Read more!
 Previous Page Next Page 
అహల్య పేజి 3


    అందరినీ కలయజూశాడు విశ్వామిత్రుడు. సభా మర్యాద పాటిస్తూ లేచి నుంచున్నాడు.


    'దేవేంద్రా!' దిక్పాలకులారా! మాన్యులారా! దేవ నాధుడు ఇన్ని యుగాలకు ఒక చక్కని కార్యాన్ని సంకల్పించాడు. జగదేక సుందరి ఎవరో నిర్ణయించి ఆమెను అందాల రాశిగా నిర్ణయిస్తానన్నాడు. బహు చక్కని ఊహ పుట్టింది ఇన్ని కల్పాలకు. గుడ్డివాడు వెన్నెలనీ చూళ్లేడు. వెలుగునూ చూళ్ళేడు. అందాన్నీ చూళ్ళేడు. అలంకారాన్నీ చూళ్ళేడు. అది వాడి తప్పూ కాదు. దోషమూ కాదు.దృష్టి దోషం! అంతే! అలాగే అనునిత్యం తన కళ్ళెదుటే తిరుగుతూ తన కన్నుసన్నలో మెలుగుతూ తన అపూర్వ లావణ్యంతో ఎందరెందరి ప్రశంసలనో పొందిన మేనక ఈ సభలో ఉండగా అందగత్తెణు సూచించమనడం అంధత్వమే అవుతుంది. అది అధికార మదోన్మత్తత వల్ల అంత వినయవతి. వాటికి తార్కాణం మేమే! మా మాటలే! మరెవరు అవునన్నా కాదన్నా జగదేక సౌందర్యవతి మేనకే! మేనకే! మేనకే!!  


    విశ్వామిత్రుడి ధీర గంభీర వాక్కులు దిక్కులు ప్రతిధ్వనించాయి.


    పిడుగు పడినట్టు అంతా నిశ్చల నీరవ నిరీహ నిశ్శబ్దంతో నిశ్చేష్టులయినారు. నిర్నిమేషత్వం వారి సొమ్మే కనుక రెప్పపాటు లేకుండా పోయింది.


    అందరూ అలా ఉంటే విభాండకుడు లేచి నిలబడ్డాడు. 'హరిణి! హూ! హరిణి లాంటి అందగత్తె ఈ చతుర్ధశ భువనాలలో లేదు! ఇది మా నిశ్చితాభిప్రాయం' అని కూర్చున్నాడు.


    'ఊర్వశి ఒక్కతే అందాల రాశి. ఇది నా దృఢ నిర్ణయం' అన్నాడు పురూరవుడు. అతని మాటలను వరుణుడూ, సూర్యుడు కూడా సమర్ధించారు. ఒకరికిద్దరు గాక ముగ్గురు సమర్ధించడంతో ఊర్వశి సభను కలయజూసింది. ఐతే అందులో ఆనందం ఉంది. గర్వం లేదు. అహంకారమూ లేదు.


    అది అంతా గమనిస్తూ కుబేరుడి కుమారుడు నలకూబరుడు చిరునవ్వులు చిందించి అన్నాడు.


    'నారీషు రంభా! ఈ మాట మరిచారా మీరంతా? రంభ సంరంభం చూడండి! ఆమె సొగసు సోయగమూ సౌష్టవమూ గమనించండి. మహనీయుల మాట మన్నించి జగదేక సుందరి రంభ అని ముమ్మారూ ప్రకటించండి!'   


    ఇంద్రుడికి ఒక్కొక్కరి ప్రతిపాదనా ఒక్కొక్క వజ్రాయుధపు దెబ్బగా అనిపించసాగింది.


    క్రమ క్రమంగా ఎవరి అనుభవానికి తగినట్టు వారి వారి అభిరుచి మేరకు అందగత్తె పేరు సూచించవచ్చు అనే అభిప్రాయం బలపడింది.


    ఒక్కొక్క మహర్షే లేచి నుంచుంటున్నాడు. ప్రతిపాదిస్తున్నాడు. ఒక్కొక్క వీరుడు సభా గౌరవం పాటించి పలుకుతున్నాడు. మునులు-యక్షులు-సిద్ధులు- వాళ్ళు వీళ్ళు అనడం ఎందుకు? అందరూ లెక్కించరాని విధంగా పేరు ప్రతిపాదిస్తున్నారు.


    కొందరు మళ్ళీ మళ్ళీ మేనకనే ప్రస్తావిస్తే మరికొందరు రంభ పేరును సూచిస్తున్నారు. తిలోత్తమ మదాలస, ఘ్రుతాచి, ఊర్వశి! పదేపదే వినపడుతున్న పేర్లు రంభ! ఊర్వశి! మేనక!


    మెలిమెల్లిగా ప్రతిపాదనలన్నీ నినాదాలయ్యాయి. నినాదాలు వాదాలయ్యాయి. గొంతులు హెచ్చుతున్నాయి. రోషం అగ్నిలా రాజుకుంటోంది. కోపం చిచ్చులా హెచ్చు మీరుతోంది. సభా మర్యాద పాటించడం మానడంతో వీధిలా తయారయింది.


    ఉస్సురని నిట్టూర్చాడు సురనాధుడు. వెండి బెత్తాలవారి వైపు చూశాడు. ఆపై తమ గురువర్యులణు చూశాడు. నారదాది మహర్షులను చూశాడు.


    అందరూ తమ ప్రతిపాదనే సమజసమనీ-ఔచిత్యవంతమయిందనీ. సరి అయినదనీ అనుకుంటున్నారు. బృహస్పతి ఒక్కసారి అందరి వంకా జూసి 'నిశ్శబ్దం! నిశ్శబ్దం! ఇది సురసభ! కానీ అసుర సభ కాదు! ఇది దేవసభ. ఇచట యెద్దేవ తగదు! ఇది మలహరుడి సన్నిధి! కలహాల పెన్నిధి కాదు! మౌని మండలి దండిగా కొలువైన నిండు సభే గానీ మానవ సమావేశం కాదు. నిశ్శబ్దాన్ని పాటించండి' అన్నాడు.


    'ఎవరికి తోచిన ప్రతిపాదన వారు చేశారు' లేచి నుంచుని అన్నాడు నారదుడు.


    'దేవనాధుడు తన మదిలోని మాట చెప్పేవాడే కానీ శచీదేవి అర్ధాసనంలో ఉండగా మరొకరి పేరు చెప్పలేడు. తన భార్య పేరూ ప్రతిపాదించలేడూ. భార్య అనగానే ఎంత అందమైనా కంటికి కనిపించదు కదా! అయినా ఇక నిర్ణయించి ప్రకటించవలసిన సమయం వచ్చింది. శచీదేవి పేరు ప్రతిపాదిస్తాడో! తన నెప్పుడూ ఆదుకునే రంభ పేరు చెప్తాడో! విశ్వామిత్రుడి గండం నుంచి తప్పించిన మేనక పేరే పలుకుతాడో! నారాయణాంశ సంభావ ఊర్వశి పేరే వల్లిస్తాడో! అంతా మనకెందుకు! అది అతనిష్టం! అతని కష్టం! చెప్పనివ్వండి! ఎవరి పేరు ప్రకటిస్తాడో విందాం! దేవ గురువు చెప్పినట్లు మౌనంగా ఉందాం! విందాం!' నారదుడు చెప్పదల్చుకున్నది చెప్పాడు. వేయవలసిన కలహ బీజం వేశాడు.


    మానవుల రీతిగా మహేంద్రుడికీ చెమటలు పట్టవలసిందే! కానీ దైవత్వ లక్షణం వల్ల ఆ స్థితి రాలేదు. కానీ భయం పుట్టుకొచ్చింది. ఏమంటే ఏమో అని శంకించాడు. అయినా తప్పదు ప్రకటించాలి!


    సభ వంక తేరిపారి చూశాడు.


    అందరిలో ఆరాటం! ఆత్రం!


    'సభాసదులారా! మనలో ప్రతి ఒక్కరు ఒక సౌందర్యవతి పేరు సూచించారు. సంతోషం! ఎవరి మనోగతం వారిది. ఎవరి అనుభవం వారిది. ఎవరినీ నిందించతగదు. అలాగని అభినందించలేను. 'తా వలచినది రంభ! తను మునిగినది గంగ! అని నరలోకంలో అశేష జనులు అనుకుంటుండగా నేను విన్నాను. మీలో ఎందరో వినే ఉంటారు!'


    ఆ చిన్న సమయంలోనే రంభ తోటి అప్సరసలను తిరస్కారంగా చూసింది.


    గాధేయుడు చప్పున అన్నాడు 'రంభ కడు అందగత్తె అంటావా?'


    విశ్వామిత్రుడు అలా ప్రశ్నించగానే ఇంద్రుడి గుండె గుభిల్లుమన్నది.


    'గాధేయా రాగాధేయా! వినరాదా పూర్తిగా! ఆపై అనవలసినదేదో అనరాదా? నేను లోకరీతి సామెతగా అన్నాను. ఎందుకా ప్రస్తావన అంటే-అది సామాన్య లక్షణంగా చెప్పాను అంతే!'

 Previous Page Next Page