Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1
3. అగ్ని సర్వకర్మ దర్శకుడు. యజమానులకు అన్నయుక్త పుత్రులను ప్రసాదించును. అగ్ని ప్రీతుడయి సర్వత్ర వ్యాపించును. అందరు వరించు ధనము అందించుటకు సాగును. "ఇషం స్తోతృభ్య ఆభర"
4. అగ్నీ ! నీవు దీప్తిమంతుడవు. జరారహితుడవు. మేము నిన్ను సర్వతో భావమున ప్రదీప్తుని చేయుదుము. స్తుతియోగ్యమగు నీదీప్తి ద్యులోకమున ప్రకాశించును. "ఇషం స్తోతృభ్య ఆభర"
5. అగ్నీ ! నీవు సమూహములకు స్వామివి. ఆహ్లాదకుడవు. శత్రువినాశకుడవు. ప్రజాపాలకుడవు. హవ్యావాహనుడవు. దీప్తుడవు అగుము. నీ కొఱకు మంత్రముల సహితముగ హవ్యములు హుతములు అగును. "ఇషం స్తోతృభ్య ఆభర"
6. లౌకికాగ్ని గార్హపత్యాది అగ్నులందు సమస్త వరణీయ ధనమును పోషించును. అగ్ని ప్రీతి దానము చేయును. నలువైపుల వ్యాప్తుడగును. అనవరతము అన్నమును ఇచ్చగించును. "ఇషం స్తోతృభ్య ఆభర"
7. అగ్నీ ! నీ కిరణములు అత్యంత అధిక అన్నయుక్తములయి వర్థిల్లవలెను. ఆ కిరణములు ఖురయుక్త గోసమూహములను వాంఛించును. హోమమును ఆకాంక్షించును. "ఇషం స్తోతృభ్య ఆభర"
8. అగ్నీ ! మేము అందరమును నీ స్తోతలము. నీవు మాకు నూతన గృహయుక్త అన్నమును దానము చేయుము. మేము నిన్ను ప్రత్యేక యజ్ఞగృహమున అర్చింతుము. నీ వలన దూతలాభము పొందగలము. "ఇషం స్తోతృభ్య ఆభర".
9. హే ఆహ్లాదక అగ్నీ ! నీవు ఘృత పూర్ణుడవయి దర్వీదయమును ముఖమున గ్రహింతువు. నీకు మాకు యజ్ఞఫలములను ప్రసాదించుము. మమ్ము పరిపూర్ణులను చేయుము. "ఇషం స్తోతృభ్య ఆభర"
10. ఈవిధముగా జనులు అనుషక్త అగ్నివద్దకు స్తుతి, యజ్ఞసహితులయి సాగుదురు. అగ్నిని ప్రతిష్ఠింతురు. అగ్ని మాకు పుత్రపౌత్రాదులను, వేగవంతములగు అశ్వములను ప్రసాదించవలెను. "ఇషం స్తోతృభ్య ఆభర"
ఏడవ సూక్తము
ఋషి - ఆత్రేయుడు ఇషుడు దేవత - అగ్ని, ఛందస్సు - అనుష్టుప్, చివరిది పంక్తి.
1. అగ్ని అత్యంత ప్రవృద్ధుడు. బలపుత్రుడు, బలశాలి. స్నేహితులగు ఋత్విక్కులారా ! యజమానుల కొఱకు అట్టి అగ్నిని అర్చించుడు. అతనికి యోగ్యమగు అన్నములను స్తుతులను సమర్పించుడు.
2. ఎవనిని పొంది ఋత్విక్కులు ప్రీతులగుదురో, ఎవనిని యజ్ఞగృహమున ప్రదీప్తము చేయుదుమో, ఎవని కొఱకు జంతువులు ఉత్పన్నములగునో ఆ అగ్ని ఎక్కడ?
3. మేము అగ్నికి అన్నము సమర్పించినపుడు అగ్ని మానవుల హవ్యములను స్వీకరించినపుడు అప్పుడు అగ్ని ద్యోతమానుడయి అన్నసామర్ధ్యమున జలగ్రాహక రశ్ములను గ్రహించును.
4. పావకుడు జరారహితుడగు అగ్ని వనస్పతులను దహించినపుడు రాత్రులందు సహితము దూరమునందున్న వ్యక్తిని గుర్తించగలడు.
5. అగ్నియొక్క పరిచర్య కార్యమున క్షరితములగు ఘృతములను అధ్వర్యాదులు జ్వాలల మధ్య ప్రక్షిప్తము చేసెదరు. కొడుకు తండ్రి తొడమీద కూర్చున్నట్లు ఘృతధారలు అగ్నిమీదకు ఆరోహించును.
6. యజమానులు అగ్నిని తెలియుదురు. అగ్ని వారి ద్వారా స్పృహణీయము, అందఱకు ఆధారభూతమగు అన్నమును రుచికరము చేయును. అగ్ని యజమానులకు నివాప్రదుడు అగును.
7. అగ్ని తృణచ్చేదక పశువులవలె నిర్జలము, తృణకాష్ఠపూర్ణమగు ప్రదేశమును ఛిన్నాభిన్నము చేయును. అగ్ని బంగరు మీసములవాడు. ఉజ్వలదంతుడు. గొప్పవాడు. అప్రతిహతుడు. బలసంపన్నుడు.
8. అగ్ని దేప్తుడు. అతని వద్దకు జనులు అత్రివద్దకువలె చేరుదురు. అతడు గొడ్డలివలె వృక్షములను నాశనము చేయును. అగ్ని అన్నమును గ్రహించువాడు. జగములకు ఉపకారకుడు. అరణిమాత అట్టి అగ్నిని ప్రసవించినది. కన్నది.
9. హవ్యభోజాగ్నీ ! నీవు సకలమును భరించువాడవు. మా స్తుతులు నిన్ను సుఖప్రదుని చేయవలెను. నీవు స్తోతలకు ధనదానము చేయుము. అన్నదానము చేయుము. అంతఃకరణ దానము చేయుము.
(మంచి మనసును ప్రసాదించుమను ప్రార్థన ఉదాత్తము)
10. అగ్నీ ! ఇట్లే ఇతరులద్వారా అకృత్య స్తోత్రములు ఉచ్చరించు ఋషి నీవలన పశులాభము పొందును. అగ్నికి హవ్యదానము చేయని దస్యుని అత్రి మరల మరల పరాభూతుని చేయవలెను. విరోధులను మరల మరల పరాభూతులను చేయవలెను.
("అధ్రిజః అధృతమన్యైరగ్ని వ్యతిరక్తైః" అని శాయణుడు. అగ్ని వ్యతిరేకులగు అన్యులు అని అర్థము)
ఎనిమిదవ సూక్తము
ఋషి - ఆత్రేయ ఇషుడు, దేవత - అగ్ని, ఛందస్సు - జగతి.
1. అగ్నీ ! నీవు బలకర్తవు. పురాతనుడవు. పురాతన యజ్ఞకారులు ఆశ్రయ లాభమునకుగాను నిన్ను చక్కగా ప్రదీప్తుని చేయుదురు.
అగ్నీ ! నీవు అత్యంత ప్రీతిదాయకుడవు. యోగ యోగ్యుడవు. బహు అన్న విశిష్టుడవు. గృహపతివి. వరణీయుడవు.
2. అగ్నీ ! నిన్ను యజమానులు గృహస్వామి రూపమున ప్రతిష్టించినారు. నీవు అతిథివలె అత్యంత పూజ్యుడవు.
అగ్నీ ! నీవు పురాతనుడవు. దీప్తిశిఖావిశిష్టుడవు. ప్రభూత కేతు విశిష్టుడవు. బహురూపుడవు. ధనదాతవు. సుఖప్రదుడవు. సురక్షకుడవు. జీర్ణవృక్ష ధ్వంసకారివి.
3. అగ్నీ ! నీవు హోమ విదుడవు. వివేకివి. రత్నదాతలలో శ్రేష్ఠుడవు. గుహాస్థితుడవు. దర్శనయోగ్యుడవు. ప్రభూత ధ్వనియుక్త యజ్ఞకారివి. ఘృతగ్రాహకుడవు. సుందరుడవు. ధనవిశిష్టుడవు.
అగ్నీ ! మనుష్యగణములు నిన్ను స్తుతించును.
4. అగ్నీ ! నీవు సర్వము భరించువాడవు. మేము బహువిధ స్తోత్రములు, నమస్కారములద్వారా నిన్ను స్తుతింతుము. నీవద్దకు చేరుదుము.
అగ్నీ ! నీవు మాకు ధనము ప్రసాదించుము. ప్రీతులను చేయుము. అంగిరపుత్రా ! అగ్నీ ! నీవు చక్కగా ప్రదీప్తుడవగుము. నీ శిఖల ద్వారా యజమానికి అన్నము కలిగించుము. ప్రీతుని చేయుము.
5. అగ్నీ ! నీవు బహురూపయుక్తుడవు. పురాతన కాలము నుండి యజమానులకు అన్నదానము చేయుచున్నావు. నీవు నీ స్వబలమున బహు అన్నములకు స్వామివి అయినావు. నీవు దీప్తిమంతుడవు. నీ దీప్తికి సరివచ్చువారులేరు.
6. యువతను అగ్నీ ! నీవు చక్కగా వెలుగొందుము. దేవతలు నిన్ను హవ్యవాహనుని చేసినారు. దేవతలు మఱియు మానవులు ప్రభూత వేగశాలి, ఘృతయోని, ఆహుత అగ్నిని వృద్ధి ప్రేరకునిగను, దీప్తిమంతుడుగను, చక్షుఃస్థానీయునిగను చేసి భజించినారు.
7. అగ్నీ ! పురాతనులును, సుఖాభిలాషులును అగు యజమానులు నిన్ను ఘృతము ద్వారా ఆహ్వానింతురు. సుందర సమిధలతో ప్రదీప్తుని చేయుదురు.
అగ్నీ ! నీవు వర్థిల్లుము. ఓషధులతో సిక్తుడవగుము. పార్థివ అన్నమును వ్యక్తపరచి అవస్థితుడవు అగుము.
దాశరథి లక్ష్మణాచార్య బుచ్చమాంబల పౌత్రుండును. విద్వాన్ వేంకటాచార్య వేంకటాంబల పుత్రుండును - ఆంధ్ర ఆస్థానకవి దాశరథి కృష్ణమాచార్య అనుజుండును - కమలానామ్మి ధర్మపత్నీ సమేతుండును ఆంగ్లమునుండి 'దేవుని పేరిట'నవల, ఉర్దూనుండి 'కవయిత్రి కథ' నవల, భిలానీబాను కథలు తెలుగునకు అనువదించిన వాడును, తెలుగు అఫ్పానే, పేరిట తెలుగు కథలను ఉర్దూలోనికి అనువదించిన వాడును, "కొక్కొరోకో" "నీలిదీపాలు" "బీళ్లు తిరగబడుతున్నాయ" తెలుగు రేడియో నాటకముల హింది అనువాదకుడును, జిగర్, జవుఖ్, ఇక్బాల్ ఉర్దూ కవితల తెలుగు అనువాదకుడును, అనేక గ్రంథకర్తయునగు దాశరథి రంగాచార్య విరచిత ఆంధ్రవచన ఋగ్వేద సంహితమున మూడవ అష్టకము సమాప్తము.
సర్వేజనాః సుఖినోభమస్తు.
(అయిపోయింది)




