Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda
సమహం ప్రజయా సం మయాప్రజా |
సమహగం రాయస్వోషేణ సం మయా రాయస్వోషః ||
నాలుగవ ప్రపాఠకము
మొదటి అనువాకము
1. ఇష్టకా! త్వం రశ్మిః అసి. నివాస సిద్ధికై త్వా = నిన్ను, ఉపదధామి = ఉపధానము చేయుచున్నాను. నీవు మా కొరకు నివాసమును సంపాదించుము.
నీవు ప్రకృష్ణ గతి గలదానవు అగుచున్నావు. త్వా ధర్మాయ ఉపదధామి. ధర్మం జిన్వ ఆర్జించుము.
నీవు అనుకూలగతి కలదానవు అగుచున్నావు. త్వా దివే ఉపదధామి. దివం జిన్వ.
నీవు ద్యావాపృథ్వుల సంధివి అగుచున్నావు. త్వా అంతరిక్షాయ ఉపదధామి. అన్తరిక్షం జిన్వ.
నీవు భూలోక భాగమవు అగుచున్నావు. త్వా పృథివ్యై ఉపదధామి. పృథివీమ్ జిన్వ.
నీవు మేఘ స్వరూపము అగుచున్నావు. త్వా వృష్ట్యై ఉపదధామి. వృష్టిమ్ జిన్వ.
నీవు ఉషః కాలరూపము అగుచున్నావు. త్వా అహ్నే ఉపదధామి. అహః జిన్వ.
2. ఇష్టకా! సాయంసంధ్యా రూపము అగుచున్నావు. రాత్రియై త్వా ఉపదధామి. రాత్రిమ్ జిన్వ.
నీవు వసువులచే కోరబడిన దానవు అగుచున్నావు. వసుభ్యః త్వా ఉపదధామి. వసూన్ జిన్వ - సంతోష పరచుము.
నీవు రుద్రుల కోరిక స్వరూపము అగుచున్నావు. రుద్రేభ్యః త్వా ఉపదధామి. రుద్రాన్ జిన్వ.
నీవు శోభన దీప్తి స్వరూపము అగుచున్నావు. ఆదిత్యేభ్యః త్వా ఉపదధామి. ఆదిత్యాన్ జిన్వ.
నీవు పితృదేవతల అనుగ్రహ స్వరూపము అగుచున్నావు. పితృభ్యః త్వా ఉపదధామి పిత్రూన్ జిన్వ.
నీవు సంతాన స్వరూపము అగుచున్నావు. ప్రజాత్వా ఉపదధామి. ప్రజాః జిన్వ.
నీవు పరకీయ సేనను పరిభవించుదానవు అగుచున్నావు. పశుభ్యః త్వా ఉపదధామి. పశూన్ జిన్వ. సంపాదించుము.
3. ఇష్టకా! నీవు ఓషధుల జీవ స్వరూపము అగుచున్నావు. త్వా ఓషధీభ్యః ఉపదధామి. ఓషధీః జిన్వ.
శత్రువును వధించు వజ్రము ధరించినదానవు అగుచున్నావు. త్వా ఇన్ద్రాయ ఉపదధామి. ఇన్ద్రంజిన్వ - సంతోష పరచుము.
ప్రాణవాయు స్వరూపము అగుచున్నావు. త్వాప్రాణాయ ఉపదధామి. ప్రాణమ్ జిన్వ.
అపాన వాయు స్వరూపము అగుచున్నావు. త్వా అపానాయ ఉపదధామి. అపానం జిన్వ.
దృష్టి స్వరూపము అగుచున్నావు. చక్షసే త్వా ఉపదధామి. చక్షుః జిన్వ.
శ్రోత్రేంద్రియ శక్తి స్వరూపము అగుచున్నావు. త్వా శ్రోత్రాయ ఉపదధామి. శ్రోత్రం జిన్వ. త్రివృత్ అసి.
4. ప్రవృత్ అసి. సంవృద్ అసి. వివృత్ అసి. సంరోహః అసి. నిరోహః అసి. ప్రరోహః అసి, అనురోహః అసి.
5. ఇష్టకా! నీవు సంపన్నుడగు పుత్రి స్వరూపము అగుచున్నావు. లభించిన సంపదను వృద్ధి చేయుదానవు అగుచున్నావు. వృద్ధి చెందిన సంపదచే జీవించు దానవు అగుచున్నావు.
రెండవ అనువాకము
1. ఇష్టకా! నీవు వెలుగొందుచున్న తూర్పు దిక్కువు అగుచున్నావు. వసువులు నీకు అధిపతులు అగుచున్నారు. అగ్ని నిన్ను ఉపద్రవ రహితను చేయుచున్నాడు. త్రివృత్ స్తోమము నిన్ను భూమి మీద స్థాపించునుగాత. ఆజ్యమును ఉక్థ నిన్ను బాధించకుండ దృఢముగ చేయునుగాత. రథంతర సామము నీకు ప్రతిష్ట కలిగించునుగాక.
2. ఇష్టకా! నీవు విరాట్ దక్షిణ దిక్ స్వరూపమవు. రుద్రులు నీకు అధిపతులు. ఇంద్రుడు నిన్ను ఉపద్రవ ఆయుధముల నుంచి రక్షించువాడు. పంచదశస్తోమము నిన్ను భూమి మీద స్థాపించునుగాక. 'ప్రఉగమ్' ఉక్థము - నిన్ను బాధించకుండ దృఢపరచునుగాక. 'బృహత్' సామము నీకు ప్రతిష్ఠ కలిగించునుగాక.
3. ఇష్టకా! నీవు సామ్రాట్టగు దక్షిణ దిక్ స్వరూపమువు. ఆదిత్యులు నీకు అధిపతులు. సోముడు నిన్ను ఉపద్రవ ఆయుధముల నుంచి రక్షించును. సప్తదశ స్తోమము నిన్ను భూమి మీద స్థాపించునుగాక. 'మరుత్వతీయమ్' ఉక్థము - నిన్ను బాధించకుండ - దృఢ పరచును గాక. వైరూప సామము నీకు ప్రతిష్ఠ కలిగించునుగాక.
4. ఇష్టకా! నీవు స్వరాట్టగు ఉత్తర దిశ స్వరూపమవు. విశ్వేదేవతలు నీకు అధిపతులు. వరుణుడు నిన్ను ఉపద్రవ ఆయుధముల నుండి రక్షించును. ఏకవింశస్తోమము నిన్ను భూమి మీద స్థాపించునుగాక. 'నిష్కేవల్యమ్' ఉక్థము నిన్ను బాధారహితముగ దృఢపరచునుగాక. వైరాజ సామము నీకు ప్రతిష్ఠ కలిగించునుగాక.
5. ఇష్టకా! నీవు అధిపత్నివగు ఊర్ధ్వ దిశా స్వరూపమవు. మరుత్తులు నీకు అధిపతులు. బృహస్పతి నిన్ను ఉపద్రవకర ఆయుధముల నుండి రక్షించును. త్రిణవ త్రయస్త్రింశస్తోమములు నిన్ను భూమి మీద స్థాపించునుగాక. వైశ్వదేవాగ్ని మారుత ఉక్థములు నిన్ను బాధ కలిగించక దృఢ పరచును గాక. శాక్వర రైవత సామము ప్రతిష్ఠ కలిగించునుగాక.
6. ఇష్టకా! దేవతలందు తొలుత పుట్టిన వారును, నారదాది మహర్షులును, విధర్తయు, అధిపతియు నిన్ను అంతరిక్షమంత చేయుటకు గాను ఆకాశమంత విశాలము చేయుదురుగాక. వారందరు కలసిమెలసి నిన్ను స్వర్గమున స్థాపింతురుగాక. అట్లే యజమానిని స్వర్గమునకు చేర్చెదరుగాక.
మూడవ అనువాకము
1. ఈ అగ్ని హిరణ్యజ్వాలలవాడు. సూర్యకాంతులు కలవాడు. తూర్పుదిక్కున ఉన్నాడు. అతనికి రథగృత్స, రథౌజులను సేనాని గ్రామణ్యులు ముఖ్యులు. పుంజికస్థల, కృతస్థలలను అప్సరసలు పరిచారికలు. అతడు క్రూర యాతుధానులను, అతిక్రూర రాక్షసులను కలిగిఉన్నాడు. ఇష్టకా! నీవు అంతటి అగ్ని స్వరూపవు.
2. ఈ అగ్ని విశ్వకర్మ. దక్షిణ దిశయందు ఉన్నాడు. అతనికి రథస్వన, రథచిత్రులు సేనాని గ్రామణ్యులు. మేనక, సహజన్యలు అతని అప్సరసలు. అతనికి క్రూరములగు మృగములును, వధించు అతిక్రూర ఆయుధములు. ఇష్టకా! నీవు అంతటి అగ్నిస్వరూపవు.
3. ఈ అగ్ని విశ్వవ్యచము. ఇతడు పశ్చిమదిశయందు ఉన్నాడు. అతనికి రథస్రోత, అసమరథులు సేనాని, గ్రామణ్యులు. ప్రమ్లోచంతి, అనుమ్లోచంతి అప్సరసలు. సర్పములు క్రూర ఆయుధములు, వ్యాఘ్రాదులు అతి క్రూర ఆయుధములు. ఇష్టకా! నీవు అంతటి అగ్ని స్వరూపవు.
4. ఈ అగ్ని లభించిన ధనము కలవాడు. ఇతడు ఉత్తరదిక్కున ఉన్నాడు. అతనికి సేనజిత్, సుషేణులు సేనాని, గ్రామణ్యులు. విశ్వాచి, ఘృతాచి అప్సరసలు. జలములను క్రూర ఆయుధములు, వాయువు అను అతిక్రూర ఆయుధములు కలవు. ఇష్టకా! నీవు అంతటి అగ్ని స్వరూపవు.
5. ఈ అగ్ని వైద్యుతాగ్ని. ఇతడు ఊర్ధ్వదిశ యందు ఉన్నాడు. అతనికి తార్ష్య అరిష్టనేములు సేనాని, గ్రామణ్యులు. ఊర్వశి, పూర్వచితి అస్పరసలు. విద్యుత్తను క్రూర ఆయుధము, అశని అను అతిక్రూర ఆయుధములు కలవు. ఇష్టకా! నీవు అంతటి అగ్ని స్వరూపవు.
6. పూర్వ మంత్రములందు చెప్పబడిన వారందరకు నమస్కారము. వారు మాకు సుఖములు కలిగింతురుగాక. మేము ద్వేషించువారిని, మమ్ము ద్వేషించువారిని వారినోళ్లలో పడవేయుచున్నాను.
7. సర్వజగద్రక్షకుడగు సూర్యుని నుండి నీడలో నిన్ను చల్లబరచి ఇష్టకా! నిన్ను ఇచటికి చేర్చుచున్నాను. సముద్ర సదృశుడగు సూర్యునకు నమస్కారము. సముద్రచక్షువగు సూర్యునకు నమస్కారము.
8. ఇష్టకా! నీవు వ్యచస్వతివి - అభివ్యక్తి గలదానవు. ప్రథస్వతివి - విశాలవు. విభూమతివి - కొంగ్రొత్త సృష్టి చేయగలదానవు. ప్రభూమతివి - ప్రభుశక్తి గలదానవు. పరిభూమతివి - పరసైన్యమును పరిభవించగలదానవు. బ్రహ్మ నిన్ను స్వర్గము మీద నిలుపునుగాక.
ఇష్టకా! నీవు యజమానికి స్వర్గము కలిగించుము. స్వర్గమును స్థిరపరచుము. స్వర్గమును హింసించకుము. సూర్యుడు నీకు సమస్త ప్రాణ, అపాన, వ్యాన ఉదానములను రక్షించుచు చరిత్ర, ప్రతిష్ఠ కలిగించునుగాత. అతడు నీకు యోగక్షేమములు, సుఖములు కలిగించి తన దీప్తి విశేషమున నిన్ను సర్వత్ర రక్షించునుగాక. సూర్యునిచే అనుగృహీతవగు నీవు. అంగిరసులచే స్థాపించబడిన దానివలె స్థిరముగా నిలుతువుగాక.





