Read more!
 Previous Page Next Page 
ఏటిలోని కెరటాలు పేజి 2


    స్నానం ఏర్పాటు దేవదాసి చేస్తుంది. ఆయన స్నానం చేసి పూజామందిరంలోకి వచ్చేసరికి సంధ్యావందనానికి, దేవతార్చనకు అన్నీ సిధ్ధపరిచి ఉండాలి. వారి పూడా అదీ అవుతూనే భోజనం చేస్తారు. ఆయనకు వడ్డనా అదీ అయ్యేవరకు దేవదాసి దగ్గరే ఉంటుంది. వంటమనిషి బ్రాహ్మణవితంతువు. వడ్డన చేసేది ఆమె అయినా, ఆమెవల్ల లోపాలు జరుగకుండా దేవదాసి పర్యవేక్షణ జరుపుతూంటుంది.

    దేవదాసి లేకపోతే ఒక్కక్షణం గడవదు.గోపాలదేవులకు. తన ఏర్పాట్లన్నీ చూసేది ఆమే! తను ఎక్కువసేపు కూర్చొని చదివితే మెడలు తీపులు తీస్తాయని భారత భాగవతాలవంటి సద్గ్రంధాలు ఆమె చేతికిచ్చి చదువమని చెప్పేవారు. దేవదాసి ఊరికే చదవటంకాక అర్థం చెప్పించుకొనేది ఆయనతో, ఆయన చెవిన వేసినట్టూ ఉంటుందీ; తనూకొంత తెలుసుకొన్నట్లవుతుందీ అని. ఆమె ఇంతవరకూ నేర్చిన చదువు ఆ గ్రామంలో వీథిబడి చెప్పుకొనే పంతులుగారివద్దనే. రెండేళ్లు ఇంటికివచ్చి చెప్పాడు ఆయన. అక్షరజ్ఞానం కలుగితే చాలునని తరువాత మానిపించారు పంతులుగారిని.

    దేవదాసి గోపాలదేవుల ముద్దుల మనుమరాలు. ఆమెకు 'దేవదాసి' అని పేరు పెట్టిందీ ఆయనే. ఇప్పుడు మాత్రం ముద్దుగా 'దేవతా' అని పిలుచుకొంటారు. ఆ ముద్దుపేరే అందరి నోళ్ళలోనూ దొర్లుతూ ఉంటుంది.

    గోపాలదేవుల దేవతార్చనా, అదీ అయ్యి భోజనానికి కూర్చొన్నాక నెయ్యివేసి పక్కకు నిల్చుని. "అత్తయ్య ఊరినుండి గోవిందస్వామి వచ్చాడు, తాతయ్యా! మామయ్య గుర్రంమీదినుండి క్రిందపడ్డాడట!" అని చెప్పింది దేవదాసి.

    ఆయన కొద్దిగా కనుబొమలు ముడివేసి అడిగారు, "ఎలా జరిగిందట?"

    గోవిందస్వామివల్ల విన్నది చెప్పింది దేవదాసి.

    ఇంట్లో ఉండి ఉండి ఒకేవిధమైన కార్యక్రమాలతో విసుగొచ్చేసిన దేవదాసికి అత్తయ్య ఆహ్వానం ఉత్సాహంగా ఉన్నా ఈ విషాద పరిస్థితిలో వెళ్ళడం కొంత విచారంగానే ఉంది. ఆప్యాయంగా పిలుచుకొని రెండురోజులు ఉంచుకొని పంపడానికి అత్తయ్యతప్ప మరిలేరు. తల్లి పుట్టింటివైపు వాళ్ళు ఉన్నా కూతుర్ని ఉంచుకొన్నట్లు కూతురి పిల్లలను ఓ నాలుగు రోజులు ఉంచుకోగల ఆత్మీయతానురాగాలు కావలసినంతగా వారిలోలేవు. అందుకే, తల్లి ఏ నాలుగైదేళ్ళలో ఒకసారి పుట్టింటికి వెళ్తూంటుంది, చంటిపిల్లను మాత్రం వెంటతీసుకొని.

    దేవదాసి అత్తయ్య ఊరికి వెళ్ళికూడా రెండేళ్ళవుతూంది. అప్పుడు కూడా అత్తయ్యే తీసుకుపోయింది. "ఓ నెల్లాళ్ళు మా ఊళ్ళో వుండివద్దువురా" అని. ఎందుకోగాని పెద్ద కోడలిమీద ప్రత్యేకాభిమానం కృష్ణవేణికి.

    ఏ పరిస్థితుల కారణంగానో కృష్ణవేణి పుట్టింటికి వచ్చి కూడా రెండేళ్ళవుతూంది. లేకుంటే పండగలకూ, పబ్బాలకూ తరచుగా వస్తూనే ఉండేది ఆమె.

    గోపాలదేవులు భోజనం ముగించి, పట్టుపంచ వదిలి ఉతికిన ధోవతి కట్టుకొని, కండువా భుజంమీద వేసుకొని హాల్లోకి వచ్చారు. దేవదాసివల్ల విన్న సమాచారమే తిరిగి గోవిందస్వామివల్ల విని విచారంలో మునిగిపోయారు. అల్లుడు శ్రీనివాసరావు అల్లుడివలె కాక కొడుకువలె మసలుకొనేవారు, అత్తవారింటికి వచ్చినప్పుడు. అల్లుడనగానే గరికపోచ కూడా విర్రవీగి నిల్చుంటుందట! కాని, శ్రీనివాసరావుగారికి అలాంటి ఎచ్చులూ, భేషజాలు లేవు! చాలా కలుపుగోలుగా మనసిచ్చి మసలుకొనేవారు. అందుకే అల్లుడంటే ఎక్కడలేని ప్రేమా గోపాలదేవులకు. అల్లుడికి సంభవించిన విపత్తుకు ఆయనెంతో వ్యధచెందారు.

    "భార్గవరాముడు వెళ్ళి మూడేళ్ళు కావస్తుంది కదూ?" అడిగారు గోపాలదేవులు.

    "కావస్తూంది. రెణ్ణెల్ల తరువాత వచ్చేస్తున్నట్లు జాబు వ్రాశారట చినబాబు.

    "ఉండేది ఒక్క నలుసు! ఇటువంటి ఆపద సమయంలో అక్కరకు రాకపోతే ఏమనుకోవాలి?" బరువుగా నిట్టూర్చారు గోపాలదేవులు.

    అల్లుడినిచూచి కూతుర్ని పరామర్శించి రావడానికి గోపాలదేవులుకూడా సిద్ధమయ్యారు. కృష్ణవేణి పంపిన బండివాడికి మూడు గంటలకు బండి కట్టాలనిచెప్పి ఓ కునుకు తీయడానికి తమ గదిలోకి వెళ్ళిపోయారు.

    దేవదాసికి జడ అల్లి ఆ బారెడు జడలో అరచెయ్యి వెడల్పున జడబిళ్ళ విప్పి "ఉ, ఇకలేచి ముఖం కడుక్కొని బొట్టూ, కాటుక దిద్దుకో!" అని చెప్పి లేచింది తల్లి. దేవదాసి వెంటతీసుకొనే బట్టలు ఆల్నరానుండి ఒకటొకటే ఏరి పెట్టెలో సర్దుతూంటే సూర్యదేవులు వచ్చారు.

    "నాన్నగారు కూడా వెడుతున్నారా?"

    "అవును."

    "అన్ని బట్టలు సర్దుతున్నావు? దేవి ఎన్నాళ్ళుంటుందక్కడ? మహా ఉంటే వారం పదిరోజులు. బావగారికి కాస్త నయమై అక్కకు విశ్రాంతి చిక్కిందంటే దేవికి అక్కడేం పని?"

    "ఏం? తరువాత ఉండకూడదా?" అని నవ్వింది శ్రీలక్ష్మి.

     "ఉండకూడదనికాదు. అవసరమేముందని!"

 Previous Page Next Page