Read more!
 Previous Page Next Page 
రాక్షసీ...! నీ పేరు రాజకీయమా? పేజి 3


    స్వాములను మించిన పాలకులు; పాలకులను మించిన స్వాములు ప్రజాసేవలో అతి జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయానికొచ్చేరు. అజ్ఞానులని సర్టిఫికెట్టు పుచ్సుకున్న ప్రజాస్వాములకీ; ప్రభువులకీ తలలొంచేసింది. పరిపాలనద్వారా పాలకులు; జ్ఞాన బోధనద్వారా స్వాములూ అభివృద్ధి కాముకులే మరి.
    ఎందరెందరో స్వాములొచ్చి తిమ్మాపురంలో జ్ఞాన బోధలుచేసి వెళ్ళటం ఎక్కువైంది.
    నీతిగా బతుకు. నీ పక్కవాడిని ఆదరించు. ఉన్నంతలో తృప్తిచెందు. నిరంతరం పరమాత్మపట్ల ఆలోచనలు చేయి. మద్యపానం చేయకు. జూదం ఆడకు, ఎవర్నీ నిందించకు- వగైరాలు ప్రజలకు తెలీదని స్వాములకు తెలుసు. 'ఎవరో వచ్చి నీతిబోధించి వెళ్ళారే గాని మాకై మాకు నీతి గురించి తెలీదు.....'బొత్తిగా తెలీదు. అనుకునే మనిషిని ముక్కుమీద గుద్ది వెళ్ళిపోడం స్వాములకే సులువు. అలాటి మనిషిని బురదలో కుక్కడం పాలకుడికి మరింత సులువు.
    చొక్కా లాగూ వేసుకునే మనిషి నీతిగురించి చెబితే తిమ్మాపుర వాస్తవ్యులు చెవొగ్గి వినరు. ప్రత్యేకించి- అలా చెప్పడానికో వేషం కావాలి. ఆచరించడం అటుంచి, నీతి, ధర్మం వగైరాలు నీకెంత తెలుసో, ఆ స్వామికి అంతే తెలుసని ఎవడైనా పొగరు మనిషి ఖర్మం గాలి అని వుంటే, ఆ మనిషి కళ్ళు పీకేస్తారు తోటివాళ్ళు.
    తిమ్మాపురం- ప్రస్తుతం- ఆ స్థితిలో వుంది.
    తిమ్మాపురానికి కొత్తగా స్వామి ఆనంద భైరవులొచ్చేరు. ఆనందభైరవులొచ్చి అప్పుడే పక్షంరోజులు గడిచిపోయేయి. ఈ స్వామితో ఆ పురానికి వచ్చిన స్వాముల సంఖ్య నలభై రెండు, ఏ స్వామి ఎన్నిసార్లు వచ్చినా పురవాసుల భక్తిపూజలు కించిత్తయినా తగ్గవు. ఏ స్వామి చెప్పివుంటారోగాని-ఆనంద భైరవులు తిమ్మాపురానికి వేంచేయక ముందే, తిమ్మాపురంలో వున్నటువంటి అజ్ఞాన వాతావరణానికి కలత చెందినట్టు వేం చేసిన మొదటి రోజునే ప్రకటించియున్నారు. ఆ రోజు లగాయితూ తమ శాయశక్తులా అజ్ఞాన వాతావరణాన్ని బాగుచేసే ప్రయత్నంతో వున్నారు వారు.
    రోగిని డాక్టరుబాబు పరామర్శించడం ఆ బాబు వృత్తి ధర్మం. అజ్ఞానంతో కళ్ళు పోగొట్టుకున్న ప్రజకి 'జ్ఞానబోధ' అనే స్వామివారి ఖరీదైన వైద్యం గూడ నిజానికి వారి వృత్తి ధర్మమే మరి! కాని, స్వామివారి 'సేవ'ని 'వృత్తి' అని చెప్పి ప్రచారంచేస్తే కళ్ళు నిజంగానే పోతాయని బోర్డు కట్టడంవల్ల- ప్రచారం చేద్దామనుకున్న ఒకరిద్దరు పొగరుబోతు వెధవలు భయపడి జారుకున్నారు.
    ఏ స్వామి ఎప్పుడొచ్చినా తెలివిగల పౌరులు జుత్తు కత్తిరించి బోడిగుళ్ళతో కనుపించడం వాళ్ళ భక్తికి చిహ్నమని గుర్తించేరు.
    మనిషికి తల వుండొచ్చు. తలమీద షోకైన వెంట్రుకల్ని షోకుగా పెంచడం అతని అహాన్ని తెలీజేస్తుందనే బెంగచేత స్వామి రాకని పురస్కరించుకుని ఆ పౌరులు కొందరు బోడి గుళ్ళతో వుంటారు.
    నిష్కాముకుడైన మనిషికి బోడితల చిహ్నమనే తెలివితేటలు వాళ్ళకి లేకపోలేదు.
    కనుక తలమీద వెంట్రుకల్ని తొలగించేస్తే చాలు- సాధువై, నిరంతర భగవత్సేవాసక్తుడై, లౌకిక వాంఛలకు దూరమై, కేవలం లోక కళ్యాణార్ధమై పాటుపడే సచ్చరితుడనే సర్టిఫికెట్టు పుచ్చుకున్నాడనే అర్ధం!
    ఈ అర్ధ స్ఫురణకొరకు తెలివిగల పౌరులు కొందరు పడి ఛస్తారు. వాళ్ళు, అస్తమానం బోడితలతో రోడ్లు తిరగడం చిరాకు గనక, కనీసం స్వామి రాకననుసరించైనా తాత్కాలికంగా- వేషం మార్చుకోవడం అవసరమని వాళ్ళకి బాగా తెలుసు.
    ఎవరో మంత్రి పుంగవులు వేం చేయబోతున్నారనే వార్త వింటేనే తప్ప తిమ్మాపురం తాలూకు మురికి రోడ్లు శుభ్రపరచడం జరగదు- స్వామిరాకను వింటేనేగాని తిమ్మాపురం వాస్తవ్యుల తలలుమారవు. మంత్రి పుంగవులు వెళ్ళడంతోటే ఆ రోడ్లు మళ్ళా నరకానికి దారులై పోవడం లాగానే స్వామి వెళ్ళిపోవడంతోటే ఆ బోడితలలు షోకుగా పెంచడం జరుగుతుంది.
    అక్కడి మురికి రోడ్లకి, అక్కడి తెలివి తలలకి అంత అవినాభావ సంబంధం మరి!
    ఆ సాయంత్రం స్వామి ఆనంద భైరవుల గంభీరోపన్యాసం ఆ పార్కులో ఏర్పాటు చేయబడ్డది.
    వందలాది జనం జ్ఞానం సమపార్జన నిమిత్తమై స్వామిసభకి హాజరయ్యేరు. ఇంతటి డిమేండ్ నీ, జన సముదాయాన్నీ చూచిన స్వాములు పరవశులై చెప్పబోయే గీతా రహస్యం చప్పున స్ఫురించక, ఒకింత కళ్ళు మూసుకుని ధ్యాన నిమగ్నులై వున్న సమయాన్ని కనిపెట్టిన వారు పుర ప్రభువు శ్రీ రామదాసు.
    శ్రీ వారికి పురపాలనలో మనశ్శాంతి దూరమైన తరుణంలో స్వామివారి రాక గొప్ప ఉపకారంచేసి పెట్టింది.
    వారిపట్ల ప్రజలకి గల భక్తి శ్రద్దలను గమనించి, అటునుంచి నరుక్కురమ్మన్నారనే ఆర్యోక్తిని పాటించి స్వామివారి పాదసేవ కడుగామారి తద్వారా భక్త చింతామణి అనే అదనమైన అర్హతణు పొంది ధన్యుడయ్యెరు రామదాసు.
    స్వామీజీ యింకా కళ్ళు తెరవలేదు.
    అందంగా అలంకరించబడిన వేదిక. స్వామివారి ప్రక్కనే ఆసీనులై వున్నారు రామదాసు.
    సభ దైవ చింతన చేత కాబోలు నిశ్శబ్దంగా వుంది.
    అదను కనిపెట్టి రామదాసు లేచి నిలబడ్డారు. ఆయన నున్నటి గుండు దీపాల వెలుగులో తళుక్కున మెరిసింది. ఆయన కళ్ళల్లో ఒక దివ్యజ్యోతి వెలిగే ఉంటుందని వారు భావించడంవల్ల- కళ్ళింతవి చేసుకుని చేతులు అతి వినయంగా జోడించి సభ నుద్దేశించి అన్నారు.....
    "ఇవాళ చాలా సుదినం. తిమ్మాపురం చరిత్రలో ఈ రోజు కెంతో ప్రాముఖ్యం వుంది: వుంటుంది. శ్రీ స్వామివారు తిమ్మాపురం వేంచేయడం యిది ప్రధమం. అయితే, శ్రీ స్వామివారిని తరచూ రావలసిందిగా మనందరి తరపునా నేను ప్రార్ధించి వున్నాను. జవాబు అనుగ్రహించేరు కాదు. వారి అనుగ్రహంకోసం మనం ఎదురుచూద్దాం.....శ్రీ స్వామివారు ఇక్కడ చేరిన భక్తకోటికి అమూల్యమైన ఉపదేశం చేయడానికి వచ్చిన మాట నిజం. కాని, ఇప్పుడు వారెందుకో సంశయిస్తున్నట్టు పసిగట్టేను. "భూమీద తాండవిస్తున్న పాపం శ్రీ స్వామివారి మనసుని గాయపరుస్తోంది. పదిహేను రోజులపాటు వారిని అంటి పెట్టుకు తిరుగుతున్న వాడిని గనుక నేనీ నిజాన్ని గ్రహించగలిగేను. ఈ పాప భూయిష్టమైన వాతావరణాన్ని చక్కబరచే నిమిత్తమే శ్రీ స్వామివారు దేశాటనం చేస్తున్నారు."

 Previous Page Next Page