Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
III) వింధ్యను వంచి అగస్త్యుడు మానవాళికి మహోపకారము చేసినాడు. వింధ్యకు దక్షిణమున వెలుగు లేదు, చీకటి ఉన్నది అని చెప్పినాడు. చీకటి నిజముగా చీకటి కాదు. అది సంకేతము మాత్రమే. పాశ్చాత్యులు ఆఫ్రికాను చీకటిఖండము (DARK CONTINENT) అన్నారు. అంతమాత్రమున అక్కడ వెలుగు లేదని అర్థము కాదు. వెలుగు నాగరకతకు చిహ్నము. నాగరకత లేనందున దక్షిణా పథమును చీకటి ప్రాంతము అన్నారు.
వింధ్య ఉత్తర దక్షిణముల మధ్య మహాకుడ్యము వంటి పర్వతము అందునుంచి మార్గములు ఏర్పరచుటకు అత్యంత ఆధునికులు సహితము ఎంతో శ్రమించవలసి వచ్చినదని ఉత్తరమునకు పయనించిన వారందరికి తెలియును. అట్టి వింధ్యపర్వతము నుంచి మార్గములు ఏర్పరచి, దక్షిణా పథమును భారతదేశపు భాగము చేసినాడు అగస్త్యుడు. దుర్గమారణ్యములు పర్వతములు దాటి దక్షిణమున ప్రవేశించిన అగస్త్యుడు, అక్కడి వారి శ్రేయస్సుకే మిగతా జీవితమును అంకితము చేసినాడు.
ఇండోనీషియాలో అనేకచోట్ల అగస్త్యుని నిలువెత్తు విగ్రహములున్నవి. అక్కడివారు అగస్త్యుని అత్యంత ఆదరమున పూజింతురు. అగస్త్యుడు దక్షిణా పథమునుండి ఇండోనీషియా దీవులకు సముద్ర మార్గమును ఏర్పరచి, వర్తక వ్యాపారములను అభివృద్ధి చేసి ఉండవచ్చును.
,మార్గములు ఏర్పరచిన మహామహుడు అగస్త్యుడు.
iv) రాక్షసులు బలవంతులు. దేవతలను అనేకసార్లు ఓడించినారు. దేవతలకు స్వయంశక్తిలేదు. వారు అన్యులను ఆశ్రయింతురు.వృత్రాసురుని వధించుటకు దధీచి తన ప్రాణములను త్యాగము చేసినాడు. దధీచి వెన్నెముక ఇంద్రుని వజ్రాయుధము అయినది. వృత్రుడు చచ్చినాడు.
ఎముకలతో ఆయుధములు చేయు విధానము ఏదో ఉన్నట్లున్నది. అందుగురించి పరిశోధించవలె.
తన జాతి కొఱకు ఆత్మార్పణము చేసిన మహాత్యాగి దధీచి.
రాక్షసులు బలవంతులేకాదు ఉపాయవంతులు. వృత్రుడు చావగా కాలకేయులు సముద్రమున చొచ్చినారు. అట్లనిన వారు సముద్ర గర్భమున దాగినారని అర్థముకాదు. వారికి నావలు, జలాంతర్గాములు తెలిసి ఉన్నట్లున్నది. వారు సముద్రమున ఆవాసము ఏర్పరచుకొని దేవతల మీద దాడి సాగించినారు. దేవతలు దాడిని తట్టుకొనలేక పోయినారు. అప్పుడు దధీచి వలన విజయము సాధించినారు. ఇప్పుడు అగస్త్యుని ఆశ్రయించినారు.
అగస్త్యుని ఆశ్రయించుటకు కారణము అతడు అప్పటికే సముద్రయాన విద్యలో ప్రయోగములు చేసి విజయము సాధించినాడు. అగస్త్యుడు దేవతలకు సాయము చేసినాడు. రాక్షసులకు ఉన్నవాని కన్న మిన్న అయిన నౌకలని నిర్మించి ఇచ్చినాడు.
రాక్షసులకు, దేవతలకు సముద్రముపై ఘోరమయిన నౌకాయుద్ధము జరిగి ఉండవచ్చును, అని అర్థము. శాస్త్ర విజ్ఞానము వలన, యుద్ధమున దేవతలు జయించి ఉండవచ్చును.
సముద్రమును త్రాగుట సామెత మాత్రమే. 'వేదములను పుక్కిట పెట్టినాడు' అనగా వేదములందు నిష్ణాతుడు అని అర్థము. అట్లే అగస్త్యుడు సముద్రమును త్రాగినాడనిన సాగరశాస్త్రమున అతడు పారంగతుడని అర్థము.
అగస్త్యుడు మానవ నాగరకతను ముందుకు నడిపించిన మహా మహిమాన్వితుడు. అగస్త్యునకు వందనము.
భగీరథుడు - గంగావతరణము:
పూర్వము ఇక్ష్వాకు వంశమున సగరుడు అనురాజు ఉండెను. అతనికి వైదర్భి, శైభ్య అను ఇద్దరు భార్యలు. అతనికి చాలా కాలము సంతానము కలుగలేదు. అతడు భార్యలతో కైలాసమునకు వెళ్లినాడు. శివుని గూర్చి తపస్సు చేసినాడు. శివుడు ప్రత్యక్షమయినాడు వరము కోరమన్నాడు.
"దేవదేవా! నాకు సంతానాపేక్ష మిక్కుటముగా ఉన్నది. నాకు సంతానము ప్రసాదించుము" అని వేడుకున్నాడు.
పరమశివుడు దయదలిచినాడు "రాజా! నీ భార్య వైదర్భియందు అరువదివేలమంది పుత్రులు కలుగుదురు. నీ రెండవ భార్య శైభ్యకు ఒక కుమారుడు కలుగును" అని చెప్పి అంతర్ధానుడు అయినాడు.
సగరుడు భార్యలతో తన పట్టణమునకు వచ్చినాడు. భార్యలు ఇద్దరు గర్భములు దాల్చినారు. కాలము గడచినది. వైదర్భి గర్భమందు సొరకాయ పుట్టినది. శైభ్యకు ఒక పుత్రుడు కలిగినాడు. అతడు అసమంజసుడు.
సగరుడు సొరకాయను చూచి వగచినాడు. బయట పారవేయదలచినాడు. "సొరకాయ పారవేయరాదు అందుగల విత్తనములు నేతి కుండలందు ఉంచి కాపాడిన అరువది వేలమంది పుత్రులు అగుదురు" అని ఆకాశవాణి పలికినది. సగరుడు ఆకాశవాణి మాట ప్రకారము చేసినాడు. అరువదివేల మంది పుత్రులు జన్మించినారు.
అసమంజసుడు, ఇతరపుత్రులు పెరిగి పెద్దవారు అయినారు. సగరుని పుత్రులందరు దుష్టులు అయినారు. అసమంజసుడు పట్టణమందలి జనులను విపరీతముగా బాధించినాడు. జనులను నిష్కారణముగా నదిలో పారవేసినాడు. జనుల అతను పెట్టు బాధలకు తాళలేక మిక్కిలి దుఃఖించినారు. సగరునితో మొరపెట్టుకున్నారు.
సగరుడు అసమంజసుని పిలిచి తిట్టినాడు. అయినాను అతడు దుర్మార్గము మానలేదు. అసమంజసుడు ప్రజాకంటకుడుగా పరిణమించుటను చూచిన సగరుడు పుత్రుడని పక్షపాతము చూపక మరణదండన విధించినాడు. ఆవిధముగా అసమంజసుడు అంతమయినాడు. అప్పటికి అసమంజసునకు ఒక పుత్రుడున్నాడు. అతడు అంశుమంతుడు.
వైదర్భికి పుట్టిన అరువదివేలమంది దుర్మార్గులయి లోకములను హింసించ సాగినారు. సగర పుత్రుల బాధకు తాళలేక లోకములు తల్లడిల్లినవి.
అట్లుండగా సగరుడు అశ్వమేధము తలపెట్టినాడు. యజ్ఞాశ్వమును రక్షించుటకు కొడుకులను దానివెంట పంపినాడు. అశ్వము భూమిమీద తిరిగి సముద్రము వైపు వెళ్లి కనిపించలేదు. ఈవిషయము సగరునకు విన్నవించినారు. అశ్వమును వెదకి తేవలసినదని సగరుడు వారిని ఆజ్ఞాపించినాడు.
సగర పుత్రులు బయలుదేరినారు. సముద్రమందుగల బురదలో దూరి త్రవ్వగా ఈశాన్య భాగమున కపిల మహర్షి ఆశ్రమము కనిపించినది. ఆ యాశ్రమము దగ్గర గుఱ్ఱము కనిపించినది. కపిల మహర్షి యాగాశ్వమును అపహరించినాడనుకున్నారు సగర పుత్రులు. అట్లనుకొని వారు కపిలుని అవమానపరచినారు.
కపిలుడు కనులు తెరచి చూచినాడు. కపిలుని కంటినుండి అగ్నిజ్వాలలు చెలరేగినవి. ఆ మంటలలో సగర పుత్రులు అరువదివేలమంది కాలి కూలినారు. అక్కడ భస్మరాసులు మాత్రము మిగిలినవి. ఇది నారదుడు చూచినాడు. వర్తమానము సగరునకు ఎరుకపరచినాడు.





