Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    విభాండకుడు వారి మాటలు విని సంతసించినాడు. రోమపాదుని పురమునకు చేరినాడు. ఋష్యశృంగుడు తండ్రికి స్వాగతము చెప్పినాడు. విభాండకుడు కొడుకును, కోడలిని చూచినాడు, ఆనందించినాడు. అచట కొంతకాలము ఉన్నాడు. శాంతా ఋష్యశృంగులను వెంటపెట్టుకొని తన ఆశ్రమమునకు వెళ్లినాడు. ఆశ్రమమునందు శాంతా ఋష్యశృంగులు, అరుంధతీ వశిష్ఠుల వలెను, లోపాముద్ర అగస్త్యులవలెను అన్యోన్యముగా కాలము గడిపినారు. వారి శుశ్రూషలు అందుకొని విభాండకుడు సుఖముగా కాలము వెళ్లబుచ్చినాడు.

                                                                                     ఆలోచనామృతము:

    1. భారతము మానవజాతి ఇతిహాసము అని పూర్వము చెప్పినాను. ఇందు మహత్తరములైన మానవ ప్రగతి చరిత్రలు ఉన్నవి. మానవజాతి ప్రగతిని కథల రూపమున చెప్పిన మహామహుడు వేదవ్యాస మునీంద్రుడు. భారతమున పరిశోధించ తగిన విషయములు ఎన్నో ఉన్నవి. ఒక్కొక్క శాఖలో నిపుణులు ఒక్కొక్క అంశమును తీసుకొని పరిశోధించిన రత్నరాసులు బయటపడును.
    2. ఋష్యశృంగుని కథ ఒక గొప్ప ఉదంతము. అందు అనేక విషయములు నిక్షిప్తములు అయి ఉన్నవి. విభాండకుడు బ్రహ్మచారి. అతనికి ఊర్వశి వలన ఋష్యశృంగుడు కలిగినాడు. ఊర్వశి కొడుకును కని వెళ్లిపోయినది. పోషించవలసిన బాధ్యత తండ్రిమీద పడినది.
    అక్రమ సంతానమును పోషించు బాధ్యత తండ్రికి ఉన్నట్లున్నది. దీనిని ఆధునిక సమాజమునకు వర్తింపచేసిన స్త్రీలకు కలుగు అనేక ఇక్కట్లు తొలగును.
    మేనక సహితము విశ్వామిత్రుని వలన కలిగిన సంతానమును విడిచి వెళ్లిపోయినది. ఎంతో ఆలోచించి, నిరంతర పరిశీలన తరువాత ఏర్పరచిన సాంఘిక నిబంధనగా కనిపించుచున్నది. ఇందుగురించి సాంఘిక శాస్త్రజ్ఞులు పరిశోధించవలసిన అవసరము ఉన్నది.
    3. విభాండకుడు బ్రహ్మచారి. ఊర్వశి వలన అతని వ్రతము భంగమయినది. అందువలన తన కొడుకును బ్రహ్మచారిగా ఉంచదలచినాడు. తన విశ్వాసమును అనుసరించి కొడుకును పెంచదలచినాడు. అతనిని ప్రాపంచిక సుఖమునకు దూరముగా ఉంచినాడు. విభాండకుని మాటనెగ్గలేదు. నెగ్గదు. నెగ్గరాదు. తండ్రులు తమ విశ్వాసములను బిడ్డలమీద రుద్దరాదు అనుటకు ఇది మంచి నిదర్శనము.
    4. ఆనాడు బ్రహ్మచర్యము ఉత్తమము అయినదిగా గుర్తించుట జరిగినట్లున్నది. అగస్త్యుడు అట్లే చేసినాడు. పితరుల పేర అతడు గృహస్థుడయినాడు. అంగదేశమున వచ్చిన కరువు నివారించుటకు ఋష్యశృంగుడు గృహస్థుడు అయినాడు. గృహస్థము మానవుని ప్రాకృతిక, సామాజిక, సామాన్య ధర్మమూ. దీనిని తప్పుకొనుట దోషము.
    5. ఋష్యశృంగుడు కరువు నివారణను గురించి పరిశోధించిన శాస్త్రజ్ఞునిగా కనిపించుచున్నాడు. వర్షములు తెచ్చు విధానములు ఈనాడు కనుగొనుచున్నారు. ఆనాడు వర్షమును తెచ్చు ఏదో ఉపాయమును ఋష్యశృంగుడు కనుగొని ఉండవలెను. ఋష్యశృంగుడు వర్ష శాస్త్రజ్ఞుడు.
    6. శాస్త్రజ్ఞుడు ఒక విషయమును కనుగొనిన మాత్రమున సరిపోదు. అది ప్రజలకు ఉపయోగించవలెను. ఋష్యశృంగుడు అడవులదుండి చేసిన పరిశోధన అడవికాసిన వెన్నెల. అతడు కనుగొనినది ఎంత మహత్తరమయిన దయినను నిష్ప్రయోజనము.
    7. అంగదేశమున కరువు వచ్చినది. రోమపాదుడు నివారణోపాయమును గురించి మేధావులతో చర్చించినాడు. వారు ఋష్యశృంగుని జాడ చెప్పినారు. రోమపాదుడు విభాండకుని నియమములను గురించి, ఋష్యశృంగుని ప్రవర్తనను గురించి తెలుసుకున్నాడు. ఒక వ్యూహము పరచినాడు. ఋష్యశృంగుని రప్పించినాడు. ఇది ప్రజా క్షేమము కొఱకు రాజు చేసిన కార్యము.
    8. ఋష్యశృంగుడు అంగదేశమున వర్షము కురిపించి తాత్కాలిక ఉపశమనము కలిగించినాడు. దీర్ఘకాలిక ప్రణాళికగా పశుపోషణను ప్రవేశపెట్టినాడు. పంటకన్న పాడి తేలిక. నిరంతరము ఉండునది. అందుకొరకు ప్రజలకు గోవులను ఇచ్చి పోషింప చేసినాడు. విస్తృతముగా గోవులను పెంచుటకు ప్రోత్సహించినవాడు ఋష్యశృంగుడు.
    నేడు కూడ ప్రభుత్వములు అదేపని చేయుచున్నవి. ప్రజలకు పశువులను ఇచ్చి పాడి అభివృద్ధి చేయుటకు ప్రయత్నించుచున్నవి.
    9. రాజులు మేధావులకు పిల్లల నిచ్చుట ఆచారముగా కనిపించుచున్నది. ఇది తమకున్న రాజ్యాధికారమునుకాక మేధాసంపత్తిని గౌరవించుట. అందుకే రోమపాదుడు తన కూతురు శాంతను ఋష్యశృంగునకు ఇచ్చి వివాహము చేసినాడు.
    10. విభాండకుడు తన నమ్మకమును ఋష్యశృంగుని మీద రుద్దదలచినాడు. కొడుకు ఎదురు తిరిగినాడు. విభాండకుడు తన నమ్మకము వలన కొడుకును కోల్పోయినాడు. కొడుకు కొఱకు కొండలు కోనలు గాలించినాడు. తుదకు కొడుకును కనుగొన్నాడు. తన నమ్మకములు విడుచుకున్నాడు. కొడుకుతో సమాధాన పడినాడు.
    సమాధాన పడుటలోనే తండ్రులకు ఆనందమున్నది.
    ఇది జరిగిన కథ, జరుగుతున్న కథ, జరుగనున్న కథ.

                                                    పరశురాముడు:

    ధర్మరాజాదులు ఋష్యశృంగుని కథ విన్నారు. ఋష్యశృంగ సరస్సులో స్నానము చేసినారు. అక్కడినుండి వారు గంగా సాగర సంగమము చేరినారు. అటనుండి బయలుదేరి కళింగ దేశమందలి వైతరణి చేరి వైతరణిలో స్నానములు చేసినారు. అచటినుండి రోమశుడు వారిని మహేంద్ర పర్వతమునకు తీసుకొని వెళ్లినాడు.
    మహేంద్ర పర్వతమున పరశురాముడు నిరంతరము తపస్సు చేయుచుండును. ధర్మరాజాదులు పరశురాముని దర్శించ దలచినారు. అక్కడ ఉన్న 'కృతప్రవణుడు' అను ముని ధర్మరాజుతో "మీరాకను పరశురాముడు తన దివ్యదృష్టి వలన తెలుసుకున్నాడు. రేపు చతుర్దశి. వారి దర్శనమగును. మీరు వేచి ఉండుడు" అన్నాడు.
    "మహాత్మా! పరశురాముడు సర్వలోక పూజ్యడు. వారి దర్శనమగుట మా భాగ్యము. పరశురాముని పవిత్ర చరిత్ర మాకు తెలియపరచుడు" అని ధర్మరాజు ప్రార్థించినాడు.
    కృత ప్రవణుడు పరశురాముని కథ చెప్పినాడు:-
    పూర్వము "కన్యాకుబ్జము"ను "గాధి" అను రాజు పాలించినాడు. సత్యవతి అతని కూతురు. భృగుపుత్రుడు "రుచికుడు" సత్యవతిని పెళ్లాడదలచి "గాధి"ని అడిగినాడు. గాధి అందుకు అంగీకరించినాడు కాని చెవి మాత్రము నల్లగా ఉండి ఒడలంతయు తెల్లగా ఉండు వేయి గుఱ్ఱములు కన్యాశుల్కముగా ఇవ్వవలసినది అన్నాడు. రుచికుడు వరుణదేవుని వద్దకు వెళ్లినాడు. వేయి గుఱ్ఱములను అడిగి తెచ్చినాడు. గాధికి ఇచ్చినాడు. సత్యవతిని పెళ్లాడినాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.