Read more!
 Previous Page Next Page 
మళ్ళీ వచ్చిన వసంతం పేజి 3

 

   వసంతం వచ్చేసింది. అయితే వసంతం అందరికీ ఆనందాన్నే యిస్తుంది. ఒకవేళ ఆ వసంతమే కొందరికి గ్రీష్మము కూడా అవుతే!!
   
    'శారదా' గుండెలకి హత్తుకున్నాడు రామం.
   
    'నా ఆనందానికి మాటలు చాలవు' కౌగిలి బిగిసింది. శారద మాట్లాడలేదు.
   
    'మాట్లాడు శారదా - 'రామం శారదతలలో మల్లెదండ సరిచేశాడు. శారద మాట్లాడలేదు.
   
    "పుట్టబోయే బుల్లిపాపాయి కోసము నాకు ప్రమోషన్ కూడా ఇప్పిస్తున్నాడు 'ఎవడూ' -శారద ఒత్తిగిలింది.
   
    'అదే - దేవుడు'
   
    'దేముడూ లేడు దెయ్యమూ లేదు - నేనసలు -'
   
    'పెళ్ళే చేసుకోనన్నావు కదూ' రామం గలగలా నవ్వాడు.
   
    శారద మనసు ఎటో వెళ్ళిపోయింది. నిజమేగా - రామం తనని వెక్కిరిస్తున్నాడా - పెళ్ళే చేసుకోనంది - పెళ్ళి చేసేసుకుంది - పిల్లల్ని కననంది - పిల్లల్ని కనడానికి సిద్దంగా వుంది. ఒకవేళ ఈపిల్ల ఆడపిల్లయితే !! శారద గుండెదడదడా కొట్టుకుంది అతి వేగంగా 'నో-నో' -అరిచింది.
   
    'ఏమిటీ - ఏమిటీ' - ఖంగారుపడి పోయాడు రామం.
   
    'నువ్వు స్కానింగ్ చేయించుకోకు.....ఎవరయితేనేం - ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, ఇంకా కావాలనుకుంటే మళ్ళీ అమ్మాయి, మళ్ళీ అబ్బాయి' - చూడు నీ ముఖం అప్పుడే ఎంత అందంగా వుందో - ఇదే నేమో - చూలింత కళ అంటారు.
   
    రామం అన్నమాటలంటుంటే శారద ముఖంవిప్పారలేదు. రామం ముఖం చిన్నబోయింది.
   
    "ఎంత ఆనందాన్నయినా క్షణం లోతుంచేయటం నీలాటి వాళ్ళకే సాధ్యం" -రామం గదిలోంచి బయటకెళ్ళి, సిగరెట్టు ముట్టించాడు'.
   
    "ఎంత ఆనందం' - సార్ధ మాటవిని లోపలకొచ్చాడు.
   
    'ఎంత ఆనందం' - రెట్టించింది శారద.
   
    'బోలెడంత - నేను తండ్రిని అవుతున్నా. నువ్వు తల్లి అవుతున్నావు ఇంతకన్నా ఆనందమేమిటి - మనిషి జీవితంలో కోరుకునే మహా భాగ్యమిది."
   
    "ప్లీజ్ మాట్లాడవద్దు ఇంక నేను స్కానింగ్ కి వెళ్ళి వచ్చిన తరువాత ఆనందాల గురించి మాట్లాడుకుందాం" - శారద లైటు ఆర్పేసింది. రామం చీకట్లోనే తిరిగే ఫాను వంక చూస్తున్నాడు నిద్ర రాక.
   
    'ఆడపిల్లయితే మాత్రం ఎలాటి సందేహం లేకుండా తీయించి పారేస్తాను' - శారద గట్టిగా కళ్ళు మూసుకుంది మనసులో అనుకుంటూ వారంరోజులు వూరికే గడిచిపోయాయి. డాక్టరు వూరినించి వచ్చింది. రామం, శారద డాక్టరుని కలిసారు.
   
    "స్కానింగ్ చేయించుకోక పోతేనేం - అసలు స్కానింగ్ ఉద్దేశం ఏమిటో తెలుసా. సరిగ్గా పెరుగుదల అవివున్నాయా, ఏదైనా పొరబాటు వుందా తెల్సుకోడానికి - నీలాటి వాళ్ళు ఆడపిల్లా, మగ పిల్లాడా కనుక్కుందుకు దాన్ని ఉపయోగించుకుంటున్నారు -అంతే రామం కోపంగా అన్నాడు.
   
    "అంటే - నా మాటకి విలువలేదా - ఆడపిల్లయితే నాకొద్దు - అంతే" శారద మొండిగా వాదించింది.
   
    "నీ భయం కాని - వాళ్ళు మగపిల్లాడని చెప్తే"-
   
    "చెప్తే - అంతకన్నా కావలసింది ఏముంది' - శారద కళ్ళు ఆనందంతో మెరిసాయి.
   
                                      *    *    *
   
                                            2   
   

    రామం వద్దంటున్నా శారద ఆటోలో వెళ్ళిపోయి స్కానింగ్ నర్సింగ్ హోమ్ దగ్గర దిగింది. తనెందుకు ఈ పని చేయటం. ఆడపిల్లకావాలనుకునే వారికీ ఇచ్చేయచ్చుగా. అలాకాకపోతే ఏ అనాధ శరణాలయం గేటుముందరో వదిలేయచ్చుగా - అమ్మబాబోయ్ - ఆడపిల్లనిపెంచి, నిర్దాక్షిణ్యంగా బ్రోతల్ హౌస్ లోదించే పరమకిరాతులున్న సంఘం ఇది నాకు ఆడపిల్ల వద్దు - నో, నో! - శారద గబగబా నర్సింగ్ హోమ్ లోపల కెళ్ళిపోయింది.
   
    డాక్టరు పదినిముషాలు థియేటర్లోకి తీసుకెళ్ళింది - మరోకొద్ది నిముషాల్లో బయటకొచ్చింది శారద. రెండు గంటలు అక్కడ రెస్టు తీసుకుని ఇంటికొచ్చేసింది.
   
    శారద తన నిర్ణయం మార్చుకోనని వెళ్ళిపోయాక రామం ఎంతో క్రుంగిపోయాడు. ఆడపిల్ల ఎంతో అదృష్టం అనినమ్మే తను ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. రామం మనసు వికలమైంది - అయినా శారదకింత పట్టుదలా? రామంగదిలో సిగరెట్టు కాలుస్తూ అటు ఇటు తిరిగాడు.
   
    కాలింగ్ బెల్ మోగింది. ఇంకెవరూ, శారదే అయివుంటుంది లోపలకి రానీ ఈ చెంప ఆ చెంప వాయిస్తాను. కోపంగా తలుపు తీసిన రామానికి ఎదురుగా కనిపించింది లలిత.
   
    "ఆ- లలితా - నువ్వు పొద్దున్నవస్తే ఎంత బావుండేదో' అన్నాడు రామం.
   
    "ఏం - ఒక్కర్తీ వెళ్ళిపోయిందా నర్సింగ్ హోముకీ" ఆశ్చర్యంగా అంది లలిత.
   
    'లలితా - నిజంగా తొందరపడ్డానేమో. నువ్వు అప్పటికీ హెచ్చరిక చేసావు. ఆడవాళ్ళు విడిగా ఎంత మొండిగావున్నా మాతృత్వం దగ్గర కొచ్చేసరికి పూర్తిగా మారిపోతారు - ఎంతో సర్దుకుపోతారు - అలాగే అవుతుందని ఆశించాను'-
   
    "పోనీలే - దాని తత్వం అంతే - భర్త చెప్పింది ఏ ఒక్కటి విన్నా భర్తకి బానిస అయిపోయినట్టే అని భావిస్తుంది అది - దాని పద్దతి అంతే లలిత ఎక్కువ మాటలకి అవకాశం యివ్వదల్చుకోలేదు భార్యా భర్తల మధ్య ఏవోవస్తూనే వుంటాయి. సర్దుకుపోతూనే వుంటాయి. ఆలుమగల తగవు అద్దంమీద ఆవగింజలాటిది అంటారు కదా! లలిత బయలు దేరబోతోంది.
   
    వీధిలో ఆటో ఆగింది - నెమ్మదిగా నడుస్తూలోపలకొచ్చింది శారద. లలిత కనిపించగానే ముఖం ముడుచుకుని లోపలకెళ్ళిపడుకుంది.
   
    'నేను వచ్చే దాన్నిగా' అంది శారద గదిలోకి వెళ్ళి లలిత.
   
    'ఎవరెందుకు- డాక్టరునాఫ్రెండు - ఇది నా వ్యక్తిగత జీవితానికి సంబంధించింది" -శారద కళ్ళు మూసుకుని పడుకుంది. లలిత వెళ్ళి పోయింది. రామం శారదని పల్కరించలేదు. ఆ నిముషం నుంచి ఆ ఇంట్లో నిశ్శబ్దం తాండవిస్తోంది. ఆ నిశ్శబ్దపు రాత్రి ఒంటరిగా దుఃఖించాడు రామం. ఆ రాత్రి ఒంటరిగా ఆనందించింది శారద.
   
    నిజానికి శారద ఆలోచనా ధోరణి లోనే మార్పు మొదలైంది చిన్నప్పుడే - ఏమీ తోచని శారద ఆరోజు లైబ్రరీకి వెళ్ళింది. అక్కడ రకరకాల పుస్తకాలు. స్త్రీస్వేచ్చ, పాతివ్రత్యం, స్త్రీలు ఓటుహక్కు స్త్రీ పురుష సమానత్వం, - ఇలా ఒకే అంశంపై కనిపిస్తున్న ఎన్నో పుస్తకాలు శారద మనసుని ఆకర్షించాయి. మనుధర్మంనాస్త్రం అని చెప్పబడిన దాంట్లో స్త్రీలకు సంబంధించినంతవరకు ఎన్నో అన్యాయాలే కనిపించాయి. శారద కళ్ళకి - సమాధానంగా స్త్రీ పురుషవ్యత్యాసం ఇంత ఎక్కువగా వుంటే స్త్రీకి గౌరవ స్థానం ఎలా వస్తుంది!! భార్యని వదిలేసి మరో స్త్రీనివివాహ మాడే పురుషుణ్ణి సమాజం గౌరవంగానే చూస్తోందేమిటో శారదకి ఎంత ఆలోచించినా అంతుపట్టలేదు. తనకు తెలుసున్న రంగయ్య భార్యవుండగానే, హాస్పిటల్ లో నర్సుని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఎవరో రహస్యంగా ఏమనుకున్నారోగానీ, ఎదురుపడితే వంగి వంగి నమస్కారాలు పెడుతున్నారేమిటీ - అగ్ని సాక్షిగా వివాహమాడిన భార్యకి ఇది అన్యాయం కాదా అని ఎవరూ ప్రశ్నించలేదు - ఇది శారద పధ్నాలుగు, పదిహేనేళ్ళ వయసప్పటి విషయం. ఎంతో కోపమొచ్చింది శారదకి ఆ రంగయ్యని చూస్తుంటే. ఆయనను చూడనపుడు ఇంట్లో తల్లి శాంతమ్మ" చూసారా. ఎంత దుర్మార్గుడు - పిల్లలతల్లిపాపం. దాన్ని ఇంట్లోపడేసి ఈ నర్సమ్మతో ఊరేగుతున్నాడు ఇలాటి వాళ్ళకి ఉరిశిక్షవెయ్యాలి" అనేది. ఆ రంగయ్య కనిపించగానే "అన్నయ్యగారూ బావున్నారా. రోజా ఎలా వుందీ అనేది - రోజా రంగయ్య రెండో భార్య. శారద గుమ్మంలో నుంచుని అంతా గమనిస్తోంది. "అమ్మా ఇందాకనే రంగయ్యని తిట్టావు. కనిపించగానే రోజాబావుందా అని అడుగుతావేమిటి - ఆయన్ని నిలబెట్టి తిట్టిపారేయచ్చుగా. ఆయన మొదటి భార్య పిల్లలు ఎంత బాధ పడుతున్నారో చెప్పచ్చుగా" అంది. తల్లినవ్వి, 'పిచ్చిదానా. అలా వున్నమాట వున్నట్టు మొఖాన్నంటే బావుంటుందా మరి" అంది - శారదకి అర్ధంకాలేదిది కూడా.

 Previous Page Next Page