Read more!
 Previous Page Next Page 
13... 14.... 15 పేజి 2

    ....తన ఆలోచనలు తనకే చిత్రం అనిపించాయి ఆమెకి. అంతలోనే ఈ కధేదో బాగానే వుందనిపించింది. తనూ రచయిత్రి అయిపోవచ్చు. ఏదో ఒక అసంతృప్తి వుంటేనే రచయితలూ కళాకారులూ అవుతారట కదా.

    .....అతడి గురక నెమ్మదిగా వినపడుతుంది. గడియారంవైపు చూసింది లక్ష్మి. పన్నెండవటానికి ఒక నిమిషం వుంది. నిముషం గడిస్తే.... ? ఏముంది? మరోరోజే మొదలవుతుంది.

    ఈ ప్రపంచంలో చాలా కొద్దిమందికి మాత్రమే 'నిన్న; వెళ్ళిపోతూవుంటే ఒక అందమైన అనుభవం, జీవితం డైరీలో చోటుచేసుకుంటుంది. 'నేడు' రేపు అవుతూంటే ఒక కొత్త వుత్సాహంతో మనసు ఉరకలు వేస్తుంది.

    తనకి మాత్రం......

    నిన్న.....నేడైనా

    నేడు.... రేపైనా

    రేపు.... ఏడాదైనా

    ఏడాది......జీవితాంతమైనా......ఒకేలా వుంటుంది.

    ఆ రాత్రి ఆమెకి ఒక కల వచ్చింది. ఎవరో కుర్రవాడు టెన్సిస్ బాల్ ని బలంగా గోడకి కొడుతున్నాడు. అంతవేగంగానూ అది వెనక్కి వస్తోంది.


                                                                            3

    పదిన్నరయింది. టెన్నీస్ మ్యాచ్ కి వెళ్ళటానికి తయారవుతోంది లక్ష్మి. అంత హడావుడిలోనూ గడియారం వైపు మాటిమాటికీ చూస్తూనేవుంది. సరిగ్గా  పదిన్నరకి..... పత్రికాఫీసుకు ఫోన్ చేసింది.

    "మధూహ కావాలండి" అంది. ఆమె ఇంకా ఆఫీస్ కి వచ్చిందో లేదో అనుకుంటుండగా మధూహ లైన్ లోకి వచ్చింది.

    "నేనూ....." లక్ష్మి అంది.

    "హాయ్! వాటె ప్లజంట్ సర్ ప్రైజ్. ఎలా వున్నావ్?"

    "ఇంకో అరగంటలో టెన్నీస్ మ్యాచ్ చూడడానికి వెళ్తున్నాను. ఆయన అట్నుంచి వస్తానన్నారు."

    "నిన్ను చూస్తుంటే ఈర్ష్యగా వుందే"

    లక్ష్మీ నవ్వి....." అది  సరేగానీ.....నేనొక కథ వ్రాద్దామనుకుంటున్నాను' అంది.

    మధూహ ఉత్సాహంగా "ఎనిమిదో వింత! ఏమిటి థీమ్?" అంది. లక్ష్మి తను ఆలోచించిన 'దూర్వాసుడి శాపం' కథ చెప్పింది. అంతావిని మధూహ తెరలు తెరలుగా నవ్వింది. "భలేవుంది. త్వరలో పొట్టి కథల పోటీ పెడుతున్నాం. డానికి వ్రాయి మా ఎడిటర్ గారికి నేను స్వయంగా అందజేస్తాలే....."

    'థాంక్స్. ఏదో  వేడిలో వ్రాయాలనిపించింది కానీ ఆ మ్యాచ్ చూసి సాయంత్రం వచ్చేసరికి ఈ ఆవేశం వుండకపోవచ్చేమో. బైదిబై రాజు ఏవంటున్నాడు?'

    "ఏ బోయ్ ఫ్రెండ్ అయినా ఏమంటాడు? చెల్లెలి పెళ్ళి అవ్వాలట. ఒక  సవత్సరం వరకూ ఆగమంటాడు. ఉంటానేం.....బై" ఫోన్ పెట్టేసింది.

    ఫ్రాన్స్.... ఇండియా డేవిస్ కప్ సెమీ ఫైనల్స్ కి అది ఆఖరి రోజు!

    అంతకుముందు నాలుగు మ్యాచ్ లు జరిగాయి. రెండు సింగిల్సూ ఇండియా గెల్చింది. డబుల్స్ లోనూ, రివర్స్ సింగిల్స్ లోనూ ప్రత్యర్థి దేశం గెలిచింది. అంటే....

    ఇప్పుడు ఆడబోతున్న అయిదో గేమ్ ఏ దేశస్థులు గెలిస్తే..... ఆదేశం ఫైనల్స్ కి చేరుకుంటుదన్నమాట. అంతా టెన్షన్.

    ఆ రెండో రివర్స్ సింగిల్స్  చూడడానికి టెన్సిస్ అభిమానులందరూ అక్కడికి చేరుకోవటంతో ఆ ప్రదేశమంతా కిటకిటలాడుతోంది. లక్ష్మి దాదాపు పావుగంట నిలబడింది. భర్త రాలేదు. ఆమెకది మామూలే. చెప్పిన టైమ్ కి అతడు  ఎప్పుడు రాడు. వచ్చి (అసలంటూ వస్తే) ఏదో అర్జెంటు  పనుందనీ ఆగిపోయాననీ చెపుతాడు. అదీ మామూలే.

    మరో అయిదు నిమిషాలు గడిచాయి. అందరూ ఆమెనే  చూస్తున్నారు. అది ఆమెకి చాలా ఇబ్బందిగా తోచింది. జుట్టుకి బాగా నూనె పెట్టి బిగించి కట్టినా కూడా ముంగురులు ఎగురుతూనేవున్నాయి అంతలో ఆమెకి తన భర్త లోపలికి వెళ్ళి కూర్చున్నాడేమో అని అనుమానం కలిగింది.

    తనకోసం అతడు లోపల వెతుకుతున్నాడేమో అని  అనుమానం రాగానే  ఆమె  కూడా లోపలికి వెళ్ళింది. వంద జతల కళ్ళు  ఆమెను అనుసరించాయి. పైటనిండుగా కప్పుకుని ఒద్దిగ్గా ఒక మూల కూర్చుంది. చాలా చిన్న బాక్స్ అది. భర్త లేడు. 

    వస్తాడన్న ఆశని మనసులో నిలుపుకుని ఎదురుచూడసాగింది. మరో అయిదు నిమిషాలు గడిచాయి. మళ్ళీ అదే వంటరితనం. చుట్టూ అందరూ ఆనందంగా.....

    ఇంతలో ఒక్కసారిగా చప్పట్లు. ఆమె ఆలోచన్లనుంచి తెప్పరిల్లి చూసింది.

    భారతదేశపు ఆటగాడు ప్రహసిత్ గ్రౌండ్ లోకి ప్రవేశిస్తున్నాడు.

    ఆరు అడుగుల ఎత్తు..... చక్కని శరీర సౌష్టవం.....కొనదేలిన ముక్కు.....ఇవి కాదు అతడిలో కొట్టొచ్చినట్టు కనపడుతోంది......పట్టుదల! ప్రత్యర్థిని గెలవాలనే పట్టుదల.

    అక్కడున్న ఆడవాళ్ళలో చాలామంది అతన్ని తినేసేట్టూ చూస్తున్నారు. ఈ మ్యాచ్ ల గురించి క్రితంరోజే ఒక ప్రముఖ పత్రిక వ్యాసం వ్రాసింది. ప్రహసిత్ గురించి వ్రాస్తూ...... అతడు టెన్నీస్ ని హాబీగా ఎన్నుకోవటం వలన సినిమా రంగం ఒక అందమైన నటుడిని కోల్పోయినట్టు వ్రాసింది.

    అందులో అతిశయోక్తి ఏమీ  లేదు. ప్రహసిత్ డాక్టర్. అయినా టెన్నీస్ మీద వున్న  ఇంటరెస్ట్ తో దాంట్లో కృషిచేసి నేషనల్ ప్లేయర్ అయ్యాడు. ఇప్పుడు భారతదేశపు ఆశలన్నీ అతడిమీద వున్నాయి.

    ఆట మొదలైంది. ఫస్ట్ సర్వీస్ ప్రహసిత్ దే.

    ఏస్ సర్వీస్. అవతలి వ్యక్తి కళ్ళు మిరుమిట్లు కిలిపేటంత వేగంతో బంతి వేగంగా వెళ్ళిపోయింది.

    చప్పట్లు. 15-0తో ప్రారంభమైంది. రెండోది ప్రత్యర్థి సాధించాడు. 15 -15. మొదటి సెట్ నుంచే టెన్షన్ ప్రారంభమైంది. అందరూ నిశ్శబ్దంగా చూస్తున్నారు. ఫ్రాన్స్ దేశపు ప్రత్యర్థి కూడా సామాన్యుడు కాదు. వరల్డ్ రాంకింగ్ వున్నవాడు.

    లక్ష్మికి వటింల్లు గుర్తొచ్చింది. స్టౌమీద రసం పెట్టింది. వస్తూ వస్తూ తను స్టౌ ఆర్పిందా లేదా అన్న అనుమానం క్షణాల్లో  పెనుభూతమైంది. తాము ఇంటికి వెళ్ళేసరికి గిన్నె ఏ షేపులో వుంటుందా అన్న భయం. ఈ మధ్య ప్రతీ  చిన్న విషయానికి విపరీతంగా ఆలోచించటం అలవాటైపోయింది. వంట మనిషిని పెట్టుకొమ్మని విష్ణు అంటాడు. తనకి  ఇష్టం లేదు. ఇంటిపనంతా స్వంతంగా చేసుకుంటేనే ఇంకా బోలెడు తీరిక. అటువంటిది మరీ ఖాళీగా వుంటే ఈ ఆలోచన్లు చంపేస్తాయి. రాత్రి ఎనిమిదింటికి పనంతా అయిపోతే ఇక భర్త  వచ్చే అర్థరాత్రి వరకూ ఆ తీరిక (?) ఎంత  బాధాకరమో ఆమెకి అనుభవ పూర్వకంగా తెలుసు.

    అకస్మాత్తుగా వళ్ళో ఏదోవచ్చి బలంగా పడటంతో ఆమె ఉలిక్కిపడింది. చుట్టూగోల.

    ప్రహసిత్ చేసిన సర్వీస్ ని ప్రత్యర్థి ఆపుచేయబోతే, బ్యాట్ కి తగిలి ఆ బంతి వచ్చి ఆమె వళ్ళోపడింది. ఆమెకు విపరీతమైన సిగ్గేసింది. అందరి దృష్టీ తన మీదే పడటంతో, తనలో తాను కుదించుకుపోతూ బంతిని కుర్రాడివైపు విసిరేసింది.

    సరిగ్గా అదే సమయానికి ప్రహసిత్ ఆమెని చూసాడు. అతడొక క్షణంపాటు అది ప్లే గ్రౌండ్ అనీ,  తను ఇండియా తరపున డేవిస్ కప్ మ్యాచ్ ఆడుతున్నాననీ మర్చిపోయాడు. ఒక అందమైన యువకుడిగా డాక్టర్ గా, దేశాన్ని రిప్రెజెంట్ చేసే  టెన్నిస్ ప్లేయర్ గా, అతనంటే పడిచచ్చే స్త్రీలూ అమ్మాయిలూ చాలామంది. కానీ......

    ఇరవై అయిదేళ్ళ జీవితంలో మొట్టమొదటిసారి అతను తనంత తానుగా ఒక స్త్రీని చూసి చలించిపోవటం జరిగింది. జనం ఇంకా గోలచేస్తూనే వున్నారు. "క్వయిట్ ప్లీజ్" అంటున్నాడు అంపైరు. ప్రహసిత్ ఆమె మీద నుంచి చూపు మరల్చుకోలేకపోతున్నాడు.

    లక్ష్మి మాత్రం తలవంచుకుని గోళ్ళవైపు తదేకంగా చూసుకుంటూంది. బంతి వచ్చి వళ్ళోపడిన సంఘటన నుంచి ఆమె ఇంకా తేరుకోలేదు. ఇంకా వెనకాల ఎవరైనా దీని గురించి నవ్వుకుంటున్నారేమో అని ఆమె గుండెలు బిక్కుబిక్కుమంటున్నాయి.

    ప్రహసిత్ ఆమెను చూస్తూనేవున్నాడు. ఇంకా చూస్తూనే వున్నాడు.

    అది టీనేజి ఆకర్షణ కాదని అతనికి తెలుస్తూంది. వజ్రకరూర్ కొండల్లో ఏళ్ళ తరబడి వెతగ్గా వెతగ్గా వజ్రం దొరికిన భావం.

    అంతలో ప్రత్యర్థి తన సర్వీస్ కోసం ఎదురుచూస్తున్నాడని స్ఫురణకు వచ్చి తనను తాను కంట్రోలు చేసుకుంటూ సర్వీసు చేశాడు.

    ఆమె ముందు వరుసలో కూర్చుని వుండటంతో స్పష్టంగా కనిపిస్తూంది. సాధారణంగా ఇలాటి టెన్నీస్ మ్యాచ్ ల్లో ప్రేక్షకులు ఎక్కువసేపు కూర్చోవాల్సి వస్తుంది. అందుకని వాళ్ళు పూర్తిగా వెనక్కి జారబడో, కాలుమీద కాలు వేసుకునో రిలాక్స్ డ్ గా కూర్చుంటూ వుంటారు. ఆమె లా కాకుండా చాలా పొందిగా ఒద్దికగా, పూవులా కూర్చుని వుంది. చాలా సేపట్నుంచి.....అలాగే తలవొంచుకుని.....అప్పుడప్పుడు అతకేసి చూస్తూ.

    వొళ్ళో రెండుచేతులూ పెట్టుకుని, కాస్త కదిలితే కూడా పక్కవాళ్ళు చూస్తారేమో అన్న బిడియంతో బుట్టబొమ్మలా కూర్చున్న ఆమెవైపు ఆ గంటలోనూ దాదాపు వందసార్లు చూసి వుంటాడు ప్రహసిత్.

    అకస్మాత్తుగా పెద్ద గోల వినిపించటంతో ప్రహసిత్ ఈ లోకంలోకి వచ్చాడు. జనం చప్పట్లు కొడుతున్నారు. గోలగోలచేస్తున్నారు. కారణం ఏమిటా అని స్కోరు బోర్డువంక చూశాడు.

    స్కోరు 4-6, 6-7,6-2,5-1.

    ప్రహసిత్ అదిరిపడ్డాడు. ప్రత్యర్థి.....ప్రపంచపు ర్యాకింగ్ వున్నవాడని తెలుసు. అయినా అతడిపై మొదటి రెండు గేములూ అతికష్టంమీద గెలవగలిగాడు. కానీ ఆ తరువాత..?

    .....ఓడి పోతున్నందుకు బాధలేదు. ఓడిపోతున్నట్టు కూడా తెలియనంతగా వంటిమీద స్పృహ లేకుండా ఎలా ఆడుతున్నాడు? అసలు  తన స్పోర్ట్స్  జీవితంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇదేమీ ఆషామాషీ ఆటకాదు. ఒక దేశపు పరువుకి సంబంధించిన విషయం. బహుశ ఏ క్రీడాకారుడి ఆవితంలోనూ ఇది జరిగివుండదు.

    పెవీలియన్ లో కూర్చున్న ఒక స్త్రీవల్ల ఆటలో ఏకాగ్రత కోల్పోవటం......

    అతనికి సిగ్గేసింది. తనమీద తనకే కోపం వచ్చింది. ఆమె మాత్రం ఇవేమీ పట్టనట్టుగా తలవంచుకుని కూర్చుని వుంది. ఈ ఆటలూ స్పోర్ట్సు ఆమెకి పెద్ద  తెలియవు. పెళ్ళయ్యేవరకూ ఏదో కొద్దిగా ఉత్సాహంవున్నా, ఆ తరువాత పూర్తిగా పోయింది.

    "....డ్యూస్" అమ్రిచాడు కామెంటేటర్. అదీ ఓడిపోయాడు.

    అడ్వాంటేజి ఫ్రాన్స్.......

    మ్యాచ్ పాయింట్!

    ఈ ఆఖరి సర్వీస్ తో భారతదేశం డేవిస్ కప్ పోటీలనుంచి శాశ్వంతంగా తప్పుకోవాల్సి వస్తుంది.

    అతడికి దుఃఖం కలిగింది.

    సరిగ్గా అదే సమయానికి ఆమె కుర్చీలోంచి లేచింది. తలవంచుకుని కుర్చీలమధ్య సందుల్లోంచి జాగ్రత్తగా నడుస్తూ బయటకు వెళ్ళిపోయింది.

    తన ఓటమి చూడలేక ఆమె వెళ్ళిపోయిందా?

    ......అతని వేదన మరింత ఎక్కువైంది. కానీ అంతలోనే మరొక అందమైన వూహ కలిగింది.

    తనలో ఆమె కలిగిస్తున్న సంచలనాన్ని ఆమె గుర్తించిందన్నమాట!

    ఆ వూహ అతడిలో కొత్త వుత్సహాన్నీ రేపింది.

    ప్రేమ ప్రథమ దశలో ఎప్పుడూ అంతే. అవతలివారి ప్రతి చర్యా మనకి అనుగుణంగానే భావించుకునేలా చేస్తుంది. నిజానికి, ఆమె  భర్తకోసం చూసి చూసి ఇక భరించలేక వెళ్ళిపోయింది. ఆమెకి టెన్నీస్ గురించి ఆసక్తిలేదు. ముందేచెప్పినట్టు క్రీడా ప్రపంచానికి భావుకత్వానికి అసలు పొసగదు.

    తన ఏకాగ్రతకోసం ఆమె ఆ ఆటని వీక్షించటం త్యాగం చేసిందని అతడు భావించగానే చేతుల్లోకి బలాన్నీ, పెదవులమధ్యకి పట్టుదలనీ,అ కళ్ళలోకి తీక్షణతనీ తెచ్చుకున్నాడు.

    అదే ఆఖరి సెట్ ఆవటంతో ఇద్దరిమధ్యా హొరా హొరీ పోరాటం జరుగుతుంది. వరుసగా 4 గేమ్స్ గెలిచాడు. 5....5ప్రేక్షకులు ఆగకుండా గోలచేస్తున్నారు.5.6.....6...6....ఒకర్నొకరు ఓడించుకోవాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.....12.....13....ఆమె  లేచివెళ్ళిపోయిన బ్యాట్ తో  బలంగా కొట్టాడు.

    ....ఏస్....

    ఒక్కసారిగా చుట్టూ హర్షధాన్యాలు. అతడు రెండు పిడికిళ్ళు బిగించి ఆనందంగా గాలిలో లేచాడు. 13...15తో ఆ విధంగా  ఆఖరి సెట్ గెలిచి సిరీస్ లో అధిక్యత సంపాదించాడు.

    బహుమతి ప్రధానం జరుగుతూంది. అప్పుడు కూడా అతను ఆ కుర్చీవైపే చూస్తున్నాడు. చివరి క్షణంలోనైనా ఆమె వస్తుందనుకున్నాడు. ఆమె రాలేదు. ఆమె ఎప్పుడో వెళ్ళిపోయిందని అతడికి తెలీదు.

    దేన్నైనా దాచుకోవడానికి ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విశాలమైనదీ, భద్రమైనదీ హృదయం. అటువంటి స్థానంలోనే చోటు ఇమడక 'ఆనందం' అతడి హృదయంలోంచి చిర్నవ్వు రూపంలో తన్నుకొచ్చింది.


                                *    *    *

    లక్ష్మి నిస్త్రాణగా పడుకుని వుంది. కడుపులో శూలంతో గుచ్చినట్టు నొప్పి ఉండిఉండి వస్తోంది. నెలకొకసారో రెండుసార్లో ఇలా నొప్పి వస్తూ వుంటుంది. అయినా ఆ విషయం ఆమె పెద్దగా బయటకు  తెలియనివ్వదు. నొప్పి మరీ ఎక్కువయితే తప్ప పక్కమీదనుంచి లేవకుండా వుండదు. అతడికి కాఫీ , టిఫిన్ అన్నీ మామూలుగా జరిగిపోతూ వుంటాయి.

 Previous Page Next Page