Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



    12. అగ్ని సత్య ధర్ముడు. అనంత సంపన్నుడు. యజమానికి గృహములు, పశుసంపద కలిగించుచున్నాడు. సూర్య దేవుని వలె తన కిరణములచే సమస్తమును ప్రకాశింప చేయుచున్నాడు. అతని పేరు విన్నంతనే శత్రువులు పారిపోవుచున్నారు. అతడు యుద్ధము చేయుట లేదు.

    13. కర్షకులారా! తోలు త్రాళ్లను బొక్కెనలను సిద్ధము చేయండి. ఈ బావిని ఏ కాలము నందును వడిసిపోనట్టి ఊట కల దానినిగా చేసెదము.

    14. ఈ బావి మంచి బొక్కెనలు కలదియు, మంచి తోలు త్రాళ్లు కలదియు, మంచి చేదలు గలదియు అయినది. దీనిని మేము తరగని నీటితో నింపుచున్నాము.

    15. కృషి శాస్త్రజ్ఞులు దేవతల సుఖము కోరువారు. వారు నాగలిని సిద్ధము చేయుదురు గాక. కాడిని కట్టుదురుగాక.

    16. రైతులారా! నాగళ్లను సిద్ధము చేయండి. వానికి కాడిని కూర్చండి. ఇది సేద్యయోగ్యమగు నేల. మంగళ వాక్యములచే దున్నండి. విత్తనములు వేయండి. ఆ పంట పండి, కొడవలికి తెగి, మాకు అందునుగాక.

    17. నాగలి వజ్రము వంటి గట్టిది. రైతు సులభముగా వాడదగినది. అది మట్టి పెడ్డలను పెకలించుచు దున్నునుగాక. పంట వచ్చినంత లేత ఆవులను, గొర్రెలను బండ్లను సాధించకలుగును గాక.

    18. మాకు సుఖము కలుగునట్లు నాగలి దున్నును గాక. రైతులు ఎద్దులకు సుఖము కలుగునట్లు తోలుదురు గాక. పర్జన్యుడు సుఖకరమగు మధుర జలమును వర్షించునుగాక. వాయువును. ఆదిత్యుడును మాకు సుఖములు కలిగింతురుగాక.

    19. ఓ నాగలిచాలా! సూర్య, వరుణ, ఇంద్ర, అగ్ని, పూష, ఓషధ, ప్రజల కోరికలు తీర్చుదానవు అగుము.

    20. నాగేటి చాలు మధుర ఘృతమున తడుపబడినది. సర్వ దేవతలను, మరుద్గణములును నాగటిచాలు శక్తిని ఆమోదించినారు. ఆ చాలు బలము నిచ్చు నీటిచే నింపబడినది. నీరు నిండిన నాగేటిచాలా! నీవు మా కొరకు గాను సర్వత్ర వ్యాపించుము.

                                     ఆరవ అనువాకము

    1. పూర్వము మూడు రుతువులందు దేవతల వద్ద పంటలు పండినవి. అవి శత సంఖ్యాకములు. అరణ్యకములు, గ్రామ్యములు అనునవి సప్త సంఖ్యాకములు. వానిని కనుగొని నేను ఎంతో ఆనందించుచున్నాను.

    2. ఓషధులారా! మీరు మాకు తల్లుల వంటి వారు. క్షేత్రములను బట్టి మీరు శత సంఖ్యాకులు. మూలమును బట్టి సహస్ర సంఖ్యాకులు. అట్లగుటచే మీరు 'శతక్రత్వః'- శత క్రతువులు - మీరు మా యజమానిని రోగరహితుని చేయండి.

    (ఇంద్రుడు శతక్రతువు, పంటలను శతక్రత్వః అన్నాడు. పంటలను ఇంద్రునితో సమానస్థాయికి చేర్చినాడు.)

    3. ఓషధులందు కొన్ని పుష్పములు కలవి. కొన్ని పూలు పండ్లు కలవి. కొన్ని పూయక ఫలించునవి. కొన్ని ఫల, పుష్పములు లేనివి. కొన్ని లతారూపములు. కొన్ని పూయక, కాయక బహు సంవత్సరములు ఉండునవి అగుచున్నవి.

    ఓషధులు అశ్వముల వలె జయశీలములు.

    (అశ్వములు యుద్ధములందు గెలుపు నిచ్చును. పంటలు జీవించుట యందు గెలుపు కలిగించును.)

    4.తల్లుల వంటి ఓషధులారా! మీరు ఫలములు ఇచ్చువారు. అందువలన మా పాపములు నశింపచేయమనియు, పాపఫలములగు దుఃఖములను నశింపచేయుమనియు ప్రార్థించుచున్నాము.

    5. ఓషధి దేవతలారా! మీకు రావి, మోదుగు చెట్లు నివాసములుగా ఏర్పాటు చేయబడినవి. మీరు నేలను అంటియుండు స్థావరములు కదా! మీరు నరులకు అన్నము పెట్టి పోషించుచున్నారు. అందుకే మాకు ఈ స్థానము.

    (పలాశ, అశ్వత్థములు సకల వృక్షములకు స్థానములని చెప్పుచున్నాడు.)

    6. నేను అన్నము తినగోరి ఓషధులను చేత పట్టినాను. అంతే! తినకముందే - చెవుల పిల్లి వలె ఆకలి మాయమైనది.

    (వేటకానిని చూచిన చెవుల పిల్లి వాడు పట్టక ముందే చెవులతో కనులు మూసుకొని చచ్చినట్లు పడిపోవును. అట్లే ఓషధులను తలచినంతనే ఆకలి మాయమగును.)

    7. రాజులు కలిసి యుద్ధములకు పోవుదురు. అట్లే ఓషధులన్నియు కలసినపుడు - వాటి గుణములను ఎరిగిన విద్వాంసుడు ఉన్నప్పుడు రోగములు నశించుచున్నవి. రోగములను నశింప చేసినందున అతడు భిషక్ - వైద్యుడు అనుబడుచున్నాడు.

    8. ఓషధులారా! మీరు తల్లి వలె ఆకలి తీర్చువారు. మీరు అందుకే పుట్టినారు. అందువలన స్వకార్య సమర్ధులు కండు. మీరు ఆకులు కలవారును, ఆకలి తీర్చువారును కండు. ఆకలి రోగము వంటిది. దానిని దూరము చేయండి.

    9. ఓషధులారా! మీలో ఒకరు మరొకరిని రక్షించండి. రక్షించబడిన ఓషధి తన దగ్గరి వాటిని రక్షించునుగాత. ఆ విధముగా కలసిమెలసి ఉన్న ఓషధులు నా ప్రార్థనను మన్నించునుగాక.

    10. నరుడా! ఓషధులు నీ దేహమునకు బలము కలిగించుచున్నవి. ఓషధులు అందించిన ధనములు కొట్టము నుండి గోవుల వలె బయట పడుచున్నవి.

    11. వెలుపలనున్న ఓషధులు ఉదరమున ప్రవేశించును. గోశాలలో ప్రవేశించిన దొంగ వలె దేహమందంతటను వ్యాపించును. దేహమునకు చెందిన వ్యాధులను అన్నింటిని నశింపచేయును.

    12. నరుడా! నీ దేహమున ఓషధులు చేరును. అవి ఆయా శరీర భాగములందు వ్యాపించును. ఉగ్రుడగు రాజు శత్రువును వలె నీ దేహమునందలి వ్యాధులను నశింపచేయును.

    13. వ్యాధులారా! మీరు శ్లేష్మముతో వచ్చిన వారైనను పిత్తముతో వచ్చిన వారయినను వదలి పొండు. వాత రోగ వ్యాప్తి వలన వచ్చిన వారైనను వదలిపొండి. బాధలన్నింటితో వెళ్లిపొండి.  

    14. అశ్వ ఓషధి, సోమ ఓషధి, బల ఓషధి, ఓజో ఓషధి, వీనిని అన్నింటిని మా యజమానికి బాధలు కలుగకుండుటకు ఆర్జించినాను.

    15. ఫలసహిత ఓషధులు, ఫల రహిత ఓషధులు పుష్ప సహిత ఓషధులు, పుష్ప రహిత ఓషధులు అన్నింటికి బృహస్పతి ప్రేరణ కలిగించునుగాత. అవన్నియు మమ్ము బాధల నుండి విముక్తులను చేయునుగాత.

    16. ఓషధీ! సోమము రాజుగా గల ఓషధులందును, నేల మీద విత్తబడిన ఓషధులందును నీవు శ్రేష్ఠమవు. మాకు జీవనౌషధము అగుము.

    17. "మేము ఏ జీవుని యందు ప్రవేశింతుమో ఆ జీవి నశించడు" అని దివి నుండి భువికి దిగి వచ్చు జల బిందు రూప ఓషధులు అనుచున్నవి.

    (ఆకసము నుండి దిగి వచ్చిన వర్ష బిందువులే ఓషధులుగా పుట్టుచున్నవి. యావన్తఃస్తోకా అవాపర్యన్త తావతీ రోశాధయో జాయన్త అని అగ్నిహోత్ర బ్రాహ్మణము. ఆపత్సు సర్వేభేషజీః - నీటియందు సర్వ ఓషధులు అని ఋగ్వేదము.)

    18. నేను ప్రార్థించుచున్నాను. దానిని దగ్గర నుండి విను ఓషధులును, దూరమున ఉండి తక్కువగా విను ఓషధులు అన్నియు ఈ కర్మయందు మాకు తోడ్పడవలెను. ఈ యజమానికి చికిత్సకులు కావలెను.

    19. ఓషధులారా! మిమ్ము త్రవ్వుచున్న నేను నశించకుందునుగాక. నేను ఎవరి కొరకు త్రవ్వుచున్నానో అతడు నశించకుండును గాక. మాకు సంబంధించిన మనుష్యులు, పశువులు, సకల ప్రాణి జాలము రోగ రహితులు అగుదురుగాక.

    20. "ఎవరికి చికిత్స చేయుటకు బ్రాహ్మణుడు మమ్ము ఉపయోగించుచున్నాడో అట్టివానిని వ్యాధుల నుండి తరింప చేయుదుము" అని ఓషధులు తమ ప్రభువగు సోమరాజుతో అన్నవి.

                                         ఏడవ అనువాకము

    1. ఎవడు భూమిని సృష్టించినాడో, ఎవడు సత్యధర్ముడో, ఎవడు దివిని సృష్టించినాడో, ఎవడు ఆనందకరములు, బృహత్తములగు జలములను సృష్టించినాడో అతడు మమ్ము బాధించకుండవలెనని కస్మైదేవాయ హవిషా విధేమ.

    2. భూదేవీ! నీవు యజ్ఞము తోను, యజ్ఞ ఫల రూపమగు పయస్సుతోడను కూడి అభిముఖముగ విచ్చేయుము. అగ్ని నీయందు ఇచ్చ కలవాడు అగుచున్నాడు. అతడు వపా సదృశమగు నీ ప్రదేశమున ప్రవేశించునుగాత.

    3. అగ్నీ! నీ అంగములందు ఏది దీప్తిమంతమో, ఏది ఆనందకరమో, ఏది పవిత్రమో, ఏది యజ్ఞార్హమో దానిని దేవతల కొరకు సముపార్జించుచున్నాము.

    4. యజ్ఞమునకు స్థానమైనదియు, అమృతమునకు కారణమైనదియునగు చోటు నుంచి అన్నమును, ఊర్జమును గ్రహించుచున్నాను. అది మా గోవులందును, ఓషధులందును ప్రవేశించునుగాక.

    అన్నరహితము, రోగ యుక్తము అగు భూమిని వదులుచున్నాను.

    5. అగ్నీ! నీది అని చెప్పబడుచున్న అన్నము ఈ భూమి మీద ఎంతో ఉన్నది.

    దీప్తి ధనవంత అగ్నీ! నీ కాంతులు ఎంతగానో ప్రకాశించుచున్నవి.

    అగ్నీ! నీవు బహుళ కాంతుల వాడవు. విద్వాంసుడవు. ఇతడు నీకు హవిస్సు అర్పించువాడు. ఇతని యజ్ఞము కొరకు నీ బలము చేత అన్నము అర్జించుము.

    6. అగ్నీ! నీవు అమరుడవు. ప్రాణులు నిన్ను దీపింపచేయుచున్నారు. మా ధనములను విస్తరింపచేయుము. నీవు దర్శనీయుడవు. శరీర మధ్యమున ప్రకాశించుచున్నావు. దానము చేయదగు ధనమును మాకు అందించుము.

    7. జాతవేద అగ్నీ! నీవు అన్నమును చెరచనివాడవు. దీప్తులు కలవాడవు. మా స్తుతులకు సంతోషించుము.

    యజమానులు మంచి రక్షణలు గలవారు. మంచి చోట పుట్టిన వారు. వారు నీ కొరకు సారవంతమగు అన్నరూప హవిస్సును సమర్పించుచున్నారు.

    8. అగ్నీ! నీ దీప్తి పవిత్రము, నిర్మలము, పరిపూర్ణము. నీవు కాంతులు నిండినవాడవై కొడుకు తండ్రిని వలె ద్యావా భూములను సంచరించుచు మా దరికి చేరి రక్షించుచున్నావు. ఆ ద్యావా భూములను పూరించుచున్నావు.

    9. అగ్నీ! మానవులు పూర్వము నిన్ను సత్యవంతునిగను మహా మహునిగను, సర్వజనులు పరచారకులుగా గలవానిగను, విన్నపములు వినువాడవుగను ఎరింగినారు. కీర్తిశాలివి. దేవతలకు హితుడవగు నిన్ను స్తుతించినారు. శుభముల కొరకు నిన్ను ఇచట స్థాపించినారు.

    10. యజమాని యజ్ఞ నిష్పాదకుడు. మంచి మనసున్నవాడు. హవిస్సులు అర్పించుటకే ఇచట ఉన్నవాడు. దాత, తపోయుక్తుడు, విద్వాంసుడు. అగ్నీ! అట్టి యజమానికి నీవు ధనమును అందించుచున్నావు.

    11. గులకరాళ్లలారా! మీరు భూమి మీద శాంతులు కండి. సర్వత్ర శాంతులు కండి. పైభాగముననే ఉండండి. చిత్యాగ్నిని ఆశ్రయించండి. మీలోని దేవతా సహితులై - అంగిరసుల చయనమునందు వలె - ఇచట స్థిరముగా ఉండండి.

    12. సోమమా! నీవు సర్వమును వర్థిల్లచేయుము. నీ రేతస్సు విశ్వమందు వ్యాపించునుగాక. అన్నము కలుగుటకు నీవు కారణభూతమవగుము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.