కులమతాలకు అతీతంగా దర్శనమిచ్చిన కృష్ణుడు

 

 

శ్రీ గణేశాయ నమః
శ్రీ గురుభ్యో నమః

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం పరమాత్ముడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఎన్నో అవతారములు స్వీకరిస్తూ, ఎన్నో బాధలు సహిస్తూ అవతార పరమార్ధాన్ని నెరవేరుస్తూ ఉంటాడు.  మహా విష్ణువు స్థితికారుడుగా లోకాలను కాపాడడానికి స్వీకరించిన అవతారములలో అత్యంత మహిమాన్వితమైన సంపూర్ణ అవతారం కృష్ణావతారం.

    మానవులలో సహజంగా ఉండే కోపతాపాలు,ఈర్షాద్వేషాలు, మదమత్సరములు, కుటిల యత్నాలు వంటివి అన్నీ పైకి కనిపిస్తూ అంతర్లీనంగా అడుగడుగునా పరమపదానికి దగ్గర చేసే అవతారం ఈ కృష్ణావతారం.  అయితే ఎంతటి పరమాత్ముడైనా తన భక్తుల వద్దకు వచ్చేసరికి వెన్నలా కరిగిపోయేవాడే.

కృష్ణావతారంలో తాను సాక్షాత్తూ పరంధాముడైనప్పటికీ గొల్ల పిల్లలల్తో కలిసి వారి ఎంగిలి కూడా తిననాడు. దుర్యోధనుడి విందు కాదని విదురుడు భక్తి పారవశ్యంలో పెట్టిన అరటి తొక్క తిన్నాడు. విదురుడి కుటీరములో బస చేసాడు.యువరాజు అయి ఉండి కూడా గోకులంలో మట్టిలో, ధూళిలో పడి ఆడాడు. పాడాడు. తన భక్తులు ఏది పెడితే అది తిన్నాడు. ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాడు. జాతి మత భేదాలు, అంతస్థుల తారతమ్యాలు చూడలేదు. పదకవితా పితామహులైన అన్నమయ్యగారు అన్నట్టు

"కందువగు హీనాధికములిందు లేవు
  అందరికి శ్రీహరే అంతరాత్మ"

అని రుజువు చేసింది కలియుగంలో ఎక్కడైనా ఉందా అంటే ఉంది. ప్రత్యక్ష తార్కాణం మన "ఉడిపి కృష్ణుడు"  అని సభక్తికంగా, సగర్వంగా చెప్పవచ్చు.

సాధారణముగా భగవంతుడిని దర్శించడం కోసం భక్తులు వెళ్ళాలి. స్వామి కనిపించేలా, ఎలా వెళితే వీలుగా ఉంటుందో చూసుకుని వెళ్ళాలి.  కానీ ఉడిపిలో మాత్రము సాక్షాత్తూ కృష్ణయ్యనే తన భక్తుడికి కనిపించేలా తిరిగి పోవడం జరిగింది. ఎలా ? ఏమిటి? అనేది తెలుసుకుందామా?

శ్రీ మధ్వాచార్యులు ఉడిపి కృష్ణ మఠములో ఉన్న కాలములో, కనకదాసు అనే పేరు కలిగిన తక్కువ జాతికి చెందిన ఒక వ్యక్తి కృష్ణుని ఆరాధనలో లీనమై ఉండేవాడు. కృష్ణుని భక్తిలో పరవశుడై ఉండేవాడు. ఉడిపిలో ఉన్న కృష్ణుడి దివ్య మంగళ విగ్రహాన్ని కనులారా చూడాలని ఎంతో ఆరాటపడేవాడు. కానీ, అతనికి ఆలయ ప్రవేశార్హత లేనందున బయట నిలబడి భక్తిగా నమస్కరించేవాడు. ఆలయం వెనుక ఉన్న ఒక చిన్న గుడిసెలో నివసిస్తూ కృష్ణ భక్తిలో లీనమై ఉండేవాడు. అతని భక్తికి, ఆర్తికి పరవశుడైన కృష్ణుడు అతని కుటీరం వైపుగా తిరిగాడు. అక్కడ ఉన్న గోడలో చిన్న చీలిక కూడా ఏర్పడేలా చేసాడు. అది గమనించిన కనకదాసు తన భాగ్యానికి పొంగిపోతూ ఆ సన్న సందులో నుంచి కృష్ణ దర్శనం చేసుకుని తన జన్మ చరితార్థం అయింది అని భావించేవాడు.

ఏమిటి ఇలా జరిగింది అని ధ్యానంలో తెలుసుకున్న మధ్వాచార్యులు అమితమైన ఆనందంతో ఆ భక్తుని గౌరవించి గోడలోని చీలికను పూడ్చకుండా అక్కడ ఒక కిటికీ ఏర్పాటు చేయించి మరింత సులువుగా కనకదాసు కృష్ణుడి దర్శనం చేసుకునే వీలు కల్పించారు.  భగవంతుని కృపకు పాత్రులు అవ్వడానికి ఏ భేదాలు అడ్డు రావని, ప్రేమతో కూడిన భక్తి మాత్రమే మార్గమని మరొకసారి ఆ భక్తుని ఆదరించి లోకానికి చాటారు.

ఇప్పటికీ ఉడిపిలో అదే ఆచారం కొనసాగుతోంది.  కృష్ణుడి దర్శనం ఇప్పటికీ కనకదాసు గారి కోసం నిర్మించబడిన కిటికీలో నుంచే ఉంటుంది. అంటే భగవంతుడు భక్త పరాధీనుడు. కుల మత భేదాలకు అతీతముగా ఆ పరంధామునికి భక్తితో చేరువ అవ్వవచ్చు అని కలియుగములో కూడా రుజువు అయ్యింది కదా.  మనమంతా కూడా కనకదాసు గారిలా ఆ భక్త సులభుని పాదారవిందములను వదలకుండా పట్టుకుని తరిద్దాము.

 


More Sri Krishna Janmashtami