తారు. నీచాతినీచులని భావిస్తారు. ఇలాంటివారిని దేవుడు క్షమించవచ్చు గాని వీళ్ళు క్షమించరు. మరొకటేమంటే సంసారులు తరచుగా అందమైన స్వరూప స్వభావాలు కలిగి ఉంటారు. అలాంటివారికి అనందం ఎందుకు లభించకూడదు? కాని మగవాళ్ళు మూర్ఖులు. పెళ్ళాల కంటే కురూపులూ, కుస్వభావం గలవారి వెంట పడతారు. పెళ్ళాలను కొంతకాలానికి గానీ, అంత కాలానికి గానీ వదిలి వేస్తారు. అందువల్ల ఆ సంసార స్త్రీలకూ ఏదో మందులూ, మంత్రాలూ తమ మగల బుద్దిని మళ్లిస్తున్నాయని అనుమానం. అది నిజం కూడానేమో! అది వాళ్ళలోని మంచితనమే. ఎంచాతంటే ఆ విషయంలోనూ వారు తమ భర్తలను దోషులుగా భావించరు. ఆ దుష్టస్త్రీలే అందుకు కారణం అనుకుంటారు. ప్రేమకు, వలపునకు అది పరాకాష్ట. దాన్ని మించిన ఉదాహరణ లభిస్తుందా?
ఉమ్రావ్ : అంతా నిజమే. ఒప్పుకుంటాను. కాని ఈ మగాళ్ళకు బుద్ది ఎందుకుండదు?
రుస్వా : మానవునికి ఆవేశం వస్తుంది. ఆవేశం అతనికి ఇష్టం. ఒకే రకపు జీవితం గడపలేదు. ఎంత మంచి జీవితం అయినా మొఖం మొత్తుతుంది. ఏదో నవత, కొత్తదనం వింత అనందం చవి చూడాలనుకుంటాడు. అప్పటికి బజారు ఆడవాళ్ళను గురించి ఊహించి ఉండడు. బోగం కొంపకు చేరుతాడు. అక్కడ ఏదో కొత్తదనం కనిపిస్తుంది. కొత్త అనుభూతి కలుగుతుంది. కొత్త అనందం చవి చూస్తాడు. ఆవేశం అతణ్ణి అంతటితో ఆపదు. రోజూ ఒక కొంప వెతుకుతాడు.
ఉమ్రావ్ : కాని మగాళ్ళంతా అలాంటివారు కారే!
రుస్వా : అవును. అందుకు కారణం సంఘం, సమాజం, ఆచారాలు, అలవాట్లు, చట్టాలూ, శాసనాలూ, దాన్ని నిషేదించాయి. అలాంటి వ్యక్తిని చుట్టుపక్కాలు , బంధు మిత్రులు ఇరుగు పరుగు వాళ్ళు హేయంగా చూస్తారు. ఆ భయంతో ధైర్యం చేయలేదు. కాని స్నేహం చెడ్డది. విలసపురుషుల సహచర్యం లభిస్తుంది. వింత వింత అనుభూతులను గురించి ప్రస్తావన వస్తుంది. మనసులో కొత్త అనుభూతిని గురించిన ఆవేశం ప్రవేశిస్తుంది. ఆవేశం భయాన్ని అంతం చేస్తుంది. తొలుత సాని కొంపకు వచ్చేవాడు భయంభయంగా వస్తాడనే విషయం మీకు తెలియనిది కాదు. గోప్యంగా వస్తాడు. ఒకరు చూస్తారని భయం. ఎవరైనా వింటారని భయం. మాట కూడా గట్టిగా మాట్లాడడు. కాని క్రమక్రమంగా ఆ భయం మృగ్యం అవుతుంది. క్రమంగా కొద్ది రోజుల్లో మానమర్యాదలు వదిలేస్తారు. సిగ్గు విడిచి పట్టపగలే సాని కొంపలకు చేరుతారు. బండ్లలో కూర్చొని జంటగా ప్రయాణాలు చేస్తారు. చేతులు పట్టుకొని వీధుల్లోనూ, జాతరల్లో నూ తిరగడం గర్వంగా భావిస్తారూ.
ఉమ్రావ్ : అది నిజమే. కాని నగరాల్లో వీటిని ఏహ్యంగా భావించరే!
రుస్వా ; అవును. ముఖ్యంగా డిల్లీ, లక్నో నగరాల్లో. అవి నాశనం కావడానికి కారణమే అది. పల్లెల్లో ఇలాంటి కొంటె జనం తక్కువ. యువకులకు వారి సహవాసం గాని ప్రోత్సాహం గాని లభించవు. రెండవది అక్కడ సాని కులానికి ఇంత గౌరవం లేదు. వారు దొరల, జమీందార్ల అదుపు అజ్ఞాలలో ఉంటారు. వారి జీవిక మాత్రమె కాక జీవితం సహితం వారి గుప్పెట్లో ఉంటుంది. అందుకే భయపడ్తారు. దొరల బిడ్డలతో చాటు మాటుగా వ్యవహారం సాగిస్తారు. నగరాలలో అలా కాదు. అంతా స్వేచ్చ ఎవడు ఎవని అదుపు అజ్ఞాలలో ఉంటాడు ? దాని ఫలితమే ఇది.





