బలము, బుద్దే కాదు.. జ్ఞానంలోనూ గొప్పవాడైన హనుమ..

హనుమంతుడు అనగానే మనకు టక్కున గుర్తువచ్చేది అంతులేని బలం, ధైర్యం. సముద్రాన్ని లంఘించడం, లంకను దహించడం, సంజీవని పర్వతాన్ని ఎత్తడం వంటి సాహసాలు చూస్తే ఆయన బలానికి సాటి ఎవరూ లేరనిపిస్తుంది. కేవలం శక్తి మాత్రమే కాదు, అష్ట సిద్ధులు, నవ నిధులు పొందిన మహా మేధావి, అపారమైన జ్ఞానశీలి. అన్ని విద్యా, శాస్త్రాలు అభ్యసించిన మహా పండితుడు.
అలాంటి అద్భుతమైన శక్తి, యుక్తి, అపార జ్ఞానం ఉన్నప్పటికీ హనుమంతుడు ఎప్పుడూ తనకు సర్వమూ తెలుసని గానీ, గొప్పవాడినని గానీ గర్వపడలేదు. తాను శ్రీరామచంద్రుని సేవకుడినని, కేవలం ఒక 'రామబంటు' మాత్రమేనని చెప్పుకోవడానికే ఎంతో ఇష్టపడతాడు. ఇంతటి మహాజ్ఞాని అయిన ఆంజనేయస్వామి తన గొప్పతనాన్ని పక్కన పెట్టి, సేవకుడిగా ఉండటానికే ఎందుకు ప్రాధాన్యత ఇస్తారు? దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? వివరంగా తెలుసుకుంటే..
నిజమైన జ్ఞానం ఎప్పుడూ వినయాన్ని నేర్పుతుంది..
లోకంలో సాధారణంగా ఎవరికైనా కొంచెం బలం, అధికారం లేదా చదువు వస్తే చాలు, అహంకారం తలకెక్కుతుంది. నలుగురిలో తాను గొప్పగా ఉండాలని కోరుకుంటారు. కానీ హనుమంతుడి విషయంలో ఇది పూర్తి విరుద్ధం. ఆయన ఎంతగా ఎదిగితే, అంతగా ఒదిగి ఉన్నాడు. సంస్కృతంలో ఒక నానుడి ఉంది. విద్యా దదాతి వినయం అని. అంటే నిజమైన విద్య లేదా జ్ఞానం మనిషికి గర్వాన్ని ఇవ్వదు, సరికదా వినయాన్ని నేర్పుతుంది. హనుమంతుడు సర్వజ్ఞుడు. వేదాలు, శాస్త్రాలు, వ్యాకరణం అన్నీ పూర్తిగా అభ్యసించిన గొప్ప పండితుడు. సూర్యభగవానుడి దగ్గరే విద్యనభ్యసించిన వాడు హనుమంతుడు.
అయినా సరే, ఆ జ్ఞానమంతా తనను తాను గొప్పగా ప్రదర్శించుకోవడానికి కాకుండా, భగవంతుని సేవకే అంకితం చేశాడు. తాను ఎంతటి శక్తిమంతుడైనప్పటికీ, దైవం ముందు తాను ఒక సాధనం మాత్రమేననే సత్యం హనుమంతుడికి పూర్తిగా తెలుసు. ఆ వినయమే ఆయనను లోకానికి ఆరాధ్య దైవంగా మార్చింది.
అహంకారాన్ని చంపుకోవడమే అసలైన భక్తి..
భక్తి మార్గంలో అత్యంత ప్రమాదకరమైన శత్రువు అహంకారం. నేను అనే భావన ఉన్నంత కాలం దైవ సాక్షాత్కారం కలగదు. హనుమంతుడు శ్రీరాముడిని కేవలం ఒక రాజుగానో, నాయకుడిగానో చూడలేదు. తన సర్వస్వంగా భావించాడు. రామనామం జపించడమే తన ఊపిరిగా మలచుకున్నాడు.
'రామబంటు' అంటే కేవలం ఒక సేవకుడు అని మాత్రమే కాదు. యజమాని ఆనందం కోసం తన సర్వశక్తులను ఒగ్గి పనిచేసే పరమ భక్తుడు అని అర్థం. బంటు అనగానే చిన్నచూపు చూసే రోజులివి. కానీ ఆధ్యాత్మిక కోణంలో భగవంతుని బంటుగా ఉండటం అంటే అన్ని అహంకారాలను, కోరికలను వదిలేసి సంపూర్ణ శరణాగతి పొందడం. హనుమంతుడు తనలోని వ్యక్తిత్వాన్ని, అహంభావాన్ని రామనామంలో పూర్తిగా విలీనం చేసుకున్నాడు. అందుకే ఆయనకు ఏ పదవి ఆశ లేదు, ఏ గుర్తింపు కోరిక లేదు. రామసేవ ఒక్కటే ఆయన జీవిత పరమావధి.
జ్ఞానానికి, భక్తికి మధ్య అద్భుతమైన అనుసంధానం..
కొంతమంది జ్ఞానమార్గమే గొప్పదంటారు, మరికొందరు భక్తి మార్గమే ముఖ్యమంటారు. కానీ హనుమ ఈ రెండింటి మధ్య ఉన్న అద్భుతమైన వారధి. ఆయనకున్న జ్ఞానం ఆయనకు శ్రీరాముడి ఎవరో సరిగ్గా గ్రహించేలా చేసింది. రాముడు సామాన్య మానవుడు కాదని, సాక్షాత్ శ్రీమహావిష్ణువు స్వరూపమని ఆయనకు తెలుసు. ఆ పరిజ్ఞానమే ఆయనలో భక్తిని పరాకాష్టకు చేర్చింది.
ఎవరికైనా నిజమైన జ్ఞానం అబ్బితే, ఈ సృష్టి అంతటా దైవమే నిండి ఉందనే సత్యం అర్థమవుతుంది. ఆ సత్యం తెలిసినవాడు ఎప్పుడూ అహంకారంతో ప్రవర్తించలేడు. సమస్త చరాచర సృష్టికి మూలమైన ఆ దైవం ముందు తలవంచడంలోనే అసలైన ఆనందం ఉందని హనుమంతుడు తన ఆచరణ ద్వారా లోకానికి చాటిచెప్పాడు. అందుకే జ్ఞానంలో ఎంత ఎత్తుకు ఎదుగినా, తాను మాత్రం రాముడి పాదాల చెంత ఒక వినయపూర్వకమైన సేవకుడిగా ఉండటానికే తపించాడు.
భక్తులకు హనుమ అందించే గొప్ప సందేశం..
హనుమంతుడు మనకు అందించే అతిపెద్ద సందేశం ఏమిటంటే, జీవితంలో మనం ఎంత పెద్ద స్థాయికి వెళ్లినా, ఎంత సంపాదించినా, ఎంత చదువుకున్నా మన మూలాలను మరచిపోకూడదు. తోటివారికి సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంటుంది. నేను అనే భావనను వదిలేసి, సమాజానికి, ధర్మానికి సేవ చేసే గుణం అలవర్చుకోవాలి.
శ్రీరాముడి పట్ల హనుమంతుడు చూపిన నిస్వార్థమైన ప్రేమ, అంకితభావం ఈనాటికీ మానవాళికి ఒక పెద్ద మార్గదర్శకం. బలం, బుద్ధి, జ్ఞానం అన్నీ ఉన్నప్పటికీ 'రామబంటు' అని గర్వంగా చెప్పుకునే ఆ వినయమే హనుమంతుడిని చిరంజీవిగా, అభయమిచ్చే దైవంగా నిలబెట్టింది. అందుకే ఆయన నామస్మరణ చేసినా, ఆయన చరిత్ర తలచుకున్నా మనసులో భయం తొలగిపోయి అంతులేని ధైర్యం, ప్రశాంతత కలుగుతాయి.
*రూపశ్రీ






