బుధాష్టమి గురించి విన్నారా… అది ఇవాళే!

 

త్రయోదశినాడు శనివారం వస్తే శనిత్రయోదశిగా చేసుకుంటాం. మంగళవారం, సంకటహర చతుర్థి వస్తే అంగారక చతుర్థిగా గొప్పగా జరుపుకొంటాం. అలాగే అష్టమి తిథి బుధవారం నాడు వస్తే… బుధాష్టమిగా
భావిస్తారు పెద్దలు. ఈ మే 19 నాడు అలా బుధవారమూ, అష్టమి తిథీ కలిసి వచ్చాయి. ఇంతకీ ఈ బుధాష్టమి ప్రత్యేకత ఏమిటో. ఆ రోజు ఏం చేస్తారో చూద్దాం…

బుధగ్రహం తెలివికీ, మానసిక ప్రశాంతతకూ, ఆరోగ్యానికీ, ఐశ్వరానికీ, విజయానికీ సూచన. అవి మన జీవితంలో సమృద్ధిగా ఉండాలంటే ఈ రోజున బుధగ్రహానికి సంబంధించిన మంత్రం కానీ, నవగ్రహస్తోత్రం కానీ యధాశక్తి జపించాలి. ఈ బుధాష్టమి శివపార్వతులకు కూడా చాలా ఇష్టమని చెబుతారు. శుక్లపక్ష అష్టమికి శివుడు అధినేత అని కొందరి నమ్మకం. కాబట్టి ఈ రోజు శివపార్వతులను పూజించినా విశేషమైన
అనుగ్రహం లభిస్తుంది.

చాలాచోట్ల ముఖ్యంగా గుజరాత్‌, మహారాష్ట్ర లాంటి ఉత్తరాది ప్రాంతాలలో బుధాష్టమి వ్రతం అని ఓ ప్రత్యేక వ్రతాన్ని కూడా జరుపుకొంటారు. ఈ రోజు ఉపవాసం ఉండి, బుధగ్రహాన్ని పూజించి, నైవేద్యం అర్పిస్తారు. ఈ పూజ కోసం బుధుడి రూపం ఉన్న బంగారు లేదా వెండి నాణం ఉపయోగిస్తారు. ఆ రూపం ముందు గంగాజలంలో నిండిన కలశాన్ని ఉంచి, దాని మీద కొబ్బరిబోండాన్ని ప్రతిష్టిస్తారు.

ఇలా ఎనిమిదిసార్లు బుధాష్టమి వ్రతాన్ని ఆచరించిన తర్వాత, బుధుని రూపు ఉన్న నాణాన్ని దానం చేస్తారు. ఇలా చేస్తే జాతకంలో బుధునికి సంబంధించి ఎలాంటి దోషాలు ఉన్నా విముక్తి వస్తుందనీ,
జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి కైవల్యప్రాప్తి లభిస్తుందనీ శాస్త్రాలు చెబుతున్నాయి.

ఈ బుధాష్టమి వ్రతం మన తెలుగునాట అంత ఆచరణలో లేదు… కానీ ఈ రోజు బుధగ్రహానికి విశిష్టమైన రోజు అన్న విషయాన్ని మాత్రం కాదనలేం. అందుకని ఈ రోజున బుధగ్రహానికి సంబంధించిన మంత్రం
లేదా స్తోత్రాన్ని పఠించే ప్రయత్నం చేయాలి. బుధునికి అధిదేవత విష్ణుమూర్తి. కాబట్టి బుధగ్రహాన్ని పూజించలేని పక్షంలో ఆయనను విష్ణుమూర్తి అంశగా భావిస్తూ… ఆ స్వామిని పూజించినా విశేషమైన ఫలితం ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్టు శుక్ల పక్ష అష్టమి తిథి శివునికి కూడా ప్రీతికరమే. కాబట్టి, ఈశ్వరుని పూజకు కూడా ఈ రోజు సరైనదే!

దేవత ఎవరైనా, ఆచరణ ఏదైనా, మనస్ఫూర్తిగా వారిని ఈ రోజు కొలుచుకుంటే… గ్రహసంబంధమైన దోషాలు తొలగిపోవాలనీ, జీవితంలో కష్టాలన్నీ వీడిపోవాలనీ మన మనసుని వారి ముందు సాష్టంగపరిస్తే
తప్పక దైవం మన మొర వింటుంది.

- మణి.

   


More Purana Patralu - Mythological Stories