కర్కాటక రాశి - (2018-2019)

 

 

కర్కాటకరాశి -  పునర్వసు 4(హీ)

      పుష్యమి 1,2,3,4(హూ,హే,హో,డా)- ఆశ్లేష 1,2,3,4(డీ,డు,డె,డో)

ఆదాయము 8 వ్యయం 2  రాజపూజ్యం 7 అవమానం 3


    ఈ రాశి వారికి 11-10-2018 వరకు 4వ స్థానంలో గురువు, తదుపరి 29-03-2019 వరకు 5వ స్థానంలో తదుపరి వత్సరాంతం 6వ స్థానంలో ఉండును. శని సంవత్సరమంతా 6వ స్థానంలో ఉండును. రాహు, కేతువులు 7-03-2019 వరకు 1, 7 స్థానాల్లో తదుపరి వత్సరాంతం 12, 6 స్థానాల్లో ఉండును.

    ఈ విధమైన గ్రహస్థితి పరిశీలించి చూడగా ఈ సంవత్సరము యోగ దాయకంగా ఉన్నది. జీవితంలో అనేకమైన అనుభవాలు, ఉచితానుచితాలు, తాము చూసిన నమ్మిన మనుష్యులు మొదలైన అనేక విషయాలపై ఒక స్థిరమైన, పారదర్శకమైన దారి మీకు కనపడుతుంది. గతంలో కొందరి మనసును అనవసరంగా నిరాదరించామన్న విషయాన్ని తెలుసుకుంటారు. పాలు, నీళ్ళనను గ్రహిస్తారు. గోముఖ వ్యాఘ్రములను గుర్తిస్తారు. వారిని ద్వేషంతో కాకుండా ప్రేమగా దూరం ఉంచాలని నిర్ణయిస్తారు. ఈ సంవత్సరం అనేక స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వ్యాపారాలకై అన్వేషణ ఆరంభమవుతుంది. ప్రస్తుతమున్న వ్యాపారముపై పట్టు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. కాని అది అంత సులభం కాదని గ్రహిస్తారు. సమయానికై నిరీక్షిస్తారు. మీ కలలు నెరవేరుతాయి. జీవితాశయము నెరవేరే అవకాశాలు అతి చెరువలో ఉన్నాయని గ్రహించండి. మిమ్ములను ద్వేషించిన వారు మీ స్నేహానికై ఆరాటపడతారు. అదే విధంగా మీ స్నేహాన్ని కోరే వారు కూడా ఆరాటపడు తుంటారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు భవిష్యత్‌ జీవితానికి గుణపాఠమని గుర్తించండి. ఊహలలో విహరించడం మానుకొని తమ, పర బేధము తెలుసుకునే ప్రయత్నం చేయండి. ధనము, హోదాతో స్నేహాలను, అభిమానాన్ని పొందలేమని గ్రహిస్తారు. ధనము చేతికందుతుంది. నూతన వ్యాపార భాగస్వాములను చేర్చుకుంటారు. భవిష్యత్తుకై చక్కని నిర్ణయాత్మకమైన పునాదులు వేస్తారు. నూతన పరిచయాలు వివాహప్రాప్తి, సంతానప్రాప్తి. కోరుకున్న వారితో సఖ్యత ఏర్పడుతుంది. ఆరోగ్య పరిస్థితి గతముకన్నా కొంత బాగుపడుతుంది. కీళ్లు, ఎముకలు, నరములకు సంబంధించిన అవస్ధతలకు వైద్యపరమైన పరిష్కారం లభిస్తుంది. నరఘోషపై ఎప్పటికప్పుడు పరిహారములు చేసుకొనుట ఉత్తమం. జీవితంలో ధనము, హోద, విలాసాలు మాత్రమే ప్రధానము కాదని గ్రహిస్తారు. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి కొంత వరకు ఉపశమనం లభిస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యము యధాస్థితి కొనసాగుతుంది. వారి ప్రవర్తన కూడా అదే విధంగా ఉండవచ్చును.మీ శ్రేయస్సుకోరే వ్యక్తులకు అభిమానించే వ్యక్తులకు ఏ విధమైన న్యాయము చేయలేకపోతున్నామనే ఆవేదన మీలో ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ ఏ మాత్రం పనికిరాదు. శతృ, ఋణ బాధలు పరోక్షంగా బాధించవచ్చును. మీ నిర్లక్ష్యము అహంభావము వల్ల కొందరికి శ్రేయోభలాషులకు దూరం కావలసిన పరిస్థితి రావచ్చును. జీవిత భాగస్వామి స్త్రీలు కాని, పురుషులు కాని వారి సలహా పాటించుట అన్ని విధాలుగా శ్రేయస్సునిస్తుంది. అతి మంచి తనము తమకు అసమర్ధంగా మారే అవకాశము గలదు. పొగడ్తలకు లొంగకూడదు. ఎదుటి వారి విలువైన వస్తువులపట్ల జాగ్రత్త అవసరం. తనకుమాలిన ధర్మం పనికిరాదు. కొందరికి సహాయం చేయబోతే అది మీ మెడకు చుట్టుకునే అవకాశము గలదు. ఋణ రూపకంగా ఇచ్చిన ధనం కాస్త తగ్గి చేతికందవచ్చును. మీ వ్యాపారంలో పేరు ప్రఖ్యాతులు రావడంలో మీ పాత్ర కీలకమవుతుంది. ఆత్మీయుల, బంధము ప్రవర్తన విస్మయానికి గురిచేస్తుంది. రాజకీయ పరపతి, రాజకీయ ఉన్నతి గలదు.    

     పాత్రత నెరుగక కొందరిని అతిగా విశ్వసించడం వలన కొంత నష్టపోతారు. నష్టాన్ని పూడ్చడంలో కొంతవరకు సఫల మవుతారు. గృహమార్పు సూచనలు కనపడుతున్నవి. నూతన స్వగృహ ప్రాప్తి అవకాశములు గలవు. కోర్టు వివాదములు మరియు కుటుంబ సామాజికపరమైన వివాదముల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. రాజకీయ పరంగా సంఘంలో ఉన్నత పదవి పొందే అవకావము గలదు. దూర ప్రాంతాల ప్రయాణం కొంతవరకు లాభించవచ్చు. వ్యాపారంలో పోటీతత్వము పెరుగుతుంది. తమ వారు పరాయివారు ప్రతి వారూ విమర్శిస్తుండటం ఒకింత నిరాశకు గురిచేస్తుంది. మీ స్వవిషయంలో ఇతరుల జోక్యం సహించరు. నష్టమైనా, లాభమైనా నిర్ణయాలు తామే తీసుకోవాలని నిర్ణయిస్తారు. కాని ఈ నిర్ణయం కొన్ని సందర్భాలలో వికటించే అవకాశం కలదు. తమ శ్రేయస్సు కోరే వారి సలహా పాటించండి. మేలు చేస్తుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. దీర్ఘకాలిక వ్యాధులు బాధించే అవకాశం కలదు. బిపి, షుగర్‌,మూత్ర సంబంధ వ్యాధులపై అశ్రద్ధ పనికిరాదు. వాహన మార్పులు చేసే అవకాశం గలదు. క్షణికావేశంలో, క్షణికానందం కొరకు కొన్ని పొరపాట్లు చేసే అవకాశం కలదు. తస్మాత్‌ జాగ్రత్త. తమ సంతానం వివాహ విషయమై కొంత కంగారు, ఆందోళన చెందే అవకాశం కలదు. నూతన గృహప్రాప్తి గలదు. కాని ధనం ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం గలదు. మీరు ఋణంగా ఇచ్చినధనంగాని, లేదా ప్రభుత్వం నుండి పొందవలసిన, రావలసిన ధనం కాని, అనుమతులుకాని, అతి ప్రయాసచే మిశ్రమ ఫలితాన్ని పొందుతారు. ఈ సంవత్సరం వీలు అయినంతవరకు సహనం, మౌనం, తమకు సంబంధం లేని విషయాలలో జోక్యం చేసుకోకూడదు. కోర్టు వివాదాలను మధ్య మార్గంగా సంప్రదింపుల ద్వారా పరిష్కారం చేసుకుంటారు. వివాహ ప్రయత్నాలు సఫలం కావచ్చును. మీ తెలివి తేటలతో ఎదుటివారిని ఆకర్షించుకుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శించడం, దూర ప్రాంతాలను సందర్శించడం జరుగవచ్చు. ఉదర సంబంధమైన ఇబ్బందులు బాధించ వచ్చును. ఒక సందర్భంలో మీ శ్రేయస్సుకోరే వారిని మీ మాటలతో దూరం చేసుకునే అవకాశం కలదు. గృహంలో శతృత్వం ఉన్నవారు మిత్రులుగా మారుట, కొత్త శతృవులు ఏర్పడుట జరుగవచ్చును. వ్యాపారంలో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలని చూస్తారు. సఫలం అవుతారు. ఆవేశం అనర్థానికి దారి తీస్తుంది. రాజకీయంగా చురుకుగా పాల్గొన వలసిన పరిస్థితి వస్తుంది. రాజకీయంగా చురుకుగా పాల్గొనవలసిన పరిస్థితి వస్తుంది. సంతాన ప్రాప్తి గలదు. పిత్రార్జితం లభిస్తుంది. ఆస్తి వివాదాలు కొంత వరకు పరిష్కార మవుతాయి. అన్య స్నేహాలు కొంత అప్రతిష్ట తెచ్చే విధంగా ఉంటాయి. ఎదుటివారిపై ఏ విధంగానైనా ప్రతీకారం తీస్చుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తారు. ఆత్మీయుల ఆరోగ్యం ఆందోళన కల్గించే విధంగా ఉంటుంది. సంఘంలో అందరికీ అనుకూలంగా ఉండాలని నిర్ణయించుకుంటారు. మనస్సుకు విరుద్ధంగా ప్రవర్తించాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటారు. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. విదేశీయోగము కలదు. ఉన్నత విద్యలకై విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి తాము కోరుకున్న స్థానంలో సీట్లు లభిస్తాయి. నూతన విద్యావకాశములు గలవు. విదేశాలలో ఉన్నవారికి శాశ్వత నివాస అనుమతి లభిస్తుంది. మాటలను అదుపులో ఉంచుకోవడం సర్వదా శ్రేయస్సునిస్తుంది. ఆస్తి విషయాలు, వివాదాలు పరిష్కారమవుతాయి. దాంపత్య వివాదాలు, సమస్యలు ఎదురుకావచ్చును. కొందరు గృహిణులకు ఉద్యోగం చేయవలసిన పరిస్థితి రావచ్చును. తమ సంతానానికి ఉన్నత విద్యా విషయంలోగాని, వారిని విదేశాలకు పంపే విషయంలోగాని మీరు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులకు తాము కోరుకున్న స్థాయి లభిస్తుంది. ఎంసెట్‌ వంటి పరీక్షలలో ఫలితం సాధిస్తారు. ఉద్యోగస్తులకు నిత్యం సమస్యలు ఎదురుకావచ్చును. చిన్న చిన్న పొరపాట్లకు కూడా సంజాయిషీ ఇవ్వవలసిన పరిస్థితి రావచ్చును. ఒకానొక సందర్భంలో ఉద్యోగ విరమణ చేయాలనే ఆలోచనలు రావచ్చును. పై అధికారుల వలన తరుచూ సమస్యలు ఎదరుకావడం, ఎవరో చేసిన పొరపాటుకు తాము భాద్యత వహించవలసిన పరిస్థితి ఎదురవుతుంది. తమకు ఇష్టం లేని ప్రదేశానికి స్థానచలనం అవడం జరుగవచ్చును. నిరుద్యోగులకు ఇష్టం లేని ఉద్యోగం లభించే అవకాశం. తాము చదివిన చదువుకు లభించే ఉద్యోగానికి ఏ మాత్రం సంబంధం లేని విధంగా ఉండవచ్చును. ఉద్యోగస్థులు ఈ సమయంలో ఎంత ఓపికగా ఉంటే అంత భవిష్యత్తులో మేలు జరుగును. ఉద్యోగం మాని వేసి వ్యాపారం  చేయాలనే ఆలోచన రావడం. ఏ మాత్రం మేలు చేయదు. ఉభయ భ్రష్టత్వం ఏర్పడుతుంది. వత్సరాంతంలో విద్యార్థులకు అతిగా శ్రమపడాల్సిన పరిస్థితి రావచ్చును. శ్రీ హయగ్రీవ స్తోత్రం చేయండి. అమోఘమైన మేధాశక్తి పెరుగుతుంది. దుర్జన సహవాసం వలన విద్యాభంగం.ప్రేమ దోమ అంటూ సమయాన్ని వృధా చేయకండి. తమ తల్లిదండ్రులకు అప్రతిష్ఠ తెచ్చే విధంగా ప్రవర్తించకండి. కళాకారులకు సామాన్యంగా ఉంటుంది. వ్యాపారస్థులకు ఐటి సంబంధించిన సమస్యలు రావచ్చును. హీన స్వభావులతో స్నేహం. శారీరక అనారోగ్యం బలహీనత రక్త సంబంధిత వ్యాధులు, సోదరులతో ద్వేషం, మర్యాద హాని, చిత్త చాంచల్యం, స్త్రీమూలక భయం, ప్రయాణ విఘ్నములు కలుగవచ్చును. ధర్మ కార్యాచరణం, వివాదాస్పద భూముల కొనుగోలు చేసే ఆలోచన, అనాచారము. మొత్తం మీద ఈ రాశివారలకు శుభాశుభ మిశ్రమ ఫలితములు కలుగుచున్నవి. ఇంకా ఉత్తమ ఫలితాల కొరకు శని, గురు, కేతు జపాలు ధ్యానము చేసిన మేలు జరుగును. గోపూజ చేయండి. శ్రీ హనుమాన్‌ చాలీసా పారాయణం శ్రీ రామరక్షా స్తోత్రము చేసిన మేలు జరుగును.

    స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. సమాజంలో గతంలో నష్టపోయిన పరపతిని ప్రతిష్టను తిరిగి పొందుతారు. ఎవరైతే గతంలో అవమానపరిచారో వారు నిజము తతెలుసుకొని పశ్చాత్తాప పడతారు.  దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మానసిక ఆనందముచే చక్కని స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. దాంపత్య సౌఖ్యము ఏర్పడుతుంది. గతంలో ఉన్న అపోహలు, అవమానాలు సమసిపోతాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ప్రస్తుతమున్న ఆదాయానికి మరొక ఆదాయము తోడవును. తెలివితో చాకచక్యంతో శత్రువులపై అధిపత్యాన్ని సాధిస్తారు. వారు తీసుకున్న గోతిలో వారే పడేలా ఎత్తుకు పైఎత్తులు వేస్తారు. అవివాహితులకు చక్కని వివాహ సంబంధాలు నిశ్చయము అవుతారు. మానసిక సంతృప్తి ఏర్పడుతుంది. సంతానప్రాప్తి కలుగుతుంది. పుత్రసంతాన ప్రాప్తి సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వారి పరిచయాలు ఏర్పడుతాయి. మీకు ఉన్నత గౌరవాలు స్థాయి దక్కుతుంది. విలువైన విలాస వంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో అనేక రకాలైన క్రొత్త మార్గాలు అవలంభించి వ్యాపారంలో లాభాలు సాధిస్తారు. నష్టాలలో ఉన్న వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపిస్తారు. సమాజంలో ముఖ్యమైన అనవసరమైన కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఉన్నతస్థాయి అధికారుల ప్రశంసలు పొందుతారు. అదనపు, బాధ్యతలు నిర్వహించవలసి వస్తుంది. పని తీవ్రత, వత్తిడి పెరిగే అవకాశము గలదు. ఉద్యోగంలో ఉన్నతస్థాయికి (ప్రమోషన్‌) ఎదుగుతారు. నూతన వాహనాలు సమకూర్చుకుంటారు. చరాస్తులు వృద్ధి పరుచుకుంటారు. ప్రేమ వివాహాలు సఫలము కావచ్చును. నూతనంగా వ్యాపారపరంగా భూములపై బంగారంపై లేదా షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడతారు. తమ సంతానానికి వారి భవిష్యత్తుకై పటిష్టమైన ప్రణాళికను సిద్ధం చేసి అమలు పరుస్తారు. ఉన్న శని ప్రభావము వలన అనేక విషయాలలో మీదే పై చేయి అవుతుంది. గతంలో విమర్శించిన వారు ప్రశంసిచడం చూసి ఆశ్చర్యపడతారు. మీ అంచానాలకు మించి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. శతృవులు స్తబ్ధులై ఉంటారు. సుఖ, సౌఖ్యాలు పరిస్థితులను మీకు అనుకూలంగా మలుచుకుంటారు. జీవిత భాగస్వామితో చక్కని అనురాగ పూరితమైన వాతావరణం ఏర్పడుతుంది. శయ్యా సౌఖ్యము లభిస్తుంది. జనాకర్షణ పెరుగుతుంది. ప్రభుత్వపరంగా మీకు అందవలసిన ప్రయోజనాలను అందుకుంటారు. రాజకీయ లబ్ధి, పరపతి ఏర్పడుతుంది. నూతన గృహ నిర్మాణానికై మీరు చేయు కృషి ఫలిస్తుంది. మీ వృత్తికి తగిన మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. కళాకారులకు చక్కని అవకాశాలు లభిస్తాయి. విలాసవంతమైన ఖరీదైన జీవితము గడిపే అవకాశాలు లభిస్తాయి. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశము గలదు. వ్యాపార భాగస్వాములపై మీదే పై చేయిగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నము సఫలమౌతుంది. తనకు మాలిన ధర్మం చేయరాదని శాస్త్ర  వచనం ఈ విషయాన్ని అక్షరాలా పాటించండి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంటా ఉంటాయి. గతంలో మధ్యలో వదలివేసిన పనులను మళ్ళీ ఆరంభిస్తారు. గతంలోని మీ ప్రవర్తనకు ప్రస్తుత ప్రవర్తనకు తేడాను చూసి మీరే ఆశ్చర్యపడతారు. గతంలో ఏర్పడిన కోర్టు వివాదాలు, కేసులు మొదలైన వాటిని సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకుంటారు. అత్యుత్సాహంతో పేరు ప్రతిష్టల కొరకు వెనకా, ముందు ఆలోచించక వృధాగా ధనాన్ని దుర్వినియోగపరిచే అవకాశాలున్నాయి.


More Rasi Phalalu 2018 - 2019