Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



                                                      ఆలోచనామృతము:

    1. సగరుడు సంతానము కొఱకు తపము చేసినాడు. అతనికి అసమంజసుడు, అరువదివేలమంది పుత్రులు కలిగినారు. వేయి శుభ సూచకమువలె కనిపించును. అతనికి కలిగిన సంతానము అరువది కావచ్చును, ఈ అరువదిమంది కృత్రిమ సంతానముగా కనిపించుచున్నారు నూరుగురు కౌరవులవంటి వారుగా తోచుచున్నారు. ఇచ్చట ఒక విషయము గమనించవలసి ఉన్నది. కృత్రిమ సంతానమయిన కౌరవులు దుర్మార్గులు అయినట్లే సగరపుత్రులు దుర్మార్గులు అయినారు. కృత్రిమముగా కలిగిన అధిక సంతానము దుర్మార్గులగుటను గమనించి ఆ పద్ధతిని విరమించినట్లు కనిపించుచున్నది. నేడు కృత్రిమ సంతానపు ప్రయోగములు జరుగుచున్నవి. వాటి పరిణామములు గమనించవలసి ఉన్నది.
    2. సగరుడు ధర్మ ప్రభువు. ప్రజా క్షేమము కొఱకు తన స్వంత కొడుకును వధించిన త్యాగధనుడు. ప్రభుత్వము చేయువారికి పుత్రేషణ ఉండరాదని చెప్పుటకు ఇదొక గొప్ప నిదర్శనము. ఈమధ్యనే "పుత్రుల రాజకీయములు" వెఱ్ఱితలలు వేసి వికారములు కలిగించిన విషయము మనకు తెలియును. ప్రజా పాలనలో దారేషణ, పుత్రేషణ వంటివి ప్రమాదములకు దారితీయునని వ్యాసదేవుని సందేశము. దొరతనము కావరము కనులకు కమ్మిన వారికి మహాత్ముల సందేశములు వినిపింపవు, కనిపించవు.
    3. సగరుడు సంతానము కోరినాడు. సత్సంతానము కోరలేదు. సంతానము మంచిది కాకున్నా మనిషికి కలుగు మానసిక ఆందోళన వివరించునదే సగరుని కథ. అంతమంది కొడుకులు అతనికి పనికి రాలేదు. తుదకు బుద్ధిమంతుడయిన మనుమడు అంశుమంతుడు అక్కరకు వచ్చినాడు.
    బిడ్డలను సుశిక్షితులుగా పెంచుట ఒక తపస్సు. వారు సన్మార్గులగుట ఒక వర ప్రసాదము.
    మరొక విషయము కనిపించుచున్నది. అధిక సంతానము అనర్ధదాయకము. కౌరవులు, సగరపుత్రులు అంతే అయినారు. లెక్కకు మించిన వారిని సుశిక్షితులను చేయుట దుస్తరము అను నిత్య సత్యము ఇందు గోచరించుచున్నది.
    4. మానవ జీవితము ఒక స్రవంతి. అది ఎప్పుడు ఎక్కడ ఆరంభమయినదో, ఎంతవరకు సాగునో తెలుసుకొనుట దుస్తరము. ఈ స్రవంతిలో వ్యక్తి, అతని స్వల్ప జీవితము ఒక బిందువు మాత్రమే. జీవన స్రవంతి లక్షల, కోట్ల బిందువుల సమాహారము. సమాజ జీవితము నిరంతరము. దాని ఆయువును ఎరుగుట దుస్తరము. వ్యక్తి జీవితము సీమితము.
    మనవ కళ్యాణ సాధనకు మానవుడు పుట్టినది ఆదిగా కృషి జరుగుతున్నది. మానవజాతి మనుగడ కొనసాగినంత కాలము ఇది కొనసాగును. ఇది నిరంతరమయిన కృషి. ఇది అంతములేని సాధన. ఎన్ని కనుగొన్నను ఇంకను కనుగొనవలసినవి ఉండును. ప్రకృతికి అంతములేదు, కృషికి సాంతములేదు. ఒక మానవతా కార్యము సాధించుటకు ఒక వ్యక్తి చాలడు. ఒక తరము సరిపోదు. ఈ కృషి ఒకతరము నుండి మరొక తరమునకు సాగిపోవలె. అప్పుడే సిద్ధి సాధ్యము. ఆ నిత్య సత్యము బోధించునదే భగీరథుని కథ. భస్మరాసులకు పుణ్యగతి కలిగించుట సంకేతము మాత్రమే. కొండలందు ఒదిగి పారుచున్న గంగా స్రవంతిని మైదానములకు తెచ్చి మానవునకు ఉపయోగించునట్లు చేయుట నిజమయిన ధ్యేయము.
    ఈ ధ్యేయము అంశుమంతునకు కలిగినది. ఆలోచనము అతనికి వచ్చినది. అతడు దిలీపునకు అందించినాడు. దిలీపుడు భగీరథునకు అందించినాడు.
    భగీరథుడు చేసిన ప్రయత్నము తన కొఱకు కాదు. తన సంతానమునకు కాదు. తనకు తన రాజ్యము వచ్చుటకు కాదు. అతడు మానవజాతి వికాసమునకు ప్రయత్నించినాడు. అందుకే అతడు చరిత్రలో స్థిరమయిన స్థానము సంపాదించుకున్నాడు.
    భగీరథుడు హిమవంతమందలి సెలయేళ్లను కలిపి మైదానముల వరకు ప్రవహింపచేసిన మహాత్ముడుగా కనిపించుచున్నాడు. అందుకు అతడు ఎంత శ్రమించినాడో ఊహించుట కూడ కష్టము.
    హిమవంతమందలి నదులకు "గంగ" అని పేరు లేదు. హరిద్వారమునుండి దానికి "గంగ" అని పేరు. హరిద్వారమునకు "గంగాద్వారము" అని కూడ పేరున్నది. ఈ గంగా ద్వారము భగీరథుడు ఏర్పరచినది కావచ్చును.
    ఆ విధముగా గంగను నేలకు తెచ్చి మానవజాతికి మహోపకారము చేసినవాడు భగీరథుడు. అతడు మానవజాతికి ఆదర్శప్రాయుడు.

                                                                                 ఋష్యశృంగుని కథ:

    "ధర్మరాజా! ఇది ఋష్యశృంగుని సరస్సు" అని చూపించినాడు రోమశుడు.
    "మహాత్మా! ఋష్యశృంగుడెవరు? అతని వృత్తాంతమేమి?" అని అడిగాడు ధర్మరాజు.
    రోమశుడు ఋష్యశృంగుని కథ వినిపించినాడు:-
    పూర్వము కశ్యప మునికి విభాండకుడు అను పుత్రుడు ఉండెను. అతడు బ్రహ్మచర్య వ్రతము అవలంబించి తపము చేయుచుండెను. ఒకనాడు విభాండకునకు ఊర్వశి కనిపించినది. ఆమెను చూచి విభాండకునకు వీర్యస్ఖలనము అయినది. అతని వీర్యము వలన ఋష్యశృంగుడు జన్మించినాడు.
    ఋష్యశృంగుడు పెద్దవాడు అయినాడు. వయసు వచ్చినది. అయినను అతనికి ప్రాపంచిక విషయములు తెలియవు.
    విభాండకుని ఆశ్రమమునందు తపము చేయుచున్నాడు.
    ఆ కాలమున అంగదేశమును రోమపాదుడు అను రాజు పాలించినాడు. అతని రాజ్యమున వానలు కురియలేదు. కాటకము వచ్చినది. జనులు అల్లాడి పోయినారు. రాజు బ్రాహ్మణులను పిలిపించి నివారణోపాయము అడిగినాడు. అందుకు బ్రాహ్మణులు "ఋష్యశృంగుడను మహర్షికి ఇంద్రుడు వర్షము కలిగించు శక్తిని ఇచ్చినాడు. అతడు బ్రహ్మచర్యము పూని అడవులందు ఉన్నాడు. అతడు శాంత చిత్తుడు. తపోనిధి, ఏదో ఒక ఉపాయమున ఋష్యశృంగుని అంగరాజ్యమునకు రప్పించిన వానలు కురిసి అంగరాజ్యము సుభిక్షము కాగలదు" అని చెప్పినారు.
    రోమపాదుడు ఋష్యశృంగుని రప్పించుటను గురించి ఆలోచించినాడు. బుద్ధిమంతులను సంప్రదించినాడు. తరువాత రూపసౌందర్యము కలిగి యౌవ నవతులు, చతురులు అయిన వేశ్యలను పిలిపించినాడు. 'మీరు మీ చాతుర్యము ప్రదర్శించి ఋష్యశృంగుని మన రాజ్యమునకు తేవలెను" అని చెప్పి పంపించినాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.