Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    ఆ విధముగా అగస్త్యుడు పుత్ర, పౌత్రవంతుడయి పితరులకు పుణ్యలోకములు కలిగించినాడు.
    కృతయుగమున కాలకేయులను రాక్షసులుండిరి. వారికి వృత్రాసురుడు నాయకుడు. వృత్రుడు దేవతలను బాధించసాగినాడు. దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్లినారు. వృత్రుని బాధలకు తాళలేకున్నామని మొరపెట్టుకున్నారు. బ్రహ్మ వారి మొరలు విని ఉపాయము చెప్పినాడు. "సరస్వతీ నదీ తీరమున దధీచి అను మునీంద్రుడు తపము చేయుచున్నాడు. అతని దేహమందుగల ఎముకలు వజ్రాయుధముల వంటివి. వానిని మీరు తీసుకొని వృత్రుని సంహరించుడు".
    దేవతలు బ్రహ్మ మాటలు విన్నారు దధీచి వద్దకు వెళ్లినారు. "మహాత్మా! నీ దేహమునందలి ఎముకలు దేవతలకు ఇచ్చిన వారికి మేలుకలుగును. నీకు కీర్తి కలుగును" అని ప్రార్థించినారు. దధీచి దేవతలకు మేలు చేయుటకుగాను తన ప్రాణములను విడిచినాడు. దేవతలు అతని వెన్నెముకను తీసుకున్నారు. విశ్వకర్మ దధీచి వెన్నెముకతో వజ్రాయుధము సృష్టించి ఇంద్రునకు ఇచ్చినాడు. వజ్రాయుధము ధరించి ఇంద్రుడు వృత్రునితో ఘోర యుద్ధము చేసినాడు. వృత్రాసురుని వధించినాడు. వృత్రాసురుడు హతుడుకాగా, కాలకేయులు బలహీనులు అయినారు. వారు సముద్ర జలములందు చేరినారు. వారు పగలంతయు సముద్రమున ఉండి, రాత్రులు బయటికి వచ్చి మునులను వధించ సాగినారు. వారు వశిష్ఠుని ఆశ్రమమున 97 మందిని, చ్యవనుని ఆశ్రమమున 100 మందిని, భరద్వాజుని ఆశ్రమమున 20 మందిని చంపి తిన్నారు. ఆవిధముగా వారు భీతావహము సృష్టించుట వల్ల యజ్ఞ, యాగాది క్రతువులు ఆగిపోయినవి. దేవతలు హవిర్భాగములను కోల్పోయినారు. అప్పుడు దేవతలందరు వైకుంఠమునకు వెళ్లినారు. నారాయణునకు భక్తి పూర్వకముగ నమస్కరించినారు, స్తుతించినారు:-
    "ప్రభూ! నీవు వరాహరూపమున భూమిని ఉద్ధరించినావు. నారసింహ రూపమున హిరణ్యకశివుని వధించినావు. వామన మూర్తివయి బలిచక్రవర్తిని అణగద్రొక్కినావు. ప్రస్తుతము కాలకేయుల వలన జగత్తునకు ఉపద్రవము సంభవించినది. నీవు జగద్రక్షకుడవు. కాలకేయులను వధించి జగత్తును రక్షింపుము" అని ప్రార్థించినారు.
    "దేవతలారా!" విష్ణువు అన్నాడు "కాలకేయులు సముద్రమందుండు మహాబలవంతులు. సముద్రమందలి నీరు తగ్గించి వారిని వధించవలసి ఉన్నది. అందుకు మిత్రావరుణుని పుత్రుడు అగస్త్యుడు సమర్థుడు. అతడు మహా తపస్సంపన్నుడు. అతనిని ప్రార్థించుడు".
    ఇంద్రాది దేవతలు విష్ణుదేవుని మాటలు విన్నారు. అగస్త్యుని వద్దకు వెళ్లినారు. అగస్త్యుని ప్రార్థించినారు:-
    "మహాత్మా! పూర్వము వింధ్య పర్వతమును అణచి లోకమును కాపాడినావు. ఇప్పుడు కాలకేయుల వలన జగమునకు ఉపద్రవము కలిగినది. వారు సముద్రమున దాగి మానవాళికి ఉపద్రవము కలిగించుచున్నారు. మహా సముద్ర జలమును త్రాగుటకు నీవే సమర్థుడవు కావున సముద్ర జలమును త్రాగి, కాలకేయులను వధించుటకు సాయము చేయుము".
    అగస్త్య మునీంద్రుడు దేవతల మాటలు విన్నాడు. మానవాళిని రక్షింతునని మాట ఇచ్చినాడు. దేవతల వెంట సముద్రమునకు చేరినాడు. అచ్చటికి సకల దేవతలు, మహామునీంద్ర, గరుడ, గంధర్వ, సిద్ధ, సాధ్య, విద్యాధర, నాగేంద్ర, కిన్నెర, కింపురుషాదులు వచ్చినారు. వచ్చినవారు సముద్రమును చూచినారు.
    సముద్రము భయంకరముగా ఉన్నది. సముద్రపు ఎత్తైన కెరటములు వేగముగా వచ్చి నేలను ముంచునట్లున్నవి. మహావేగవంతమయిన వాయువుతో గూడి పర్వత గుహలను ఆక్రమించుచున్నవి. సముద్రము మహాఘోష పెట్టుచున్నది. అది గర్జించుచున్నది. సముద్రమునందు ఉన్న గొప్ప నురుగు సముద్ర దరహాసమువలె ఉన్నది. మొసళ్లు సర్పముల వంటి క్రూర మృగములు కలిగి భీకరముగా ఉన్నది. సముద్ర గర్జనకు దిక్కులు ప్రతిధ్వనించుచున్నవి.
    అగస్త్యుడు సముద్రమును తదేకముగా చూచినాడు.
    దేవతలు మున్నగువారు ఆసక్తిగా చూచినారు.
    అగస్త్యుడు దీక్షగా చూచినాడు.
    దేవతలు ఊపిరి బిగపట్టి చూచినారు.
    అగస్త్యుడు సముద్రమును పిలిచినాడు, పీల్చినాడు.
    దేవతలు ఆశ్చర్యపడి చూచినారు.
    అగస్త్యుడు సముద్ర జలము సాంతము ఖాళీ చేసినాడు. సముద్రము ఎండిపోయినది. క్రూర జల జంతువులతో కాలకేయులు బయటపడినారు. దేవతలు కాలకేయులతో యుద్ధము చేసినారు. యుద్ధమున చాలామంది రాక్షసులు హతమారినారు. మిగిలినవారు పాతాళమునకు పారిపోయినారు.
    దేవతలు అగస్త్యుని అనేక విధముల స్తుతించినారు:-
    "మహాత్మా! లోకమును మహోపద్రవము నుండి రక్షించినావు. జగత్తునకు మహోపకారము చేసినావు. సముద్రమున జలము లేకుండుట యుక్తము కాదు. జల శూన్యమయిన సముద్రమున జంతువులు జీవించలేవు. కావున మరల సముద్రమును నింపుము".
    "దేవతలారా! నేను త్రాగిన జలము నా ఉదరమున జీర్ణమయినది. సముద్రమును మరల నింపుటకు వేరొక ఉపాయము ఆలోచించుడు" అన్నాడు అగస్త్యుడు.
    దేవతలు అగస్త్యునకు నమస్కరించి వెళ్లిపోయినారు.
    ధర్మరాజు రోమశుని ఇట్లు అడిగినాడు:-
    "ఏమి కారణమున వింధ్య పర్వతము పెరిగినది? అగస్త్యుడు ఏవిధముగా వారించినాడు?".
    రోమశుడు చెప్పిన కథ ఇట్లున్నది. సూర్యుడు మేరుపర్వతము చుట్టు తిరుగుచుండును. తన చుట్టూ సూర్యుడు తిరుగకుండుటకు వింధ్య పర్వతము కోపించినది. అది ఆకాశము వరకు పెరిగినది. అందువలన సూర్యచంద్రులు గతులు తప్పినారు. పగలు లేకపోయినది. చీకట్లు కమ్మినవి. లోకము గాఢాంధకారమున మునిగినది. అప్పుడు ఇంద్రాది దేవతలు అగస్త్యుని వద్దకు వచ్చి లోకముల చీకట్లు బాపి రక్షించ వలసినదని ప్రార్థించినారు. అగస్త్యుడు దేవతల ప్రార్థనలు విన్నాడు. లోపాముద్రను వెంట పెట్టుకున్నాడు. వింధ్యపర్వతము వద్దకు వెళ్లినాడు. "వింధ్య పర్వతమా! నేను దక్షిణమునకు వెళ్లుచున్నాను. నాకు మార్గమును ఇమ్ము" అన్నాడు. వింధ్య పర్వతము వినయపూర్వకముగా వంగినది. దారిని ఇచ్చినది. అప్పుడు అగస్త్యుడు వింధ్య పర్వతముతో "నేను మరల ఉత్తర దిక్కునకు వెళ్లువరకు నీవు ఈప్రకారముననే వంగి ఉండుము" అన్నాడు. అందుకు వింధ్య పర్వతము సమ్మతించినది.
    అగస్త్యుడు లోపాముద్ర సహితముగా దక్షిణ దిక్కునకు వెళ్లినాడు. లోక కళ్యాణము కొఱకు అతడు దక్షిణ ప్రాంతమందే ఉండిపోయినాడు. అందువలన వింధ్య పర్వతము వంగియే ఉండిపోయినది.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.