Read more!
 Previous Page Next Page 
అశ్రుతర్పణ పేజి 3


    దానికి ప్రాప్తంలేదు వెళ్ళిపోయింది. తల్లి తరువాత పినతల్లి అంటారు. కానీ మా కాప్రాప్తం లేదు. మా గాలికూడా సోకకుండా పెంచాడు మీ నాన్న" అంది పింతల్లి కమలమ్మ. ఆమె మాటలు వింటూవుంటే దెప్పుతూన్నట్టుగా అనిపించినా, ఏదో జాలేసింది సుమతికి.
    "పోనీలే పిన్నీ .... ఒప్పుడవన్నీ ఎందుకూ? రక్తసంబంధం ఎక్కడికి పోతుంది చెప్పు" అంటూ మాట మార్చింది సుమతి.
    "నా తల్లే! నిజమేనమ్మా. ప్రేమ లెక్కడికి పోతాయి" అంటూ గడ్డం పట్టుకుని ముద్దు పెట్టుకుంది. ఆయమ్మకి ఈవిడ మాటలూ, చేతలూ చికాగ్గావున్నా, పోనీలే నాలుగురోజులుండిపోతారు" అని సుమతి సర్ది చెప్పేటప్పటికి విధిలేక ఊరుకుంది. అలా ఊరుకోవడంతో కమలమ్మ ఆయమ్మమీద పెత్తనం చెలాయించడం మొదలెట్టింది.
    "ఎంతయినా పనివాళ్ళు పనివాళ్లే. వాళ్ళకి ప్రేమ లెలావుంటాయమ్మా.... డబ్బుకోసం పనిచేస్తారుకానీ" అనేది  మాటి మాటికి. అసలుసంగతి తమకి లేచి ప్రాముఖ్యం ఆ ఇంట్లో ఆయమ్మకుందన్న ఈర్ష్య. ఒకటి రెండుసార్లు విన్నాక ఇక వూరుకోలేదు సుమతి.
    "పిన్నీ....ఆయమ్మ అందరిలాంటిదీ కాదు. నన్ను తల్లిలా పెంచింది" అంది కొంచెం కటువుగానే.
    "మరేనమ్మా.... నాకు  తెలీదూ" అంటూ దాటీ తగ్గించింది ఆమె, సుమతికి కోపంతెప్పిస్తే లాభం లేదని. అప్పుడప్పుడు కమలమ్మ వైఖరి చూస్తే సుమతి కనిపించేది ఆమె  పూర్తిగా ఇక్కడ వుండిపోవడానికి ఒచ్చిందేమోనని. ఒకరోజున ఆ మాటే అందికూడా.
    "ఒక్క కూతురిని కదా, మీ నాన్న అల్లుణ్ణి ఇల్లరికంతెచ్చుకుంటే బాగుండేది కదూ? నువ్వూ అత్తవారింటి కెళ్ళిపోతే ఆయనకి ఆయమ్మ వండిపెట్టడం ఏం బాగుంటుంది? అందుకే  అనుకుంటున్నాను, పోనీ  నేనిక్కడే వుండిపోదామని. మీ చిన్నాన్నా ఇక్కడికే వచ్చేస్తారు. ఈపాటి బడిపంతులు ఉద్యోగం ఇక్కడ దొరక్కపోదు. దొరకకపోయినా ఫరవాలేదు.  నాలుగు ట్యూషనులు చెప్పుకుంటే సరి. పిల్ల లిక్కడే చదువుతారు. అప్పుడాయమ్మ అవసరం వుండదు. నే వుంటాగా,  అన్నివిషయాలూ చూసుకోవడానికి. " గుక్కతిప్పుకోకుండా మాట్లాడుతూన్న ఆవిణ్ణి చూస్తే ఒళ్ళు మండుకొచ్చింది సుమతికి. నాన్నగారి మాటలు జ్ఞాపకమొచ్చాయి. "బంధువులు. ప్రాణం పోయ్యడానికి ప్రయత్నిస్తారు స్నేహితులు. లేదా నౌకర్లునయం డబ్బు తీసుకుంటున్నామన్న విశ్వాసంతో నైనా నమ్మకద్రోహం చెయ్యరు."
    సుమతికి పిన్నిమీద అసహ్యం వేసింది. "పిన్నీ....ఇంకెప్పుడూ ఆయమ్మా గురించి మాట్లాడకు. ఆమె నాతల్లితో సమానం" అంది.
    "హవ్వ.....ఇదేం విడ్డూరమే అమ్మా .... నౌకరుదాన్ని పట్టుకుని తల్లితో సమానం అంటావ్ ! ఇంతకీ డానికి ప్రాప్తం లేదు. అది వెళ్ళిపోయింది." శోకాలు మొదలెట్టింది. అప్పుడే ఏదో పని మీద లోపలికోస్తూన్న వాసుదేవరావుగారు ఆ రాగాలు విని ఒక్క నిమిషం ఆగిపోయారు. అయినా కమలమ్మగారు శోకాలపలేదు. "చూడండి కమలమ్మగారూ! ఏడుపులతో, రాగాలతో సుమతి మనసు పాడుచెయ్యకండి. మీరంతగా ఆపుకోలేకపోతే, ఎవ్వరూ చూడకుండా ఏ బాత్ రూములోనో సుబ్బరంగా ఎడ్చిరండి" అన్నారు విసుగ్గా.
    ఇక లాభం లేదనుకుని కమలమ్మ నోరుమూసుకుని కళ్ళుతుడుచుకుంది.
    పెళ్ళి ఎంతో ఘనంగా జరిగిపోయింది. కామాక్షమ్మగారు పెళ్ళిలోమాత్రం కొడుకుని నోరెత్తినియ్యకుండా, అన్ని సరదాలూ తీర్చుకుంది. ఆ తరువాత పదిహేనురోజులూ  ఇట్టే గడిచిపోయాయి. కోడలిరాకతో కొండంత సంతోషంతో అన్నిపన్లూ చకచకా చేస్తోంది కామాక్షమ్మగారు. పెళ్ళిలో కమలమ్మ మూతి విరుపులూ, దెప్పి పోడుపులూ వాసుదేవరావుగారి దాకా పోయాయి. పానకంలో పుడకలా ఈ గొడవేమిటి అనుకుని విసుకున్నా, అది సమయంకాదని ఊరుకున్నారాయన. పెళ్ళయిన నాలుగోనాడే, అందరికీ రైలు టిక్కెట్లుకొని  తెచ్చిచేతిలో పెట్టారాయన. కమలమ్మ వెళ్ళిన రెండు రోజులకికానీ తెలీలేదు ఇంట్లోంచి చాలావస్తువులే మాయమయినట్టు.
                                                              *        *        *
    గోవింద్ హైదరాబాదు వెళ్ళేరోజు రానేవచ్చింది. అంతకి నాలుగురోజులక్రితంనుంచే, రోజుకో స్నేహితుడు పార్టీ ఇవ్వడం వల్ల, సుమతితో సహా ఇంట్లో వుండడంలేదు వాళ్ళు  అందుకు కామాక్షమ్మగారు మాత్రం మహా భాదపడిపోతోంది. "మధ్య కోడల్ని కూడా ఊరంతా తిప్పుతున్నాడు ఒక్కనిమిషం ఇంట్లో వుండనివ్వకుండా ఏం స్నేహితులో ఏమిటో!" అంటూ రోజుకోపదిసార్లైనా విసుక్కుంటూంది. వాసుదేవరావుగారు కూడా ఈ పదిరోజులనుంచీ సాధ్యమయినంతసేపు ఇక్కడే గడుపుతున్నారు.
    వాసుదేవరావుగారు, తన పలుకుబడితో హైదరాబాదులో ఎవరో స్నేహితుడికి వ్రాసి, కూతురికోసం, అల్లుడికోసం ఇల్లు కుదిర్చారు. ఎంత చెప్పినా వినకుండా, కోడల్ని దిగబెట్టడానికి వస్తానని పట్టుపట్టింది కామాక్షమ్మగారు.
    "నువ్వొస్తే నాన్నగారిని ఎవరు చూసుకుంటూరమ్మా ఆయనసలే బి.పి మనిషి ఏ క్షణాన బ్లడ్ ప్రెషర్ ఎక్కువవుతుందో ఏమో!" అని గోవింద్ గట్టిగా వాదించడంతో, ఆమె నిస్సహాయురాలై ప్రయాణం మానుకుందే గానీ, ఏ సామా నెలా సర్దుకోవాలో, ఏ వంట ఎలాచెయ్యాలో గోవిందు కేమిటి ఇష్టమో అంతా పాఠం చెప్పినట్టు చెప్పింది సుమతికి. ఆమె అలా చెబుతూంటే, నవ్వుకుంది సుమతి.
    కొత్తఊరూ, కొత్తవాతావరణంలో మొదట్లో కొత్తగానూ ఏదో ఒంటరితనం ఫీలయింది సుమతి. గోవింద్ బ్యాంకు కెళ్ళినప్పటినుంచీ, అతను తిరిగి వచ్చేదాకా , ఏవేవో పుస్తకాలు, నవలలూ, మాగజీన్లు చదువుతూ కూర్చునేది. అతను రాగానే, కాప్సేపు అలా శికారుకో , సినిమాకో వెళ్ళటం, కబుర్లుచెప్పకుంటూ కాలక్షేపం చెయ్యడం, క్రమేణా అలవాటు పడిపోయింది క్రమం తప్పకుండా తను చేసే పన్లలో , రెండురోజుల కొకసారి తండ్రి కో వుత్తరం, అత్తగారికో వుత్తరం వ్రాయడం.
    అలా జరిగిపోతూన్న సంసారంలో, గోవింద్ మిలటరీలోకి పోవడం, అత్తమామలు ఎలాతట్టుకుంటారో , తండ్రి ఎలా వుంటాడో, సుమతి ఊహ కందకుండా వుంది. తాము హైదరాబాదు కొచ్చిన ఆరునెలల్లో రెండుసార్లు తండ్రీ, రెండుసార్లు అత్తమామ లిద్దరూ వచ్చివెళ్ళారు. అటువంటిది ఈ ఉద్యోగం వార్తవిని ఎంత బాధపడతారో, సుమతకి తెలుసు అలాఅంటే "నువ్వట్టి సెంటిమెంటల్ పూల్ వి" అంటాడు గోవింద్.
    గోవింద్ మాత్రం సంతోషంతో ఉక్కిరి బిక్కిరయి పోతున్నాడు.
    ఆనాడే బ్యాంకువాలందరూ ఫేర్ వెల్ పార్టీ ఇచ్చారు గోవిందు గుణగణాలని పొగుడుతూ ఎందరో ఉపన్యాసాలిచ్చారు. సుమతికూడా వెళ్ళింది ఆ పార్టీకి. గజిబిజి ఊహలతో గమ్యం తెలియని తలపులతో జరిగిందంతా తలచుకుంటూ కూర్చుంది సుమతి.
                                                            *        *        *
    ఆలోచిస్తూ పడుకున్న సుమతికి గోవింద్ నడుంమీద చెయ్యివేసే వరకూ తెలీనేలేదు అతడు దీపం ఆర్పేసి వచ్చి పడుకున్నట్టు.
    "సుమతీ! పార్టీ గ్రాండ్ గా. జరిగింది కదూ! పై ఆఫీసర్ల దగ్గరనుంచి, స్టాఫ్వరకూ ఎంత అభిమానంగా మాట్లాడారో చూశావుగా! వాళ్ళ అభిమానానికి, కృతజ్ఞత ఎలా తెలుపుకోవాలో తెలీక, కళ్ళలో నీళ్ళోచ్చాయి నాకు. గమనించావా?"
    "అవునండీ, నాకూ సరిగ్గా అదే అనుభూతి కలిగింది. ఇందరి అబిమానాన్నీ ప్రశాంత జీవితాన్నీ వదులుకొని ఎందుకండీ  ఆ మిలటరీ ఉద్యోగానికి వెళ్ళడం? పోనీ డబ్బుకొసమాఅంటే ఇప్పుడు మనకేం తక్కువని? కొన్ని తరాలవరకు సరిపడే ఆస్తి అటూ ఇటూ కూడావుంది. ఇప్పటికయినా మించిపోయిందిలేదు. మీ మనసు మార్చుకోండి."     

 Previous Page Next Page