Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda
పదమూడవ అనువాకము
1. అగ్ని పాపములను నశింపచేయువాడు. మా స్తుతులు విని ధనములు ఇచ్చువాడు. చక్కగా ప్రజ్వలించువాడు. ప్రకాశించువాడు. ఆహ్వానించబడువాడు.
అతడు మమ్ము అనుగ్రహించును గాక.
2. సోమరాజా! నీవు సత్కర్మలకు అధిపతివి. దీప్తిమంతుడవు. పాపనాశకుడవు. నీవు భద్ర క్రతువవు అగుచున్నావు.
3. అగ్నీ! నీవు గొప్ప సైన్యము కలవాడవు. నీ కథలు మంగళ ప్రధములు. నీవు యజమానులను చక్కగా చూచుకొందువు. నీ జ్వాలలు ఉగ్రములు. నిత్యములు. సర్వ వ్యాపకములు. వానికి నీవు ప్రవర్తకుడవు. నీ వెలుగులను చీకట్లు ఆవరింపజాలవు. రాక్షసులు నిన్ను కొట్టజాలరు.
4. అగ్నీ! నీవు బలవంతుడవు. సూర్య సదృశమగు నీ జ్వాలానీకము కటిక చీకటి రాత్రులందు కూడ దారిచూచుటకు, భోజనమును ఉపద్రవ రహితము చేయుటకు, సర్వత్ర చూచుటకు ఉపకరించుచున్నది.
5. అగ్నీ! నీకు జ్వాలా సైన్యము ఉన్నది. దానితో నీవు సర్వమును తెలిసికొనగలవు. నీవు మా యాగములను దేవతలకు చేర్చువాడవు. నిరాటంకముగ పూర్తి చేయువాడవు. ఎవరిచేతను హింసించబడనివాడవు. యజ్ఞ రక్షకుడవు. మాకు రక్షకుడవు. అట్టి నీవు దీప్యమానములను, బహుధనయుక్త గృహ క్షేత్రాదికములను ప్రకాశింపచేయుము.
6. అగ్నీ! మేము యాగానుష్ఠానమునకని ద్యులోకమున ఉండవచ్చును. భూలోకమున ఉండవచ్చును. విఘ్నములు లేని పరిపూర్ణాయువును మాకు కలిగించుము.
స్వర్గమునందు పుట్టిన అగ్నీ! మేము సేవించదగినదియు, ప్రశస్తమైనదియు, మణియుక్త సహితమగు ధనమును మాకు ప్రసాదించుము.
7. అగ్నీ! నీవు బలపుత్రుడవు. హోతవు. నరులను వలె దేవతలను సంతోషపెట్టు వాడవు. ఈ కర్మ యందు నీవు సుమస్కుడవు. శ్రద్ధాయుక్తుడవు అయినావు. నీకు సములును, శ్రద్ధా సమన్వితులగు దేవతలను యజించుము.
8. అగ్ని పురోహితుడు. యజ్ఞ ఋత్విజుడు. ప్రకాశించువాడు. హోత. రత్నములు కలవాడు. అట్టి అగ్నిని స్తుతించుచున్నాను.
9. సోమరాజా! నీవు కోరికలు తీర్చువాడవు. దీప్తిమంతుడవు. కోరికలు తీర్చువాడవు అయినందున వర్షము కలిగించువాడవు. పుణ్యమును ధరించువాడవు అగుచున్నావు.
10. మరుత్తులారా! మీరు శత్రువును తపింపచేయువారు. బాధించువారిని నశింపచేయువారు. మా రక్షణలు కోరి హవిస్సును అర్పించు చున్నాము. ఆరగించండి.
11. మరుత్తులారా! మీరు నివాసకారకులు. మా మీద కోపముచే మాట తప్పి మమ్ము బాధించదలచిన వాడు ద్రోహియగును. మా పాశము వాని మీద పడునుగాత. వానిని నిరంతర పరితాపము కలిగించి బాధించండి.
12. మరుత్తులు సంవత్సరము పొడుగున రక్షకులగువారు. విశాల గృహములు కలవారు. సప్తగణముల వారు. శత్రువును పీడించువారు. తాము సంతుష్టులు. ఇతరులకు సంతోషము కలిగించువారు. అట్టివారు వారి పాశములను మా నుంచి తొలగించి మా విరోధులను బంధింతురుగాక.
13. అగ్నీ! నీవు యువతముడవు. అభిలాషులగు దేవతలను తృప్తి చెందించుము. ఋతుపతి అగ్నీ! నీవు ఋతువులు తెలిసినవాడవు. కావున ఋతువును బట్టి యాగము చేయుము. దేవతల ఋత్విజులతో కూడ నీవు ఈ యజమాని ఋత్విజులలో యష్టవు అగుము.
14. అగ్నీ నీవు హోమకర్తవు. పావకుడవు. దీప్యమానుడవు. మేము యజ్ఞము చేయుచున్నాము. ఆ యజ్ఞపు హవిస్సును నీవు ఆరగించుము. నీవు యాగకర్తవు కదా! నీ మహిమచే ఈ యజ్ఞ దేవతలను తృప్తి చెందించుము. నీవు యువతముడవు. విశిష్టుడవు. మా హవిస్సులను అందుకొనుము.
15. నరుడు అగ్ని చేత కీర్తికరము, వీరవత్తమము నగు ధన పుష్టిని నిత్యము పొందుచున్నాడు.
16. సోమదేవా! మా గృహములను వర్థిల్లచేయుము. మా వ్యాధులను దూరము చేయుము. మాకు ధనము కలిగించుము. పుష్టివర్ధనుడవగుము. మంచి మిత్రుడవగుము.
17. గృహమేధులగు మరుత్తులారా! మమ్ము పాప విముక్తులను చేయండి. రండి. తొలగిపోకండి.
18. మరుత్తులారా! మేము యజమానులము. మేము అనాది నుండి హవిస్సులు అర్పించుచున్నాము. మహనీయములగు హవిస్సులు అర్పించుచున్నాము. సంవత్సరముల తరబడి హవిస్సులు అర్పించుచున్నాము. ఋత్విజులద్వారా హవిస్సులు అర్పించుచున్నాము.
19. మరుత్తులారా! మీ తేజస్సులు అనాది కాలము నుండి వెల్లడి యగుచున్నవి. మీరు మహా యాగములతో కూడినవారు. గృహమేధి, మరుత్ అను నామధేయములు గలవారు. ఈ పురోడాశము సహస్రయాగార్హము. దీనిని మీకు అర్పించుచున్నాము. స్వీకరించండి.
20. ఈ ఆహుతి మంత్రయుక్తము. హవిర్యుక్తము. ఘృతయుక్తము. ఇది రాత్రింబవళ్లు అగ్నికి అర్పించబడుచున్నది. ధనములను ఆశించుయజమాని అవిశ్రాంతముగా అగ్నికి హవిస్సులు అర్పించుచున్నాడు.
21. అగ్నీ! ఈ హవిస్సులు ఎంతో రుచికరములు. అలసట ఎరుగక వీనిని దేవతలకు వహింపుము. సువాసనలు గల మా హవిస్సులను దేవతలు విశేషముగ భక్షింతురుగాక.
22. కణ్వాదులారా! ఈ బలము మీకు ఆట వంటిది. మరుత్సంబంధి. శత్రువును ధిక్కరించునది. రథమునకు ప్రేరణ కలిగించునది. అటువంటి బలమును గూర్చి గానము చేయండి.
23. వాయు దేవతలు అత్యంత వేగవంతులు. యజ్ఞమును చూచు నరుల వలె ఇచటికి వచ్చినవారు. శిశువులు మేడల మీదికి ఎక్కినట్లు పర్వతముల మీద సంచరించువారు. దూడల వలె గంతులు వేయువారు. మబ్బులను నీటితో నింపువారు. వారు తాము తిరుగుచు లోకములకు శుభములు కలిగించుచున్నారు.
24. వాయు దేవతలు మేఘములందు జలము నింపువారు. ఆటలాడువారు. కంపించువారు. విద్యుత్తు దృష్టిగా గలవారు. శత్రువులను గడగడలాడించువారు. తమ మహిమలను తెలిసినవారు.
వారు కదలికకు భూమి - వితంతువు వలె - వడకుచున్నది.
25. వాయువులారా! మీకు పక్షుల వలె పయనింతురు. అప్పుడు మీ దరి చేరిన మేఘమును కొట్టుదురు. ఆ మేఘము కోశాగారముల వంటి జలములు కలిగి మీ రథముల తాకిడికి నీరు కురిపించును.
మిమ్ము అర్చించు యజమాని కొరకు మధుర జలమును వర్షించండి.
26. అగ్ని ప్రజాపాలకుడు. హవ్యవాహనుడు. అనేకులకు ముదము కూర్చువాడు. అతనిని హవిస్సులు అర్పించి నిరంతరము ఆహ్వానించుచున్నారు.
27. ఋత్విజులు నేతుల కారు స్రుక్కులతో అగ్నిని యజించుచున్నారు. హవిస్సులు వహించుమని అగ్నిని స్తుతించు చున్నారు.
28. "ఇన్ద్రాగ్నీ రోచనాదివః" పురోనువాక్యకు ప్రతీక. 'శథద్వృత్రమ్' యాజ్యకు ప్రతీక.
29. "ఇన్ద్రం వో విశ్వతస్పరి" పురోనువాక్యకు ప్రతీక. "ఇన్ద్రంనరః" యాజ్యకు ప్రతీక.
30. "విశ్వకర్మన్హ విషా వావృథానః" పురోనువాక్యకు ప్రతీక. "విశ్వకర్మన్హ విషా వర్దనేన" యాజ్యకు ప్రతీక.
శ్రీమదాంధ్రవచన కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహిత
నాలుగవ కాండము నందలి మూడవ ప్రపాఠకము సమాప్తము.





