Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6


 

    ఫైజాబాదు లో ఆరు నెలలు గడిచాయి. అక్కడి వాతావరణం అనుకూలంగా ఉంది. వారానికో, పది రోజులకో కచేరి కూడా వచ్చేది. ఊరంతా నా పాటలతో మోగిపోయింది. కచేరీ జరిగి చోటనల్లా వేలమంది విరుచుకు పడ్డారు. పొగడ్తలూనా గదిలో దాకా వినిపించాయి. లోలోపల సంతోషపడేదాన్ని. అప్పుడప్పుడు బాల్యం గుర్తుకువచ్చేది. ఉద్రేకం కలిగేది. రాజ్యపతనం, పితూరీ, బర్ జిస్ ఖదర్ అన్నీ చిత్రపటాల్లా కళ్ళముందు కనిపించేవి. గుండె బండ వారింది. తలిదండ్రులు జ్ఞాపకం రాగానే అసలు జీవించి ఉన్నారో, లేదో అనే ఆలోచన వచ్చేది. ఉన్నా, వారికీ నాతోనేం పని? వారి స్థితి వేరు, నా స్థితి వేరు. కన్నవారని మనసు లాగుతుంది గాని మానమర్యాదలున్నవాడు ఎవడొస్తాడు. ఈ చోటికి? ఈ స్థితిలో వారిని కలుసుకోవడం వారిని దుఃఖంలో ముంచడమే అవుతుంది. ఇంటి ధ్యాస వచ్చేవరకు ఈ ఆలోచలన్నీ వస్తాయి. మనసు మళ్ళించుకుంటాను.
    తరచుగా లక్నో గుర్తుకు వచ్చేది. బాధ కలిగేది. కాని విప్లవాన్ని గురించి తలచుకుంటే గుబులు పుట్టేది. అక్కడ మాత్రం ఎవరున్నారు? ఎవరి కోసం వెళ్ళేది? ఖానమ్ బ్రతికి ఉంటె మాత్రమేం? ఆవిడతో ఇప్పుడెం పోసగుతుంది? పూర్వంలా ప్రభుత్వం చలాయిస్తుంది. ఆవిడ కట్టు బాట్లలో ఉండడం నాకు ఇష్టం లేదు. మీర్ గారి చెల్లెలు దగ్గరున్న సొమ్ము ఇంకేం దొరుకుతుంది? మొత్తం లక్నో దోచుకోబడింది. మీర్ గారి ఇల్లు కూడా గుల్ల అయి ఉంటుంది. కాలేదనుకున్నా వానీతోనేం పని? ఇక ఆ ఆలోచనే వృధా. నా వంటి మీద ఉన్నది చాలు!
    ఒకరోజు గదిలో కూర్చొని ఉన్నాను. ఒక వ్యక్తీ వచ్చాడు. ముఖాన్ని బట్టి ఉత్తముడుగా కనిపించాడు. నడీడు మనిషి, తాంబూలం సిద్దం చేసి ఇచ్చాను. హుక్కా నింపించాను. మాటల సందర్భాన బహుబేగమ్ బంధువులలోని వారని తెలిసింది. బహుబేగమ సమాధి వద్ద జరిగే దీపోత్సవాన్ని గురించి ప్రస్తావించి పాత ఉద్యోగులను గురించి అడిగాను.
    నేను : పాత పనివారిలో ఇప్పుడు ఎవరేవరున్నారు?
    అతను : కొందరు చనిపోయారు. కొత్తవాళ్ళు వచ్చారు. పద్దతులు మారాయి. క్రొత్త ఏర్పాట్లు జరిగాయి.
    నేను : పాతవారిలో ఒక ముసలి జమేదార్ ఉండేవారు.
    అతను : అవును, ఉండేవాడు. అతను మీకెలా తెలుసు?
    నేను : విప్లవానికి ముందు మొహర్రం లో ఫైజాబాదు వచ్చాను. దీపోత్సవం చూడ్డానికి వెళ్ళాను. అతడు చాల మర్యాద చేశాడు.
    అతను : ఎవరు? కూతురు తప్పిపోయిన జమేదారేనా?
    నేను : నాకేం తెలుసు ? (కధ అందరికి తెలుసునన్నమాట)
    అతను : చాలామంది జమేదార్లు ఉండేవారు. ఉన్నారు. విప్లవానికి పూర్వం దీపాల ఏర్పాటు వగైరా అతనే చూచేవాడు.
    నేను : వారికి ఒక కొడుకు కూడా ఉండాలే?
    అతను : అతడెక్కడ కనిపించాడు.
    నేను : అదే రోజు పోలికలను బట్టి అనుకున్నాను.
    అతను : జమేదార్ విప్లవానికి ముందు చనిపోయాడు. అతని స్థానంలో కొడుకు పని చేస్తున్నాడు.
    ఆ మాట తప్పించడానికి ఇంకేవో విషయాలు అడిగాను. నవాబు గారు విషాద గీతం పాడమన్నారు. రెండు వినిపించాను. ప్రభావితులయారు. అప్పటికి చాల రాత్రి అయింది. వెళ్ళిపోయారు.
    తండ్రి చనిపోయిన వార్త దుఃఖంలో ముంచింది. రాత్రంతా ఏడ్చాను. మరుసటి రోజు తమ్ముణ్ణి చూచి రావాలనిపించింది. రెండు రోజుల తరవాత ఒక కచేరీకి పిలుపు వచ్చింది. అక్కడికి వెళ్ళాను. వీధి పేరు గుర్తులేదు కాని ఇంటి ముందు పెద్ద చింతచెట్టు ఉంది. దాని క్రిందనే వేదిక కట్టి రంగస్థలం తయారు చేయాబడింది. జనం బాగా వచ్చారు. తెరల మరుగున దాబాల మీద స్త్రీలున్నారు. తొమ్మిది గంటలకు పాట మొదలైంది. పన్నెండు గంటల దాకా సాగింది. ఆ ప్రదేశాన్ని చూస్తె గుండె నీరు అవుతుంది. దుఃఖం ముంచు కు వస్తుంది. మా ఇల్లు ఇక్కడే ఉండాలి. ఈ చింత చెట్టు కిందనే నేను ఆదుకున్నది. అక్కడ కూడిన కొందరి ముఖాలు ఎప్పుడో చూచినట్లున్నాయి. బయటకు వెళ్ళి చూచాను. ఇళ్ళు అదొరకంగా కనిపించాయి. ఆ స్థలం కాదేమో అనుకున్నా . ఒక ఇంటిని జాగ్రత్తగా పరిశీలించాను. అది మా ఇల్లే. ఇంట్లోకి వెళ్లాలనిపించింది. అమ్మ కాళ్ళ మీద పడాలనుకున్నాను. ఆమె నన్ను కౌగలించుకుంటుంది. కాని ధైర్యం చాలలేదు. పల్లెల్లో బోగం వాళ్ళను ఏహ్యంగా చూస్తారు. తమ్ముని గౌరవం , మర్యాద మంట కలపడమా? నవాబు గారి మాటలను బట్టి జమేదారు కూతురు వెళ్ళిపోవడం అందరికీ తెలుసునని విదితం అయింది. ఖర్మ! ఒక్క గోడ మాత్రం అడ్డంగా ఉంది. గోడకు ఆవల మా అమ్మ ఇవతల తల్లి కోసం తపించే నేను. ఒక్క చూపు. అదీ సాధ్యపడదా? అబ్బ, విధి ఎంత బలీయమైంది!
    ఆలోచనలతో సతమతం అవుతుండగా ఒకావిడ వచ్చి "లక్నో నుంచి వచ్చింది నువ్వేనా?" అని అడిగింది.
    నేను : అవును. (నా ఎద అరచేతిలో గంతులు వేస్తుంది)
    ఆవిడ : అయితే ఇలా రా. ఎవరో పిలుస్తున్నారు.
    నేను : "మంచిది" అని ఆవిడను అనుసరించాను. అడుగులు బరువైనాయి. ఎక్కడో వేస్తె ఎక్కడో పడుతున్నాయి.
               ఇంట్లోకి తీసికెళ్ళింది. వరండాలో కూర్చో పెట్టింది. లోపలి గుమ్మానికి గొనె సంచి తెర ఉంది. దాని వెనక ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు నుంచొని ఉన్నారు.
    ఒకామె : లక్నో నుంచి వచ్చింది నువ్వేనా ?
    నేను : అవును.
    రెండవది : నీ పేరు?
    నేను : (చెప్పెయ్యమన్నది మనసు. కాని నిగ్రహించుకున్నాను) ఉమ్రావ్ జాన్.
    మొదటిది : పుట్టిల్లు లక్నోయేనా?
    నేను : (నిగ్రహించుకోలేకపోయాను. కన్నీరు జలజల రాలింది) "పుట్టిల్లు ఇక్కడే" అన్నాను.
    మొదటిది : అయితే బంగ్లాదానివా?
    నేను : (కన్నీరు కారుతూనే ఉంది) కష్టంగా "అవునండీ" అన్నాను.
    రెండవది : కులానికి బోగం దానివా?
    నేను : కులం కాదు. తలరాత ఇలా చేసింది.
    మొదటిది : (స్వయంగా ఏడుస్తూ) ఎందుకు ఏడుస్తున్నావు? నిజం చెప్పు. నువ్వెవరు?
    "నేను : (కన్నీరు తుడుచుకొని) "ఏవరినని చెప్పను? చెప్పరావడం లేదు" ఎంతో ప్రయత్నం మీద ఆమాత్ర్రం చెప్పాను. ఇక వశం కాలేదు. ఊపిరి ఆడడం లేదు.
    ఇంతలో ఆ ఇద్దరూ తెర లోంచి వచ్చినారు. ఒకావిడ చేతిలో దీపం ఉంది. ఆవిడ నా చెవి దగ్గర జాగ్రత్తగా చూచి రెండో ఆవిడను చూచి " నేను అనలేదూ" అదే అని" అన్నది.
    రెండో ఆవిడ "నా అమీరన్" అని కావిలించుకొని ఏడ్చింది. తల్లీ కూతుళ్ళం పెద్దగా ఏడ్చాం. ఎక్కిళ్ళు వచ్చాయి. ఇద్దరు స్త్రీలు వచ్చి విడదీశారు. తరవాత నా కధంతా చెప్పాను. అమ్మ విన్నది. ఏడ్చింది. ఆ రాత్రి అంతా అక్కడే కూర్చున్నాం. ఉదయం వచ్చేశాను. వచ్చేప్పటి తల్లి చూపు జీవితాంతం మరువలేను. మసక చీకట్లోనే నా గదికి వచ్చేశాను. తెల్లవారి కచేరి. కాని మొత్తం డబ్బు వాపసు ఇచ్చేశాను. శరీరం బావుందలేదని బొంకాను. వరుని తండ్రి సగం డబ్బు మళ్ళీ నాకు పంపించాడు. ఆనాటి నా స్థితి అల్లాకే తెలియాలి. తలుపులు వేసుకొని రోజంతా ఏడ్చాను.
    రెండవరోజు సుమారు గడియ రాత్రికి ఒక యువకుడు వచ్చాడు. చామనచాయ సుమారు ఇరవై. ఇరవైరెండేళ్ళవాడు. సిపాయిల దుస్తుల్లో ఉన్నాడు. హుక్కా నింపించాను. పాన్ దాన్ లో అకుల్లేవు. దాసీదాన్ని పిలిచి చెవిలో ఆకులు తెమ్మని చెప్పి పంపాను. గదిలో అదృష్టవశాత్తూ మరెవరూ లేరు. నేను, ఆ యువకుడు మాత్రం ఉన్నాం.
    యువకుడు : "నిన్న కచేరీకి వెళ్ళింది నువ్వేనా ?" తీవ్రంగా అడిగాడు.
    నేను : (వణికిపోయి) "అవును" అని ముఖం చూచాను. కళ్ళు  రక్తం కక్కుతున్నాయి.
    యువకుడు : (తల వంచుకొని) ఇంటి పేరు బాగా వెలిగిస్తున్నావు. నువ్వు చచ్చి పోయావనుకున్నాము. ఇంకా బ్రతికే ఉన్నావా?
    నేను : దౌర్భాగ్యురాలివి. చావలేదు. అల్లా! త్వరగా తీసుకెళ్ళు.
    యువకుడు : ఈ బ్రతుకు కంటే చావే లక్ష పాళ్ళు నయం. ఎందులో నన్నాపడి చావరాదూ? ఇంత విషం తింటే పోయేదిగా?
    నేను : నాకేమో అంత తెలివి లేదు. ఇవ్వాళటి వరకు ఇలాంటి మంచి సలహా ఇచ్చిన వాడూ కనిపించలేదు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.