Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    సగరుడు పుత్రవంతుడయ్యు, పుత్రులు లేనివాడు అయినందులకు మిక్కిలి దుఃఖించినాడు. భార్యలను ఓదార్చినాడు. మిగిలిపోయిన అశ్వమేధము పూర్తిచేయదలచినాడు. అసమంజసుని పుత్రుడు అంశుమంతుని పిలిచినాడు అన్నాడు:-
    "అంశుమంతా! నీతండ్రి దుర్మార్గుడు అగుటవలన అతనిని చంపించినాను. నీపెద తండ్రులు అరువదివేలమంది కపిల మహాముని కోపాగ్నికి ఆహుతి అయినారు. ఇప్పుడు ఈవంశమునకు నీవు ఒక్కడవే అంకురమవు. నీవు నా యజ్ఞాశ్వమును తెచ్చిఇచ్చి నా అశ్వమేధము పూర్తి అగుటకు తోడ్పడుము".
    అంశుమంతుడు పితామహుని మాటలు విన్నాడు. సగరునకు నమస్కరించినాడు. బయలుదేరినాడు. అతడు సగరపుత్రులు వెళ్లిన మార్గమున వెళ్లినాడు. సముద్రములోనుంచి వెళ్లగా కపిల మహాముని కనిపించినాడు.
    అంశుమంతుడు కపిలుని దర్శించినాడు. అతనికి నమస్కరించి, ఆదరించి పూజించినాడు. తాను వచ్చిన కార్యము తెలియపరచినాడు. కపిలుడు సంతసించినాడు. యజ్ఞాశ్వమును అంశుమంతునకు ఇచ్చినాడు.
    "మహర్షీ! నా తండ్రులు భస్మరాసులయి ఇచట పడి ఉన్నారు. వారికి పుణ్యగతులు కలుగు మార్గము చూపుడు" అని విన్నవించినాడు అంశుమంతుడు.
    "అంశుమంతా! దేవగంగను దివి నుంచి భువికి దించి ఈ భస్మరాసులను తడిపినచో నీ తండ్రులకు పుణ్యగతులు కలుగును. అగస్త్యుని వలన ఎండిన సముద్రము నిండును".
    "మహాత్మా! ఇది నరులకు సాధ్యమగు పనియేనా?"
    "అంశుమంతా! ప్రయత్నము వలన నరులు సాధించలేనిది లేదు. నీకు కలుగబోవు మనుమడు భగీరథుడు గంగను నేలకు దింపనున్నాడు. నీ పితరులకు పుణ్యగతులు కల్పించనున్నాడు. నీవు యజ్ఞాశ్వమును గొనిపొమ్ము" అని కపిల మహర్షి ఆశీర్వదించినాడు. అంశుమంతుడు యాగాశ్వమును తీసుకొని సగరుని వద్దకు వెళ్లినాడు. జరిగిన కథ చెప్పినాడు. సగరుడు పుత్రశోకమును దిగమింగి అశ్వమేధము చేసినాడు. అశ్వమేధము విజయవంతముగా ముగిసినది. సగరుడు సముద్రమును తన పుత్రునిగా భావించినాడు. అందువలన సముద్రమునకు "సాగరము" అను పేరు వచ్చినది.
    సగరుడు బహుకాలము రాజ్యము చేసినాడు. తదుపరి అంశుమంతునకు పట్టము కట్టి, తపోవనమునకు వెళ్లినాడు. అంశుమంతునకు దిలీపుడు అను పుత్రుడు కలిగినాడు. అంశుమంతుడు సగరుని వలె బహుకాలము రాజ్యము చేసినాడు. అనంతరము దిలీపునకు పట్టముకట్టి తపోవనమునకు వెళ్లినాడు.
    దిలీపుడు తన తాతలకు పుణ్యగతులు కలిగించవలెనని ఆలోచించినాడు. దేవగంగను దించుటకు యత్నించినాడు. కాని అతని ప్రయత్నము ఫలించలేదు. దిలీపునకు భగీరథుడు అను పుత్రుడు కలిగినాడు. దిలీపుడు రాజ్యమును భగీరథునకు పట్టము కట్టినాడు. దిలీపుడు తపోవనమునకు వెళ్లినాడు.
    భగీరథుడు యుద్ధవీరుడు. మహాతేజోవంతుడు. మహాకీర్తిమంతుడు. అతడు తన ముత్తాతలకు పుణ్యగతులు కలిగించదలిచినాడు. అందుకుగాను తపస్సు చేయుటకు హిమవత్పర్వతమునకు వెళ్లినాడు.
    హిమవంతమున అనేక ధాతువులుగల శిఖరములు ఉండును. తెల్లని మంచు కొండపై నల్లని మబ్బులు దోబూచులాడును. అచట రత్నముయములయిన చరియలుండును. వానిపై గంధర్వులు, దేవతలు, స్త్రీ, పురుషులు విహరించుచుందురు. సింహ, శరభ, శార్దూలములు విహరించుచుండును. హిమవంతము మనోహరముగను, భయంకరముగను ఉండును.
    అటువంటి హిమవంతమున భగీరథుడు ఉగ్రముగా తపస్సు చేసినాడు. అతను గంగను గూర్చి తపస్సు చేసినాడు. ఘోరముగా తపస్సు చేసినాడు. భగీరథుని తపమునకు మెచ్చినది గంగాదేవి. ప్రత్యక్షమయినది.
    భగీరథుడు గంగను చూచినాడు. ఆనందమున మునకలు వేసినాడు. తబ్బిబ్బయినాడు. చేతులు దోయిలించి ఆమెకు నమస్కరించినాడు. స్తుతించినాడు. విన్నవించినాడు:-
    "అమ్మా! గంగమ్మా! నాముత్తాతలు కపిల మహర్షి కోపాగ్నికి బూడిద అయినారు. వారికి పుణ్యగతులు కలిగించుటకు నీవు భూలోకమునకు దిగి రావలెను. ఇదియే నా కోరిక. నా ఈ కోరిక నీవు తీర్చవలెను" గంగాదేవి భగీరథుని కోరికకు సంతసించినది. "బిడ్డా! భగీరథా! నేను నీ కోరిక మన్నింతును. కాని నేను దివినుండి భువికి దిగునపుడు నా జల ప్రవాహవేగమును భరించుటకు మహాశివుడు మాత్రము సమర్థుడు. నన్ను ధరించుటకు, భరించుటకు శివుని అనుగ్రహము పొందుము" అని చెప్పి వెళ్లిపోయినది.
    భగీరథుడు గంగాదేవి మాటలు విన్నాడు. కైలాస పర్వతమునకు వెళ్లినాడు. కఠోరమయిన నియమములతో ఘోరమయిన తపము చేసినాడు. శివుడు భగీరథుని తపమునకు మెచ్చినాడు. ప్రత్యక్షమయినాడు. దేవగంగను ధరించుటకు అంగీకరించినాడు. గంగను రప్పించమన్నాడు వెళ్లినాడు.
    భగీరథుడు గంగాదేవిని గూర్చి మరల తపము చేసినాడు. గంగ ప్రత్యక్షమయినది. ఆకసము నుండి నేలకు దిగి వచ్చుటకు అంగీకరించినది.
    గంగ దివి నుండి భువికి దిగి రాసాగినది. ఆమె వయ్యారముగ దిగి వచ్చినది. వంపులతో దిగి వచ్చినది. సొంపులతో దిగి వచ్చినది. జలధారలతో దిగి వచ్చినది. జల పాతములతో దిగివచ్చినది.
    గంగ నేలకు రాసాగినది. నరుల కొఱకు రాసాగినది. గంగ దిగిరాగా ఆకాశ మార్గమంతయు అందములు అలముకొన్నవి. పంచ మహాభూతములు సౌందర్యమున తేజరిల్లినవి.
    మహావేగమున వచ్చుచున్న గంగను శివుడు జటాజూటమున ధరించినాడు. శివుని జటాజూటమున కమలములు వికసించినట్లుండెను. అది దిగంత రమణీయము, అది అనంత సౌందర్యము.
    దానిని దర్శించుటకు దేవతలు వచ్చినారు మునులు వచ్చినారు, సిద్ధులు వచ్చినారు, సాధ్యులు వచ్చినారు శివునకు ప్రణమిల్లినారు. శివుని స్తుతించినారు.
    వారందరు దర్శించుచుండగా గంగమ్మ తల్లి భూమి మీదకు వచ్చినది. ఆమె హిమవన్నగములు దాటి, మైదానమున ప్రవహించి సముద్రుని కలిసినది. గంగాదేవి తన భర్త సముద్రుని కలసినది.
    గంగ హంసవలె ఆకసము నుండి దిగివచ్చినది. నురుగు ఆమె దరహాసము, చేపలు ఆమె చూపులు, గలగలలు ఆమె పలుకులు.
    గంగానది భార్య, సముద్రుడు పురుషుడు. ఆమె ఆరాటముగా, ఆతురతగా వచ్చినది. తన పురుషునిలో ఒదిగిపోయినది.
    ఇదొక మహా సంగమము.
    ఈసంగమమున సగరపుత్రులు పునీతులు అయినారు. వారికి పుణ్యగతులు కలిగినవి.
    భగీరథుడు కృతార్థుడు అయినాడు.
    భగీరథుని పవిత్ర కథను రోమశుడు ధర్మరాజునకు వినిపించినాడు. ధర్మరాజు భగీరథుని పుణ్యకథను విన్నాడు. తమ్ములు, ద్రౌపది సహితముగా నంద, ఉపనంద నదులందు స్నానము చేసినాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.