Home » Bhakti Content » Aacharalu » ప్రయాణాలలో, నడుస్తున్నప్పుడు మంత్ర జపం చేయవచ్చా.. మీకు తెలియని నిజాలివి..!

ప్రయాణాలలో, నడుస్తున్నప్పుడు మంత్ర జపం చేయవచ్చా.. మీకు తెలియని నిజాలివి..!

జీవితంలో మనం భగవంతుని నామాన్ని జపించడానికి నిశ్శబ్దంగా ఒక చోట కూర్చున్నప్పుడు మన మనసు స్థిరంగా ఉండదు. శరీరం కదలకుండా ఉన్నా, మనసు మాత్రం లెక్కలేనన్ని  ఆలోచనలతో,  ప్రపంచమంతా సంచరిస్తూ  ఉంటుంది. ఏకాంత ప్రదేశంలో నిశ్శబ్దంగా కూర్చోవడం మాత్రమే భగవంతుని స్మరించుకోవడానికి మార్గమా? వీధిలో నడుస్తూ, రోజువారీ పనులు చేసుకుంటూ లేదా ప్రయాణిస్తున్నప్పుడు నామాన్ని జపించవచ్చా? ఒకవేళ అలా చేస్తే ఆ జపం ఫలవంతంగా ఉంటుందా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..

మంత్రసాధన రహస్యం..

నిజమైన మంత్ర సాధనలో  అసలు రహస్యం ఏమిటంటే, మంత్రాన్ని ఎక్కడ జపిస్తున్నామన్నది కాదు, దానిని జపిస్తున్నప్పుడు మన మనసు నిజంగా ఎక్కడ ఉందన్నదే ముఖ్యం. దేవాలయ గర్భగుడిలో పూర్తి భక్తితో కూర్చున్న వ్యక్తి మనసు కూడా లౌకిక విషయాలలో చిక్కుకుపోయి ఉండవచ్చు. మరోవైపు, రద్దీగా ఉన్న మార్కెట్ మధ్యలో నడుస్తూ, తన పనులను నిజాయితీతో చేస్తున్న సాధారణ వ్యక్తి అంతరంగంలో భగవంతుడి  నామం నిరంతరం తిరుగుతూ  ఉండవచ్చు. మంత్రం అంటే కేవలం కొన్ని పదాలను జపించడం కాదు. పరధ్యానంలో ఉన్న మనసును పదే పదే దైవం వైపునకు ఆకర్షించడమే అసలైన అర్ధం.

సమయాన్ని ఆదా చేయడం కాదు..

అందుకే నడుస్తూ జపించడం అనేది కేవలం సమయాన్ని ఆదా చేసే మార్గం కాదు, అది మనసును నిర్దేశించే ఒక గొప్ప విధానం. చుట్టూ జనసమూహాలు, శబ్దాలు ఉన్నప్పటికీ భగవంతుని స్మరణ నిరంతరాయంగా కొనసాగితే అది గొప్ప విషయమే. దైవస్మరణ అనేది ఎలా కూర్చుని ఉన్నాం,  ఏ కఠినమైన నియమాలు పాటిస్తున్నాం అనే విషయాల  మీద ఆధారపడి ఉండదు. అయితే, మనసును ప్రాపంచిక విషయాలలో,  ఆలోచనలలో  ఉంచి కేవలం
 మంత్రాలను బయటికి  ఉచ్చరించడం సరికాదు. పెదవులతో పవిత్ర మంత్రాలను జపిస్తూ లోలోపల వేరే ఆలోచనలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. మనం మంత్రాన్ని జపిస్తున్నప్పుడు మన అస్తిత్వం మొత్తం దైవస్మరణలో లీనమై ఉందా లేదా అన్నదే ముఖ్యం.

నిశ్చలమైన మనసే..

ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంటి పనులతో తీరిక లేకుండా ఉండే గృహిణి కొన్నిసార్లు ప్రశాంతంగా కూర్చోలేకపోవచ్చు. అంతమాత్రాన ఆమె దేవుడితో సంబంధాన్ని కోల్పోయిందని కాదు. లౌకిక కార్యకలాపాలు అన్నీ వదిలిపెట్టి ఒకే చోట కూర్చోవడమే కాకుండా, నిత్య జీవితంలో నిరంతర స్మరణను కొనసాగించడమే అసలైన ఆధ్యాత్మికత. నడుస్తూ జపించడం, నిశ్శబ్దంగా కూర్చొని జపించడం రెండూ ముఖ్యమే. నిశ్శబ్దంగా కూర్చోవడం మనలోని మానసిక గంధరగోళాన్ని గుర్తిస్తే, దైనందిన పనుల మధ్య దైవాన్ని స్మరించుకోవడం మనసును నిలకడగా ఉంచుతుంది.

ఇది కూడా చదవండి : ప్రయాణాలలో, నడుస్తున్నప్పుడు మంత్ర జపం చేయవచ్చా.. మీకు తెలియని నిజాలివి..!

రోజంతా ప్రయాణాలు, పని వేళలు, వంట పనులు వంటి కారణంగా ఎంతో సమయం  జారిపోతూ ఉంటుంది.  ఈ సమయాలను సాధారణంగా వృథాగా భావిస్తుంటాం. కానీ ఆ  సమయాలను కూడా మన దిశను మార్చుకోవడానికి సువర్ణ అవకాశాలుగా మలచుకోవచ్చు. పగటి పూట ఎప్పుడైనా నామం గుర్తువస్తే మౌనంగా మనుసులో పదే పదే జపంలాగా స్మరించుకోవాలి.  

ఒకవేళ మనసు చెదిరిపోతే మిమ్మల్ని మీరు తిట్టుకోకుండా, మళ్ళీ మనసును  నామం వద్దకు తీసుకురావాలి. ఆధ్యాత్మిక సాధన అంటే మనసు ఎప్పటికీ చెదిరిపోకపోవడం కాదు, అది ఎప్పుడు చెదిరినా దాన్ని ఆప్యాయతతో తిరిగి తీసుకురావడమే. జీవితపు హడావిడి వల్ల ప్రశాంతంగా కూర్చొని జపం చేయడానికి సమయం దొరకకపోతే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కదలకుండా ఎన్ని గంటలు గడిపారన్నది ముఖ్యం కాదు, ప్రపంచమంతా తిరిగినా  మనసు సంపూర్ణ తపనతో ఎన్నిసార్లు భగవంతుడి
 వద్దకు తిరిగి వచ్చిందనేదే అత్యంత ముఖ్యం.


                                                                                                                                         *రూపశ్రీ.
మీకు నచ్చవచ్చు  :         బలము, బుద్దే కాదు.. జ్ఞానంలోనూ గొప్పవాడైన హనుమ..                                                                        కుండలి శక్తి విచ్చుకోవడాన్ని పద్మంతో ఎందుకు పోలుస్తారు.!                                     

google-ad-img