Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    వేశ్యలు రుచిగల భక్ష్యములను, గంధపుష్పమాల్యాది సుగంధ ద్రవ్యములను తీసుకొని వనమునకు వెళ్లినారు. వారు ఋష్యశృంగునితో మాట్లాడుటకు వేచియున్నారు.
    ఒకసారి విభాండకుడు ఫలములు తెచ్చుటకు అడవిలోనికి వెళ్లుచు "కుమారా! కాలాతిక్రమణము చేయక అగ్ని విధులను ఆచరింపుము" అని చెప్పి వెళ్లిపోయినాడు.
    సమయమునకై వేచియున్నారు వేశ్యలు. వెంటనే వయసులో ఉన్న అందమయిన వేశ్యను ఋష్యశృంగుని వద్దకు పంపినారు. ఆమె ముని కన్యవలె ఋష్యశృంగుని చేరినది. ఋష్యశృంగుడు ఆమెను చూచినాడు. చిత్తరువుగా మారినాడు. అతనికి లోకవృత్తి తెలియదు. వచ్చినవాడు ముని కుమారుడు అనుకున్నాడు.
    "ముని కుమారా! స్వాగతము. నీవు వింతగా ఉన్నావు. అందముగా ఉన్నావు. నేను ప్రకృతి సౌందర్యము చూచినాను. నీవంటి అపురూప సౌందర్యమును చూడలేదు. రమ్ము నా ఆతిథ్యము స్వీకరించుము" అని ఆహ్వానించినాడు.
    ఆమె వయ్యారముగా కదలినది. హంస నడకలు నడచినది. ఋష్యశృంగుని చేరినది. చిలకపలుకులు పలికినది "కుమారా! నాతో స్నేహము చేతువా? నావెంట వత్తువా? దగ్గరలోనే ఉన్నది మా ఆశ్రమము. నీవు వత్తునన్న, నాతో జత కట్టెదనన్న నీ ఆతిథ్యము స్వీకరింతును".
    ఋష్యశృంగునకు మత్తు కమ్మినది. అతనికి లోకము కనిపించలేదు. ఆమె మాటలకు అంగీకరించినాడు. ఆమెతో వత్తునన్నాడు.
    ఆమె కిలకిల నవ్వినది.
    అతడు ఆమెకు మోకరిల్లినాడు.
    ఆమె వయ్యారముగా కూర్చున్నది.
    అతడు ఆమెకు ఫల పుష్పములను ఇచ్చినాడు.
    ఆమె పడిపోయినది. అతనిని చూచినది.
    అతడు ఓడినాడు. ఆమెను చూచినాడు.
    దూరము నుండి మిగిలిన వేశ్యలు చూచినారు. గ్రహించినారు. రంగమున ప్రవేశించినారు. ఋష్యశృంగునకు వింత వింత భక్ష్యములు ఇచ్చినారు. అవి విచిత్రముగా ఉన్నవి. రుచిగా ఉన్నవి. అతనికి చిత్రవిచిత్రములయిన వస్త్రము లిచ్చినారు. అవి విచిత్రముగా ఉన్నవి. అందముగా ఉన్నవి. గంధము మున్నగు సుగంధ ద్రవ్యములు ఇచ్చినారు. అవి విచిత్రముగా ఉన్నవి. సువాసనలు వెదజల్లినవి.
    ఋష్యశృంగుని అలంకరించి కూర్చుండ పెట్టినారు. అతనిముందు వారు పాడినారు. అతని మనసు పరవళ్లు తొక్కినది.
    అతని ముందు వారు నాట్యములు చేసినారు. ఆటలు ఆడినారు. అతడు నిలువలేక పోయినాడు, లేచినాడు వారిలో చేరినాడు.
    అతడు వారిలో చేరినాడు. ఒకతె అతనిని కౌగిలించుకున్నది.
    ఒకతె అతనిని ముద్దు పెట్టుకున్నది.
    ఒకతె అతని చెవిలో గుసగుసలు చెప్పినది.
    ఋష్యశృంగుడు మైమరచినాడు. లోకమునే మరచినాడు.
    విభాండకుడు వచ్చు వేళ అయినదని స్త్రీలు విరమించినారు. వెళ్లిపోయినారు.
    విభాండకుడు వచ్చి చూచినాడు. అంతయు అస్తవ్యస్తముగా ఉన్నది. ఋష్యశృంగుడు ఈ లోకమున లేడు.
    అగ్నిహోత్రము జ్వలించుట లేదు. హోమము జరిగిన జాడలు లేవు.
    "కుమారా! ఏమి అట్లున్నావు. చిత్తము చలించినట్లున్నావు! అగ్నిహోత్రము ఆచరించలేదు! ఏమి నీకేమయినది?" అడిగినాడు విభాండకుడు. "తండ్రీ! మున్నెన్నడు చూడనిది చూచినాను. ఒక ముని కుమారుడు వచ్చినాడు. అతడు నాతో జతకట్టినాడు. అతడు వింతగా ఉన్నాడు. అతని రొమ్మున రెండు గుండ్రని పిండములున్నవి. అతడు వయ్యారముగా నడచును, చిలుకవలె పలుకును. అతడు నాకు అనేక సుగంధములు ఇచ్చినాడు, నాతో ఆడినాడు, పాడినాడు. నన్ను కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు".
    "కుమారా! మోసపోయినావు. తాపసుల తపస్సు భంగము చేయుటకు రాక్షసులు ఆ రూపమున వత్తురు. వారిచ్చినవి తీసుకొనరాదు. వారితో జతకట్టరాదు అని బోధించినాడు విభాండకుడు. కొడుకును సహజాతి సహజమయిన ఆకర్షణ నుండి తప్పించినాను అనుకున్నాడు"
    విభాండకుడు ఎప్పటివలె ఫలములు తెచ్చుటకు అడవిలోనికి వెళ్లినాడు. సమయము కనిపెట్టి ఆమె వచ్చినది. ఆమెను చూచి అతడు కరిగినాడు.
    ఆమె సైగ చేసినది. అతడు లేచినాడు, ఆమె సాగినది, అతడు వెంబడించినాడు. వారు జల జల పారు సెలయేళ్లవలె సాగినారు.
    వారు కలిసినారు. సెలయేళ్లు కలిసిన నదివలె సాగినారు.
    ఋష్యశృంగుడు అంగదేశము చేరినాడు.
    రోమపాశుడు ఋష్యశృంగునకు స్వాగతము పలికినాడు. అతనిని రాజాశ్రమము అను వనమున ఉంచినాడు. ఆమెతో పని తీరినది.
    కొండను తాకి చీలిపోయిన నదివలె ఆమె చీలిపోయినది. కొంత దూరము పోయి ఎండిపోయి ఉండును. ఆమె కథ మనకు తెలియదు.
    ఋష్యశృంగుడు అంగదేశమున ప్రవేశించినాడు. రాజాశ్రమమున నివశించినాడు. అంగదేశమున ఆకాశమున మబ్బులు కమ్మినవి. మెరుపులు మెరిసినవి, ఉరుములు ఉరిమినవి. మహావర్షములు కురిసినవి. నదులు, చెరువులు, బావులు జలపూర్ణములు అయినవి. అంగదేశమందలి జనులు పరమానందము పొందినారు.
    ఋష్యశృంగుని అనుగ్రహము వలన అంగదేశమున కరువు దూరమయి, దేశము సుభిక్షము అయినది. అందుకు కృతజ్ఞతగా రోమపాదుడు తన కూతురు శాంతను ఋష్యశృంగునకు ఇచ్చి వివాహము చేసినాడు. రోమపాదుడు అనేక ధనరాసులను దాసీదాస జనులను ఋష్యశృంగునకు ఇచ్చినాడు. వేలకొలది గోవులను ఇచ్చి, దేశమందంతటను గోశాలలు నిర్మించి వానిలో గోవులను ఉంచినాడు. ఆగోశాలలన్నీ ఋష్యశృంగుని పేర వెలసినవి.
    ఋష్యశృంగుడు శాంతతో సుఖముగా ఉన్నాడు. విభాండకుడు ఫలములు తీసుకొని ఆశ్రమమునకు వచ్చినాడు. అతనికి ఋష్యశృంగుడు కనిపించలేదు. అడవి సాంతము గాలించినాడు. కనిపించలేదు. కొడుకును వెదకుటకు బయలుదేరినాడు. అనేక దేశములు తిరిగినాడు. కనిపించలేదు. పుత్రాన్వేషణలో అతడు అంగదేశము ప్రవేశించినాడు. అచట గోవుల సందడి ఎక్కువగా కనిపించినది. గోపాలురు సంతోషముగా ఉన్నారు.
    విభాండకుడు ఒక గొల్లపల్లెకు చేరినాడు. పల్లె వెలసిన విధము అడిగినాడు. "మహర్షీ! ఇది ఋష్యశృంగుని పల్లె. ఇందలి గోవులన్నియు అతనివే!" అని చెప్పినారు గొల్లవారు. విభాండకుడు ఆశ్చర్యపడినాడు. అసలు విషయము అడిగినాడు. ఋష్యశృంగుని వివాహ వృత్తాంతమును వారు వివరించి చెప్పినారు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.