Read more!
 Previous Page Next Page 
పరిహారం పేజి 2


    రోగం నయం కాలేదు కాని కాళ్ళు చేతులు వాపులు వచ్చాయి.
    పంతులు పెదవి విరిచాడు.
    కృష్ణారావు గుండెలమీద రాచుకోసాగాడు. విజయ లక్ష్మితో తన పెళ్ళయి సరిగ్గా మూడేళ్ళు కాలేదు. బిడ్డ పుట్టేవరకు ఎంత అన్యోన్యంగా గడిచిపోయింది తమ సంసారం! అప్పుడే తన నుండి సెలవు తీసుకొని వెళ్లిపోతూందా తన ఇల్లాలు? అదీ సంవత్సరంనుండి రోగంతో తీసుకొని! తీసుకొని! భార్య అంటే తన కెంత ప్రేమ ఉన్నా ఆమెను రక్షించుకోలేకపోయాడు. దైవనిర్ణయం ముందు మానవుడెంత నిస్సహాయుడు!
    ఆ రాత్రి విజయలక్ష్మికి వెక్కిళ్ళు ప్రారంభమయ్యాయి. ప్రొద్దు విడవకముందే విజయలక్ష్మి ఆత్మ విముక్తిపొంది వెళ్ళిపోయింది. ఆ శిధిలదేహంనుండి ఇరవయ్యేళ్ళకే నూరేళ్ళు నిండి వెళ్ళిపోయింది.
                        *    *    *
    "అన్నగారూ! పాపనిలా ఇస్తారా? పాలుపట్టి తెస్తాను!"
    "ఇంకా నీ కెందుకమ్మా శ్రమ! కొద్ది రోజుల్లో ఇదీ రుణం తీర్చుకొని వెళ్ళిపోతుంది. ఈ నాలుగు రోజులైనా తండ్రిగా దానికి చేయగలిగిందంతా చేయనివ్వు! ఇక నేను చేసే పని మాత్రం ఏముంది? దాని పనులు నాకు బరువు కావు!"
    కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా నిలబడి కళ్ళు తుడుచుకొంటూ వెళ్ళిపోయింది ఇందిర.
                                                                            2
    అయిదేళ్ళ తరువాత ఒకనాటి సంగతి.
    రంగనాధం అనే అతను కృష్ణారావుకు బాల్యమిత్రుడు. హైదరాబాద్ లో ఏదో ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. చాలా సంవత్సరాల తరువాత పనిమీద స్వగ్రామానికి రావడం జరిగింది. ఊళ్ళో అడుగుపెడుతూనే అతడికి కృష్ణారావు సంగతులు తెలిశాయి. భార్య పోయిందనీ, చాలా కష్టాల్లో ఉన్నాడనీ తెలిసి రంగనాధం మననం కలచినట్టుగా అయి అప్పటికప్పుడు కృష్ణారావు ఇంటికి బయల్దేరి వచ్చాడు.
    గుమ్మంలో అడుగుపెట్టి, అక్కడ కనిపించిన దృశ్యం చూచి స్తంభించిపోయినట్టుగా ఆగిపోయాడు రంగనాధం.
    ముప్ఫై ఏళ్ళకే ముసలిరూపు ఏర్పడిన కృష్ణారావు ఆడదానిలా ఒక కాలు మడిచి కూర్చొని తెల్లగా, బొమ్మలా ఉన్న ఒక అమ్మాయికి తలదువ్వుతున్నాడు. అయిదేళ్ళయినా సరిగాలేని ఆ పాపజుట్టు ఎంత బారుగా ఉంది!
    "ఎవరు? నీ కూతురా?" గొంతుకేదో అడ్డం పడ్డట్టుగా ప్రశ్నించాడు రంగనాధం.
    "నువ్వా, రంగా? రా, రా" ఆప్యాయంగా ఆహ్వానించాడు కృష్ణారావు.
    రంగనాధం లోపలికి వచ్చి కూర్చుని,  "నీ కూతురా? ఏం పేరు?" అని అడిగాడు మళ్ళీ.
    "నా కూతురే. పారిజాత ఎప్పుడొచ్చావు? అంతా కులాసేనా?"
    "కులాసే........ నువ్వేమిటి, కృష్ణా? ఇలా అయిపోయావు?"
    "పెళ్ళాన్ని పోగొట్టుకున్నవాళ్లు ఎలా ఉంటారు రంగా?" పాప జడ కొసకు రిబ్బను కడుతూ నిర్లిప్తంగా అన్నాడు కృష్ణారావు.
    రంగనాధం ఒక నిట్టూర్పు విడిచి "భార్యపోయిన వాళ్ళను చాలామందిని చూశాను. కాని ముప్పయ్యేళ్ళకే ముసలివాళ్ళయి పోయిన వాళ్ళని ఎక్కడా చూడలేదు! సహజంగా పుట్టుకతో బక్కగా వుండేవాళ్లు బక్కగా ఉంటే ఏమీ అనిపించదు. తిండిలేక చిక్కిపోయినవాళ్ళు ఎంత అసహ్యంగా కనిపిస్తారో తెలుసా? చర్మం ఎండిపోయి, ఎముకలు ఎంచుకొనేట్టు తేలి.... ఛీఛీ!" అన్నాడు.
    "తిండి లేకపోవడం నా తప్పు కాదుగా?"
    "మగాడివి కాదూ? ఏం మాటలురా? నీ ఒక్క కడుపుకు తిండి సంపాదించుకోలేకపోయావా?"
    "తిండి సంపాదించుకోవడం పెదకష్టమేమీ కాదు మనిషికి, పరువు మర్యాదల్ని మరిచిపోతే చాలు."
    "ఆహా? ప్రాణంపోతున్నా సరే. పరువు మర్యాదల్ని పట్టుకు వ్రేలాడుతావా? అయినా నిన్ను ఆడదానిలా వ్యభిచారంచేసి బ్రతకమని చెప్పడం లేదు. కష్టంచేసి నీ పొట్టకింత తిండి సంపాదించుకో లేకపోయావా?"
    "కష్టమంటే ఎలాంటి కష్టంరా? ఉద్యోగం దొరికే వయసు కాదు! ఇన్నాళ్ళు స్వతంత్రంగా బ్రతికినవాణ్ని ఎవరిదగ్గరా నౌకరీ చేయలేను. ఏ అడవికో వెళ్ళి కట్టెలుకొట్టి తెచ్చి అమ్ముకొనేలాటి పనులకు ఆత్మాభిమానం అడ్డువస్తుంది."
    "నువ్వొక్కడివే అయితే నీ ఆత్మాభిమానాన్ని ఎవరూ ఆక్షేపించరు. నీకోకూతురుకూడా ఉందిగా? ఇప్పుడు ఆమెకు తిండిలోటు చేస్తున్నట్టు కనిపించడంలేదు. కాని, ఒక్క తిండిపెడితే చాలదు. ఆ పిల్లకు వయసు వస్తుంది. కోరికలు పుడతాయి. తండ్రివి. కోరికలు తీర్చక తప్పదు. పెళ్ళిచేయక తప్పదు అందుకు డబ్బుకావాలి! ఆ డబ్బు సంపాదించే మార్గం చూచుకోవాలి!"

 Previous Page Next Page