Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
ఆలోచనామృతము:
భారతము మనవ ఇతిహాసమని చెప్పియున్నాను.మానవ సమస్తత్వమును నిశితముగా పరిశీలించిన ఇతిహాసము భారతము.
1. ధర్మరాజాదులు రాజ్యము పోగొట్టుకొని అడవులందు ఇడుములు పడుచున్నారు. బృహదశ్వుడు వారికి నలదమయంతుల కథ చెప్పి వారికి ఊరట కలిగించినాడు. ఇప్పుడు రోమశుడు వచ్చినాడు. అతడు అర్జునుని వద్దనుండి వచ్చినాడు. అర్జునుడు సాధించిన విజయములను గురించి ఇంద్రుడు చెప్పినట్లు చెప్పినాడు. కౌరవులను అర్జునుడు అవలీలగా గెలువగలడని చెప్పినాడు. ఆవిధముగా ధర్మరాజాదులకు మనోధైర్యము కలిగించినాడు. విజయము కలుగునను ఆశ కలిగించినాడు.
కష్టములలో ఉన్నవారికి సాంత్వన వాక్యము పలుకువారు, ధైర్యము చెప్పువారు అవసరము. బృహదశ్వుడు, రోమశుడు ఆ కార్యమును నిర్వర్తించినారు.
రామునకు ఆతిథ్యమిచ్చిన శబరి ఇట్టి కార్యమునే నిర్వహించినది.
2. ఒకేచోట ఉన్న అవే ఆలోచనలు వచ్చును. అందువలన యాత్రలు ప్రతిపాదించినాడు ఇంద్రుడు. రోమశుని మార్గదర్శకునిగా పంపినాడు.
యాత్రలు విజ్ఞానార్జనకు, మనోవికాసమునకు, లోకజ్ఞానమునకు, మనశ్శాంతికి ఉపకరించునని ఆనాడు భారతీయులు తెలుసుకున్నారు. ఈనాడు సకల నాగరక సమాజములు దీనిని గుర్తించినవి. ప్రపంచమందంతటను పర్యటనను ప్రోత్సహించుచున్నారు.
యాత్రలు చేసిన వారికి అవి ఎంత ఉపయోగకరములో తెలియును.
యాత్రలు అనిన గుడ్డిగా తిరిగి వచ్చుటకాదు. ఆయా ప్రదేశములను గురించిన వివరములు ఆసక్తిగా తెలుసుకొనుట. అవి తెలియపరుచుటకు విజ్ఞులయిన వారు అవసరము. రోమశుడు అటువంటివాడు. అతడు అంతకుముందు రెండుసార్లు ప్రపంచమును దర్శించి వచ్చినాడు.
యాత్రలకు వెళ్లునపుడు మార్గదర్శకుడు అవసరము. నేడు కూడ పర్యటనలకు "గైడు"లను నియమించుచున్నారు. వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చుచున్నారు.
రోమశుడు చేయించిన యాత్రలలో ఆలయములు కనిపించవు. అప్పటికి విగ్రహారాధన ఉన్నట్లు లేదు. క్షేత్రములన్నియు ఎక్కువగా నదులు. నదులలో స్నానములను గురించి వివరించినారు. ఒక్కొక్క నదీ స్నానమునకు ఒక్కొక్క మహత్తు చూపినారు.
స్నానములో గొప్ప ప్రభావమున్నదని తెలుసుకున్నవారు భారతీయులే. జీవనదులందు స్నానము చేసిన అనుభవము, అనుభవైక వేద్యము. అది శరీరమునకు ఆరోగ్యము, మనసునకు ఉల్లాసము కలిగించును. వేరు వేరు నదుల స్నానము వేరువేరు అనుభవములను కలిగించును. అందువలనవే అన్ని నదులలో స్నానము చేయవలెననుచున్నారు.
యాత్రలందు, ప్రదేశమందున్న ఆప్రదేశపు చరిత్ర తెలుసుకొనుటలో ఆనందమున్నది. విజ్ఞానమున్నది. మనసు అది జరిగినచోట ఉన్నామని గర్వము కలుగును. ఆచరిత్ర మన ముందు జరుగుతున్నట్లు పులకాంకితులము అగుదుము.
"గయ"ను గురించి ఇచట చెప్పిన కథ అద్భుతమయినది. ఇదే యుద్ధము వలనగాని, నరవధ వలన గాని విఖ్యాతమయిన స్థలముకాదు. గయుని దానము వలన ప్రసిద్ధమయిన చోటు. ఇది మానవునిలోని మానవతకు దాన గుణమునకు, సౌహార్ద్రతకు, దైవత్వమునకు చిహ్నము.
గయా తీర్థము శాంతికి సంకేతము.
3. మానవ ఇతిహాసము అతి దీర్ఘము-అనంతము. మానవ జీవితము సులభము, సుఖ పూరితము అగుటకు అనేకమంది మహాత్ములు, మహామహులు నిరంతరమయిన శ్రమచేసి అనేక అంశములను ఆవిష్కరించినారు. వారు మనకు వందనీయులు, స్తవనీయులు, అట్టి వారిలో అగస్త్యుడు ఒకడు. అగస్త్యుని ఆశ్రమమున ఉండి అగస్త్యుని కథ చెప్పినాడు రోమశుడు. విన్నాడు ధర్మరాజు. ఆవిధముగా అక్కడనే ఉండి ఆ కథ మనమును విన్నట్లు చేసినాడు వ్యాసదేవుడు. వ్యాసదేవునకు నమస్కరించి అగస్త్యుని మహత్తర కార్యములను గురించి ఆలోచింతము.
i) అగస్త్యుడు సమాజ కళ్యాణమునకు అంకితమయిన మహాత్ముడు. అతడు బ్రహ్మచారిగా ఉండియే సమాజ సేవకు అంకితము కాదలచినాడు. జగద్గురు శంకరాచార్యులు బ్రహ్మచర్యము నుండి సన్యాసము స్వీకరించినారు. జైనులందు ఇట్టి ఆచారము ఈనాటికిని ఉన్నది.
గృహస్థము మానవులకు అవసరము. సమాజమునకు అవసరము. అది సత్సంతానమునకు క్రమశిక్షణకు అవసరము. ఈ విషయమును అగస్త్యునకు పితృదేవతలతో చెప్పించినారు. వారు సంకేత మాత్రులు. అసలు చెప్పదలచినది వేరు.
అగస్త్యుడు మహామేధావి. దీక్షాపరుడు. వారికి వివాహము జరిగిన సమాజమునకు మరొక మేధావి లభించవచ్చును. ఆ మేధా సంపద అంతటితో అంతరించరాదు. మహా మేధావుల వీర్యముతో సంతానమును సృష్టించే పరిశోధన ఒకటి అమెరికా దేశమున కొనసాగుచున్నది. అగస్త్యుని వివాహమునకు ప్రోత్సహించుటకు అదియే కారణము కావచ్చును.
విదర్భ రాజు పుత్రిక లోపాముద్ర అగస్త్యుని ప్రభావము వలననే కలిగినది. ఆమెను అగస్త్యుడు వరించుట విడ్డూరముగా కనిపించుచున్నది. ఆమె వయసున చాల చిన్నది. కూతురుతో సమానమయినది. ఆమెను పెండ్లాడుట కూడా ఒక ప్రయోగమువలె కనిపించుచున్నది. తల్లిదండ్రులు వారించినను లోపాముద్ర ముందుకు వచ్చుటకు కారణము ఆమెకు ఈ ప్రయోగము తెలిసి ఉండుట కావచ్చును, లేదా స్త్రీ సహజమయిన కోరిక మంచి సంతానము. అది అగస్త్యుని వలన లభించునని అంగీకరించి ఉండవచ్చును.
ప్రయోగము ఫలించినట్లు కనిపించదు. పుట్టినవాడు అగస్త్యునికి సమానుడు కాలేదు.
ii) స్త్రీ భద్రతను కోరును. లోపాముద్ర సంపదను భద్రత కొఱకు కోరినది. దానిని అగస్త్యుడు సంపాదించిన తీరు గొప్పది. ప్రజాకార్యములకు ఆటంకము కలుగకుండునట్లు డబ్బు సాధించదలచి బృహదశ్వ, శ్రుతపర్వ, ప్రాదశ్వుల వద్దకు వెళ్లినాడు. వారి ఆదాయ వ్యయములు సరిగా ఉన్నవి. వారు ఇల్వలుడు వాతాపిని గురించి చెప్పినారు.
ఇల్వలుడు ధనికుడు. కూడపెట్టుట తప్ప ఖర్చు పెట్టుట తెలియనివాడు. మేధావుల వలన తన సంపదకు హాని కలుగవచ్చునని అతని అభిప్రాయము. అందువలననే ఒక పథకము ప్రకారము వారిని తుదముట్టించ సాగినాడు. అగస్త్యుడు వాతాపిని హతమార్చి ఇల్వలుని శక్తి హీనుని చేసినాడు. పనిలేక మూలుగుచున్న ధనమును ప్రజాకార్యములకు సాధించినాడు. మేధావులను రక్షించినాడు.
అగస్త్యుడు ఇల్వలుని చంపలేదు. ఇల్వలుడు ఉండవలె. వారి ధనము మాత్రము ప్రజలకు ఉపయోగపడవలె. నేటి నాగరక ప్రభుత్వములన్నియు ఈ విషయమున అగస్త్యునే అనుకరించుచున్నవి. రాబడి పన్ను వంటివి విధించుట అందుకు నిదర్శనము.
ఆర్థిక ప్రణాళిక విషయమున అగస్త్యుడు ఆదర్శముగా కనిపించుచున్నాడు.





