Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
భార్య : ఏం చెప్పాలి?
నేను : మాట్లాడలేదు.
ముసలది : (అక్బరుఖాను భార్యతో ) "అయ్యో నాకు తెలియదనుకున్నావా?" అన్నది
నేను : తెలుస్తే అడగడం దేనికి?
ముసలిది : నీతో మాట్లాడనమ్మా నేనడిగింది బేగం ను. నీతో మాట్లాడగలనే! నువ్వు పెద్ద మనిషివి.
భార్య! ఏయ్ ముసలిదానా! కాస్త మాటకు పొరకముల్లైనావు.
ముసలిది : పగదాన్ని అయినట్లు మాట దాస్తావెం? నేనేనున్నానని ఈమెను, ఖస్సు మంటుంది నామీద.
భార్య : అవునవ్వా నువ్వేమీ అనలేదు. సరేనా? ఈ ఇల్లు జాగీరా నీకు ?
ముసలిది : నా జాగీరెందుకు అవుతుందమ్మా. కొత్త కొత్తవాళ్ళు వస్తున్నారు. వాళ్ళ జాగీరుగాని.
ముసలిదాని మాట విని నాకు నవ్వు వచ్చింది. ముఖం తిప్పి నవుకున్నాను.
భార్య : ఏ జాగీరుకాకేం? నువ్వు నా సవతివి కావూ/ (నావైపు చూచి) ఇదిగో వినండి. ఈమె ఖాను గారి మొదటి పెళ్ళాం. నా సవతి. నేను తరవాత వచ్చిందాన్ని.
ముసలిది : నాకు సవతి ఎవ్వరే! ఇదిగో ఇలాంటి మాటలు మంచివి కావు. ముఖం ముందే తిట్తున్నావు. బోగం ముండల సావాసంలో ఇంతకంటే ఏం నేర్చుకుంటావులే. ఇన్నాళ్లైంది వచ్చి, పెద్ద బేగం గారు (అక్బరలీఖాను తల్లి ) పల్లెత్తు మాట అనలేదు. నిన్న దొరసానీ వాడలో ఉన్న ముసలి వాళ్ళందరినీ తిట్టి పోస్తుంది.
భార్య : (కోపంతో) ఇదిగో చెపుతున్నా లడ్డన్ తల్లీ! నువ్వు నా దగ్గరకు రావద్దు. వెళ్ళి ఆ పెద్ద బెగమ్ దగ్గరే కూర్చో.
నాకూ ఎంతో కోపం వచ్చింది. గయ్యాళి ఆడది దీంతో ఎవరు పెట్టుకుంటారు. అని నిగ్రహించుకున్నారు.
ముసలిది : ఏమి ? నీ సొమ్మేమైనా పోతుందా ?
భార్య : ఏం పోయేకాలం వచ్చిందే అలా వాగుతున్నావు?
ముసలిది : వాగకేం ? నీ చేతి కింద పడి ఉన్నారా ? నువ్వేమన్నా పెట్టేదానివా ? పోసేదానివా? ఏదో పొద్దు పుచ్చుకోవడానికి వస్తుందా. ఇక రానులే.
భార్య : అసలు రావద్దు.
ముసలది : అలాగా ! రావద్డెం? ఏం ఎందుకు రావద్దు! తప్పక వస్తాను. చూస్తా ఏం చేస్తావో.
భార్య : వస్తే చెప్పు దెబ్బలు తింటావు. నెత్తి వెంట్రుకలు రాల్తాయి.
ముసలిది : ఒహోహో ! ఏమి అధికారం దొరసానిది. చెప్పు దెబ్బలు కొడుతుందట! పాపం!
భార్య : లే ఇక్కడ్నుంచి నడువ్. నడుస్తావా ! చెప్పందుకోవాలా?
ముసలిది : ( తిష్ట వేసుకొని కూర్చుంది) ఇవ్వాళ చెప్పుదెబ్బలు తినే వెళతా. గొప్ప అయ్యకూతురువు కదూ!
భార్య ; ( తండ్రి పేరు విని కోపం వచ్చింది. ముఖం ఎర్రబడింది) "ఇదిగో చెప్పుతున్నా. వెళ్ళు ఇక్కడ్నుంచి "ఉరిమింది.
ముసలిది : ఇక మేం చెప్పదేబ్బలు తినండి కదలం.
భార్య : (నాతొ) చూచారా కోపం తెప్పిస్తుంది. ఇది తన్నులు తింటుందివాళ.
నేను : పోనివ్వండి బేగం. వెధవ ముసలిది గయ్యాళి గంప.
ముసలిది : (నాతో) ఏయ్ తోత్తా! నువ్వెందుకే మాట్లాడేది. నిన్ను నమల కుండానే మింగేస్తాను.
భార్య : (చెప్పు తీసి) ఒకటి - రెండు - మూడు , కుదిరిందా రోగం ?
నేను : (చేతిలోంచి చెప్పు లాక్కొని ) బేగమ్ ! శాంతించండి.
భార్య : మీరు అడ్డు రాకండి. వెధవ ముండ తోలు వలుస్తాను.
ముసలిది : ఊ కొట్టు. ఇంకా కొట్టు.
భార్య మరొక కాలు చెప్పు తీసి నాలుగైదు అంటించింది. ముసలిది కాళ్ళు బారచాపి మొత్తుకుంది. "కొట్టావు . చాలా. గుండె చల్లబడిందా? సవతి మంట నా మీద తీర్చావు. కదూ. "కొడుతున్నది చంపుతున్నది. చస్తి చస్తి" పెడబొబ్బలు పెట్టింది. వంటింట్లోంచి అమీరన్ , గదిలోంచి బేగమ్ పరుగెత్తుకొని వచ్చారు. మిన్ను విరిగి పడినట్లు చేసింది. బేగమ్ రాగానే " ముసలితనానికి తన్నులు తిన్నాను" అని ఏడ్చింది.
బేగమ్ : నాకేం తెలుసు నువ్వు తన్నులు తింటున్నావని. తెలిసి ఉంటే అడ్డుకునేదాన్ని అసలు ఏం జరిగింది.
ముసలిది : (నన్ను చూసి) అదిగో ఆ నంగనాచి తన్నులు తినిపించింది. అదే, అదే తన్నులు తినిపించింది.
నేను నివ్వెరపోయాను. అదే మొదటిసారి బేగమ్ ను చూచింది. ఏమీ చెప్పలేక పోయాను.
భార్య : మళ్ళీ ఆమె మాట ఎత్తుతున్నావు.
ముసలిది : అంటాను, ఏం చేస్తావు ?
బేగమ్ : జరిగిందేమిటి?
ముసలిది : ఈమె ఎవరు అని అడిగాను? ఏం పాపం చేశాను?
భార్య : నాకు తెలుసునని కదా నువ్వన్నది. మళ్ళీ అడగడం దేనికీ?
ముసలిది : ఎందుకా? ఎందుకో చూపుతాగా! పగ తీర్చుకోలేకపోతానా? చెప్పుదెబ్బలు కొడ్తావు కదూ? చూస్తా.
బేగమ్ : ఏడ్చావులే. పగ తీర్చుకుంటావు! మరిచిపోబోకేం.
ముసలిది : నిన్నేమీ అనను. మీ ఇష్టం వచ్చినట్టు అను. నీకు హక్కుంది.
బేగమ్ : నీ హక్కూ, నువ్వూ. నడువ్ ఇక్కడ్నుంచి.
ముసలిది : "చూడవమ్మా ఈమె కూడా గెంటుతుంది. "మంచిది వెళ్తాను" అని లంగా దులుపుకొని "వెళ్ళకొట్టేది వచ్చింది పెద్ద. వెళ్తున్నా , వెళ్తున్నా చూస్తా. ఎలా రానివ్వరో. " అంటూ వెళ్ళిపోయింది.
బేగమ్ : (కోడలుతో) ఏమిటీ ఆ వెధవముండతో నీకు?
భార్య : అత్తగారూ! మీ తోడు, నేనేమీ అనలేదు. వచ్చింది పాపం, ఈమెను వంద మాటలన్నది.
నా ప్రస్తావన రాగానే బేగమ్ ముఖం చిట్లించింది. ముసలిది పిచ్చిదని తెలిసింది కాబట్టి దాని మాటలు అట్టే బాధించలేదు. బేగమ్ చిట్లింపుతో మనసు చివుక్కుమంది. లేచి దిడ్డిలోంచి ఇంట్లోకి వచ్చి కూర్చున్నాను.
బేగమ్ : (నేను వచ్చేసింతరవాత కోడలుతో ) ఏం బిడ్డా! అనవసరంగా ఆ ముసలిముండను బాదేశావు. అదీ ఒక బజారు ముండ కోసం. నీకు దానితో ఏంపని?
అమీరన్ : దాని నోరే అంత. నోరు పారేసుకుంది. శిక్ష అనుభవించింది. కాని ఉంపుడు కత్తెతో - అదీ మొగుడు ఉంచుకున్న దానితో సహవాసం ఏమిటమ్మా! వారే తీసుకొని వచ్చి నెత్తిని కూర్చోపెడితే మొత్తుకునేదానివి. నువ్వే వెళ్ళి తీసుకొస్తావేమిటమ్మా!
బేగం : వాడికి గుండెలున్నాయీ ఇంట్లో పెట్టడానికి - ఇంట్లో నేనుండగా . మగాళ్ళ ఇష్టం బయటనే. ఇంట్లో ఆ పప్పులేమీ ఉడకవు. మావారికి చాలాకాలం ఒక అందగత్తెతో అతుకుండేది. వారు ఎన్ని విధాల బ్రతిమాలాడారు? నేను ససేమిరా కాదన్నాను. ఒక్కసారి అడుగు పెట్టానిచ్చావనుకో, ఇంట్లోనే తెచ్చిపెడితే? గుండె మీద పేలాలు వేగుతాయి. తన మగడు తన చేతిలో ఉండాలి. ఈ కాలపు పిల్లలు, ఏమోనమ్మా ఏదీ గ్రహించలేరు.
అమీరన్ : నిజం చెప్పారు. అసలు ఈ బజారు ముండలను సంసారులతో నేంపని? పెద్దలన్నారు మగవాణ్ణి ఇంటికి పిలువడం మేలు గాని చెడిపోయిన ఆడదాన్ని పిలువరాదనీ.
బేగమ్ : పెద్దలు ఊరకే చెప్పారా? మగవాడెం వచ్చి ఆడాళ్ళల్లో కూర్చుంటాడా? మొన్నటి మాట. కల్లోలం జరిగిందా? హుసేనీ ఖాను వచ్చి మా ఇంట్లో దాగి ఉన్నాడు. ఉండడం ఒక్క ఇంట్లోనే అయినా కొంగు సైతం చూచే గుండె లేకపోయింది. విన్నావా? రోజుల తరబడి ఇంట్లోనే కూర్చున్నాను. కదలలేదంటే నమ్ము. పనివాళ్ళతో సంజ్ఞలు చేసి పనులు చేయించేదాన్ని.
అమీరన్ : నువ్వు గోప్పవారింటి కోడలవు. ఇలాంటివాళ్ళతో స్నేహం చేస్తే ఎలా చెప్పు? కాచుకో సున్నంలో చేతులు పెడుతుంది. నీవు చూడనప్పుడు బిందెలో నీళ్ళు త్రాగేస్తుంది. వీళ్ళది ఏం నమ్మకం ! ఎంతకైనా తెగిస్తారు. నీళ్ళ నీడకు సైతం దూరంగా ఉండాలమ్మా!





