ఈ విషయాలు తెలుసుకోకుండా ధ్యానం చేస్తే ఫలితం ఉండదు!

నేటి ఆధ్యాత్మిక ప్రపంచంలో ధ్యానం గొప్ప తనాన్ని గుర్తించినవారు ఉన్నారు కానీ.. ధ్యానాన్ని కచ్చితమైన మార్గంలో చేసేవారు తక్కువగా ఉన్నారు. ధ్యానం గురించి స్వామి వివేకానంద రాజయోగంలో తెలిపారు.  వెలుపల లేదా లోపల ఒక లక్ష్యం మీద మనస్సును నిలిపితే చిత్తం ఆ లక్ష్యంలో అవిచ్ఛిన్నంగా ఉండి పోతుంది. దీన్నే ధ్యానం అంటారు. ఇంద్రియానుభవంలోని బాహ్యంశాన్ని తొలగించి, అంతరాంశమైన అర్థాన్ని మాత్రమే ధ్యానిస్తే మనస్సుకు తీవ్రశక్తి ఏర్పడుతుంది. అది సమాధి అవుతుంది. మనిషి బుద్ధిలో రమిస్తాడు. దివ్యపురుషుడు ఆత్మలో రమిస్తాడు. ధ్యానంలో ఉండగలిగే వ్యక్తికే నిజంగా ప్రపంచమంతా రమణీయంగా కనిపిస్తుంది.

యమ (సత్యం, అహింస, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం) నియమ (శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం) వీటిని అభ్యాసం చేస్తే చిత్త స్థైర్యం కలుగుతుంది. మనోనిగ్రహం ఏర్పడుతుంది. దాని వల్ల సూక్ష్మగ్రహణశక్తి అలవడుతుంది. ఇలాంటి చిత్తాన్ని ధ్యానంలో లగ్నం చేయాలి. స్థూల లక్ష్యంతో ధ్యానాన్ని ముందుగా ప్రారంభించాలి. క్రమంగా సూక్ష్మ లక్ష్యాల వైపు వెళ్ళాలి. చివరికి ఏ లక్ష్యం లేకుండా ధ్యానంలో ఉండిపోవాలి. ధ్యానం చేసేటప్పుడు వక్షం, భుజాలు, తల - వీటిని నిటారుగా, స్థిరంగా నిలపాలి.

ధ్యేయంలో పన్నెండు క్షణాలు మనస్సును నిలిపితే అది ధారణ. పన్నెండు ధారణలు ఒక ధ్యానం. పన్నెండు ధ్యానాలు సమాధి. (12 x 12 × 12 = 1728 క్షణాలు = 4 గంటల 48 నిమిషాలు) 

అగ్ని భయమున్నచోట, చీమల పుట్టలుండే ప్రదేశంలో, ప్రమాదకరమైన స్థలాల్లో, నాలుగు బాటలు కలిసే చోట, పెద్ద పెద్ద ధ్వనులు వినిపించే చోట ధ్యానం, యోగాభ్యాసం చేయరాదు. దేహం నీరసంగా, అనారోగ్యంగా ఉన్నప్పుడు, మనస్సులో దుఃఖం, దైన్యం ఉన్నప్పుడు యోగసాధన చేయవద్దు. అపరిశుద్ధ స్థలాన్ని ఎన్నుకోవద్దు. ఇతరుల వల్ల బాధ కలుగని రహస్య ప్రదేశానికి వెళ్ళాలి. రమణీయ స్థలాన్ని ఎన్నుకోవాలి. లేదా ఇంట్లోనే చక్కని గదిని సాధనకు ఉపయోగించాలి.

మొదట యోగులకు నమస్కరించాలి. గురువుకూ, దైవానికీ మొక్కాలి. ఆ తర్వాత సాధన మొదలుపెట్టాలి. తలపైన కొన్ని అంగుళాల ఎత్తున ఒక పద్మాన్ని ఊహించుకోండి. జ్ఞానం దాని తంతువనీ, ధర్మం దాని కర్ణిక (చివరిభాగం) అనీ తలంచండి. అష్టదళాలు అష్టసిద్ధులనీ, పరాగం త్యాగమనీ భావించండి. సిద్ధులను త్యాగం చేసి పరిపూర్ణ త్యాగాన్ని ఆశ్రయిస్తే మోక్షం లభిస్తుంది. ఓంకార స్వరూపుడు, అవాజ్మానస గోచరుడు, సర్వేశ్వరుడైన భగవంతుణ్ణి ఆ పద్మం మధ్యలో ధ్యానించండి. లేదంటే హృదయాకాశం మధ్యలో ఒక జ్యోతి ప్రకాశిస్తూ ఉన్నట్లు భావించండి. ఆ జ్యోతిని ఆత్మగా భావించండి. ఆ జ్యోతిలో మధ్యలో దివ్యతేజస్సుతో వెలిగే కాంతిని ఊహించుకోండి. అది పరమాత్మ అనుకోండి. ఆ పరంజ్యోతిని ధ్యానించండి.

ఇలా ధ్యానాన్ని సాధన చేయాలి. అలా చేసినవారికి అంతులేని అనుభూతి సొంతమవుతుంది.


                                               ◆నిశ్శబ్ద.


More Subhashitaalu