Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
యువకుడు : అంత సిగ్గున్నదానివైతే ఈ ఊరికే వచ్చేదానివి కావు. వచ్చినా పుట్టిన'వాడలో భోగం మేళానికి ఒప్పుకునేదానవు కావు.
నేను : అవును. తప్పే. కాని నాకు తెలియందే?
యువకుడు : ఇప్పుడు తెలిసిందిగా!
నేను : అయితే ఏమౌతుంది ?
యువకుడు : (క్రోధంతో ) "ఏమౌతుంది? ఏమౌతుంది ?" అని బోడ్లోంచి కత్తి దూసి నా మీద పడి చేతులు పట్టుకొని గొంతు మీద కత్తి పెట్టి " ఇదిగో ఇది అవుతుంది" అన్నాడు.
ఇంతలో దాసీదీ ఆకులు తెచ్చి పరిస్థితిని చూచి " అమ్మను చంపేస్తున్నారు రాండి. పరిగెత్తండి" అని కేకలు పెట్టింది.
మెడ మీది నుంచి కత్తి తీసి "అడదాన్నేం చంపను? అదీ ఏ ఆడది నా .......... " అని ఎక్కెక్కి త=ఏడ్చాడు.
నేను ముందునుంచే ఏడుస్తున్నాను. కత్తి కుత్తుక మీదికి వచ్చేవరకు ప్రాణ భయంతో గుండెలో ఒక పోటు పొడిచినట్లైంది. శ్వాస నిలిచిపోయింది. అతడు వదిలాడు. ఏడ్పు సాగించాడు. నేనూ ఏడ్చాను.
దాసీది ఒకటి రెండు కేకలు వేసింది. దానికి అంతా వింతగా తోచింది. నేను సైగ చేసి వారించాను. వచ్చి ఒక పక్క నుంచుంది.
ఇద్దరం ఏంతో సేపు ఏడ్చాం.
యువకుడు : ( చేతులు జోడించి ) "తల్లీ! మమ్ము కరుణించు. ఈ ఊరు విడిచి వెళ్ళిపో." అన్నాడు బ్రతిమాలాడినట్లు.
నేను : రేపు వెళ్ళిపోతాను. వెళ్ళేముందు ఒక్కసారి అమ్మను చూస్తా.
యువకుడు : క్షమించు. ఇంక మరిచిపో. నిన్న అమ్మ నిన్న ఇంట్లోకి పిలిచింది, నేను ఇంట్లో లేను. ఉంటె గొడవ అయ్యేది. వీధంతా ఇదే గుసగుసలు.
నేను : చూచావుగా, నాకు ప్రాణ భీతి లేదు. కాని నీవు మాత్రం చల్లగా వర్ధిల్లాలి. నీ పిల్లల కోసం , బతికి ఉంటె ఎప్పుడో ఒకప్పుడు కుశల వార్త తేలుస్తుంటుంది.
యువకుడు : మా విషయం మాత్రం ఎవరికీ చెప్పొద్దు.
నేను : మంచిది.
యువకుడు వెళ్ళిపోయాడు. నేను దుఖంతో కుంగిపోయాను. దాసీది ప్రాణాలు తీయసాగింది. " అతనెవరు" అని.
:ఇద బోగం కొంప. వేలమంది వస్తారు. నీకెందుకు?" అని కసిరాను.
రాత్రి అంతా వేదన. ఉదయం లక్నో వెళ్ళడానికి తయారైనాను. బాడుగ బండి చేసుకొని వెళ్ళిపోయాను.
19
లక్నో వచ్చి ఖానమ్ ఇంట్లో దిగాను . అదే చౌకు . అదే గది. మనుషులూ వారే. పూర్వం వచ్చేవాళ్ళలో కొందరు కలకత్తా వెళ్ళిపోయారు. నగరం కొత్త ఏర్పాట్లు జరుగుతున్నాయి. రోడ్లు వెడల్పు అవుతున్నాయి. గొందుల్లో రాళ్ళు పరుస్తున్నారు. మురికి కాలువలు శుభ్రం చేయబడుతున్నాయి. చూస్తూ చూస్తుండగానే లక్నో మారిపోయింది.
మూడు, నాలుగు నెలలు ఖానమ్ ఇంట్లో ఉన్నాను. తరవాత వేరు ఇల్లు తీసుకున్నాను. కాలంతో పాటు ఖానమ్ మారింది. ఆమెలో ఒక రకపు నిర్లక్ష్యం వచ్చేసింది. ఆమె నుండి విడిపోయిన వేశ్యల సంగతి అలా ఉండగా ఆమె దగ్గర ఉన్నవారి విషయంలోనూ అట్టే పట్టించుకోవడం లేదు. రెండు , మూడు రోజులకు ఒకసారి వెళ్ళి సలామ్ చేసి వచ్చేదాన్ని. ఆ కాలంలోనే నవాబ్ మహమూదలీఖాన్ గారితో పరిచయం ఏర్పడింది. మొదలుమొదలు వచ్చి పోతుండేవారు. తరవాత కొలువుంచుకున్నారు. ఆ తరవాత కట్టుబాట్లో ఉంచాలనుకున్నారు. లక్నో లో ఉండి పాత పరిచయస్తులను వదులుకోవడం నాకు ఇష్టం లేకపోయింది. నవాబు స్వభావం చూసి కొలువు వదిలేస్తానన్నాను. నన్ను "నికా" కట్టుకున్నానని నవాబు గారు కోర్టులో కేసు పెట్టారు. వింత చిక్కుల్లో చిక్కుకున్నాను. కోర్టు ఖర్చులకు వేల రూపాయిలూ వదిలాయి. మొదటి కోర్టులో తీర్పు నావాబు పక్షం అయింది. దాగి ఉండాల్సి వచ్చింది. చాల కాలం చాటుమాటుగా తిరిగాను. వకీలు ద్వారా అప్పీలు చేశాను. అప్పీలులో నవాబుగారు ఓడిపోయాడు. హైకోర్టుకు అప్పీలు చేశారు. అక్కడా ఓడిపోయారు. అప్పుడు చంపుతాననీ, చీరుతాననీ , ముక్కు కోస్తాననీ బెదిరింపులు సాగించారు. పది, పన్నెండు మంది దుడ్డు కర్రలవాళ్ళను కొలువు పెట్టుకోవాల్సి వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా వెంట మనుషులు. ప్రాణం కొసకు వచ్చింది. క్రిమినల్ కోర్టులో కేసు పెట్టాను. నవాబు దౌర్జన్యాన్ని గురించి సాక్ష్యులతో రుజువు చేయించాను. కోర్టువారు నవాబు గారిని ధరావత్తు కోరారు. అప్పుడు విముక్తి కలిగింది. ఆరు సంవత్సరాలు కేసుల్లో తిరిగాడు. ఆ పీడ అల్లా అనుగ్రహం వల్ల విరగడైంది.
కేసు నడుస్తూ ఉండిన రోజులలో అక్బరలీఖాను నా తరపు పైరో కారు. ఇతరుల పక్షాన పనిచేయడం వారి వృత్తి. ఆపదలు తెచ్చి పెట్టడంలో మొనగాడు. కోర్టులో పనులలో నిపుణుడు. మోసగించడంలో పండితుడు. బూటకపు కేసులు బనాయించడంలో మేటి. కోర్టులో తప్పుడు సాక్ష్యాలు ఇప్పించడంలో ఘనుడు. కోర్టు పనులలో నాకు వారి వల్ల చాల సహాయం లభించింది. అతను లేకుంటే నవాబు నన్ను ముంచేవాడు. నవాబు నన్ను నికా కట్టుకోలేదనేది వాస్తవం అయినప్పటికీ, కోర్టులలో నిజమైన విషయాలకు గూడ అబద్దపు సాక్ష్యం సృష్టించాల్సి ఉంటుంది. వేసింది వట్టి బూటకపు కేసు. అయినా అబద్దపు కేసనుకోవాదానికి ఏమాత్రం అవకాశం లేకుండా తయారుచేయబడింది. నికాను రుజువుపరచడానికి ఇద్దరు మౌల్వీలు సాక్ష్యం ఇచ్చారు. వారి నొసట నమాజు మచ్చలు, తలలకు మౌల్వీల కుళ్ళాలు, చేతులలో జపమాలలు , మాటకు అల్లా స్మరణ కోర్టువారు శంకించడానికి ఏమాత్రం వీలులేదు. వారిలో ఒకరు నికా చదివించినవారు. రెండవవారు నికాకు సాక్షులు. కాని నిజం నిజమే. క్రాసు పరీక్షలో తేలిపోయింది. వీరి సాక్ష్యంతోనే అప్పీలులో ఓడిపోయారు నవాబు. క్రిమినల్ కేసు సాక్ష్యులంతా అక్భరలీఖాను తయారు చేసినవారు. ఎక్కడా తప్పలేదు.
అక్బరలీఖాను నా దగ్గరికి చాల కాలం వరకు వచ్చి పోతుండేవారు. వారి స్నేహం నిస్వార్ధం అయింది. నా దగ్గరి నుంచి ఒక దమ్మిడి తీసుకోలేదు. వారి డబ్బే చాల కర్చైంది. వారికి నామీద ఒక రకపు ప్రేమ ఉండేది. నా అనుభవం ఏమంటే, చెడ్డవారు అచ్చం చెడ్డవారు కారు. ఎవరికో ఒకరికి మంచివారుగా ఉంటారు. పూర్వకాలపు దొంగల విషయం మీరు వినే ఉంటారు. స్నేహం చేస్తే స్నేహానికి కట్టుబడి ఉండేవారు. మంచిది అనేది లేని జీవితం ఉండడం దుర్లభం. అందరికీ చెడు అయినవాడు సహితం ఎవరినో ఒకరిని తన వారిని చేసుకుంటాడు. కేసు నడుస్తున్నంతకాలం నవాబు ఏ కొత్త వ్యక్తినీ రానివ్వలేదు. ఆ వచ్చేవాడు కూపీ తీయడానికి వచ్చినవాడు కావచ్చు. లేక నాకు నష్టం కలిగించినా కలిగించవచ్చు. అక్భరలీఖాను కోర్టు నుంచి ఇక్కడికే వచ్చేవారు. నమాజు ఇక్కడే చేసేవాడు. ఇంటి నుంచి భోజనం వచ్చేది. ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవాల్సిన అవసరం ఏమని ఎన్నో సార్లు అన్నాను. వారు వినలేదు. చివరకు విసిగి ఊరుకున్నాను. మా ఇంటి భోజనం నిషిద్దామని కాదు. నేనూ వారితోనే భోజనం చేసేదాన్ని. ఆ కాలం లోనే నియమంగా నమాజు చేయడం నేర్చుకున్నాను. అర్బరలీఖానుకు దానధర్మలంటే ఎంతో ఇష్టం. రామ్జాన్, మొహర్రం నెలలలో ఎన్నో సత్కార్యాలు చేసేవారు. సంవత్సరం పొడుగునా చేసినా పాపాలు కడుక్కునేవారు. అది తప్పో ఒప్పో గాని వారి విశ్వాసం అది.
రుస్వా : ఇది ధర్మానికి సంబంధించిన విషయం. కాబట్టి నేననేదే మంటే అలాంటి విశ్వాసం తప్పు.
ఉమ్రావ్ : నా నమ్మకమూ అదే.
రుస్వా : బుద్దిమందుతులు రెండు రకాల పాపాలు చేస్తారు. ఒకటి తమకు హాని కలిగించేది. రెండవది ఇతరులకు హాని కలిగించేది. నా అభిప్రాయం ప్రకారం మొదటిది స్వల్పమైంది. రెండవది ఘోరమైంది. రెండవదాన్ని నష్టపడినవారు మాత్రమే క్షమించగలరు. మీరు భాజా హాపిజ్ పద్యం వినలేదా ?
మైఖుద్ ముసహఫ్ బసోజ్ ఆతిష్ అందర్ కాబజన్
సాకిన్ బుత్ ఖానా బాష్ వ మర్ధుమ్ అజారీ మకున్
త్రాగు మధువు, కాల్చు ఖురాను
కూల్చు మక్కాను, పూజించు ప్రతిమల
హింసించకు మనిషిని మాత్రం!
ఉమ్రావ్ జాన్! మనిషిని హింసించడం మహాపాతకం . దానికి పరిహాసం లేదు. అది ఉంటే దైవం ఉండీ లేనట్లే లెక్క.





