Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6


 

    ఉన్మత్తారణ్య మధ్యంలో
    దారితప్పెను ఈ హృదయం    
    వెదకి తెచ్చారు ఆత్మీయులు
    తగిలించారు జీవితబంధాలు.
    
                                  17
    భయదమైన పెనుగాలులు వీచి
    భగ్గు భగ్గుమని మండే బ్రతుకు దివ్వె
    వ్యదార్తి హృదయ మాక్రోశించే
    దిగంతాల నాక్రమించే అక్రందన!
    నవాబ్ మలికా- ఏ - కిషోర్ దర్బారులో శోకగీతాలాపం రాజ్యం అంతరించేవరకు కొనసాగింది. ఆరోజుల్లో షహజూదే సికిందర్ హస్మత్ ఉరఫ్ జర్నీల్ సాహబ్ పాటకత్తేల్లో నాపేరూ ఉండేది. మహాప్రభువు జర్నీల్ గారు కలకత్తా వెళ్ళిపోయారు. ఆ బంధం తెగిపోయింది.
    పితూరీ సైనికులు మిర్జా బర్ జిస్ ఖదర్ ను గద్దె ఎక్కించినపుడు అభినందన సమర్పనకు నన్ను పిలిపించారు . నగరం అంధకార బంధురంగా ఉంది. ఇదిగో ఈ ఇంట్లో దోపిడీ. తెల్లవారి దొంగ పట్టు బడ్డాడు. మూడరోజు వాణ్ణి కాల్చేశారు. ఇవే వార్తలు. అంతా కల్లోలం. అంతా అయోమయం. సయ్యద్ ఖుత్బుద్దీన్ అనే సైనికాధికారి ఉండేవారు. రాజభవన రక్షణకార్యం వారికీ అప్పగించబడింది. వారికి నేనంటే ఎంతో దయ. చాలావరకు అక్కడే ఉండాల్సి వచ్చేది. పాట కోసం కూడా సమయా సమయాలల్లో పిలుపు వచ్చేది.
    ఆ రోజు ప్రభుత్వహయాములో బర్ జిస్ ఖదర్ పదకొండవ జన్మదినోత్సవం అతి వైభవంగా జరిగింది. ఆ సందర్భంలో కాశ్మీరీయులు ఈ గజల్ పాడారు :
    ఓయి విభుడ! చంద్రుడ నీవు    
    అలభ్యరత్న మీవు! నెవెగదోయి!
    అసందర్బానికి గాను నేనొక గజల్ రచించాను. దాని అదిచరణాలు ఇచి :
    నీ చూపులు వేల ప్రాణాలు హరిస్తాయి
    కరుణించావా వేల ప్రాణాలు లేచి వస్తాయి
    రుస్వా : అది చరణాలే అందరినీ అంతమొందించెట్లున్నాయి.....
    ఉమ్రావ్ : పదకొండు ద్విపదులు చెప్పాను. ఈ అదిచరణాలు తప్ప గుర్తులేవు. అలాంటి కల్లోలపు రోజులవి. గుండె మీద కుంపటిగా ఉండేది. గజల్ కాగితం మీద వ్రాసి పాన్ దానులో పెట్టాను. బేగమ్ గారు "ఖైసర్ బాగ్" నుంచి వెళ్ళి పోయేదాకా అందులోనే ఉంది. పారిపోయే హడావుడిలో పొందనే కాదు చెప్పులు, మేలి ముసుగు కూడా పోయాయి.
    రుస్వా : బేగమ్ గారు ఖైసర్ బాగ్ నుంచి వెళ్ళిపోయింది ఏరోజో గుర్తుందా?
    ఉమ్రావ్ : రోజు గుర్తు లేదు. హజారీ రోజో, రెండో రోజో కావచ్చు.
    రుస్వా : బాగా గుర్తుంచుకున్నారు. రజ్జబ్ నెల ఇరవై తొమ్మిదా? ఋతువేది?
    ఉమ్రావ్ : చలికాలపు చివరి రోజులు, నౌరోజ్ అప్పటికి నాలుగైదు రోజులు ఉండి ఉంటుంది.
    రుస్వా : ఖచ్చితంగా చెప్పారు. మర్చి నెల పదహారువ తేదీ. అచ్చా , మీరు బేగమ్ గారితోనే ఖైసర్ బాగ్ వదిలి వెళ్ళిపోయారా?
    ఉమ్రావ్ : (కధంతా తిరిగి చెప్పాల్సి వచ్చింది) ఫైజాతో లేచిపోయిన రోజు నగలు, ఆష్రఫీలు అన్నీ ఒక పెట్టెలో పెట్టి దాని చుట్టూ ఒక గుడ్డ చుట్టాను.
    ఖానమ్ ఇంటి వెనక ఒక మీర్ సాహాబ్ ఉండేవాడు. ఇమామ్ బాడా ప్రహరీ ఎక్కితే వారి ఇల్లు కనిపిస్తుంది. నేను తరచు పీట వేసుకుని గోడ మీది నుంచి మీర్ గారి చెల్లెలితో మాట్లాడేదాన్ని. ఆ నగల పెట్టె మీర్ గారి చెల్లిలికి ఇచ్చి జాగ్రత్తగా కాపాడవలసిందని చేతులు జోడించి ప్రార్ధించాను. ఆమె ఫైజాబాదు నుంచి వచ్చిన తరవాత గుడ్డ చుట్టిన ఆ పెట్టె యధాతధంగా అప్పగించింది. పితూరీ లో దేశంలో ఇండ్లన్నీ దోచుకొనబడినాయి. దోపిడిలో పోయిందంటే ఏం చేసేదాన్ని? ఆమె నిజాయితీకి మొక్కాలి. ఒక్క దమ్మిడీ నష్టం కాలేదు. అలాంటి వారు ఉండబట్టే కాలం అవుతుంది. కాకుంటే ఎప్పుడో ప్రళయం రావలసింది.
    రుస్వా : ఎంత సొమ్ము ఉండి ఉంటుంది?
    ఉమ్రావ్ : పది, పదిహేను వేలవరకు.
    రుస్వా : అదంతా ఏమందిప్పుడూ?
    ఉమ్రావ్ : కావడానికే ముంది? వచ్చిన దోవనే పోయింది.
    రుస్వా : పితురీలో మీది ఒక్క దమ్మిడీ పోలేదనీ , మీ సొమ్మంతా మీ దగ్గరే భద్రంగా ఉందనీ చెప్పుకుంటున్నారే జనం.
    ఉమ్రావ్ : ఆ సొమ్మే ఉంటే ఈ గతెందుకు?
    రుస్వా : మీరు పాతర తీశారని, చెప్పుకుంటున్నారు. కాకుంటే రోజులు ఎలా గడుస్తాయి? ఇప్పటికీ మీరంత దిగజారలేదే? ఇద్దరు నౌకరులున్నారు. మంచి బట్టలు. మంచి భోజనం. ఎలా వస్తాయి ఇవన్నీ?
    ఉమ్రావ్ : భగవంతుడున్నాడు. ఎవరికి ఎంత కావాలో అంత ఇస్తాడు. ఆ సొమ్ములో ఒక్క దమ్మిడీ మిగల్లేదు.
    రుస్వా : అయితే ఏమైనట్లు?
    ఉమ్రావ్ : ఏం చెప్పను? ఒక మహానుభావుడు.....
    రుస్వా : అర్ధమైంది. గోహర్ మిర్జా గారి పని అయి ఉండాలి.
    ఉమ్రావ్ : నా నోటితో చెప్పను. మీ ఊహ తప్పు కూడా కావచ్చు.
    రుస్వా : అది తమ ఔదార్యం. చూడండీ. అతడెంత హాయిగా ఉన్నాడో, మీ విషయం తలచనైనా తలచడు.
    ఉమ్రావ్ : మిర్జాగారూ ! బోగందానితో చెలిమి ఎంతకాలం? ఎందుకు తలచాలి? బంధం తెగి చాలాకాలం అయింది.
    రుస్వా : వస్తుంటారా ఎప్పుడైనా?
    ఉమ్రావ్ : వారెందుకు విచ్చేస్తారు? పెళ్ళాం మీద ప్రేమ కలిగింది. నేనే వెళ్తుంటాను. నాలుగు రోజుల క్రితం వెళ్ళాను. పాపకు పాలు మాన్పిస్తున్నామని పిలిచారు.
    రుస్వా : ఏదైనా ఇచ్చి వచ్చారా?
    ఉమ్రావ్ : లేదు. ఇవ్వలేదు. ఒకరికి ఇచ్చేంత అర్హతా?
    రుస్వా : అయితే ఆ సొమ్ము గోహర్ మిర్జా సాహబ్ కాజేశారు?
    ఉమ్రావ్ : మిర్జా సాహెబ్! సొమ్ము శాశ్వతమా? అది అరచేతి మట్టి. మాట నిలిచిపోతుంది. ఇప్పటికీ అల్లా దయ వల్ల పస్తులుండడం లేదు. ఆదరించే తమలాంటి వారు క్షేమంగా ఉంటే చాలు. ఎలాంటి ఇబ్బంది ఉండదు.
    రుస్వా : అది చెప్పాలా? ఇప్పటికీ వేల మంది కంటే బాగున్నారు. మీ శీలాన్ని మెచ్చుకోవాలి. భగవంతుడు తీర్ధయాత్రలు సైతం అనుగ్రహించాడు.
    ఉమ్రావ్ : చిత్తం. మౌలా అన్ని కోర్కెలు తీర్చాడు. మిగిలిన కోరికల్లా మళ్ళీ కర్బలాకు పిలుచు'కొమ్మని . అక్కడే మట్టి అయిపోతాను. మిర్జా గారూ!తిరిగి రాగూడదనే వెళ్ళను. కాని భగవంతుడు లక్నో పిచ్చి పట్టించాడు. ఈ తడవ దేవుని దయ వల్ల వెళ్ళడం సంభవిస్తే తిరిగి రావడం కల్ల.
    
                                 18


        వినిపించితి నా సర్వనాశననగాధ!
        వింటిది, ఇంక వినదలతురా మీరు?
        ఇంకా  నిందేమి మిగిలెను మజా?
    బొండీ నుంచి బేగమ్ గారూ బర్ జస్ ఖదర్ నేపాల్ వెళ్ళిపోయారు. సయ్యద్ ఖుత్భుద్దీన్ యుద్దంలో కూలాడు. నేనూ ఫైజాబాదు చేరాను. ముందు సత్రంలో దిగాను. తరవాత గది అద్దెకు తీసుకున్నాను. గానా బజానా ప్రారంభించాను.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.