Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6


 

    బేగమ్ పిరికి అనుకున్నాను. కాని తీరా చూస్తె అర్ధం అయింది. ఎవరి గుండె అయినా పగులుతుంది. ఎదురుగా ముసుగు మనుషులు పది పదిహేను మంది వస్తున్నారు. వారి చేతుల్లో నగ్న కరవాలాలున్నాయి. పరిగెత్తివస్తున్నారు. ఆడవారి కేకలు విని నౌకర్లు అటు పరిగెత్తారు. కొందరు దుడ్డు కర్ర లందుకొని , కొందరు రిక్త హస్తాలతోను పరిగెత్తారు. ఇటు మనుషులు తక్కువ ఉన్నారు. బందిపోట్లు ఎక్కువ ఉన్నారు. చాలామంది మధ్య నుంచే పారిపోయారు. నలుగురైదుగురు అరుగు దగ్గరకు వచ్చి చంపడానికి, చావదానికీ సన్నద్ధం అయి నుంచున్నారు. స్త్రీలలో ఎవరికీ స్పృహ లేదు. అంతా తెలివి తప్పి పడిపోయారు. ఒక్క రాతి గుండెది మాత్రం చూస్తూ కూర్చుంది. గుండె దడదడకొట్టుకుంటుంది. ప్రాణాలు లేచి పోతున్నాయి. యా అల్లా ఏమిటీ అవాంతరం!
    ఆయుధపాణులైన బేగమ్ మనుషులు ముందడుగు వేస్తుండగానే సర్పరాజ్ అనే సిపాయి ఆపాడు. అతడు తన తోటివారితో "ఆగండి. తొందరపడవద్దు. ముందు వీరు ఏ ఉద్దేశంతో వచ్చారో తెలుసుకుందాం" అని, దొంగలతో "మీ ఉద్దేశం ఏమిటి?" అని అడిగాడు.
    "మేము వచ్చిన పనేమిటో ఇప్పుడే తెలిసిపోతుంది." అన్నాడు ఒక దొంగ.
    సర్పరాజ్ : డబ్బు హరించడానికి వచ్చారా ? ప్రాణాలా?
    రెండో దొంగ : మాకు ప్రాణాలతో నిమిత్తం లేదు. వాటితో మాకేం వైరం? మేము వచ్చిన పనికి అడ్డు తగిలితే మాత్రం వదలం.
    సర్పరాజ్ : (కాస్త కఠినంగా) అయితే ఆడవారి మానాలు హరిస్తారా? అదేమీ ..........
                     సర్పరాజ్ మాట పూర్తీ కాకముందే "కాదు బాబూ! ఒకరి ఆడవాళ్ళతో ,మాకేం పని? మాకు మాత్రం కూతుళ్ళు, కోడళ్ళు లేరు? ఎవడు చేయివేయగలడు ఆడవాళ్ళ మీద ?"
    ఆ ధ్వని నాకు పరిచితమైనట్లనిపించింది.
    సర్పరాజ్ : (సంతోషంతో ) అదే నేను అడిగింది. అయితే అన్నలారా! ఇప్పుడే తాళం చెవులు తెప్పించి ఇస్తాను. గదులలో ఉన్న ఆడవారిని ఇక్కడికి పిలిపించుకుంటాను. యజమానురాలు, బేగమ్ గారు ఇక్కడే ఉన్నారు. మీరు కోటలో ప్రవేశించి మీ ఇష్టం వచ్చింది తీసుకోండి. ఆడవారి మెడల్లోంచి సొమ్ములు ఇక్కడే ఒలిచి ఇస్తాం. దీంతో మా దొర ఫకీరు అయిపోడు. దేవుని దయ వల్ల బ్యాంకుల్లో లక్షలున్నాయి. జాగీరు నుంచి వచ్చే డబ్బు లెక్కలేదు.
    దొంగ : అంతకంటే కావలసిందేమి? కాని చూడు, మోసం జరుగరాదు.
    సర్పరాజ్ : సిపాయి పుత్రుడు మోసం చేయదు. నమ్మండి.
                   నేను  ధ్వని గుర్తించిన దొంగ ముందుకు సాగాడు. "మంచిది , అయితే తాళం చేవులేవి?" అడిగాడు. ఆ మాటలంటునే నా మీద దృష్టి పడింది. నేనూ అతణ్ణి చూచాను.  గుర్తించాను. కాని భయంతో వణకిపోతున్నాను. మాట రావడం లేదు. అతడే ముందుకు వచ్చి అడిగాడు "వదినా! మీరిక్కడ?" అని.
    నేను : మీ అన్న జైలుకు వెళ్ళినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను.
    ఫజలలీ : ఇక్కడా! ఎక్కడ?
    నేను : ఉండడం ఊళ్ళో. కాని నా చెల్లెలు ఈ నవాబు గారి  దగ్గర కొలువుంది. చూడడానికి వచ్చిపోతుంటాను.
    ఫజలలీ : ఏదీ మీ చెల్లెలు?
    నేను : ఇక్కడే ఉంది. మీరు వస్తున్నారనే కల్లోలంతో తెలివి తప్పి పడిపోయింది. గోషా స్త్రీ. వయసులో వేశ్య అయింది. అప్పటి నుంచి నవాబుల వద్ద, అమీరుల వద్ద కొలువు చేస్తుంది.
    ఫజలలీ : (తన సహచరులతో ) ఇక్కడి ఒక పైస ముట్టినా నా మీద ఒట్టు. ఈ విషయంలో మాత్రం నేను మీవాణ్ణి కాను.
    దొంగ : ఆ మాత్రానికి రావడం దేనికి?
    ఫజలలీ : ఎందుకు వచ్చామో అందరికీ తెలుసు. చూస్తున్నారా ఎవరున్నారో ఇక్కడ? ఫైజూ భాయి ఆడది. ఈమె చెల్లెలు ఇల్లే దోచుకుందామా? జైల్లో ఉన్నవాడికి తెలుస్తే ఏమంటాడు?
    ఈ మాట మీద దొంగల్లో తగాదా మొదలైంది. అంతా ఫజలలీ అదీనంలోనివారు. ఎదురుచెప్పడానికి ఎవనికీ ధైర్యం చాలలేదు. అయినా వట్టి చేతులతో తిరిగిపోవడం ఎవరికీ ఇష్టం లేదు. దొరికింది ఒక్క అవకాశం. దాన్నీ ఖాను జారవిడుచుకుంటే పొట్ట ఎలా గడవాలి?
    ఫజలలీ తన గుంపు నుంచి వేరుగా నుంచున్నాడు. ఒక నల్లని ఎత్తైన మనిషి అతని పక్కకు చేరి " ఖాను గారూ!" నేను మీ పక్షమే " అన్నాడు.
    ధ్యానంగా చూచాను. అతడు ఫైజలీ సైసు. అతణ్ణి పిలిచాను. వేరుగా తీసికెళ్ళి మాట్లాడాను. బేగం గారు బహుకరించిన రూపాయలు, సవరనులు ఇచ్చేశాను.
    ఫజలలీ సర్పరాజ్ ఖాను తో "నేను మీవాణ్ణి , ఇక వారున్నారు. నీవున్నావు మీ ఇష్టం" అన్నాడు.
    సర్పరాజ్ : నేను వీరిని ఒప్పిస్తాను. ముందు ఇక్కడ్నించి నడవండి. ఆడవాళ్ళు భీతాహంతో ఉన్నారు. బేగమ్ గారు తెలివి తప్పి పడిపోయారు. వారికి తెలివి రానియండి. మిమ్మల్ని సంతోషపెట్టి పంపిస్తా . సరేనా ?"
    దొంగలు అక్కణ్నుంచి వెళ్ళిపోయారు. బేగమ్ గారు స్పృహ లేక పడి ఉన్నారు. చెరువు లోంచి దోసిలిలో నీళ్ళు తెచ్చి ముఖం మీద చల్లాను. చాలాసేపటికి తెలివి వచ్చింది. "అల్లా అనుగ్రహం వల్ల ఆపద తొలగిపోయింది. ధైర్యం తెచ్చుకొని కూర్చోండి" అన్నాను. మిగతా స్త్రీలను కూడా నీళ్ళు చల్లి కూర్చోబెట్టాను. అందరికీ ధైర్యం చెప్పి జరిగిన వృత్తాంతం బేగమ్ గారికి విన్నవించాను. బేగమ్ గారు చాల సంతోషించారు. సర్పరాజ్ ఖానును పిలువనంపారు.
    సర్పరాజ్ : సర్కార్ ! కాస్తో కూస్తో ఇవ్వాలి. ఉమ్రావ్ జాన్ లేకుంటే ప్రమాదం తప్పేది కాదు.
                    నేను ఈ విషయాలు చెప్పదలచలేదు. అతడు చెప్పేశాడు. బదులు చెప్పదలచుకోక "చిత్తం, నేనేమీ చేయలేదు. అంతా దైవికం" అన్నాను.
    సంగ్రహంగా చెప్పాలంటే బేగమ్ పెట్టె తెప్పించింది. అయిదు వందల రూపాయలూ, అంత మొత్తము నగలూ వారికిచ్చి వదిలించుకుంది. అప్పుడు కాని అందరికీ ప్రాణాలు రాలేదు. నాటి బేగమ్ మాటలు నేటికీ గుర్తున్నాయి.
    బేగమ్ : ఏమి ఉమ్రావ్ జాన్ ! తోటలో ఉండే హాయి చూచావా ?
    నేను : తాము చెప్పింది, నిజమని గ్రహించాను హుజూర్!
    అప్పటికి తెల్లవారుజాము మూడైంది. అంతా లేచి బంగాళాలోకి వెళ్లాం. వరండాలో నాకోసం మంచం వేశారు. నిద్ర ఎలా వస్తుంది? రాత్రంతా మేలుకునే ఉన్నాం. తెల్లవారుతుండగా నిద్రపట్టింది. ఇంకా నిద్రలోనే ఉన్నాను. నా సేవకులు సవారీ తెచ్చారు. నన్ను లేపారు. కళ్ళు నలుపుకుంటూ బయటకు వచ్చాను.
    సేవకుడు : మీరు ఇక్కడ హాయిగా ఉన్నారు. మేము తెల్లవార్లూ ఎదురు చూస్తూ కూర్చున్నాం.
    నేను : ఎలా వస్తాను? సవారీ పంపించానుగా!
    సేవకుడు : సరే పదండి. లక్నో నుంచి మీకోసం మనుషులు వచ్చారు.
                  వచ్చిందేవరో గ్రహించాను . బువాహుసేనీ , గోహర్ మిర్జా మొత్తానికి జాడ తెలుసుకున్నారు!
    నేను : అచ్చా పదండి. సవారీ తెచ్చారా?
    సేవకుడు : చిత్తం.
                   అప్పటికి ఒకరిద్దరు ఆడవాళ్ళు మేల్కొన్నారు. బేగమ్ గారిని కలుసుకొని వెళ్ళవలసిందని వారించారు. "పని ఉంది. బేగమ్ గారు ఎప్పుడు లేస్తారో?" మళ్ళీ దర్శనం చేసుకుంటాను" అన్నాను.

                                   16


    ఇల్లు చేరి చూస్తె బువాహుసేనీ , గోహర్ మిర్జా కనిపించారు. బువాహుసేనీ నన్ను కౌగలించుకొని ఏడ్చింది. నేనూ ఏడ్చాను.
    బువాహుసేనీ : బిడ్డా! రాతి గుండెదానవే! ఎవరి మీదా లేదేమే!
                        నేను మొదలే సిగ్గుతో చచ్చిపోతున్నాను. ఏమంటాను? ఏడుపు నటించాను.
    ఆ మాటా ఈమాటా అయిన తరవాత అదే రోజు లక్నో వెళ్ళడానికి తయారైంది. లక్ష చెప్పాను వినందే. అంత మంకుతనానికి కారణం మౌల్వీ గారు జబ్బు పడ్డారు. క్షణం నిలువలేకపోయింది. వాత్సల్యం ఆమెను ఇక్కడికి లాక్కొచ్చింది. కాన్పూర్ లో సరుకులు కొనడంలోను, ఇంటి అద్దె చెల్లించడం, పనివాళ్ళ లెక్క చూచి డబ్బు ఇచ్చేయడంలో ఆ రోజు గడిచిపోయింది. బండి బాడుగకు తీసుకున్నాను. మరీ పనికి రాని వన్నీ పనివాళ్ళకు ఇచ్చేశాను. మిగతా సామానంతా బండి మీద వేశాను. రెండవరోజు లక్నో చేరుకున్నాం. మళ్ళీ అదే ఇల్లు. అదే వాకిలి. అదే గదీ. ఆ మనుషులే!




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.