Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



                 సమహం ప్రజయా సం మయాప్రజా |
        సమహగం రాయస్వోషేణ సం మయా రాయస్వోషః ||

                                       మూడవ ప్రపాఠకము

                                             మొదటి అనువాకము

    1. ఇష్టకా! నిన్ను జల ప్రవాహమున చేర్చుచున్నాను. అలల జలములందు చేర్చుచున్నాను. జలముల ప్రకాశములందు చేర్చుచున్నాను. జలముల నిర్మలత్వమున చేర్చుచున్నాను. జలములుగల నదులందును, కూపములందును చేర్చుచున్నాను.

    2. ఇష్టకా! నీవు అర్ణవముల వంటి తటాకములందు వసించుము. సముద్రములందు వసించుము. సామాన్య జలములందు వసింపుము. క్షీణించు జలములందు వసించుము. జలములుగల వడగండ్లయందు వసించుము.

    3. ఇష్టకా! నిన్ను ఉదక స్థానములందు చేర్చుచున్నాను. ఉదక సంబంధి మేఘములందు చేర్చుచున్నాను. ఉదక సంబంధ సైకతమున చేర్చుచున్నాను. ఉదక హేతువగు అగ్ని యందు చేర్చుచున్నాను. ఉదక స్థానమగు సముద్రమున చేర్చుచున్నాను.

    4. ఇష్టకా! నీవు గాయత్రీ ఛందోరూపము అగుచున్నావు. త్రిష్టుప్ ఛందోరూపము అగుచున్నావు. జగతీ ఛందోరూపము అగుచున్నావు. అనుష్టుప్ ఛందోరూపము అగుచున్నావు. పంక్తి ఛందో రూపము అగుచున్నావు.

                                            రెండవ అనువాకము

    1. తూర్పున ఉన్న ప్రజాపతి ప్రాణము భౌవాయన శబ్ద వాచ్యమగును.

    వసంతర్తువు ప్రాణాయనము. గాయత్రీ ఛందస్సు వసంత సంబంధి.ఛందోరూప గాయత్రి 'గాయత్రమ్' అనబడును. ఉపాంశు గ్రహము గాయత్రి నుండి పుట్టినట్లగును.

    త్రివృత్ స్తోమము ఉపాంశు గ్రహము నుండి ఉత్పన్నమైనట్లగును. రథంతర సామము త్రివృత్ స్తోమము నుండి ఉత్పన్నమైనట్లగును. వసిష్ఠఋషి రథంతర సామము నుండి ఆవిర్భవించినట్లగును.

    ఇష్టకా! నీవు ప్రజాపతిచే గ్రహించబడినదానవు. ప్రజలప్రాణముల కొరకు నిన్ను అందుకొనుచున్నాను.

    2. దక్షిణ దిశన ఉన్న విశ్వకర్మ మనసు వైశ్వ కర్మణము అగును.

    గ్రీష్మము విశ్వ కర్మ మానస సంబంధి. త్రిష్టుప్ గ్రీష్మ సంబంధి అగుచున్నది. ఐడసామము త్రిష్టుప్ సంబంధి. ఇడ సామము నుండి అంతర్యామగ్రహము పుట్టినట్లైనది.

    అంతర్యామగ్రహము నుండి పంచదశ స్తోమము ఉత్పన్నమైనట్లు అయినది. పంచ దశ స్తోమము నుండి బృహత్ సామము ఉత్పన్నమైన్నట్లు అయినది. 'బృహత్ సామము నుండి భరద్వాజ ఋషి ఆవిర్భవించినట్లయినది.

    ఇష్టకా! నీవు ప్రజాపతిచే గ్రహించబడిన దానవు. ప్రజల మనస్సుల కొరకు నిన్ను అందుకొనుచున్నాను.

    3. ఇష్టకా! నీవు పశ్చిమ దిశన గల ప్రజాపతి స్వరూపము అగుచున్నావు. ఆ ప్రజాపతియగు విశ్వవచసుని నేత్రము 'వైశ్వవచసమ్'అయినది.

    వర్షర్తువులు విశ్వవచస నేత్ర సంబంధులు. జగతీ ఛందస్సు వర్షర్తు సంబంధి. ఋక్షమ సామము జగతీ ఛందో సంబంధి. ఋక్షమ సామము నుండి శుక్రగ్రహము పుట్టినట్లయినది. శుక్రగ్రహము నుండి సప్తదశ స్తోమము ఉత్పన్నమైనట్లయినది. సప్తదశము నుండి వైరూప సామము ఉత్పన్నమైనట్లయినది. వైరూప సామము నుండి విశ్వామిత్రర్షి ఆవిర్భవించినట్లయినది.

    ఇష్టకా! నీవు ప్రజాపతిచే గ్రహించబడినదానవు. ప్రజల నేత్రముల కొరకు నిన్ను అందుకొనుచున్నాను.

    4. ఈ ప్రజాపతి దేహము ఉత్తర దిక్కున ఉన్నది. ఇష్టకా! నీవు ఆ ప్రజాపతి శరీర స్వరూపవు అగుచున్నావు. ఆ ప్రజాపతి శ్రోత్రము 'సౌరమ్' అగుచున్నది.

    శరత్తు 'శ్రౌత్రి' అగుచున్నది. అనుష్టుప్ శరత్ సంబంధి అగుచున్నది. అనుష్టుప్ నుండి 'స్వార' సామము ఉత్పన్నమైనట్లు అయినది. స్వార సామము నుండి మంధి గ్రహము ఉత్పన్నమైనట్లు అయినది. మన్థి గ్రహము నుండి ఏకవింశత్ స్తోమము ఉత్పన్నమైనట్లు అయినది. ఏకవింశత్ స్తోమము నుండి వైరాజసము ఉత్పన్నమైనట్లు అయినది. వైరాజసము నుండి జమదగ్ని ఋషి ఆవిర్భవించినట్లయినది.

    ఇష్టకా! నీవు ప్రజాపతిచే గ్రహించబడిన దానవు అయినావు. ప్రజల శ్రోత్రము కొరకు నిన్ను అందుకొనుచున్నాను.

    5. ఈ ప్రజాపతి తనువు పైదిక్కునందున్నది. ఇష్టకా! నీవు ఆ ప్రజాపతి స్వరూపము అగుచున్నావు. ఆ ప్రజాపతి యొక్క వాక్కు 'మాతి' అయినది.

    హేమంతము వాచ్యాయన శబ్ద వాచ్యమగును. పంక్తి ఛందస్సు హేమంతసంబంధి. నిధనవత్ సామమగు పంక్తి సంబంధము నుండి ఆగ్రాయణ గ్రహము పుట్టినట్లు అయినది. ఆగ్రాయణ గ్రహము నుండి త్రయస్త్రింశ స్తోమము పుట్టినట్లయినది. త్రయస్త్రింశ స్తోమము నుండి శాక్వర, రైవత సామములు ఉత్పన్నమైనట్లయినవి. శాక్వర రైవతముల నుండి విశ్వకర్మ ఋషి ఆవిర్భవించినట్లయినది.

    ఇష్టకా! నీవు ప్రజాపతిచే గ్రహించబడిన దానవు అయినావు. నిన్ను ప్రజల వాక్కు కొరకు అందుకొనుచున్నాను.

                                           మూడవ అనువాకము

    1. ఇష్టకా! నీవు దిక్కులందు తూర్పువు. ఋతువులందు వసంతమవు. దేవతలందు అగ్నివి. ధనములందు బ్రహ్మమవు. స్తోమములందు త్రివృత్ స్తోమమవు. త్రివృత్తు పంచదశవర్తని. వయస్సులందు సార్ధసంవత్సరాత్మకవు. యుగములందు కృతయుగమవు. వాయువులందు పురోవాతమవు.  ఋషులందు 'సానగ' ఋషి స్వరూపవు.

    2. ఇష్టకా! నీవు దిక్కులందు దక్షిణమవు. ఋతువులందు గ్రీష్మమవు. దేవతలందు ఇంద్రుడవు. ధనములందు క్షత్రమవు. స్తోమములందు పంచదశ స్తోమమవు. అది పంచదశస్తోమ ప్రవర్తవి. వయస్సులందు ద్విసంవత్సర వయోరూపమవు. యుగములందు త్రేతవు. వాయువులందు దక్షిణవాయువవు. ఋషులందు 'సనాతన' ఋషి స్వరూపవు.

    3. ఇష్టకా! నీవు దిశలందు పశ్చిమనువు. ఋతువులందువర్షమవు. దేవతలందు విశ్వేదేవతల స్వరూపమవు. ధనములందు 'వైశ్వ'వు. సోమములందు సప్తదశ స్తోమమవు. అది ఏకవింశతి స్తోమ ప్రవర్తివి. వయస్సులందు వర్షత్రయరూపమవు. యుగములందు ద్వాపరమవు. వాయువులందు పడమటిగాలివి. ఋషులందు 'అహభూన' ఋషి స్వరూపవు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.