Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1
5. నా దేశపు గోవుల వెంట ఎవడు నియుక్తుడు అయినాడు? ఏమి ! ఆ గోవులకు రక్షకుడు లేడా ? నా దేశముపై దండెత్తిన వాడు నశింపవలెను. అగ్ని మా కోరికలను ఎరుగును. అగ్ని మా పశువుల వద్దకు చేరవలెను.
6. ప్రాణులకు స్వామి, జనులకు ఆవాస భూతుడగు అగ్నిని శత్రువులు మర్త్యుల మధ్యదాచి ఉంచెదరు. అత్రిగోత్రోత్పన్న వృశుని స్తోత్రము అగ్నిని విముక్తుని చేయును. నిందకులు నిందనీయులు కావలెను. "నిందితారో నిన్ద్యాసోభవంతు"
7. అగ్నీ ! శునఃశేష ఋషి నిన్ను స్తుతించగా అత్యంత వృద్ధుడగు ఆ ఋషిని సహస్ర యూపమునుండి విముక్తుని చేసినావు. హోతవు, విద్వాంసుడవగు అగ్నీ ! నీవు ఈ వేదిమీద అవతరించుము. మమ్ము సకల పాశములనుండి విముక్తులను చేయుము.
8. అగ్నీ ! నీవు క్రోధించినపుడు మాకు దూరముగా ఉందువని దేవతల వ్రతపాలకుడగు ఇంద్రుడు మాతో చెప్పినాడు. అతడు విద్వాంసుడు. అతడు నిన్ను దర్శించినాడు. అతని ద్వారా అనుశిష్టులమయి మేము నీవద్దకు రాగలము.
9. అగ్ని మహా తేజస్సంపన్నుడయి విచిత్రముగ ప్రజ్వరిల్లును. అగ్ని తన మహిమతో సకల పదార్థములను ప్రకాశింప చేయును. అగ్ని ప్రవద్దుడయి ఆసురీమాయను పరాభూతము చేయును. రాక్షసులను నష్టపరచుటకు అగ్ని తన ఉధృత జ్వాలను తీక్ష్ణము చేయును.
10. శబ్దాయమాన అగ్నిజ్వాల తీక్ష్ణ ఆయుధమువలె రాక్షసులను నష్టపరచుటకు ద్యులోకమున ఉద్భవించును. ఉత్సాహవంతుడగు అగ్నిక్రోధమున జాజ్వల్యమానుడై రాక్షసులను పీడించును. బాధలు కలిగించు అసురసేన అగ్నిని బాధింపజాలదు.
11. బహుభావప్రాప్తుడవగు అగ్నీ ! మేము నీ స్తోతలము. ధీరుడు, కర్మ కుశలుడగువాడు చక్కని రథమును నిర్మించిన రీతి మేము నీ కొఱకుగాను ఈ స్తోత్రమును రచించినాము. నీవు మా ఈ స్తోత్రమును గ్రహించినచో మాకు బహు వ్యాప్త జయ లాభము కలుగును.
12. బహుజ్వాలావశిష్టుడు. అభీష్టవర్షి. వర్థమానుడగు అగ్ని శత్రువుల ధనమును సమస్తమును గ్రహించును. దేవతల అగ్నితో చెప్పినదేమనగా యజ్ఞము చేయువారలకు, హవ్యములు ఇచ్చువారలకు సుఖములు ప్రసాదించుము.
మూడవ సూక్తము
ఋషి - ఆత్రేయుడగు వసుశ్రుతుడు దేవత - అగ్ని, ఛందస్సు - త్రిష్టుప్.
1. అగ్నీ ! నీవు ఉద్భవించగనే అంధకార నివారక వరుణుడవు అగుదువు. సమిద్దుడవయి హితకారక మిత్రుడవు అగుదువు. సమస్త దేవగణములు నిన్నే అనుసరింతురు.
బలపుత్రా ! అగ్నీ ! నీవు హవ్యదాత యజమానికి ఇంద్రుడవు.
2. అగ్నీ ! నీవు కన్యల విషయమున సర్వనియామక ఆర్యమవు. హవ్యవాహన అగ్నీ ! నీవు వైశ్వానరుడను గుప్తనామము కలవాడవు. నీవ దంపతులను ఏక మనస్కులను చేసినపుడు వారు నిన్ను బంధువునువలె గవ్యమున సిక్తము చేయుదురు "సమనసా కృణోషి."
3. అగ్నీ ! నీ ఆశ్రయమునకుగాను మరుద్గణములు అంతరిక్షమును మార్జన సేతురు. రుద్రా ! నీ కొఱకు విద్యుల్లక్షణ, అతివిచిత్ర, మనోహర, అగమ్య విష్ణుపదము ఏర్పడినది. ఆ పదము ద్వారా నీవు ఉదకము యొక్క గుహ్యనామమును పాలించుము.
4. అగ్నీ ! నీ సమృద్ధి ద్వారా ఇంద్రాది దేవగణములు దర్శనీయులు అగుచున్నారు. దేవగణములు నీ విషయమున అత్యంత ప్రేమ కలిగి అమృతమును స్పృశింతురు. ఋత్విక్కులు యజమాని కొఱకు హవ్య వితరణ చేయుచు హోత అగ్నికి పరిచర్యలు చేసెదరు.
5. అగ్నీ ! నిన్ను మించిన మిత్రుడు అన్యుడు ఉండడు. యజ్ఞకారి ఉండడు. పురాతనుడు ఉండడు. భవిష్యత్కాలమున కూడ నిన్నుమించిన స్తుతియోగ్యుడు ఉండడు. నీవు ఏ ఋత్విక్కులనకు అతిథివి అగుదువో అతడు యజ్ఞము ద్వారా మానవ శత్రువులను నష్టపరచును.
6. అగ్నీ ! మేము నీ రక్షణమున శత్రువులను పీడింతుము. మేము ధనాభిలషులము. హవ్యము సమర్పించి నిన్ను వర్థిల్లసేతుము. మాకు యజ్ఞమున బలము యుద్ధమున జయము లభించవలెను. మాకు ధనము సహితముగా పుత్రలాభము కలుగవలెను.
7. అగ్నీ ! మా విషయమున అపరాధము లేక పాపము చేసినవానిని పాపిని చేయుము. విద్వాంసుడవగు అగ్నీ ! మా విషయమున అపరాధముచేసి బాధించిన వానిని పాపకర్మలద్వారా బాధించిన వారిని నష్టపరచుము.
8. అగ్నీ ! పురాతన యజమానులు నిన్ను దేవదూతను చేసి ఉషఃకాలము యజ్ఞములు చేసినారు. నీవు హవ్యములు గ్రహింతువు. ద్యుతిమంతుడవగుదువు. మానవుల ద్వారా సమిద్దుడవయి సాగుదువు.
9. బలపుత్రా ! అగ్నీ ! నీవు పితరుడువు. నీ కొఱకు హవ్యము వహించిన విద్వాంసుడగు పుత్రుని నీవు దరి చేర్చెదవు. పాపములనుండి అతనిని దూరము చేసెదవు.
విద్వాన్ అగ్నీ ! నీవు మమ్ము ఎప్పుడు చూచెదవు? ఎప్పుడు మమ్ము సన్మార్గమునకు ప్రేరేపింతువు?
10. అగ్నీ ! నీవు నివాసప్రదుడవు. పాలకుడవు. నీ నామమునకు నమస్కరించి సమర్పించిన హవిని నీవు స్వీకరింతువు. అందువలన యజమాని పుత్రవంతుడగును. యజమాని అందించు మరింత హవిని అభిలషించువాడును. వర్ధమానుడును అగు అగ్ని బలయుక్తుడయి సుఖములను ప్రసాదించవలెను.
11. అగ్నీ ! నీవు స్వామివి. యువతముడవు. నీవు స్తోతలను అనుగ్రహింతువు. వారి దురితములను దూరము సేతువు. వారికి తస్కరగణములు అగుపించును. తెలియరాని శత్రుభూత మానవులు మాకు దూరము అగుదురు.
12. అగ్నీ ! ఈ స్తోమము నీకు అభిముఖమై సాగును. నివాసప్రదుడగు అగ్నిముందు మేము యాచింతుము. మా అపరాధములు ఉచ్ఛరింతుము. అగ్ని మా స్తుతుల ద్వారా వర్థిల్లవలెను. మమ్ము నిందకుల, అపరాధకుల చేతికి వప్పగించరాదు.
నాలుగవ సూక్తము
ఋషి - ఆత్రేయుడగు వసుశ్రుతుడు దేవత - అగ్ని, ఛందస్సు - త్రిష్టుప్.
1. అగ్నీ ! నీవు ధనములకు స్వామివి. మేము నిన్ను యజ్ఞమున స్తుతింతుము. మేము ధనభిలాషులము. నీ అనుకూలత వలన మేము అన్నవంతులము అగుదుము. మానవసేనను పరాభవింతుము.
2. అగ్నీ ! నీవు హవ్యవాహకుడవు. మమ్ము పాలించువాడవు. నీవు మాకు సర్వవ్యాప్త దీప్యమానుడవయి దర్శనీయుడవగుము. నీవు శుభంకరమగు గార్హపత్య అన్నమును చక్కగా ప్రకాశింప చేయుము. ప్రదానము చేయుము. మాకు బృహత్ పరిమాణమున అన్నము ప్రసాదించుము.
3. అగ్ని మానవులకు స్వామి. మేధావి. పరిశుద్ధుడు. ఇతరులను పరిశుద్ధులను చేయువాడు. ఘృతపుష్టుడు. హోమనిష్పాదకుడు. సర్వవిదుడు. ఋత్విక్కులారా ! అట్టి అగ్నిని సేవించుడు.
అగ్ని దేవతలనుండి సంగ్రహించిన ధనమును మాకు సమభక్తము చేయును.
4. అగ్నీ ! వేదభూమి ఇళాసమానుడయి ప్రతియుక్తుడవగుము. సూర్యరశ్ని ద్వారా దేదీప్యమానుడవయి స్తుతిని స్వీకరించుము.
జాతవేదా ! మేము సమర్పించు సమిధలను స్వీకరింపుము. హవ్య భోజనమునకు దేవతలను ఆహ్వానింపుము. హవ్యములను వహింపుము.
5. అగ్నీ ! నీవు పర్యాప్తుడవు. దాన్తమనస్కుడవు. గృహాగత అతిథివలె పూజనీయుడవు. మేము చేయు యజ్ఞమునకు విచ్చేయుము.
విద్వాన్ అగ్నీ ! నీవు సమస్త శత్రువులను నష్టపరచుము. శత్రుచారణుల ధనమును అపహరించుము.
6. అగ్నీ ! నీవు యాజమానాది రూప పుత్రులకు అన్నదానము చేసెదవు. ఆయుధము ద్వారా దస్యులను వధింతువు. నీవు దేవతలను ఏ కారణమున తృప్తినొందింతువో అదే కారణమున మమ్ము సంగ్రామమున రక్షింపుము.
7. అగ్నీ ! మేము శస్త్రద్వారా నీ పరిచర్య చేయుదుము. మేము హవ్యముల ద్వారా నీపరిచర్య చేయుదుము.
శోధక కళ్యాణ కర దీప్తి విశిష్ట అగ్నీ ! నీవు మాకు అందరకు వరణీయమగు ధనమును ప్రసాదించుము. మాకు సమస్త ధనములను సమకూర్చుము.
8. అగ్నీ ! మా యజ్ఞమును స్వీకరింపుము. బలపుత్రా ! క్షితిజాది త్రిస్థానములందుండు అగ్నీ ! మా హవ్యములను స్వీకరింపుము. మేము దేవతల నడుమ సన్మార్గగాములము అగుదుము. నీవు మమ్ము వాచికాది భేదమున మూడు ప్రకారముల సర్వ వరణీయ సుఖముల ద్వారాగాని త్రితల విశిష్ట గృహముద్వారాగాని రక్షింపుము.
9. జాతవేదా ! నావికుడు నౌకద్వారా నదిని దాటించినట్లు నీవు మమ్ము సమస్త దుస్సహ దురితములనుండి దాటించుము.
అగ్నీ ! అత్రివలె మా స్తోత్రములద్వారా స్తుతుడవయి మా శరీర రక్షకుడవయి కరుణింపుము.
10. అగ్నీ ! మేము మర్త్యులము. నీవు అమరుడవు. మేము స్తుతులు నిండిన గుండెతో స్తవించి నిన్ను మరల మరల ఆహ్వానింతుము.
జాతవేదా ! మాకు సంతానము ప్రసాదించుము. మేము సంతతులద్వారా అవిచ్చిన్న అమరత్వము పొందగలము.
11. జాతవేదా అగ్నీ ! నీవు సుకర్మకృత యజమాని విషయమున సుఖకరముగ అనుగ్రహించినవాడు అశ్వయుక్తుడు, పుత్రయుక్తుడు, వీర్యయుక్తుడు, గోయుక్తుడయి అక్షయ ధనలాభము గలవాడు అగును.
అయిదవ సూక్తము
ఋషి - ఆత్రేయుడగు వసుశ్రుతుడు దేవత - వేరు వేరు నామములుగల అగ్ని, ఛందస్సు - గాయత్రి.
1. ఋత్విక్కులారా ! జాతవేద, దీప్తిమాన్, సుసమిద్ధనామ అగ్నిని సమృద్ధ ఘృతమున హవనము చేయుడు.
2. నరాశంస నామక అగ్ని ఈ యజ్ఞమును ప్రదీప్తము చేయవలెను. నరాశంసుడు అహింసనీయుడు, మేధావి, హస్తవిసిష్టుడగును.
3. అగ్నీ ! నీవు స్తుతుడవగుము. మమ్ము రక్షించుటకుగాను విచిత్రము, ప్రియమగు రథము ద్వారా ఇంద్రుని ఈ యజ్ఞమునకు తీసికొని రమ్ము.
4. బర్హీ ! నీవు కంబళివలె మృదు భావమున విస్తరింపుము. స్తోతలు నిన్ను స్తుతింతురు. దీప్తిమాన్ ! మా కొఱకు ధనప్రదుడవగుము.
5. సుగమన సాధకమగు యజ్ఞద్వారపు అభిమాన దేవేరులారా ! మీరందరు విముక్తులగుడు. మమ్ము రక్షించుటకుగాను ఈ యజ్ఞమున సుసంపన్నము చేయుడు.
6. సురూప, అన్నవర్ధయిత్రి, మహతీ, యజ్ఞనిర్మాత్రి రాత్రి మఱియు ఉషను మేము స్తుతింతుము.
7. అగ్ని ఆదిత్య సముద్భూత హోతృద్వయమా ! మీరు ఉభయులు స్తుతులయి వాయు పథమున పయనింతురు. మా యజమానుల ఈ యజ్ఞమునకు విచ్చేయుడు.
8. ఇళ సరస్వతి మహినామ దేవేరులు సుఖములను సృష్టించవలెను. హింసాశూన్యులయి మా యజమానుల ఈ యజ్ఞమునకు విచ్చేయుడు.
9. త్వష్టదేవా ! నీవు సుఖకరుడవగుము. ఈ యజ్ఞమునకు విచ్చేయుము. నీవు పోషక రూపమున వ్యాప్తుడవు. సమస్త యజ్ఞములందును నీవు మమ్ము ఉత్కృష్ట రూపమున రక్షింపుము.
10. వనస్పతీ ! నీవు ఏ స్థానమున దేవతల గుప్తనామములు ఎరుగుదువో ఆ స్థానమున హవ్యమును ప్రేరేపింపుము.
11. ఈ హవ్యము అగ్ని వరుణులకు స్వాహారూపమున సమర్పించుచున్నాము. ఇంద్రమరుత్తులకు స్వాహారూపమున సమర్పించుచున్నాము.
ఆరవ సూక్తము
ఋషి - వసుశ్రుతుడు, దేవత - అగ్ని, ఛందస్సు - పంక్తి
1. అగ్ని నివాసప్రదుడు. ఎల్లరకు గృహమువలె ఆశ్రయ భూతుడు గోవులు, శీఘ్రగామి అశ్వము. హవ్యములు అందించు యజమానులు అగ్నిని ప్రసన్నుని చేయుదురు. అట్టి అగ్నిని మేము స్తుతింతుము.
అగ్నీ స్తోతల కొఱకు అన్నము సముపార్జించుము. "ఇషం స్తోతృభ్య ఆభర"
2. అగ్ని నివాసప్రదరూపమున స్తుతుడగును. అతనివద్దకు హోమార్ధము గోవులు, శీఘ్రగాములగు అశ్వములు, సత్కులోత్పన్న మేధావులు సమాగతులగుదురు. "ఇషం స్తోతృభ్య ఆభర" స్తోతలకు అన్నము సముపార్జించుము.





