Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



    13. సోమమా! నీవు పాపములను పారద్రోలు దానవు. నీవలన మాకు క్షీరాదులు సంప్రాప్తములగునుగాక. అన్నములు సంప్రాప్తములగునుగాక. నీవు వర్ధిల్లుము. యజమానికి అమరత్వము కలిగించుటకు స్వర్గమందు ప్రసిద్ధములగు శ్రేష్ఠ అన్నములను సంపాదించుము.

                                           ఎనిమిదవ అనువాకము

    1. ఈ అశ్వము సమస్త శత్రుసేనలను, అరాతులను త్రొక్కివేయునుగాక. అట్టి ఆక్రమణమును అగ్నియు, సోముడును ఆమోదింతురుగాత. బృహస్పతియు, సవితృ దేవతయు ఆమోదింతురుగాక. పూష నిన్ను పుణ్య లోకమునకు చేర్చునుగాత.

    2. అశ్వమా! నీవు సముద్రము నుండి పుట్టినావో, గుర్రమునకే పుట్టినావో కాని నీవు తొలిగా పెట్టిన కేక వలన డేగ రెక్కగను, లేడి పాదముగను స్తుతించబడినావు.

    3. పద్మ పత్రమా! నీవు నీటి మీద తేలుచున్నావు. అగ్నికి యోనివి అగుచున్నావు. సముద్రమంతటి తటాకమునకు శోభాయమానవగుచు, నిత్యము వర్థిల్లుచు, పూజనీయవు, పుష్టికరమవు అగుచున్నావు. నీవు ఆకాశమున కన్న విశాలమవై వర్థిల్లుము.    

    4. తొలుత పుట్టిన ఈ రుక్మము మహనీయము. సూర్యుడు తూర్పున ఉదయించి, తన కమనీయ కిరణములచే సమస్త ప్రదేశములను ప్రకాశింప చేయుచున్నాడు. ఆ సూర్యుడు ఈ రుక్మము ఉపమానముగా గల పదార్థములను కూడ ప్రకాశింపచేయుచున్నాడు. ఆ సూర్యుడు భూమి ఆధారముగా గల పదార్థములను, మానవమేధ ఆధారములగు పదార్థములను ప్రకాశింప చేయుచున్నాడు.

    (రుక్మము- బంగారము. పదార్థము ప్రకృతి నుండి పుట్టినవియు, మానవ మేధ సృష్టించినవి అను రెండు విధములు.)

    5. హిరణ్య గర్భః సమవర్తతాగ్రే భూతిస్య జాతసః పతిరేక ఆసీత్ | సదాధార పృథివీం ద్యా ముతే మాం కస్మైదేవాయ హవిషా విధేమ ||            4-2-6-13 పునరావృతము.

    6. హిరణ్యపురుషుని అవయవలేశము భూమి మీద పడినది. అది భూలోక, ద్యులోక అంతరిక్షములందు సంచరించుచున్నది. ఆ ద్రప్సము పడిన దిక్కును కాక మిగిలిన ఏడు దిక్కులందు హుతమైన దానిగా మనసున భావించుచున్నాను.

    (ద్రప్సము హిరణ్యగర్భుని అవయవలేశము.)

    7. నేల మీద సర్పములకు నమస్కారము. అంతరిక్షమునందలి సర్పములకు నమస్కారము. ద్యులోకమందలి సర్పములకు నమస్కారము.

    8. అంతరిక్షమున తేజరిల్లు స్వర్గలోకమునందలి సర్పములకు, సూర్య కిరణములందలి అదృశ్య సర్పములకు, జలములందున్న సర్పములకు నమస్కారము.

    9. రాక్షసుల శర రూప సర్పములకు, చెట్ల యందున్న సర్పములకు, పుట్టలందున్న సర్పములకు నమస్కారము.

                                          తొమ్మిదవ అనువాకము

    1. స్వయమాతృణ్ణమను ఇష్టకా! నీవు భూమి మీద దానవు. బాధించబడనిదానవు. జగత్కర్త చేత చేయబడినదానవు. నీవు స్థిరముగ నిలుచుదానవు అగుచున్నావు. సముద్రుడు నిన్ను ముంచకుండునుగాక. పక్షిరాజు నిన్ను ఎత్తుకొని పోకుండునుగాక. నిర్భయముగా నేలమీద దృఢముగా నిలువుము.

    2. స్వయమాతృణ్ణమా! నీవు ఎంతో వెడల్పు, ఎంతో పొడవైనదానవు. ప్రజాపతి నిన్ను భూమి మీద ఉంచును గాక. నీవు విస్తారమవు అగుచున్నావు. పృథ్విని అగుచున్నావు. సుఖములు కలిగించుదానవు అగుచున్నావు. భూమివి అగుచున్నావు. 'అఖండనీయవు' అగుచున్నావు. విశ్వమును పోషించుదానవు అగుచున్నావు. లోకములను భరించుదానవు అగుచున్నావు.

    3. తృణమా! నీవు కాండ కాండము నుంచి, పర్వ పర్వము నుంచి పుట్టుచున్నావు. అట్లే మమ్ము శతసహస్రములుగా వర్థిల్ల చేయుము.

    4. దూర్వేష్టకా! నీవు నూర్ల కొద్ది పెరుగుచున్నావు. వేల కొలది పుట్టుచున్నావు. నీకు మేము హవిస్సులు అర్పించు చున్నాము.

    5. ఇష్టకా! నిన్ను కాదన్న వారులేరు. నీవు విరోధులను పరిభవించుచున్నావు. అరాతులను పరిభవించుము. అరాతులు కావలెనను కొన్నవారిని పరిభవించుము. మాకు ఇవ్వవలసిన ధనమును ఇవ్వని వారిని, పూర్వము కాకున్నను ఇప్పుడు అరాతిత్వము కోరుచున్నవారిని పరిభవించుము.

    6. ఇష్టకా! నీవు వేల బలములు కలదానవు. శత్రు సేనను ఓడించుము. సేనను కోరు శత్రువును ఓడించుము. మమ్ము సంతోష పరచుము.

    7. మధువాతా ఋతాయతే మధుక్షరన్తి సింధవః మాధ్వీర్నః సన్త్వోషధీః

    యజ్ఞము కోరువానికి వాయువులు మధుర రసమును చిమ్ముచున్నవి. సముద్రములు మధుర రసమును చిమ్ముచున్నవి. మాకు ఓషధులు మధుర రసోపేతములు అగునుగాక.

     8. మాకు రేయి మధురమగును గాక. ప్రభాతములు మధురములగునుగాత  భూరజస్సు మధురమగునుగాక. పితృ స్థానీయమగు దివి మధురమగునుగాక.

    9. వనస్పతులు మధురములగునుగాత. సూర్యుడు మధురమగునుగాత. గోవులు మధుర రసోపేతలు అగునుగాక.

    10. మహనీయములగు ద్యావాపృథ్వులు మాకు యజ్ఞ ఫలమును కలుగజేయునుగాక. మమ్ము సమర్థులను చేయునుగాక.

    11. విష్ణువు ఆకసపు నేత్రము వలె వ్యాపించినవాడు. విద్వాంసులు విష్ణువు యొక్క పరమపదము నిత్యము దర్శించుచున్నారు.

    12. మట్టి కుంపటీ! దేవతల చేత అమృత సమమగు ఆజ్యముచే నింపబడి వచ్చినావు. స్థిరపడినావు. యుద్ధము కోరు శత్రువును పరిభవించుము.

    13. అగ్నీ! నీవు సూర్యుని యందు ఉదయించుచున్నావు. నీ కాంతులు కిరణరూపములై స్వర్గమున వ్యాపించుచున్నవి. ఆ కాంతులన్నింటితో ఈ యజమానిని ప్రకాశింపచేయుము.

    14. దేవతలారా! మీ దీప్తులు సూర్యమండలమందున్నవి. గోవులందున్నవి. అశ్వములందున్నవి. ఇంద్రాగ్ని బృహస్పతులారా! ఆ దీప్తులచే మాకు కాంతిని ప్రసాదించండి. 

    15. 'రేతస్పిక్' అను మొదటి ఇష్టక జ్యోతిని ధరించి విశేషముగ ప్రకాశించినది - విరాట్. రెండవ ఇష్టక జ్యోతిని ధరించి చక్కగా ప్రకాశించినది - సమ్రాట్. మూడవ ఇష్టక జ్యోతిని ధరించి స్వయముగా ప్రకాశించినది - స్వరాట్.

    16. అగ్ని దేవా! నీ అశ్వములందు సాధువులు శీఘ్రగాములున్నవి. అట్టి వహన సమర్థములను రథమునకు కట్టుము.

    17. అగ్నీ! నీవు దేవతలను ఆహ్వానించువాడవు. రథికుడు ఆశ్వములను రథమునకు కూర్చినట్లు దేవతలను ఈ యజ్ఞమునకు కూర్చుము. నీవు పూర్వపు హోమనిష్పాదకుడవై ఈ యాగస్థానమున ఆసీనుడవగుము.

    18. ద్రప్సశ్చస్కన్ద పృథివీమను ద్యామిమంచ యోనిమను యశ్చపూర్వః | తృతీయం యోనిమను పంచరన్తం ద్రప్సం జుహోమ్యను సప్తహోత్రాః |

    (8వ అనువాకము 6వ మంత్రము పునరావృతము.)

    19. హిరణ్యము సర్వ ప్రాణులకు అన్నము అగుచున్నది. అట్లే సకల జనులకు స్వామియైన అగ్నికి అన్నము అగుచున్నది. అగ్ని తన స్వంత కాంతుల చేతనే ప్రకాశించు చున్నాడు. అట్లయ్యు హిరణ్య కాంతిచే వర్చస్సు కలవాడు అగుచున్నాడు.

    20. హిరణ్య శకలమా! నిన్ను 'ఋక్కు' కొరకుగాను నరుని శిరస్సు యొక్క దక్షిణ అక్షి గోలకమందు ఉంచుచున్నాను. దీప్తి కొరకు నరుని శిరస్సు యొక్క వామాక్షి గోలకమందు ఉంచుచున్నాను.

    21. దధి, మధువులు నదుల వలె పొంగి పారుచున్నవి. అవి శరీరమున చేరి, మనసును నింపి ఘృతధారలు అగుచున్నవి. ఆ ధారలను అంతట ప్రకాశింపచేయుచున్నాను. వాని మధ్యన హిరణ్యము నది నడుమ వేతస వృక్షము వలె తేజరిల్లుచున్నది.

    22. వేతస వృక్షము వంటి మానవ శిరస్సు నందు సుందర పక్షములు, సునివాసము గల ఒక మధుకరము దేవతల కొరకు తేనెను సమకూర్చుచున్నది. దాని ప్రక్కనే ఏడు తేనెటీగలు స్వధయగు అమృతధారలను ప్రవహింపచేయుచున్నవి.

                                         పదవ అనువాకము

    1. అగ్నీ! వర్థిల్లుము. ఈ గర్భము అదితి సంబంధి. విశ్వరూప, సహస్ర ప్రతిమా రూప. దీనిని వదలుము. నీ మంటలచే అంటకుము. దీనికి నూరేళ్ల ఆయువు కలిగించుము.

    2. అగ్నీ! నీవు జ్వాలా రూప సహస్రాక్షుడవు. యజ్ఞ నిష్పాదకుడవు. వర్థిల్లువాడవు. పశువులందు ద్విపాద పశువును హింసించకుము. నీకు అరణ్య సంబంధి కృష్ణ మృగమును అర్పించుచున్నాను. దాని వలన నీ జ్వాలా రూప శరీరమును పోషించు కొనుము. యజ్ఞ స్థానమున ఆసీనుడవు అగుము.

    (మానవుడు ద్విపాద పశువగును.)

    3. అశ్వము వాయు వేగము కలది. వరుణునకు నాభిస్థానము. సముద్ర మధ్యమున పుట్టినది. నదులకు బిడ్డ. మనిషిని మోయునది. పరిగెత్తునపుడు రాళ్లను పిండి చేయునది.   

    అగ్నీ! అట్టి అశ్వమును దహించకుము. దానికి ఉత్తమ రక్షణలు కలిగించుము.

    4. ఈ అశ్వము పశువులందు ఒక గొరిసె గలది. సకిలించునది. వేగవతులందు మిక్కిలి వేగము కలది. అగ్నీ! దీనిని హింసించకుము. నీకు అరణ్య గౌర మృగమును అందించుచున్నాను. దాని వలన జ్వాలా రూప దేహమును పోషించుకొనుము. యజ్ఞ స్థానమున ఆసీనుడవగుము.

    5. అగ్ని పూర్వ ఋషుల మనసులందుండిన వాడు. నిత్య సంపన్నుడు. ప్రాణ రక్షకుడు. అతనికి నమస్కరించి స్తుతించుచున్నాను.

    అగ్నీ! నీవు సమస్త ఋతువులను కలిగించుచున్నావు. అఖండనీయమై విరాజిల్లుచున్న ఋషభమును బాధించకుము.

    6. ఋషభము - ఎద్దు. సముద్రమున పుట్టినది. శతధారలు కలది. ప్రవాహము వంటిది. భువన మధ్యమున సేవించబడునది. ఘృతము నిచ్చునది. అఖండనీయ యజమాని కొరకు అట్టి ఋషభమును బాధించకుము. నీకు అరణ్య సంబంధమగు ఋషభ సదృశ మృగమును ఇచ్చుచున్నాను. దానివలన జ్వాలా రూప దేహమును పోషించు కొనుము. యజ్ఞ స్థానమున ఆసీనుడవగుము.

    7. పొట్టేలు త్వష్ట నిర్మితము. వరణీయ అగ్నికి నాభిస్థానము. ప్రజాపతి ఉరము నుండి పుట్టినది. గొప్పది. వేల వెలగలది. అసురమాయా నిర్మిత. అగ్నీ! అట్టి పొట్టేలును హింసించకుము. ఉత్తమ రక్షణలు కలిగించుము.

    8. పొట్టేలు అగ్ని సంబంధి. దాని చర్మము ద్విపాద, చతుష్పాదుల వంటిది. త్వష్ట చే ప్రాణి జాలమందు ప్రథమముగా సృష్టించబడినది. అగ్నీ! దీనిని బాధించకుము. ఉత్తమ రక్షణలు కలిగించుము. నీకు అడవి ఒంటెను తెచ్చి ఇచ్చుచున్నాను. దానితో జ్వాలా రూపదేహమును పోషించుకొనుము. యజ్ఞ స్థానమున ఆసీనుడవగుము.

    9. అగ్నీ! నీవు ప్రజాపతి తపము నుండి ఆవిర్భవించినావు. భూమికి స్వర్గమునకు తాపము కలుగ చేయుచున్నావు. విశ్వకర్మ మేకపోతు రూపమున ప్రజలను పశువులను సృష్టించినాడు. దానిని నీ కోపమునకు గురి కానివ్వకుము. దానిని కాపాడుము.

    10. మేక అగ్ని గర్భమున పుట్టినది. పుట్టగానే తనను సృష్టించిన ప్రజాపతిని దర్శించినది. ఆ మేక వలననే యజమానులు స్వర్గమునకు చేరినారు. దేవతలు పూర్వము దేవత్వము పొందినారు. నీకు అడవి శరభమును ఇచ్చుచున్నాను. దానిచే నీ దేహమును పోషించు కొనుము. యజ్ఞ స్థానమున ఆసీనుడవగుము.

                                        పదకొండవ అనువాకము

    1. ఇంద్రాగ్నులారా! మీరు ద్యులోకమున రోచమానులు. అంతటను హవిస్సులు అందుకొనుచున్నారు. అందువలన మీ శక్తి లోకములకు వెల్లడి అయినది.

    2.ఇంద్రాగ్నులు సమాన ఆహ్వానములు కలవారు. మహా సంపన్నులు. తమ బలమున అన్యులను ఓడించువారు. అన్నములు అభిలషించువారు. అట్టివారిని సేవించునట్టి యజమాని శత్రువును తుడిచి వేయుచున్నాడు. అందరకు అన్నము పెట్టుచున్నాడు.

    3. హవిస్సులు స్వీకరించుమనువారు, యుద్ధములకు ఆహ్వానించువారు ఉన్నారు కదా. ఇంద్రాగ్నులు వారిని మించినవారు. ద్యులోక భూలోకములను మించినవారు. సముద్రమును మించినవారు. పర్వతములను మించిన వారు. వేయేల? తమ మహిమలచే లోకములనే మించినవారు.

    4. మరుత్తులారా! మీరు విశిష్ట తేజోవంతులు. దివి నుండి దిగి వచ్చినవారు. మీరు ఎవని ఇంట ఉంటున్నారో అంతనికి మిక్కిలి రక్షణలు కలుగుచున్నవి.

    5. మరుత్తులారా! మీరు యజ్ఞమును రక్షించువారు. యజ్ఞము నందలి ఆహ్వానములను వినండి. యజమాని ప్రార్థనలను వినండి.

    6. వారు ఆ మరుత్తులు - ప్రజలు తమను ఆశ్రయించవలెనని కోరువారు. అందుకు సూర్య కిరణములతో కూడి వర్షము కలిగించ నిచ్చగించువారు. ఋక్కలచే స్తుతించబడువారు. హవిస్సులు ఆరగించువారు. వారు ఆనందమున నినదించుచు నిర్భయముగ స్వస్థానములకు చేరుకున్నారు.

    7. "అవతేహేడ" పురోనువాక్య - "ఉదుత్తమమ్" యాజ్య

    8. ఈ యజ్ఞమునకు ప్రజాపతి రక్షణలు ఉన్నవి. అది సదా వర్థిల్లునది. సఖి వలె ప్రియమైనది. ఎంతో శక్తివంతము. ఆ యజ్ఞము మా వద్దకు చేరినది!

    9. నేటి స్తుతి గానములు యజ్ఞపు అగ్ర భాగములు. కర్మ యుక్తములు. స్వయం ప్రకాశములు. అవి మా వాక్కున చేరుచున్నవి. స్తుతించు వారి హృదయములందు ప్రవేశించుచున్నవి. ఏ యజమాని అట్టి వాక్కులను భద్ర పరచుచున్నాడో, వృద్ధి చెందించుచున్నాడో అతడు చిరంజీవి అగుచున్నాడు.

    10. అగ్నేనయసుపథా, పురోనువాక్య. ఆదేవా నామపిపన్థామ్" యాజ్య.

    11. "శన్నోభవన్తు వాజినో హవేషు" పురోనువాక్య. వాజే వాజ్కేవత వాజినః" యాజ్య

    12. అగ్నీ! నీ బలము జలములందున్నది. నీవు ఓషధులను అనుసరించుచున్నావు. అరణులందుండి మరల మరల పుట్టుచున్నావు.

    13. సోమదేవా! నీవు కోరిన ఫలములు ఇచ్చువాడవు. వృషా. అందువలన దీప్తిమంతుడవు అగుచున్నావు. వృషవు కావున వర్షించువాడవు అగుచున్నావు. వృషవు కనుకనే పుణ్యములు కలుగచేయుచున్నావు.

    14. "ఇమం మే వరుణ శ్రుధీ" పురోనువాక్య. "తత్త్వాయామి బ్రాహ్మణా వన్దమానః" యాజ్య.

    15. "త్వంనో అగ్నే వరుణస్య" పురోనువాక్య. "సత్యంనో అగ్నేభవ" యాజ్య.

            శ్రీమదాంధ్ర వచన కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహిత
            నాలుగవ కాండము నందలి రెండవ ప్రపాఠకము సమాప్తము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.