ప్రేమించండి ప్లీజ్


    మరో పావుగంటకు డాక్టర్, మేజిస్ట్రేటు, వురితీసే తోటీ వచ్చారు. అందరూ జైలు ఆవరణలో ఓ మూలనున్న ఉరికంబం దగ్గరికి చేరుకున్నారు.
    ఆంజనేయుల్ని బలి పశువును అలంకరించినట్టు అలంకరించారు. తలనిండా టెంకాయ నూనె పెట్టారు. బాగా వుతికి, తోమిన బట్టలు వేశారు.
    ఇద్దరు సెంట్రీలు పక్కన నలుగురు వార్డెన్లు వెనకరాగా అతను వురికంబం దగ్గరికి చేరుకున్నాడు.
    తూర్పు ఆకాశం పురిటినొప్పులు పడుతోంది. అక్కడంతా ఎర్రగా కమిలిపోయింది. అశుభ సూచకంగా చెట్లమీద కాకులు అదేపనిగా అరుస్తున్నాయి. గాలి ఆ ప్రాంతాన్ని బహిష్కరించినట్టు వుక్కగా వుంది.
    "ఆంజనేయులుగారూ! మీ చివరి కోరిక ఏమైనా వుంటే చెప్పండి" అని అడిగాడు జగన్ ఒక్కోమాట వత్తిపలుకుతూ.
    చప్పున తల పైకెత్తాడు ఆంజనేయులు. జగన్ అలా అగడగానే ఠక్కున "ప్రేమకావాలి" అని అడగాలనిపించింది. అది ఎంత అసాధ్యమో తన జీవితకాలంలో తెలుసుకున్నాడు. ఎందుకు వృధా ప్రయాస అనుకుని తల దించుకున్నాడు.
    ఆంజనేయుల్ని వురివేసే ఫ్లాట్ ఫామ్ మీదికి ఎక్కించారు.
    తోటీ అతన్ని మధ్యలోకి తీసుకువచ్చి పొజిషన్ లో నిలబెట్టాడు అతనికి ముఖానికి తొడగడానికి నల్లటి ముసుగుని తీసుకుని అధికారుల వైపు చూశాడు.
    "మీ చివరి కోరిక ఏమైనా ఉంటే భయపడకుండా, బిడియం లేకుండా చెప్పండి. తీరుస్తాం" జగన్ మరోసారి అడగడంతో మేజిస్ట్రేట్ విసుగ్గా చూశాడు. ఆయన టెన్నిస్ కోర్టుకి వెళ్ళే టైమైంది. ఎప్పుడు ఈ తతంగం ముగిసి బయటపడదామా అన్న ఆతృతతో  వున్నాడాయన తను ఏభై అయిదేళ్ళ వయసులో కూడా చాలా రొమాంటిక్ గా ఆలోచించగలుగుతున్నానంటే అదంతా టెన్నిస్ ఆడడంవల్లే అన్న అజ్ఞానంతో వున్నాడాయన. ఆ అజ్ఞానాన్ని స్టేటస్ సింబల్ గా భావించడంవల్ల దానిని వదిలించుకునేందుకు ఆయన సిద్ధపడడంలేదు.
    ఆంజనేయులు మాత్రం తీవ్ర సంచలనానికి గురయ్యాడు. తన కోరిక తీర్చడానికి దేవుళ్ళు పంపిన దూతలా అనిపించాడు జగన్.
    అతని కళ్ళముందు ఏవేవో దృశ్యాలు కదులుతున్నాయి.
    -- చిన్నబాబు - అమాయకత్వాన్ని తన కళ్ళల్లో ప్రమిధలుగా చేసుకుని తల్లికోసం వెదుకుతున్నాడు. ఆమె ఎక్కడో దాక్కుని ఎదిపిస్తోంది. వాడు అమ్మ ముఖం కనిపించగానే ముఖాన్నంతా నవ్వు చేసుకోవాలని మోకాళ్ళ మీద పాకుతున్నాడు. ఎంతసేపు తిరుగుతున్నా కనిపించడంలేదు. తల్లి 'అమ్మా' అంటూ బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయాడు. అప్పుడే వచ్చిన పళ్ళు పెదవుల్లోకి గుచ్చుకున్నాయి. రక్తం కారుతోంది. కానీ రక్తం పంచిన అమ్మ కనిపించటంలేదు--
    -- ఓ యువకుడు అప్పుడే పుట్టిన నూనూగు మీసాలను సవరించుకుంటూ నడుస్తున్నాడు. పక్కనే ఓ యువతి అతన్ని అనుసరిస్తోంది. ఆమెను తన చేయిపట్టుకోమని అడిగాడు. ఆమె ఎటూ చెప్పలేదు అతను మాత్రం చేయి చాచాడు. కానీ చిత్రంగా ఇద్దరి మధ్యా కత్తుల వంతెన బుస బుసా పొంగింది. ఇద్దరికీ మధ్య కత్తులవంతెన. ఆమె ఆవల నిలబడిపోయింది. అతను ఇక ఆగలేక దానిమీదే నడిచి ఆమెను చేరాలనుకున్నాడు పైకెక్కాడు కత్తులు దిగాబడుతున్నాయి నెత్తురు బొట్లు బొట్లుగా పడుతోంది. నొప్పిని కడుపులోనే దాచుకుని అతను దాటాడు ఇక చేయి అందివ్వబోతుండగా మరో చేయి వచ్చింది అడ్డంగా, ఆమె దాన్ని తన చేతుల్లోకి తీసుకుని కొత్తవ్యక్తితో వెళ్ళిపోయింది. అతను అలానే......
    ----- ఒక వ్యక్తి బజార్లో నడుస్తున్నాడు. ఎవరూ అతనిని పలకరించడంలేదు. ఒక్కరంటే ఒక్కరూ చూడటంలేదు. అతను తనను గమనించాలని చేతులు తట్టడం ప్రారంభించాడు. అంత శబ్దం అవుతున్నా ఒక్కరూ తిరిగి చూడడంలేదు. గట్టిగా...... ఇంకా గట్టిగా తను చప్పట్లు చరుస్తున్నాడు. రక్తం - చేతులనిండా రక్తం - కానీ ఒక్కరూ గాయం చూడడంలేదు. కట్టుకట్టడంలేదు - కన్నీరు కార్చటం లేదు.
    కళ్ళముందు ఇలా అమీబా శరీరంలా ఎటువైపుకంటే అటువైపుకి సాగిన దృశ్యాలు గందరగోళాన్ని రేపాయి ఆంజనేయుల్లో.
    అవును - తనకు కావాల్సింది ఏమిటో తనకు తెలిసింది. దాన్ని ఎలా సాధించుకోవాలో కూడా తెలిసింది. తను కూడా తనకి కావాల్సింది ఏమిటో చెప్పగలనని ప్రపంచానికి తెలియజెయ్యాలి. అదే ఆత్మవిశ్వాసం అంటే. దాన్నే తను పొందాలి. ఏ భయాలైతే తనను వెంటాడి నిర్వీర్యున్ని చేశాయో వాటిని వేటాడాలి.
    అందుకే తను చెప్పాలి. జీవితంలో ఏ మాటలైతే తాను వినాలని ఆరాటపడ్డాడో వాటిని వినాలి. అవి నిజం కాకపోయినా నిజమన్న భ్రమ అయినా కావాలి. సో - తనిప్పుడు తన చిరకాల కోరిక చెప్పబోతున్నాడు - ప్రొసీడ్ - చెప్పు.
    ఎవరో వెనక తనకు ధైర్యం చెబుతున్నట్టు, ముందుకు తోస్తున్నట్టు అనిపించింది. ఆంజనేయులు జీవితంలో మొదటిసారిగా బిగ్గరగా మాట్లాడడం ప్ర్రారంభించాడు.
    "నాకున్న కోరిక ఒకటే. దాన్ని వింటే మీకు  నవ్వులాటగా అనిపించవచ్చు. లేదూ సాధారణంగానైనా అనిపించవచ్చు. నాలాంటి వాళ్ళు ఈ సంఘంలో చాలామంది వున్నారు. కానీ ఎవరికీ వాళ్ళు ఏదో విధంగా రాజీపడిపోతుండవచ్చు కానీ - నేను - అందర్లాగే రాజీపడదామని భావించినవాడ్ని. అయినా వీలుకాలేదు. ఈ క్రమంలోనే తాగుబోతునయ్యాను ఒక మనిషిని నిష్కారణంగా చంపేశాను. చచ్చిపోతున్న ఈ సమయంలో కూడా ఈ చిన్న గుండె ప్రేమ కోసం కొట్టుకుంటోంది. అందుకే నకు ప్రేమ కావాలి" అని ఓ క్షణం సేపు ఆగాడతను.
    అందరూ వూపిరి బిగపట్టి వింటున్నారు.
    మళ్ళీ అతను ప్రారంభించాడు" అందుకే ఓ స్త్రీ నాదగ్గర  నిలబడి 'నిన్ను ప్రేమిస్తున్నాను' అని చెప్పేటట్టు చేయండి. నేను ఆమెను చూడక్కర్లేదు. ఇప్పుడే నల్ల ముసుగు వేసుకుంటాను. నన్ను వురితీస్తున్న సమయంలో ఆ మాటలు నాకు వినపడాలి. ఆ మాటలు వింటూ నేనూ ఒకరి ప్రేమను పొందానన్న భ్రమలో ప్రాణాలు పోవాలి. వూహ తెలిసినప్పుడు నాకు కలిగిన మొదటి కోరికా, వూపిరి ఆగిపోతున్న సమయంలో నాకున్న చివరి కోరికా ఇదే తీర్చగలరా?"