
పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే కార్తీక శుద్ధ ఏకాదశి భక్తుల జీవితాల్లో ఆధ్యాత్మిక వెలుగులను నింపుతుంది. ఈ రోజును ఉత్థాన ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి, బోధన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి నాడు యోగనిద్రలోకి వెళ్లిన శ్రీమహావిష్ణువు, తిరిగి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజునే యోగనిద్ర నుంచి మేల్కొంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే తొలి ఏకాదశితో మొదలైన నాలుగు నెలల చాతుర్మాస్య వ్రతం ఈ పవిత్ర దినంతో ముగుస్తుంది. స్వామి వారు మేల్కొనడంతోనే వివాహాది శుభకార్యాలకు మళ్లీ శ్రీకారం చుట్టడం మన సంప్రదాయంలోని గొప్ప విశేషం.
కార్తీక మాసం మొత్తం శివారాధనకు ఎంతో ప్రీతికరమైనప్పటికీ, ఏకాదశి రోజున మాత్రం మహావిష్ణువును ప్రత్యేక భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున స్వామిని మేల్కొలిపేందుకు బ్రహ్మ, పరమేశ్వరుడితో పాటు దేవతలు, మునులు, మహర్షులు వైకుంఠానికి తరలి వస్తారని విశ్వాసం. భజనలు, కీర్తనలు, మంగళవాయిద్యాల నడుమ స్వామిని మేల్కొలిపి, శివుడు హారతి ఇస్తుండగా బ్రహ్మ వేదాలు పఠిస్తారని పురాణ గాథలు వివరిస్తాయి. మహాభారత యుద్ధంలో భీష్మ పితామహుడు అస్త్రాలను విడిచి అంపశయ్యపై శయనించింది కూడా ఈ పవిత్ర ఏకాదశి రోజేనని, యజ్ఞవల్క్య మహర్షి జన్మదినం కూడా ఇదేనని శాస్త్రాలు పేర్కొంటాయి.
కార్తీక ఏకాదశి రోజున భక్తులు ఉపవాస దీక్ష పాటించి, విష్ణుపూజ చేసి, రాత్రి జాగరణ చేయడం అత్యంత శ్రేష్ఠమని పండితులు చెబుతారు. ఈ ఒక్క రోజు ఉపవాసం చేస్తే వెయ్యి అశ్వమేధ యాగాలు, వంద రాజసూయ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు వివరిస్తారు. కొండంత పత్తిని ఒక చిన్న నిప్పు రవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో, అలాగే ఈ రోజు చేసే ఏకాదశి వ్రతం చేసిన పాపాలను తొలగిస్తుందని నమ్ముతారు. అంతేకాదు, ఈ రోజు చేసే చిన్న పుణ్యకార్యమైనా హిమాలయ పర్వతానికి సమానమైన ఫలితాన్ని ఇస్తుందని స్కందపురాణంలోని బ్రహ్మ నారద సంవాదం ద్వారా తెలుస్తుంది.
ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకుని శ్రీహరి ముందు ఆవు నెయ్యితో దీపాలు వెలిగించడం ఎంతో శుభప్రదం. ఉత్థాన ఏకాదశి రోజున విష్ణుమూర్తికి హారతి ఇవ్వడం లేదా ఆలయంలో స్వామికి ఇచ్చే హారతిని కన్నులారా వీక్షించడం వల్ల అపమృత్యు దోషం తొలగిపోతుందని భక్తులు విశ్వసిస్తారు. ఇంట్లో తులసి మొక్క పక్కన 12, 16 లేదా 21 దీపాలతో పూజ చేయడం, ఉసిరి లేదా మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగించడం కార్తీక శోభను రెట్టింపు చేస్తుంది.
ఇది కూడా చదవండి:అక్షయ నవమి నాడు, ఉసిరి చెట్టును ఎందుకు పూజిస్తారు? అసలు రహస్యం ఇదే!
ఈ రోజు చేసే దానధర్మాలకు విశేష ప్రాధాన్యత ఉంది. అన్నదానం, దీపదానం లేదా పేదలకు సహాయం చేయడం వల్ల ఆ ఇంట్లో ధనధాన్యాలకు, సుఖసంతోషాలకు ఎప్పటికీ లోటు ఉండదని పండితులు చెబుతారు. మరుసటి రోజు ద్వాదశి ఘడియలు ఉండగానే విష్ణుపూజ చేసి, పారణ చేయడం ద్వారా ఉపవాస వ్రతాన్ని పరిపూర్ణంగా ముగించాలి. ద్వాదశి వేళ ఆలయాలు, ఇళ్లలో జరిగే తులసి వివాహ వేడుకలు భక్తిపారవశ్యాన్ని కలిగిస్తాయి.

భక్తి, క్రమశిక్షణ, దానగుణాలను మేళవించే కార్తీక శుద్ధ ఏకాదశి మనసులోని చీకట్లను తొలగించి ప్రశాంతతను అందిస్తుంది. శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని కోరుకుంటూ ఈ పవిత్ర రోజును సద్వినియోగం చేసుకోవాలి. ఆధ్యాత్మికతతో నిండిన ఈ కార్తీక ఘడియలు ప్రతి భక్తుడికి శుభాలను చేకూర్చాలి.
మీకు నచ్చవచ్చు:ఛఠ్ పూజ చివరి రోజు: ఉషా అర్ఘ్ సమయాలు, మరియు పూజా విధానం
Koti Somavaram 2026 Special: నవంబర్ 16న శ్రవణ నక్షత్ర యోగం.. ప్రత్యేకతలు ఇవే!
Karthika Shuddha Ekadashi, Prabodhini Ekadashi Significance, Lord Vishnu Awakening, Yoga Nidra Chaturmasya, Karthika Masam Rituals, Spiritual Growth Articles, Devotional Articles In Telugu.






