Read more!
 Previous Page Next Page 
అహల్య పేజి 2


    రణరంగంలో వీర మరణం చెందిన వీరాధి వీరులు యాగాలు చేసిన ముని పుంగవులు, భూసురోత్తములు, నరోత్తములూ, తమ తమ పుణ్యం కొద్దీ స్వర్గం చేరినవారు నేటి ప్రత్యేక సమావేశానికి వచ్చారు. ఆ సభలో తప్ప ఇంకెక్కడా అగుపడరా అన్నట్లు మొత్తం స్వర్గవాసులంతా అక్కడే ఉన్నారు.


    'అనరాదు కానీ ఈ సమయంలో ఏ రాక్షసుడైనా దండెత్తి వస్తే దేవలోకం అంతా ఖాళీ! స్వర్గాన్ని వాళ్ళు సునాయాసంగా ఆక్రమించుకోవచ్చు. అడ్డూ ఆపూ లేని అమృత వాహిని సురగంగ మందాకినిలో మునకలు వేయచ్చు. ఏ కాపలా లేని నందనోద్యాన్ని సునాయాసంగా స్వాధీనం చేసుకోవచ్చు. అష్టదిక్పాలుర ఆవాసాలను తప్ప అందరి నివాసాలను స్వంతం చేసుకోవచ్చు. కామధేనువునీ, కల్పవృక్షాన్నీ కబళించవచ్చు. ఒక్కసారి ఈ సభని ముట్టడిస్తే రసగంగ అమృత పానంలో వివశులై ఉన్న అందరినీ తేలిగ్గా కొల్లగొట్టవచ్చు' అనుకున్నాడు నారదుడు.


    ఆ క్షణంలో గజ్జెలు గలగల మన్నాయి.


    అందెల రవళికి జతగా కంకణ ధ్వనులు ఘల్లుఝల్లుమని మోగాయి. రాగల కదలికలు రెపరెపలు కూర్చున్న వారి గుండెల్లో గుబులు పుట్టించాయి.


    రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఘృతాచి, హేమ, మదాలస, హరిణి మొదలగు గల అచ్చెర మచ్చెకంటులంతా సభలో ప్రత్యక్షమయ్యారు. ఒక్కసారిగా వీణాది సకల వాద్యాలూ మోగింపబడ్డాయి.


    మృదంగం మోగింది. అచ్చెరల పాదాలు కదిలాయ్. లయానుగుణంగా నర్తించడం ప్రారంభించారు. నాట్య వేదానికి సరికొత్త భాష్యం రాయదగినంత నయన మనోహరంగా సాగుతున్నది నృత్యం.


    ఉన్న రెండు కళ్ళూ రెప్పపాటు లేనివి కావడంతో దేవతలంతా ఒళ్ళు మరిచి కళ్ళారా ఆ సోయగాన్ని చూస్తున్నారు. రంభ కన్నా మిన్నగా ఊర్వశి, ఆమెను తలదన్నేలా మేనక, తనకంటే గొప్పగా తిలోత్తమ, ఆమె శిరస్సు దన్నేలా హేమ. అలా ఒకరిని మించి ఒకరు తమ నాట్య కౌశలాన్ని ప్రదర్శిస్తున్నారు. నిజానికది పోటీ ప్రదర్శన కానే కాదు. ఆ రోజున ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని నిర్ణయించే పాటవ పరీక్షా లేదు.


    ఉత్తమ కళాకారిణికి బిరుదిచ్చే సందర్భమూ కాదు. కానీ సకల దేవతా గణం, స్వర్గలోక నివాసులందరూ విచ్చేసిన సందర్భం కాబట్టి నిజమైన కళాకారిణులుగా వారివారి కౌశలాన్ని సోయగాలని ప్రదర్శిస్తున్నారు.


    పాట ముగిసింది. ఆట ఆగింది. అలసట ఎరుగని అచ్చెరలు అందాల బొమ్మల్లా నిలబడ్డారు. సభలోని వారందరూ అభినందన పూర్వకంగా చప్పట్లు కొట్టారు. ఆగని కరతాళ ధ్వనులు అసుర లోకం దాకా ప్రతిధ్వనించి రాక్షసుల గుండెల్లో గుబులు పుట్టించాయి.


    'అద్దా' అన్నాడు విశ్వామిత్రుడు.


    'అద్బుతం!' అన్నాడు బృహస్పతి.


    'అమోఘం!' అన్నాడు నారదుడూ.


    'అసదృశం!' అన్నాడు పరాశరుడు.


    అందరినీ కలయజూసి చిర్నవ్వులు చిందించాడు సురనాధుడు. ఎక్కడా ఎన్నడూ ఎవరికీ దక్కని భాసుర వైభవానికి గర్వించాడు.


    'ఇందుకే కదా ఇంద్రుడన్నా ఇంద్రలోకమన్నా ఆ రాక్షసులకు అంత కోపం' తనలో తాను మురిసిపోయాడు. ఆకలి, దప్పి, అలసట, వేసట లేని అమరత్వ సిద్ధిని ఇచ్చే అమృతం, గాలి సోకితేనే పులకించి పోయేలా చేసే నందనోద్యానం, కోరిందల్లా కురిపించే కామ ధేనువు. అడిగింది అరక్షణంలో అందించే కల్ప వృక్షం. నిత్య త్రిదశత్వం. ఓహ్! ఇవన్నీ అమరుల అసూయా హేతువులే' అనుకున్నాడు.


    నిండు గర్వంతో నిండు పేరోలగంలోని ప్రతి ఒక్కరినీ చూసి తనదైన బాణీలో ఇలా అన్నాడు "దేవర్షులారా! మహాత్ములారా! బ్రహ్మర్షులారా! అష్టదిక్పాలకులారా! దేవతలారా! దేవలోక నివాసులారా!'


    'ఇప్పుడే ముగిసిన దేవకన్యల నాట్యం చూశారు మీరంతా. ఆ నాట్యంలో ఎవరు మిన్న? నృత్య ప్రదర్శనలో అందరినీ అధిగమించిన అన్నులమిన్న ఎవరు? భరత శాస్త్ర ప్రదర్శనలో అగ్రశేణిలో అలరించిందెవరు? అని.. మిమ్మల్ని ప్రశ్నించడం లేదు. అలాగే ఎవరద్భుతంగా పాడారు? అనీ అడగటం లేదు.


    నా ప్రశ్న ఒక్కటే.....


    ఇందరిలో అందగత్తె ఎవరు?


    అంటే నా ఉద్దేశం గజ్జె కట్టి ఆడిన ఈ సుందరీమణుల్లో సుందరీమణి ఎవరు? అని కాదు! అందరిలో ఎందరున్నా అందరినీ మించిన అందగత్తె ఎవరు? మీ అభిప్రాయం తెలుసుకుని ఆ అందగత్తెను అందాల రాశిగా బిరుదుతో సత్కరించి గౌరవిస్తాను.


    మహేంద్రుని మాటలు పూర్తయ్యాయి.


    సభలో గుసగుసలు. ఎవరు? ఎవరు?? ఎవరు??? అఖిల లోకాల్లో అందాల రాశి ఎవరు? అందరి కనులకూ అమృత వర్షిణిలా కనిపించే ఆ అతిలోక రూపసి ఎవరు? అమరేంద్రుడి మన్ననలు అందుకోబోయే ఆ అందాల భామ ఎవరా అందాల రాశి?


                                             3


    మహనీయులు, మాననీయులు, మహర్షి సత్తములు, మౌన సముద్రాలంకారులయ్యారు. సామాన్యులు గుసగుసలు పోతున్నారు.   

 Previous Page Next Page