Read more!
Next Page 
13... 14.... 15 పేజి 1

                                 


                                                  13 - 14 - 15


                       -యండమూరి వీరేంద్రనాథ్ రచనలు



    "నీకు తెలుసా? అర్థరాత్రి సముద్రం మాట్లాడుతుందని?

    ఆ సాగర ఘోషలో నా హృదయం వినపడుతుంది!

    నాలాగే సముద్రం కూడా ఒంటరిది. ఆకాశంలా నువ్వు దూరంగా వున్నంతసేపూ!

    సముద్రలాంటి నిశ్శబ్దం. కాటుకలాంటి చీకటి. ప్రపంచమంతా భయం కౌగిలిలో అబధ్రతాభావంతో మగత నిద్రలో ఉలిక్కిపడుతూ నిద్రపోతున్నప్పుడు, సరుగుడు చెట్ల మధ్య వెన్నెల కిరణంలా నీ జ్ఞాపకం పాకుతూ వచ్చేది. ఆ జ్ఞాపకంతో నేనొక్కదాన్నే ఆనందంగా వుండేదాన్ని. ప్రపంచాన్ని చూసి జాలిపడేదాన్ని.

    కానీ 'ఆనందానికి' నేనంటే మొహం మొత్తినట్టుంది.

    అందుకే ఈ హేమంత సాయంత్రం, చలికి వొళ్ళు చెరుకు విల్లయిన వేళ, నీ వెచ్చటి ఉనికి కోసం నా కన్నీటి చినుకు సుళ్ళు తిరుగుతోంది.

    బ్రతకడం వేరు. జీవించడం వేరూనట. భార్యాభర్తల మధ్య, ఎప్పటికీ పెళ్ళికాని ప్రేమికుల మధ్య వుండే ఆకర్షణ మిగిలి వుండాలంటే ఒకర్నొకరు మనస్ఫూర్తిగా నమ్మాలి. నిరంతరం మాటల వారధి వుండాలి. నిర్లప్తత వాగులా పొంగి ఆ వారధిని కూల్చెయ్యకూడదు.

    హృదయం గదినిండా బాధ బురద పేరుకుపోకుండా నిరంతరం ప్రక్షాళన చేయడానికి కన్నీటిని ఇచ్చాడు భగవంతుడు. ఈ పెళ్ళి అనే వ్యవస్థలో ఏదో లోపం వుంది కాబట్టే చాలా మంది స్త్రీలు రాజీ పడడాన్నీ, చాలా మంది పురుషులు ఎస్కేపిజాన్నీ తమ జీవితం అనే అభిప్రాయానికి మనిద్దరం బలవంతంగా తోయబడ్డాం. ఒకరికొకరు ఏమీకాకుండా.... కేవలం భార్యాభర్తలమయి..... వొహ్ నవ్వొస్తోంది నాకు.

    నువ్వరుస్తావ్. నేను మొండికేస్తాను.

    నువ్వు  తోసేస్తావ్. నేను లాగేస్తాను.

    నువ్వటంటే నేనిటు..... పడుకుందామని పోట్లాడుకుంటాం.

    నువ్వు అవునంటావ్. నేను వద్దంటాను.

    నువ్వు సరేనంటావ్. నేను కీచుమంటాను.

    నువ్వు గిల్లుతావు. నేను కొరుకుతాను.

    ప్రేమరాగమా అది ? వలపుతాళంతో ప్రతిరోజూ 'నేన్నిన్ను ప్రేమిస్తున్నాను' అని మన పద్ధతిలో చెప్పుకునే పాట కాదూ అది? ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ పాట? ఏ కొండల వెనకాలకో, ఏ అరణ్యాల్లోకో పారిపోయినట్టుంది. కదూ.

    అన్ని బంధాల్లోకీ భార్యాభర్తల బంధం గొప్పదంటారు. కాదు. కానే కాదు. దానికన్నా ఒక పాపకి తన లక్కపిడతల మీదవున్న అనుబంధం గొప్పది. కనీసం నాలుగు సంవత్సరాల పాటైనా వాటితో ఆడుకుంటుంది. నేనేమో నీకు నాలుగు నెలలకే బోరు కొట్టేస్తాను.

    పెళ్ళయిన కొత్తలో ఎంత బావుండేవాళ్ళం మనం. నువ్వలా బయటకు వెళ్ళినప్పుడల్లా నా మెదడు అల్మైరాలోంచి నీ ఆలోచన్ల దారపు వుండ బయటకు తీసి తిక్కతిక్కగా దాన్ని చిక్కుపట్టించి 'అరెరె' అని దాన్ని తిరిగి సరిచేయబోయి మరింత గజిబిజిచేసి ఉక్రోషంతో ఏడుపు బిగపట్టుకుంటున్నప్పుడు.....

    అప్పుడు నువ్వొచ్చి నా చిక్కుల్ని నీ చేతిలోకి తీసుకుని విడదీసి సరిచేసి వాటిని యధాస్థానంలో పెట్టేసి నా వైపు ఓదార్పుగా చూసేవాడివి.

    (ఆ ఓదార్పులో కాస్త గర్వం కూడా వుంటుందనుకో.)

    ఒక్క ఉదుటున నిన్ను చుట్టేసిన నాకు, మెదడు అల్మైరా మూతబడిపోయి  శరీరపు అరలన్నీ తెరుచుకునేవి.

    నువ్వు లేనప్పుడు నా మంచం భూప్రపంచమంత విశాలం. నువ్వున్నప్పుడు నా శరీరం భూమిని మోసే అట్లాస్ తో సమానం.

    అలాటిది ఎందుకిలా అయింది?

    ......కారు ఆగిపోతే అంతా విప్పి ఏ పార్టు పాడయిందో కనుక్కోవచ్చు. బంధం పాడవుతే ఏ పాయింట్ దగ్గర పాడయిందో ఎలా తెలుసుకోవడం? అసలు నేనెలా వుంటే బాగుంటుంది నీకు? పోనీ చెప్పు నేనలా మారతాను.

    అసలు....తప్పు నాదేనా? నిజంగా నాదేనా. ప్రతి సాయంత్రం నీ స్నేహితుల్తో...."

                                       2

    ట్రింగ్.... ట్రింగ్.... కాలింగ్ బెల్ మ్రోగింది.

    ఆమె డైరీ వ్రాయడం ఆపి దాన్ని  బట్టలు కింద పెట్టేసి వెళ్ళి తలుపుతీసింది. అతను లోపలికి వచ్చాడు. తలుపుమీద రెండోసారి కొట్టకుండానే ఆమె తీయడం చూసి, "పడుకోలేదా ఇంకా?" అని అడిగాడు.

    ఎంతమంది భర్తలు ఎన్ని అర్ధరాత్రులు తన భార్యల్ని ఇదేప్రశ్న అడిగి వుంటారీ దేశంలో?

    'ఇంకా కొద్దిరోజులు పోవాలి? నువ్వు ఆలస్యంగా వొస్తే నిద్రలోంచి మేల్కొని ఆవలిస్తూ వచ్చి తలుపుతీయటానికి నేనింకా కొంత రాటుదేలాలి' అనుకుంది.

    అతడు భోజనానికి కూర్చున్నాడు. ఆమె పక్కన కూర్చుంది. అతడు భోజనం చేసేటప్పుడు మాట్లాడడు. నిశ్శబ్దంగా తినటం ముగించి వెళ్ళి పక్కమీద చేరాడు ఆమె గిన్నెలు సర్ది వచ్చేసరికి అతడు పేపరు చదువుకుంటున్నాడు. ఆమె వెళ్ళి పక్కన  పడుకుని కళ్ళుమూసుకుంది.

    అతడు స్టోర్స్ పేజి కూడా చదివేసి....1 పేపరు పక్కన పడేసి..... పక్కకు తిరిగి మీద చెయ్యేసి లాక్కుంటే, అదోరకమైన నిర్లప్తత మనసంతా కమ్మేసి.....2

    ...జీవితానికి అర్థం మనం జీవిస్తేనే తెలుస్తుంది. మరణానికి అర్థం మన దగ్గిర వాళ్ళు మరణిస్తేనే తెలుస్తుంది.....ప్రేమకి అర్థం మనం  ప్రేమిస్తేనే తెలుస్తుంది. 'రొటీన్' కి అర్థం మన దగ్గర వాళ్ళ ప్రవర్తనంవల్ల తెలుస్తుంది.

    ఒకప్పుడు....సాగర  మథనంలో పుట్టిన అమృతంకన్నా.... మన అధర మథనంలో ఉబికిన సుధ.... మధురంగా  వుండేది.

    కళ్ళు అరమోడ్పులు అవగా, కాళ్ళే పైకి లేచి కైమోడ్పులు చేసేవి.

    నువ్వు అనేవాడివి గుర్తుందా? మనకిష్టంలేని వ్యక్తితో రాతినైనా సాగించవచ్చుగానీ, పెదవుల మీద ముద్దాడలేమని.... పెదవులతో పెదవులు కలిపి ముద్దాడాలంటే ఏమతో ఇష్టం వుండి తీరాలనీ.....లేకపోతే మొహం తిప్పేసు కోవాలనిపిస్తుందనీ.......!! మనం ప్రేమగా ఒకర్నొకరం ముద్దుపెట్టుకుని ఎంత కాలమైంది? విషాదకరమైన వాస్తవం ఏమిటంటే మామూలు సమయాల్లో ఎలాగూ లేకపోయినా, కనీసం తమకంలోనైనా ముద్దు పెట్టుకునేవాడివి. ఇప్పుడదీ మానేసేవు.

    పెదవి అంచున నాలుక కొనమీటితే వినిపించే ముద్దు శబ్దపు మోహనరాగం, ఒకప్పుడు మన ఇంటి వంటింటితోసహా ప్రతిగదిలోనూ వినిపించేది. ఇప్పుడు పడగ్గదిలో, నిరాసక్తమైన మృదంనాదమే తప్ప మీరేమీ లేదు.

    .......అతను అటు తిరిగి పడుకున్నాడు. ఆమె పైకప్పుకేసి నిర్లిప్తంగా చూస్తూ వుండిపోయింది.

    '.....తుమ్మెదలేచి వెళ్ళిపోతుంటే పూవు అలవోకగా కదులుతుంది. ముగ్ధంగా, స్నిగ్థంగా, సుతారంగా రేకలచేతులు కదుపుతూ వీడ్కోలు చెపుతుంది! కాళ్లకు పుప్పొడి పారాణిరాసి పంపి, తృప్తి బరువుతో కనురెప్పల రేకుల్ని ముడుచుకుని, తల్లికావటానికి తొందరపడుతుంది. మరి మనిద్దరం?.......కలిసి పర్వతారోహణ మొదలుపెడతాం. సగంలో నన్నొదిలేసి తృప్తిగా నువ్వు వెళ్ళిపోతావు. ఒంటరిగా పైకి వెళ్ళలేకమ్ క్రిందికి రాలేక, నిశ్శబ్ధపు చీకటిరాత్రిలో అసంతృప్తిగా మిగలిపోతాను.

    నా కల ఎంత చిన్నదంటే.... అస్వాదించేలోపులో పాదరసంలా అది  కనురెప్పల మధ్యనుంచి జారిపోతుంది. నా ఆశ ఎంత  పెద్దదంటే దాన్ని నింపటానికి నా హృదయం కూడా సరిపోదు.

    "లక్ష్మీ....." అతడు నిద్రలోంచి హఠాత్తుగా మెలకువ వచ్చినవాడిలా పిల్చాడు.

    "ఊ...."

    "రేప్రోద్దున పదకొండింటికి నువ్వు స్టేడియంకి వచ్చేయి. డేవిస్ కప్ మ్యాచ్ వుంది. నీ పాస్ పర్సులోవుంది. తీసుకో. నేను ఆఫీసునుంచి పదకొండుకి అటే వచ్చేస్తాను."

    ఆమె మాట్లాడలేదు.

    "మధుర్, కిష్ణన్........అందరూ వస్తారు"

    టెన్నీస్ అంటే తనకి ఉత్సాహం లేదు. ఆ మాటకొస్తే తన భర్తకే ఇంటరెస్టు లేదు.

    తన భర్త రేపు టెన్నిస్ మ్యాచ్ కి రమ్మంది తనతో కలిసి సరదాగా గడపటం కోసం కాదుమధుర్ లాంటి పరిచయస్థులముందు తన  టేస్టు చూపించు కోవటానికి. భార్యని పరిచయం చేస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళలో లీలగా కదలాడే ఈర్ష్య గమనించి మనసులో నవ్వుకోవటానికి......

    ....ఆమెకిలాంటివి ఇష్టంవుండవు. ఇంటిపట్టున కూర్చుని భర్తతో కబుర్లు చెప్పుకోవడం ఇష్టం. ఏముంటాయి కబుర్లు అంటాడు. మరి స్నేహితులతో గంటలతరబడి చెప్పటానికి ఏముంటాయో?

    ఆమె  అలాగే పై కప్పుకేసి చూస్తూ పడుకుంది. వామనావతారం అయిపోయిన తరువాత శ్రీ మహావిష్ణువు తిరిగి వైకుంఠానికి వచ్చేసేడుట. ఎన్నాళ్ల విరహం తరువాత కలయికో కాబట్టి ఆ కలయిక చిన్న యుద్ధమే అయిందట. ఆమె విన్యాసానికి ఆవేశభరితుడై(అప్పుడే వామనావతారం ముగించుకొన్నాడు కాబట్టి) అతడూ విశ్వవ్యాప్తమై పెరిగిపోసాగాడట. ఒక కాలుతో భూమినీ, మరొక కాలుతో ఆకాశాన్ని ఆక్రమించాడట. ఆ ఆవేశంలో దూర్వాసుడికి తన కాలు వల్ల తపోభాగం అవుతోందన్న విషయాన్ని గమనించలేదట. దాంతో దూర్వాసుడు అమితమైన కోపంతో  వైకుంఠానికి వచ్చి "ఇక  ముందునుంచీ నువ్వు  ఏ అవతారమెత్తినా, నీ అర్థాంగి నీకు తోడుగా వుండకుండుగాక" అని శాపమిచ్చాడట. అందువల్లే పరశురాముడైనా, శ్రీరాముడైనా, బుద్ధుడైనా - భార్యా వియోగంతోనే, లేమితోనే గడిపారట. (బ్రతిమాలితే బలరాముడికి కన్సెషన్ ఇచ్చి వుంటాడు. అది వేరే సంగతి). ఆ తరువాత దుర్వాసుడు శ్రీ మహాలక్ష్మివైపు తిరిగి, "నువ్వు భూమ్మీద సగటు మానవస్త్రీగా జన్మిస్తావు. పెళ్ళయిన కొంతకాలంవరకూ మాత్రమే నీ భర్త నీ పట్ల  ఉత్సాహం చూపిస్తారు. తరువాత జీవితాంతం నిన్ను పట్టించుకోరు. అదే నేను నీకు ఇస్తున్న శాపం...." అని వుంటాడు.   

Next Page