Home » Festivals » Karthikamasa Vaibhavam » కార్తీక ఏకాదశి.. ఈ ఒక్క పని చేస్తే చాలు.. కోటి ఏకాదశుల ఫలితం వస్తుంది..!

కార్తీక ఏకాదశి.. ఈ ఒక్క పని చేస్తే చాలు.. కోటి ఏకాదశుల ఫలితం వస్తుంది..!

కార్తీక మాసం అంటేనే మన సంప్రదాయంలో దీపాలు, పూజలు, భక్తి పారవశ్యంతో నిండిపోయే పవిత్ర సమయం. అందులోనూ నవంబర్ 20న వచ్చే కార్తీక ఏకాదశి భక్తులకు ఎంతో విశిష్టమైన రోజు. ఈ పవిత్రమైన రోజున మనం చేసే చిన్నపాటి నియమాలు, భక్తిపూర్వకంగా ఆచరించే పద్దతులు మన జీవితంలో ఎంతో ఆధ్యాత్మిక ప్రశాంతతను తీసుకువస్తాయి. అసలు ఏకాదశి వ్రతం  అర్థం ఏమిటి, దాన్ని ఎలా ఆచరించాలి, ఏ నియమాలు పాటించాలి అనే విషయాల గురించి  వివరంగా తెలుసుకుంటే..

ఏకాదశి వ్రతం విశిష్టత..

మన శాస్త్రాలలో అన్ని వ్రతాలలోకి అత్యంత గొప్పది ఏకాదశి వ్రతం. సంవత్సరంలో వచ్చే ఇతర వ్రతాలన్నీ చేసి ఒక్క ఏకాదశి వ్రతం చేయకపోతే ఆ వ్రతాల ఫలితం దక్కదట. కానీ ఒక్క ఏకాదశి వ్రతం నియమంగా చేస్తే అన్ని వ్రతాల ఫలితం లభిస్తుందని శాస్త్రాలు పేర్కొంటాయి. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి దీనిని విష్ణు వాసరం అని కూడా అంటారు. నెలలో వచ్చే రెండు ఏకాదశులను భక్తితో ఆచరిస్తే భగవంతుడి పూర్తి కృప మనపై ఉంటుంది. ఏకాదశిని భక్తి జనని అని కూడా అంటారు. ఎందుకంటే ఈ వ్రతం వల్ల మన మనసులో భగవంతుడి పట్ల నిజమైన ప్రేమ, భక్తి కలుగుతాయి.

ఉపవాసం అంటే అసలు అర్థం..

చాలామంది ఉపవాసం అంటే కేవలం తినకుండా ఉండటమే అనుకుంటారు. కానీ ఉపవాసం అనే మాటకు అసలు అర్థం వేరు. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం. అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటమే అసలైన ఉపవాసం. ఏకాదశి రోజున శరీరానికి విశ్రాంతి ఇస్తూనే మనసును భగవంతుడి వైపు మళ్లించాలి.

కేవలం నీళ్లు కూడా తాగకుండా కటిక ఉపవాసం ఉంటూ రోజంతా మంచంపై పడుకుని టీవీ సీరియళ్లు లేదా సినిమాలు చూస్తూ గడిపితే అది అసలైన ఉపవాసం అనిపించుకోదు. దేన్నైనా సరే మనసును దృష్టిలో పెట్టుకుని భక్తితో చేయాలి. ఏకాదశి రోజున ఇంకా ఎక్కువగా భగవంతుడి నామస్మరణ చేయాలి. విష్ణుమూర్తికి  సంబంధించిన  మంత్రాన్ని జపించడం, భాగవతం , భగవద్గీత, విష్ణుసహస్ర నామాలు వినడం, చదవడం వంటివి చేస్తే భగవంతుడికి దగ్గరగా ఉన్నట్లు అవుతుంది.

ఇది కూడా చదవండి   కార్తిక పౌర్ణమి వెన్నెల వెనుక దాగిన ఆరోగ్య రహస్యాలివే!

రోజువారీ పనులకు దూరంగా ఉండి భక్తిలో గడపడం..

మన సాధారణ రోజుల్లో పొద్దున్న లేచినప్పటి నుంచి టిఫిన్ తయారీ, వంటలు, లంచ్, డిన్నర్, కిచెన్ శుభ్రం చేయడం, పడుకోవడం వంటి పనులతోనే సమయం అంతా గడిచిపోతుంది. వీటి వల్ల కొంతమందికి నిద్ర కూడా ఎక్కువగా వస్తుంది. అందుకే దేవుడికి దగ్గరగా ఉండాలంటే ఈ రోజువారీ హడావిడికి, వంట తిండి గోలకు కొద్దిసేపు దూరంగా ఉండాలి.

ఒకరోజు వంట, తిండి పనులను తగ్గించి చూస్తే ఆ రోజు మనకు చాలా సమయం మిగిలినట్లు అనిపిస్తుంది. ఆ సమయాన్ని భగవంతుడి ఆరాధనకు, ఆలయానికి వెళ్లడానికి, భక్తుల సేవ చేయడానికి, నామజపం చేయడానికి, సత్సంగంలో ఉండటానికి వినియోగించాలి. ఇదే ఏకాదశి ముఖ్య నియమం.

ఆహార నియమాలు ఎలా పాటించాలి

ఏకాదశి రోజున ధాన్యాలకు దూరంగా ఉండాలని శాస్త్రాలు చెబుతాయి. బియ్యం, పప్పులు, గోధుమలు వంటి ధాన్యాలలో పాప పురుషుడు ఉంటాడని చెబుతారు. అందుకే ఆ రోజు వాటిని తినకూడదు. వీటికి బదులుగా పాలు, పండ్లు తీసుకోవచ్చు.

ఒకవేళ ఆరోగ్య కారణాల వల్ల లేదా బీపీ, షుగర్ వంటి సమస్యల వల్ల పాలు, పండ్లు సరిపోవని అనిపిస్తే సగ్గుబియ్యం లేదా కొర్రలు వంటి వాటిని తీసుకోవచ్చు. సగ్గుబియ్యంతో పాయసం, వడ లేదా ఉప్మా ఇలా ఏదో ఒక రకం మాత్రమే చేసుకుని తినాలి కానీ పది పదిహేను రకాలు చేసుకుని తినమని చెప్పరు. శరీరం బాగుండేలా, నీరసం రాకుండా చూసుకుంటూ ఆ శక్తిని భగవంతుడి సేవలో ఉపయోగించాలి.

నిర్జల ఉపవాసం , ఇతర పద్ధతులు..

కొందరు భక్తులు ఆ రోజు నీళ్లు కూడా తాగకుండా కటిక ఉపవాసం చేస్తారు. దీనిని నిర్జల వ్రతం అంటారు. పొద్దున్న నుంచి రాత్రి వరకు నీళ్లు తాగకుండా ఉంటూ చక్కగా జపం చేసుకునే శక్తి ఉంటే అలా చేయవచ్చు. అలా కాకుండా ఏదైనా లోపలికి వెళ్లకపోతే బుద్ధి పనిచేయదు అనిపించేవారు పాలు, పండ్లు లేదా సగ్గుబియ్యం వంటివి తీసుకోవచ్చు.

ఎవరు ఆచరించవచ్చు , ఏమి చేయాలి?

ఇంట్లో ఎవరైనా మరణించినా లేదా మైలు, అసౌచం వంటివి ఉన్నా ఏకాదశి వ్రతాన్ని పాటించవచ్చు. దానికి ఎలాంటి అడ్డంకి లేదు. ఏ వయసు వారైనా, ఎవరైనా సరే ఆసక్తి, ఓపిక ఉంటే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు.

ఏకాదశి రోజున భాగవతం వినడం, చదవడం, భగవన్ నామ జపం చేయడం, కీర్తనలు పాడటం, ఆలయానికి వెళ్లడం, విష్ణుమూర్తికి  తులసితో అర్చన చేయడం చాలా మంచిది. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం, వైకుంఠ ద్వార దర్శనం ఎలా విశేషమో, అన్ని ఏకాదశుల రోజున కూడా భగవంతుడి ఆరాధన, నామ జపం, భాగవత స్మరణ అంతే ముఖ్యం. ప్రతి ఒక్కరూ ఈ ఏకాదశి వ్రత విశిష్టతను గుర్తించి భక్తితో ఆచరించడానికి ప్రయత్నించాలి.

                                                                                                                                           *రూపశ్రీ.

 

మీకు నచ్చవచ్చు    విజయంలో అయినా అపజయంలో అయినా.. మనసుకు ఎంతో ఊరట ఇచ్చే భగవద్గీత శ్లోకాలు ఇవి..!

                                  విష్ణుమూర్తి యోగనిద్ర నుండి నాలుగు నెలల తర్వాతే ఎందుకు బయటకు వస్తారో తెలుసా

google-ad-img